భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రవ్యాప్తంగా నీటమునిగిన 15 లక్షల ఎకరాల పంటలు
4.15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా తేలి్చన వ్యవసాయ శాఖ
వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది సహా ఇతరత్రా పంటలకు తీవ్ర నష్టం
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలో కుండపోత వర్షాలు, వరదలకు లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రెండు మూడు రోజులుగా పంటలన్నీ నీళ్లలోనే నానుతున్నాయి. అన్ని జిల్లాల్లో కలిపి 15 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు నీటమునిగినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. అందులో 4.15 లక్షల ఎకరాల మేర నష్టం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. పంట నష్టం జరిగిన రైతులకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో త్వరలో పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేస్తామని అధికారులు అంటున్నారు.
వరి రైతు విలవిల..
వరదల వల్ల వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది సహా ఇతరత్రా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షాల దెబ్బకు అధికంగా మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, నల్లగొండ, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం జిల్లాల్లో పంటలు నీటమునిగాయి. నాట్ల దశలోనే వరి ఉండటంతో రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లనుంది.
పెరగనున్న చీడపీడల బెడద..
ఆధిక వర్షాల వల్ల వివిధ పంటల్లో కొన్ని రకాల చీడపీడల ఉధృతి అధికంగా ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న వరి, పత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు, కంది, పెసర, మినుము వంటి పంటల్లో ప్రస్తుతం ఉన్న దశలో కొన్ని రకాల చీడపీడలు ఆశించే అవకాశం ఉందన్నారు. వరి పంట పసుపు రంగులోకి మారుతుందని.. కొనల నుంచి తెల్లటి చారలు ఏర్పడతాయన్నారు. అలాగే పత్తిలో పచ్చ దోమ అధికమవుతుందని.. ఎండు తెగులు కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉందన్నారు. సోయా చిక్కుడు పంట కాత దశలో ఉన్నందున వేరుకుళ్ల, ఎండు తెగులు ఆశించే అవకాశం, కాయలుపై పక్షి కన్ను తెగులు, ఆకులపై కొన్ని రకాల శిలీంద్రాల వల్ల ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వివిధ జిల్లాల్లో వరద నష్టం ఇలా..
⇒ ఖమ్మం జిల్లాలో ఆకేరు, పాలేరు పొంగిపొర్లడం, మున్నేరు, వైరాకు భారీ వరద పోటెత్తడంతో వేలాది ఇళ్లు నీట మునిగాయి. కొన్ని ఇళ్లు కూలాయి. 37,716 మంది రైతులకు చెందిన 57,410 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలో మొత్తం రూ. 11,99,65,000 వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా 38 చెరువులు ఉప్పొంగాయి. 180 వరకు చేపల చెరువులు పొంగిపొర్లాయి. దీంతో సుమారు రూ. 4.20 కోట్ల విలువైన 3,500 టన్నుల మత్య్స సంపదకు నష్టం జరిగింది. ఏదులాపురం సెక్షన్‌లో 11 కేవీ టవర్, 1,935 స్తంభాలు దెబ్బతిన్నాయి. నాలుగు సబ్‌స్టేషన్లలో నీరు నిలిచింది.
⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 60 వేల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. మహబూబాబాద్ జిల్లాలో 78, జనగామలో 8, వరంగల్‌లో 2, జయశంకర్ భూపాలపల్లిలో 8, ములుగులో 6, హనుమకొండలో 2 చెరువులు కలిపి మొత్తం 104 చెరువులకు గండ్లు పడ్డాయి.
⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరదల్లో చిక్కుకొని ఇద్దరు మరణించగా వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా ప్రకారమే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 22,344 ఎకరాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. సూర్యాపేట జిల్లాలో 23 చోట్ల రోడ్లు తెగిపోగా, 35 రోడ్లు దెబ్బతిన్నాయి. మరో 15 చెరువుల కట్టలు తెగిపోయినట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది.
⇒ ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 7,746 ఎకరాల్లో వరి, పత్తి, వేరుశనగ తదితర పంటలకు నష్టం వాటిల్లింది. సుమారు 140 వరకు ఇళ్ల ధ్వంసమవగా 10 ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురయ్యాయి.
⇒ ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారు 2 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. కాలువలకు గండి పడింది. అక్కడక్కడ కుంటల కట్టలు తెగిపోయాయి. గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
4 ఎకరాల్లో ఇసుక మేటలు
నాకు 13 ఎకరాలు పొలం ఉంది. మరో 16 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. మొత్తం వరి సాగు చేశా. ఇప్పటికే ఎకరానికి రూ. 20 వేల చొప్పున పెట్టుబడి పెట్టా. భారీ వర్షాల కారణంగా పోతిరేణికుంట చెరువు నీరంతా 4 ఎకరాల పొలాన్ని ముంచెత్తడంతో ఇసుక మేటలు వేశాయి. కొన్నిచోట్ల పొలం కోతకు గురైంది. – దేవరం ప్రభాకర్‌రెడ్డి, రైతు, హుజూర్‌నగర్, సూర్యాపేట జిల్లా
దిగుబడి బాగా వస్తుందనుకుంటే..
ఇసుక మేటలు వేసిన పొలం మధ్య నిలబడిన ఈయన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటకు చెందిన రైతు బేతమల్ల రమేశ్. బంధం చెరువు కింద 2.20 ఎకరాల్లో వరి సాగుచేశాడు. అప్పు తెచ్చి రూ. 80 వేల పెట్టుబడి పెట్టాడు. 40 రోజుల క్రితం నాట్లు వేయగా చేను ఏపుగా పెరిగింది. ఈసారి దిగుబడి బాగా వస్తుందని సంబురపడ్డాడు. కానీ భారీ వర్షాలతో బంధం చెరువుకు గండిపడి రమేశ్ పొలాన్ని ముంచెత్తింది. ఇసుకమేటలతో నిండిన తన పొలాన్ని చూసి రమేశ్ కన్నీటిపర్యంతమయ్యాడు. ఇప్పుడు ఇంకెక్కడి నుంచి అప్పు తేవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
రూ. 40 వేలు ఆకేరు పాలు
ఈ రైతు పేరు రమావత్ శ్రీను. తిరుమలాయపాలెం మండలం రమణా తండాకు చెందిన ఈయన రూ. 40 వేల పెట్టుబడి ఖర్చుతో 2 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. జూన్ ప్రారంభంలోనే పత్తి గింజలు నాటగా పత్తి ప్రస్తుతం కాత దశలో ఉంది. మరో పంట నెలలో చేతికి అందుతుందని శ్రీను అనుకుంటుండగా ఆదివారం ఆకేరు వాగు ముంచెత్తడంతో చేనును ముంచెత్తింది. వరద తగ్గాక సోమవారం వెళ్లే సరికి పత్తి చేనులోని మొక్కలన్నీ నేలవాలి నామరూపాల్లేకుండా పోయాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక శ్రీను కన్నీరుమున్నీరవుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment