3 లక్షల ఎకరాల్లో పంట మునక | Crops Collapsed By Heavy Rains In Telangana | Sakshi
Sakshi News home page

3 లక్షల ఎకరాల్లో పంట మునక

Published Tue, Aug 21 2018 1:15 AM | Last Updated on Tue, Sep 4 2018 5:53 PM

Crops Collapsed By Heavy Rains In Telangana - Sakshi

3 లక్షల ఎకరాల్లో పంట మునక

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో దంచికొడుతున్న భారీ వర్షాలకు పలు జిల్లాల్లో ఖరీఫ్‌ పంటలు నీట మునిగాయి. ఇప్పటివరకు 3 లక్షల ఎకరాల మేర పంటలు నీటిమునిగినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా పూర్వ ఆదిలాబాద్‌ జిల్లాలోనే 1.23 లక్షల ఎకరాల మేర పంటలు నీటమునిగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా పత్తి, పెసర పంటలు మునిగినట్లు చెబుతున్నారు. పూర్వ ఖమ్మం జిల్లాలో మిరప నారు మునిగిపోవడంతో పనికి రాకుండా పోయింది. అలాగే చేతికి వచ్చే దశలో పెసర పంట పూర్తిగా నాశనమైందని వ్యవ సాయశాఖ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.76 లక్షల ఎకరాల్లో పెసర వేయగా భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో పెసర కాయలు బూజుపట్టి పాడైపోయాయని అధికారులు పేర్కొన్నారు.

పూర్వ ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో అనేక చోట్ల సోయాబీన్, జొన్న, పత్తి పంట మునిగిపోయింది. రెండు, మూడు రోజుల్లో ఆయా చేల నుంచి నీరు బయటకు పోతే ఎలాంటి ఇబ్బంది ఉండదని, లేకుంటే మాత్రం నష్టం వాటిల్లుతుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఇప్పటికే నీటమునిగిన పంటలు దెబ్బతినే అవకాశమే ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. మరోవైపు ప్రస్తుత వర్షాలతో వరి నాట్లు ఊపందుకున్నాయి. కీలక సమయంలో వర్షాలు కురుస్తుండటంతో ఈసారి వరి అంచనాలకు మించి సాగవుతుందని అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్‌ వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.75 లక్షల ఎకరాలుకాగా ఇప్పటివరకు 18 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఈ వర్షాలతో మిగిలిన చోట్ల కూడా వరి నాట్లు పడతాయని, ప్రాజెక్టుల కింద కూడా వరి నాట్లు పుంజుకుంటాయని అంచనా వేస్తున్నారు.

నేడు అతి భారీ వర్షాలు... 
పశ్చిమ బెంగాల్‌–ఉత్తర కోస్తా ఒడిశాలను ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న  అల్పపీడనంతోపాటు దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుండటంతో మంగళవారం రాష్ట్రంలో పలుచోట్ల అత్యంత భారీ వర్షం, మరికొన్ని చోట్లభారీ నుంచి అతిభారీ వర్షాలు, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు తెలిపారు. అలాగే బుధవారం పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ఆదివారం నుంచి సోమవారం రాత్రి వరకు భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవగా, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరుతుండటంతో చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ఈ ఏడాది జూన్‌ ఒకటో తేదీ నుంచి సోమవారం వరకు ఈ సీజన్‌లో రాష్ట్రంలో సాధారణం కంటే 17 శాతం అధిక వర్షపాతం నమోదైంది. జయశంకర్‌ భూపాలపల్లి, కొమురం భీం జిల్లాల్లో 61 శాతం, ఆదిలాబాద్‌ జిల్లాలో 55 శాతం అధికంగా వర్షపాతం నమోదు కావడం విశేషం. ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకు సూర్యాపేట జిల్లాలో 11.74 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా ఒక్క రోజులో కురిసే సగటు వర్షపాతానికి ఇది 1,763 శాతం అధికం కావడం విశేషం. అలాగే ఖమ్మం జిల్లాలో ఒక్క రోజులో 1,397 శాతం అధికంగా వర్షం కురిసింది.

సాగర్‌లో 200 టీఎంసీలు...
కృష్ణా బేసిన్‌ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి వరద పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే నిండిన శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తున్న ప్రవాహాలను దిగువకు వదిలేయడంతో నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ 200 టీఎంసీలకు చేరింది. వరద ఇలాగే కొనసాగితే 7–8 రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సాగర్‌ ఎడమ కాల్వ కింది ఆయకట్టుకు బుధవారం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. సాగర్‌ నిండాలంటే ఇంకా 112 టీఎంసీలు అవసరం. గతేడాది సాగర్‌లో ఈ సమయానికి నీటి నిల్వ 115 టీఎంసీలే ఉండటం గమనార్హం.

గోదావరి ప్రాజెక్టుల్లో జలకళ..
గోదావరి ప్రాజెక్టుల్లోనూ ప్రవాహాలు పుంజుకుంటున్నాయి. ఇప్పటికే వాగులు, వంకలు నిండటం, చెరువులు అలుగుపారుతుండటంతో ప్రాజెక్టుల్లో ప్రవాహాలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో గోదావరి బేసిన్‌లోని ప్రధాన మధ్యతరహా ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. బేసిన్‌ పరిధిలోని 27 మద్యతరహా ప్రాజెక్టులన్నీ నిండటంతో వాటి గేట్లెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్‌ జిల్లాలోని సాత్నాల, మత్తడివాగు, సుధ్దవాగు, వట్టివాగు, ఎన్టీఆర్‌ సాగర్, పీపీ రావు ప్రాజెక్టు, కొమురం భీం, గొల్లవాగు, నీల్వాయి, ర్యాలివాగు ప్రాజెక్టులన్నీ నిండటంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. వరంగల్‌ జిల్లాలోని లక్నవరం, పాలెంవాగు, గుండ్లవాగు ప్రాజెక్టులు, ఖమ్మం జిల్లాలోని తాలిపేరు, పెద్దవాగు, కిన్నెరసానిలకు గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. వాటి కింద 2.92 లక్షల ఎకరాల సాగుకు మార్గం సుగుమమైంది.

ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు (టీఎంసీల్లో), ప్రవాహాలు (క్యూసెక్కుల్లో)
ప్రాజెక్టు                  నిల్వ సామర్థ్యం        ప్రస్తుత నిల్వ    ఇన్‌ఫ్లో    ఔట్‌ఫ్లో
ఆల్మట్టి                 129.72                125.83    1,48,000    1,60,060
నారాయణపూర్‌       37.64                 35.83        1,60,260    1,59,630
జూరాల                 9.66                     9.11        1,17,000    1,14,942
శ్రీశైలం                215.81                  200.20    2,38,889    2,38,889
నాగార్జునసాగర్‌      312.05                200        2,08,464     9,638 
కడెం                   7.6                        6.05        61,241        77,116
లోయర్‌ మానేరు    24.07                  3.52        238        99
నిజాంసాగర్‌         17.80                    2.29        487        0
సింగూరు            29.91                    7.61        170        170
ఎల్లంపల్లి           20.17                     19.20        81,195        81,195
ఎస్సారెస్పీ        90.31                       33.76        19,720        0

గత 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షపాతం (సెంటీమీటర్లలో)
అశ్వారావుపేట 21
భద్రాచలం    15
ముల్కలపల్లి 14
ఏన్కూరు, సత్తుపల్లి 13
వెంకటాపురం 12
బూర్గుంపాడు 12
దుమ్ముగూడెం 12
సూర్యాపేట 12
మణుగూరు 11
జూలూరుపాడు 11
తల్లాడ 11
చెరువులు ఫుల్‌...
కృష్ణా, గోదావరి బేసిన్‌లలో చెరువులు 44,497
అలుగు పారుతున్న వాటి సంఖ్య    9,948
వాటిలో గోదావరి బేసిన్‌లో అలుగుపారుతున్నవి 9,719
నిండేందుకు సిద్ధంగా ఉన్న చెరువులు 5,500
జిల్లాలవారీగా అలుగుపారుతున్న చెరువుల సంఖ్య...
కొత్తగూడెం 2,184
భూపాలపల్లి 2,011
పెద్దపల్లి 1,097
వనపర్తి 138 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement