crops damage
-
లక్షల ఎకరాల్లోని పంటలు వరదలోనే...
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో కుండపోత వర్షాలు, వరదలకు లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రెండు మూడు రోజులుగా పంటలన్నీ నీళ్లలోనే నానుతున్నాయి. అన్ని జిల్లాల్లో కలిపి 15 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు నీటమునిగినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. అందులో 4.15 లక్షల ఎకరాల మేర నష్టం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. పంట నష్టం జరిగిన రైతులకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో త్వరలో పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేస్తామని అధికారులు అంటున్నారు. వరి రైతు విలవిల.. వరదల వల్ల వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది సహా ఇతరత్రా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షాల దెబ్బకు అధికంగా మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, నల్లగొండ, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం జిల్లాల్లో పంటలు నీటమునిగాయి. నాట్ల దశలోనే వరి ఉండటంతో రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లనుంది. పెరగనున్న చీడపీడల బెడద.. ఆధిక వర్షాల వల్ల వివిధ పంటల్లో కొన్ని రకాల చీడపీడల ఉధృతి అధికంగా ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న వరి, పత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు, కంది, పెసర, మినుము వంటి పంటల్లో ప్రస్తుతం ఉన్న దశలో కొన్ని రకాల చీడపీడలు ఆశించే అవకాశం ఉందన్నారు. వరి పంట పసుపు రంగులోకి మారుతుందని.. కొనల నుంచి తెల్లటి చారలు ఏర్పడతాయన్నారు. అలాగే పత్తిలో పచ్చ దోమ అధికమవుతుందని.. ఎండు తెగులు కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉందన్నారు. సోయా చిక్కుడు పంట కాత దశలో ఉన్నందున వేరుకుళ్ల, ఎండు తెగులు ఆశించే అవకాశం, కాయలుపై పక్షి కన్ను తెగులు, ఆకులపై కొన్ని రకాల శిలీంద్రాల వల్ల ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వివిధ జిల్లాల్లో వరద నష్టం ఇలా.. ⇒ ఖమ్మం జిల్లాలో ఆకేరు, పాలేరు పొంగిపొర్లడం, మున్నేరు, వైరాకు భారీ వరద పోటెత్తడంతో వేలాది ఇళ్లు నీట మునిగాయి. కొన్ని ఇళ్లు కూలాయి. 37,716 మంది రైతులకు చెందిన 57,410 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలో మొత్తం రూ. 11,99,65,000 వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా 38 చెరువులు ఉప్పొంగాయి. 180 వరకు చేపల చెరువులు పొంగిపొర్లాయి. దీంతో సుమారు రూ. 4.20 కోట్ల విలువైన 3,500 టన్నుల మత్య్స సంపదకు నష్టం జరిగింది. ఏదులాపురం సెక్షన్లో 11 కేవీ టవర్, 1,935 స్తంభాలు దెబ్బతిన్నాయి. నాలుగు సబ్స్టేషన్లలో నీరు నిలిచింది. ⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 60 వేల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. మహబూబాబాద్ జిల్లాలో 78, జనగామలో 8, వరంగల్‌లో 2, జయశంకర్ భూపాలపల్లిలో 8, ములుగులో 6, హనుమకొండలో 2 చెరువులు కలిపి మొత్తం 104 చెరువులకు గండ్లు పడ్డాయి. ⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరదల్లో చిక్కుకొని ఇద్దరు మరణించగా వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా ప్రకారమే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 22,344 ఎకరాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. సూర్యాపేట జిల్లాలో 23 చోట్ల రోడ్లు తెగిపోగా, 35 రోడ్లు దెబ్బతిన్నాయి. మరో 15 చెరువుల కట్టలు తెగిపోయినట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. ⇒ ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 7,746 ఎకరాల్లో వరి, పత్తి, వేరుశనగ తదితర పంటలకు నష్టం వాటిల్లింది. సుమారు 140 వరకు ఇళ్ల ధ్వంసమవగా 10 ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురయ్యాయి. ⇒ ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారు 2 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. కాలువలకు గండి పడింది. అక్కడక్కడ కుంటల కట్టలు తెగిపోయాయి. గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 4 ఎకరాల్లో ఇసుక మేటలు నాకు 13 ఎకరాలు పొలం ఉంది. మరో 16 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. మొత్తం వరి సాగు చేశా. ఇప్పటికే ఎకరానికి రూ. 20 వేల చొప్పున పెట్టుబడి పెట్టా. భారీ వర్షాల కారణంగా పోతిరేణికుంట చెరువు నీరంతా 4 ఎకరాల పొలాన్ని ముంచెత్తడంతో ఇసుక మేటలు వేశాయి. కొన్నిచోట్ల పొలం కోతకు గురైంది. – దేవరం ప్రభాకర్‌రెడ్డి, రైతు, హుజూర్నగర్, సూర్యాపేట జిల్లాదిగుబడి బాగా వస్తుందనుకుంటే.. ఇసుక మేటలు వేసిన పొలం మధ్య నిలబడిన ఈయన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటకు చెందిన రైతు బేతమల్ల రమేశ్. బంధం చెరువు కింద 2.20 ఎకరాల్లో వరి సాగుచేశాడు. అప్పు తెచ్చి రూ. 80 వేల పెట్టుబడి పెట్టాడు. 40 రోజుల క్రితం నాట్లు వేయగా చేను ఏపుగా పెరిగింది. ఈసారి దిగుబడి బాగా వస్తుందని సంబురపడ్డాడు. కానీ భారీ వర్షాలతో బంధం చెరువుకు గండిపడి రమేశ్ పొలాన్ని ముంచెత్తింది. ఇసుకమేటలతో నిండిన తన పొలాన్ని చూసి రమేశ్ కన్నీటిపర్యంతమయ్యాడు. ఇప్పుడు ఇంకెక్కడి నుంచి అప్పు తేవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.రూ. 40 వేలు ఆకేరు పాలు ఈ రైతు పేరు రమావత్ శ్రీను. తిరుమలాయపాలెం మండలం రమణా తండాకు చెందిన ఈయన రూ. 40 వేల పెట్టుబడి ఖర్చుతో 2 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. జూన్ ప్రారంభంలోనే పత్తి గింజలు నాటగా పత్తి ప్రస్తుతం కాత దశలో ఉంది. మరో పంట నెలలో చేతికి అందుతుందని శ్రీను అనుకుంటుండగా ఆదివారం ఆకేరు వాగు ముంచెత్తడంతో చేనును ముంచెత్తింది. వరద తగ్గాక సోమవారం వెళ్లే సరికి పత్తి చేనులోని మొక్కలన్నీ నేలవాలి నామరూపాల్లేకుండా పోయాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక శ్రీను కన్నీరుమున్నీరవుతున్నాడు. -
AP: ‘రైతులు అపోహలు నమ్మొద్దు.. అండగా ఉంటాం’
సాక్షి, అమరావతి: రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. వర్షాలు, రైతుల సమస్యలపై సీఎం సమీక్ష నిన్న, నేడు నిర్వహించారని.. ఈ మేరకు వ్యవసాయశాఖ, సివిల్ సప్లై, మార్కెటింగ్‌శాఖలకు పలు సూచలను, ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. ఫీల్డ్‌కు ఎవరూ వెళ్లడం లేదు, సర్వే చేయడం లేదనడం సరికాదని అన్నారు వర్షాలు పడుతున్నప్పుడు సర్వే చేయడం కుదరదని.. వర్షాలు తగ్గిన తర్వాత సర్వే చేసి ప్రతీ రైతు నుంచి నష్టం అంచనాలు సేకరిస్తామని చెప్పారు. ఒక్క రైతు కూడా ఇబ్బంది ఉండదు ‘సోషల్ ఆడిట్ కోసం లిస్ట్‌ను ఆర్బీకేల్లో డిస్ప్లే చేస్తాం. వాతావరణశాఖ సమాచారం మేరకు 8వ తేదీ వరకూ వర్షాలు పడే అవకాశం ఉంది. ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా నష్టం అంచనాలు రూపొందిస్తాం. రైతుకు ఏ సమస్య వచ్చినా ఆర్బీకే కేంద్రాల్లో సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఆర్బీకే కేంద్రాల్లో ఎవరైనా సిబ్బంది స్పందించకపోతే టోల్ ఫ్రీ నెంబర్ -155251 ఫిర్యాదు చేయొచ్చు. రైతులకు వ్యవసాయశాఖ పూర్తిగా అండగా ఉంటుంది’ అని గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. చదవండి: చంద్రబాబు నోరు.. రామోజీ రాతలు ఒక్కటే: మంత్రి బొత్స ఏ సీజన్లో దెబ్బతిన్న పంటలకు ఆ సీజన్లోనే పరిహారం: హరికిరణ్ మార్చి నెలలో కూడా ఇదే మాదిరి అకాల వర్షాలకు పంట నష్టం ఏర్పడిందని వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. వ్యవసాయ పంటలు 17,820 హెక్టార్లు దెబ్బతిన్నాయని, ఉద్యానపంటలు 5652 హెక్టార్లు దెబ్బతిన్నాయన్నారు. మార్చి నెలలో వర్షాలకు దెబ్బతిన్న పంటలకు 34కోట్ల 22లక్షలు నష్టం వాటిల్లినట్లు అంచనా వేసినట్లు తెలిపారు. ఏ సీజన్ లో దెబ్బతిన్న పంటలకు ఆ సీజన్లోనే పరిహారం అందిస్తున్నామన్నారు. నష్టం వాటిల్లిన ప్రతీ రైతును గుర్తిస్తాం ప్రస్తుత వర్షాలకు జొన్న, మొక్కజొన్న, వరి పంటలకు ఎక్కువ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోందని, వర్షాలు తగ్గిన తర్వాత నష్టం వాటిల్లిన ప్రతీ రైతును గుర్తిస్తామని చెప్పారు. 2023 ఖరీఫ్ సీజన్ మొదలయ్యేలోపే మార్చి నెల , ప్రస్తుత వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. చదవండి: మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం రూ.7208 కోట్లను రైతుల ఖాతాల్లో జమ: అరుణ్‌కుమార్ మార్చి 31తో ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్ ముగిసిందని, 6లక్షల 45వేల మంది రైతుల నుంచి 35లక్షల 41వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పౌరసరఫరాలశాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. రూ.7208 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమచేశామని, ఎన్.పీసీతో ఉన్న సమస్య కారణంగా 25 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రబీ ప్రారంభమైందని.. ఇప్పటి వరకూ 55576 మంది రైతుల నుంచి 5లక్షల 22వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. 43427 రైతుల ఖాతాల్లో 803కోట్ల నిధులను జమచేశామని చెప్పారు. ‘ధాన్యం కొనుగోలు చేసిన నాలుగైదు రోజుల్లోనే నిధులు జమ చేస్తున్నాం. ఏ ఒక్క రైతూ మద్దతు ధర కోల్పోకూడదని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ధాన్యం కొనుగోలుకు ఆటంకం ఏర్పడింది. గత సీజన్లో బాయిల్డ్ వెరైటీకి (జయ) రైతులు ఎక్కువగా మొగ్గు చూపారు. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో సాగు చేశారు. కేంద్రప్రభుత్వంతో మాట్లాడి జయ వెరైటీని కొనుగోలు చేసేందుకు లక్ష్యం సిద్ధం చేసుకున్నాం. అవసరం మేరకు ప్రతీ రైతు భరోసా కేంద్రంలో గన్నీ బ్యాగ్స్ సిద్ధం చేశాం. రైతులు అపోహలను నమ్మొద్దు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దని కోరుతున్నాం. మిల్లర్లపై కూడా కొన్ని చోట్ల మాకు ఫిర్యాదులొచ్చాయి. మిల్లర్లు రైతులను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు రైతులు అపోహలను నమ్మొద్దు: పౌర సరఫరాల శాఖ ఎండీ వీర పాండ్యన్ రాష్ట్రవ్యాప్తంగా కమాండ్ కంట్రోల్‌కు 472 ఫిర్యాదులొచ్చాయి. 472 ఫిర్యాదులను పరిష్కరించాం. 20 లక్షల గన్నీ బ్యాగ్ లను సేకరించి గోదావరి జిల్లాలకు పంపించాం. ఈ సీజన్ లో 39 మిల్లులు , 25 మంది అధికారుల పై చర్యలు తీసుకున్నాం. ఖరీఫ్ సీజన్ లో మాదిరిగానే రబీ సీజన్ లోనూ ధాన్యం సేకరిస్తాం. -
గానుగుపహాడ్ క్రాస్ రోడ్ వద్ద రహదారిపై రైతుల ధర్నా
-
ఆకలి వర్షంతో అన్నదాత కంట కన్నీరు
-
కోత కష్టం.. ఆగితే నష్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం పంటలు కోత దశకు వచ్చాయి. అనేకచోట్ల వరి, మొక్కజొన్న, సోయాబీన్ కోతలు, పత్తితీత మొదలైంది. ఇలాంటి సమయంలో కురుస్తున్న వర్షాలు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. వానాకాలం ప్రారంభదశలో సాగును దెబ్బతీసిన వర్షాలు, తీరా పంటలు చేతికొచ్చే దశలోనూ వెంటాడుతున్నాయి. వర్షాల వల్ల కోతదశలో ఉన్న పంటలు పాడవుతున్నాయి. వాటిని కోయడం కూడా సమస్యగానే మారుతోంది. కోయకుండా పొలాల్లో ఉంచడం వల్ల వరి ధాన్యం రంగు మారుతోంది. కొన్నిచోట్ల కోతకొచ్చిన సోయాబీన్‌ను రైతులు చేలల్లోనే వదిలేస్తున్నారు. ఇక పత్తి పరిస్థితి ఘోరంగా మారింది. తీత దశల తడిసిపోతుండటంతో పంటదెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఈపంటను మొదటి నుంచీ వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. జూలై నుంచి వర్షాలు మొదలుకాగా అప్పటి నుంచి లక్షలాది ఎకరాల్లో పత్తి పాడైపోయింది. దీంతో ఈసారి పత్తి దిగుబడి గణనీయంగా తగ్గుతుందని అంటున్నారు. సీజన్ మొదట్లోనూ సమస్యలు ఈ ఏడాది వానాకాలంలో 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా (ఆల్‌టైం రికార్డు) 1.36 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వరి సాగు లక్ష్యం 45 లక్షల ఎకరాలు కాగా, రికార్డు స్థాయిలో 64.54 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి సాగు లక్ష్యం 70 లక్షల ఎకరాలు కాగా, 50 లక్షల ఎకరాలకే పరిమితమైంది. వర్షాలతో పత్తి సాగు తగ్గింది. జూలై, ఆగస్టుల్లో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి నార్లు కొట్టుకు పోయాయి. సరఫరా కాని యంత్రాలు... రైతులకు వరికోత మిషన్లు అందించడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది. ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయ యంత్రాలకు రూ.500 కోట్లు కేటాయించినా యంత్రాలు సరఫరా కాలేదు. ఇప్పుడు వరినాటు యంత్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అనుకున్నారు. దీంతో కంపెనీలు 5 వేల వరికోత యంత్రాలను సిద్ధం చేశాయి. ఒక్కో యంత్రం ధర కంపెనీని బట్టి రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. అయితే ఈ యంత్రాలను సబ్సిడీపై రైతులకు అందజేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంలో వ్యవసాయశాఖ విఫలమయ్యింది. ఓలా, ఉబర్ మాదిరి వ్యవసాయానికి సంబంధించిన భారీ కోత యంత్రాలు బుక్ చేసుకుంటే అద్దెకు పంపించేలా కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని వ్యవసాయ శాఖ గతంలో చెప్పినా ఆచరణకు నోచుకోలేదు. వరి కోత యంత్రాల కొరత ప్రస్తుతం పలు ప్రాంతాల్లో పంటలు కోతకు సిద్ధమయ్యాయి. ఇప్పుడు కూడా వర్షాలు కురుస్తుండటంతో.. ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌గర్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో వేలాది ఎకరాల్లో చేతికొచ్చిన పంట తడిసిపోతోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు వరికోత యంత్రాలు లేకపోవడం సమస్యగా మారింది. వరి రికార్డు స్థాయిలో సాగవడంతో కోత యంత్రాలకు కొరత ఏర్పడుతోంది. చేలల్లోనే సోయా.. మొక్కజొన్న మొలకలు ఆదిలాబాద్ జిల్లాలో కోతకు వచ్చిన సోయా పంటను చేలల్లోనే వదిలేస్తున్నారు. పత్తి తీసే దశకు రాగా వానలకు తడిసి ముద్దయిపోతోంది. కొన్నిచోట్ల తీత మొదలైంది. అక్కడక్కడ కొనుగోళ్లు జరుగుతున్నాయి. కానీ వానల కారణంగా అంతరాయం కలుగుతోంది. జగిత్యాల జిల్లాలో వరి కోతలు ప్రారంభం కాలేదు. కానీ వర్షాలతో భూమి తేమగా మారడంతో పాటు కాలువల ద్వారా నీటిని వదులుతుండటం, వ్యవసాయ బావుల్లో నుండి నీరు ఉబికి వస్తుండటం ఇబ్బందికరంగా మారింది. టైర్ కోత యంత్రాలు (హార్వెస్టర్లు) నడిచే పరిస్థితి లేకుండా పోయింది. చైన్ హార్వేస్టర్లు సరిపడా లేవు. ఇక వర్షాల్లో పత్తి తీస్తే ఆరబెట్టడం కష్టం. కాబట్టి ఉష్ణోగ్రతలు పెరిగేవరకు తీసే పరిస్థితి కనిపించడంలేదు. దిగుబడి కూడా గణనీయంగా తగ్గే పరిస్థితి కన్పిస్తోంది. మొక్కజొన్న పంట కోతకు రావడంతో కంకుల బూరు తీసి ఆరబెడుతున్నారు. వర్షాలకు తడవడంతో మొలకలు వస్తున్నాయి. వరి ఎక్కువగా సాగయ్యే నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం కోతలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 20 శాతం కోతలు పూర్తయ్యాయి. అయితే వర్షాల కారణంగా కోతలు ఆలస్యం అవుతున్నాయి. కోసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ఇబ్బందులెదురవుతున్నాయి. రోడ్లు, కళ్లాల్లో అరబెట్టిన ధాన్యం తడుస్తోంది. కోత కోయని పంట పొలాల్లోనే నేలకొరుగుతోంది. సోయా, మొక్కజొన్న పంటల కోత మాత్రం పూర్తయ్యింది. అధిక వర్షాల వల్ల పత్తిలో ఎదుగుదల లోపించిందని రైతులు చెబుతున్నారు. వరి కోసే పరిస్థితి లేదు నేను నాలుగు ఎకరాల్లో వరి వేశా. ప్రస్తుతం పంట కోతకు వచ్చింది. కానీ కోయించలేని పరిస్థితి నెలకొంది. జూలై నుండి ఇప్పటివరకు కురిసిన వర్షాల కారణంగా పొలమంతా నీరు పైకి ఉబికి వస్తోంది. టైర్ హార్వెస్టర్లు నడిచే పరిస్థితి లేదు. చైన్ హార్వెస్టర్లు లేవు. ఒకవేళ దొరికినా గంటకు రూ.3,500 వరకు కిరాయి ఇవ్వాల్సి వస్తుంది. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. – బందెల మల్లయ్య, చల్గల్, జగిత్యాల రూరల్ మండలం -
అకాల వర్షాలు: పంట నష్టంపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, పంట నష్టంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పంట నష్టం వివరాలను వెంటనే నమోదు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, యుద్ధ ప్రతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పిడుగుపాటు, బోటు ప్రమాదాల్లో మరణించినవారికి 24 గంటల్లో పరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్లను సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశానికి మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, హెల్త్ చీఫ్ స్పెషల్ సెక్రటరీ హాజరయ్యారు. ఇక పంటలు చేతికొచ్చి కోయాల్సిన సమయంలో అకాల వర్షాలు రైతులను దెబ్బతీశాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా చేతికొచ్చిన పంట నేలపాలయ్యింది. ఈదురు గాలులతో కూడిన వాన రైతుల్ని అతలాకుతలం చేసింది. వందల ఎకరాల్లోని పంటలు నేలకొరిగాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మళ్లీ ‘గజ’గజ
సాక్షి, ఎల్.ఎన్.పేట: ఏనుగుల బీభత్సం మళ్లీ మొదలైంది. రాత్రి వేళ పంటలను నాశనం చేయడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. మండలంలోని సూదిరాయిగూడ, కరకవలస కొండల్లో తిష్ట వేసిన నాలుగు ఏనుగుల గుంపు గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారేంత వరకు సూదిరాయిగూడ గిరిజన గ్రామం సమీపంలో హల్చల్ చేశాయి. రాత్రి 10 గంటల సమయానికి ఏనుగుల గుంపు సూదిరాయిగూడ గ్రామం సమీపానికి వచ్చాయని గిరిజనులు సరవ వెంపయ్య, సవర సుంబురు, సవర చింగయ్య, సవర సురేష్‌లతోపాటు పలువురు చెప్పారు. వారం రోజులుగా ఏనుగులు గ్రామ సమీపానికి వచ్చి వెళ్లి పోతున్నాయని, గురువారం రాత్రి ఏనుగులు వచ్చే సమయానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఏనుగులు గ్రామ వీధులోకి వచ్చాయని అప్పుడు మంటలు వేసి ఏనుగులను తరమాల్సి వచ్చిందని గిరిజనులు చెప్పారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సంబంధిత శాఖ సిబ్బందికి ఫోన్ చేసినా వారు స్పందించ లేదని ఆరోపించారు. గ్రామంలో వీధి లైట్లు నాలుగే ఉన్నాయని, వీధి లైట్లు మరో రెండు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వారం రోజులుగా ఏనుగులు రావడం, వెళ్లడం వలన సవర వెం పయ్య, సవర సుంబురులకు చెందిన మూడు ఎకరాల వరిచేనును పూర్తిగా కుమ్మేశాయని బాధిత గిరిజనులు వాపోయారు. పోడు పంటగా పండించే కంది, పసుపు పంటలతోపాటు అరటి, కొబ్బరి, జీడి, మామిడి తోటలను నాశనం చేస్తున్నాయని బాధిత గిరిజనులు వాపోతున్నారు. ఏనుగుల దాడి కారణంగా సవర సుంబురు, సవర ప్రసాదరావు, సవర సింగయ్య, సవర సన్నాయి, సవర వెంపయ్య, సవర సుజాత, సవర జ్యూయల్, సవర ఏసైలకు చెందిన అరటి పసుపు, కంది పంటలను కుమ్మేసి విరిచేస్తున్నాయని బాధిత రైతులు వాపోయారు. పోడు పంటలకు తీరని నష్టం జరిగిందన్నారు. కష్టపడి పండించిన పంటను ఏనుగులు తొండంతో పీకేయడం, కాలితో తొక్కేయడం వలన ఎందుకూ పనికిరాకుండా పోతుందని రోదిస్తున్నారు. ఏనుగుల కారణంగా ఎప్పుడు ఎలాంటి నష్టం జరుగుతుందోనని భయం భయంగా జీవిస్తున్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించి ఏనుగుల గుంపు దారి మళ్లించే ప్రయత్నాలు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. -
పొంగి కృశిం‘చేను’
గోదావరి వరదలకు జిల్లాలో వరి పంటతోపాటు ఉద్యానవన పంటలు, కూరగాయల పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. లంక గ్రామాల్లో సుమారు మూడు వేల ఎకరాల్లో వేసిన ఉద్యానవన పంటలు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా అధికార యంత్రాంగం నష్టం అంచనాలో నిమగ్నమైంది. ముంపు మండలాల్లో ప్రభుత్వం సేకరించిన భూముల్లో కూడా ఈ ఏడాది పంటలు వేశారు. అవి కూడా దెబ్బతిన్నాయి. వీటికి కూడా ఉచితంగా విత్తనాలు పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సాక్షి, పశ్చిమగోదావరి : గత నెల 31 నుంచి గోదావరికి వరద సంభవించింది. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. గంట గంటకూ వరద హెచ్చుతగ్గులతో రైతులు ఆందోళన చెందారు. అదృష్టవశాత్తూ వరద తగ్గుముఖం పట్టినా పంటలను భారీగా ముంచింది. జిల్లా వ్యాప్తంగా గోదావరి తీర ప్రాంత రైతులు పంటలు సాగు చేసుకునేందుకు సమాయత్తమయ్యారు. ఎగువన ఉన్న కుక్కునూరు మండలం నుంచి వేలేరుపాడు, పోలవరం, తాళ్లపూడి, కొవ్వూరు, పెరవలి, ఆచంట, యలమంచిలి మండలాల వరకూ గోదావరి పరీవాహక ప్రాంతంలో వరి, కూరగాయలు, పత్తి, అరటి పంటలను రైతులు సాగు చేస్తున్నారు. అయితే ప్రకృతి గోదావరి వరద రూపంలో కన్నెర్ర చేసింది. నదీపరీవాహక ప్రాంతంలో రైతులను నష్టలపాలు చేసింది. మరో అడుగుమేర వరద పెరిగినా మరింత భారీస్థాయిలో పంటలు నష్టపోవాల్సి వచ్చేదని అధికారులు చెబుతున్నారు. అధికారులు అప్రమత్తం వరద ప్రారంభం నుంచే జిల్లా అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ ముత్యాలరాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ గౌసియాబేగం వరద ప్రాంతాల్లో పర్యటించారు. పంటల వివరాలను ప్రాథమికంగా అంచనా వేసేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే ఉద్యానవనశాఖ డిప్యూటీ డైరెక్టర్ సుబ్బారావు ఆధ్వర్యంలో అసిస్టెంట్ డైరెక్టర్ దుర్గేష్ ఉద్యానవన పంటల నష్టాల అంచనాకు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రోజూ పంటలు ఏ మేర నష్టపోవాల్సి వస్తుందో అంచనాకు వచ్చారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నీరు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వరద నీరు పంట చేల నుంచి బయటకు వెళ్లకపోవడంతో నష్టం అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఉద్యాన, వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. నరసాపురం రెవెన్యూ డివిజన్లోని మండలాల్లో ఇంకా ముంపు బారినే పంటలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల రైతులకు కష్టం పోలవరం ప్రాజెక్టు నిమిత్తం కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో రైతుల వద్ద నుంచి భూసేకరణ చేపట్టారు. అయితే వారిని ఇంకా అక్కడి నుంచి తరలించలేదు. దీంతో ప్రభుత్వం సేకరించిన భూముల్లో రైతులు పంటలు సాగు చేశారు. ఈ నేపథ్యంలో వరద వల్ల అక్కడి రైతులు పంటలను నష్టపోయారు. ఈ ప్రాంతాల్లోనూ అధికారులు నష్టాలను నమోదు చేశారు. వీరికి నిబంధనల ప్రకారం.. ఎటువంటి సాయం అందదు. అయితే ఇటీవల ఏరియల్ రివ్యూ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి కలెక్టర్ ముత్యాలరాజు ఈ అంశాన్ని తీసుకువెళ్లారు. దీంతో వారికి కూడా ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నష్టపోయిన రైతులకు వెంటనే విత్తనాలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పంట నష్టాలు ఇలా... జిల్లాలో అరటి 190 హెక్టార్లు, కూరగాయలు 62 హెక్టార్లలో, బొప్పాయి 8 హెక్టార్లలో నష్టపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 105.8 హెక్టార్లలో 1,587 మంది రైతులు వరినారుమళ్లు నష్టపోగా 183.8 హెక్టార్లలో వరి సాగుకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. కుక్కునూరు మండలంలో పత్తి 800 హెక్టార్లలో, వేలేరుపాడు మండలంలో 20 హెక్టార్లలో వరి నారుమళ్లు, 100 హెక్టార్లలో వరిసాగు, పోలవరం మండలంలో 182 హెక్టార్లు వరి నారుమళ్లకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు అంచనాలు సిద్ధం చేశారు. అయితే ఈ నష్టం రెండింతలు ఉండవచ్చని సమాచారం. నీరు పూర్తిగా తగ్గిన తర్వాతే అసలు నష్టం ఎంత అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
ఉద్యాన పంటల నష్టం రూ.29.74 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ మొదటి వారం నుంచి రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, బలమైన ఈదురు గాలులతో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతినగా.. అరటి, బొప్పాయి, మిరప, నిమ్మ, కూరగాయలు సాగు చేసిన రైతులు నష్టపోయారు. జిల్లాల వారీగా అకాల వర్షాలతో ఉద్యాన పంటలకు జరిగిన నష్టంపై అధికారులు ప్రాథమిక నివేదిక రూపొందించారు. పెద్దపల్లి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, జనగామ తదితర జిల్లాల్లో ఉద్యాన పంటలు ఎక్కువ విస్తీర్ణంలో దెబ్బతిన్నాయి. ప్రాథమిక నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 41,383 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో 38,653 ఎకరాల (93 శాతం) విస్తీర్ణంలో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. నిమ్మ, బత్తాయి తోటలతో పాటు మిరప, సపోట, బొప్పాయి పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఏప్రిల్ 7 నుంచి 24 మధ్య ఉద్యాన పంటలకు జరిగిన నష్టం రూ.29.74 కోట్ల మేర ఉంటుందని ఉద్యాన శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. జిల్లాల వారీగా ఉద్యాన పంటలకు జరిగిన నష్టంపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించిన నేపథ్యంలో, ప్రభుత్వం నుంచి అందే ఆదేశాల మేరకు ఉద్యాన పంటలకు జరిగిన నష్టంపై గ్రామాలు, రైతుల వారీగా పూర్తి వివరాలు సేకరిస్తామని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు చాలా చోట్ల ఉద్యాన పంటల నష్టం మొత్తం సాగు విస్తీర్ణంలో 33 శాతం లోపు ఉన్నట్లు ప్రాథమిక నివేదిక వెల్లడిస్తోంది. -
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
-
గంపెడాశలు.. గంగపాలు
* తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలకు నీట మునిగిన పంటలు * 80 వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు * సుమారు రూ. 200 కోట్ల వరకూ నష్టం సాక్షి, హైదరాబాద్: నిండు కరువుతో విలవిల్లాడిన రైతన్న ఆశలన్నీ అకాల వర్షాలతో గల్లంతయ్యాయి.. ఎంతో కొంత చేతికందకపోతుందానన్న గంపెడాశలూ గంగ పాలయ్యాయి. కాలంగాని కాలంలో కురిసిన వాన రాష్ట్రవ్యాప్తంగా అపార నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన వరి నీటమునిగిపోగా.. కోతదశలో ఉన్న మామిడి నేల రాలిపోయింది. మిగతా పంటలూ భారీగా దెబ్బతిన్నాయి. వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా ప్రకారమే దాదాపు 80 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా.. ఏకంగా రూ. 200 కోట్ల మేర నష్టం వాటిల్లింది. మరోవైపు వాన బీభత్సంపై సీఎం కేసీఆర్ వెంటనే అధికారులతో సమీక్షించారు. వీలైనంత త్వరగా రైతులను ఆదుకోవాలని ఆదేశించారు. అపార నష్టం.. రెండు, మూడు రోజులుగా కురిసిన వర్షాలకు ఎనిమిది జిల్లాల్లో అపార నష్టం వాటిల్లింది. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో నష్టం సంభవించగా.. నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లోనూ నష్టం భారీగా ఉంది. మొత్తంగా 40 మండలాల్లోని 328 గ్రామాల్లో 52,352 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇందులో దాదాపు 29 వేల ఎకరాల్లో వరి దెబ్బతిన్నది. కోత దశలో ఉన్న వరి నీటిపాలవడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. నువ్వుల పంట 5,934 హెక్టార్లలో దెబ్బతినగా... 2,089 హెక్టార్లలో సజ్జ, 769 హెక్టార్లలో మొక్కజొన్న, 510 హెక్టార్లలో జొన్న పంటలు దెబ్బతిన్నాయి. వీటికితోడు 11 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా అన్ని జిల్లాల్లోనూ మామిడి తోటల బాగా నష్టం వాటిల్లింది. దాదాపు 7వేల హెక్టార్లలో మామిడి దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. 250 హెక్టార్లలో అరటి, 75 హెక్టార్లలో బొప్పాయి పంటలకు నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఇక కూరగాయల తోటలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. మరోవైపు అకాల వర్షాల కారణంగా వివిధ జిల్లాల్లో 150 వరకు ఇళ్లు దెబ్బతిన్నాయని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. పిడుగుపాటు, వర్షాల తీవ్రతతో గోడలు కూలి, పంట నష్టం తట్టుకోలేక పురుగుల మందు తాగి.. ఇలా వివిధ కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు రైతులు మృత్యువాత పడ్డారు. కానీ జిల్లాల నుంచి మృతిచెందిన ఘటనలకు సంబంధించిన సమాచారమేదీ రాలేదని ఉన్నతాధికారులు ప్రకటించారు. మిషన్ కాకతీయకు బ్రేక్.. అకాల వర్షాలతో ‘మిషన్ కాకతీయ’ పథకానికి బ్రేక్ పడింది. మెదక్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పరిధిలో చెరువుల పునరుద్ధరణ పనులన్నీ దాదాపు పూర్తిగా నిలిచిపోగా.. ఆదిలాబాద్, వరంగల్‌లో కొన్ని డివిజన్ల పరిధిలో పనులు ఆగిపోయాయి. ప్రాథమిక సమాచారం మేరకు సుమారు 800 చెరువుల పరిధిలో పనులు పూర్తిగా నిలిచినట్లు తెలుస్తోంది. నేడు కూడా వర్షాలు వచ్చే 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. ఆదుకుంటాం: సీఎం వర్షాల కారణంగా సంభవించి న నష్టంపై సీఎం కేసీఆర్ సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలను, పంట నష్టపోయిన రైతులను, ఇళ్లు కోల్పోయినవారిని ఆదుకుంటామని ఈ సందర్భంగా చెప్పారు. పిడుగుపాటు, వడగళ్లు, భారీ వర్షాల కారణంగా జరిగిన ప్రమాదం వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. వెంటనే జిల్లాల వారీగా మృతుల వివరాలను పంపాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అకాల వర్షాల వల్ల జరిగిన పంటనష్టం, కూలిపోయిన, దెబ్బతిన్న ఇళ్లు, మరణించిన పశువుల సంఖ్య తదితర అంశాలపై పూర్తిస్థాయి నివేదికలను జిల్లా కలెక్టర్ల నుంచి తెప్పించాలని ప్రభుత్వ సీఎస్‌కు కేసీఆర్ ఆదేశించారు. నివేదికలు రాగానే ఆర్థిక సాయం అందించాలన్నారు. అంతా అస్తవ్యస్తం సాక్షి, నెట్వర్క్: వర్షాలతో పలు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్టలో గోడ కూలిపోయి యమున అనే మహిళ మృతి చెందింది. నల్లగొండ తడకమళ్ల ఐకేపీ కేంద్రంలో ధాన్యం నీటమునిగింది. వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు రాస్తారోకో చేశారు. రామన్నపేట మార్కెట్లో సిందం మల్లయ్య అనే రైతుకు చెందిన 30 బస్తాల ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.36.28 కోట్ల నష్టం జరిగింది. నువ్వులు, వరితో పాటు మామిడి, అరటి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల ఇళ్లు, కోళ్ల ఫారాలు దెబ్బతిన్నాయి. ఇక వరంగల్ జిల్లాలో పసుపు పంటకు నష్టం వాటిల్లింది. బచ్చన్నపేట మండలంలోని లింగంపల్లి, పడమటి కేశ్వాపూర్, మన్సాన్పల్లిలో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, దిలావర్పూర్, ఖానాపూర్, కడెం, మామడ మండలాల్లో సజ్జ, నువ్వు, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగింది. జైపూర్, చెన్నూర్ మండలాల్లో మామిడి దెబ్బతిన్నది. మహబూబ్‌నగర్ జిల్లాలో వరి పంటకు నష్టం వాటిల్లింది. మెదక్ జిల్లాలో 76 ఇళ్లు దెబ్బతిన్నాయి. -
అంధకారంలో ఆదిలాబాద్
ఈదురుగాలులు, వర్ష బీభత్సం 15 మండలాలకు నిలిచిపోయిన విద్యుతఖ సరఫరా సుమారు 500 ఇళ్లు ధ్వంసం.. వేల ఎకరాల్లో పంట నష్టం సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: అకాల వర్షం.. ఈదురుగాలులు సృష్టించిన బీభత్సంతో ఆదిలాబాద్ చీకట్లో మగ్గుతోంది. సోమవా రం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు సుమారు 15 మండలాల్లో కరెంటఖ లేక ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. మరో రెండు రోజుల పాటు విద్యుత్తు పునరుద్ధరణ జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. గురువారం వరకు విద్యుత్తు పునరుద్ధరణ పనులు పూర్తి చేయగలమని ఉన్నతాధికారులే చెబుతుండడంతో.. అంతకంటే ఎక్కువ సమయమే పట్టేలా ఉంది. సోమవారం రాత్రి బలమైన ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన జిల్లాను అతలాకుతలం చేసింది. ఈ వర్షం ధాటికి నిర్మల్ నుంచి ఆదిలాబాద్ డివిజన్‌కు విద్యుతఖ సరఫరా చేసే 132 కేవీ విద్యుత్తు లైను భారీ టవర్లు నేలకూలాయి. నిర్మలఖ మండలం ఎల్లారెడ్డిపేటఖ సమీపంలో రెండు టవర్లు (71డీ, 72 డీ) ధ్వంసమయ్యాయి. దీంతో జిల్లా కేంద్రంతోపాటు, 15 మండలాల పరిధిలో 300 గ్రామాలకు సోమవారం రాత్రి నుంచి విద్యుతఖ సరఫరా నిలిచిపోయింది. కరెంటఖ లేకపోవడంతో మంచి నీళ్లు కూడా దొరక్క ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ప్రత్యామ్నాయ విద్యుత్తు లైనఖ ద్వారా మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలో కొన్ని గంటపాటు విద్యుత్తు సరఫరా చేయగలిగారు. అంధకారంలో ఉన్న మండలాలివే.. ఆదిలాబాద్, జైనథ్, బేల, బోథ్, తలమడుగు, తాంసి, నేరడిగొండ, బజార్హత్నూర్, ఇచ్చోడ, గుడిహత్నూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, జైనూర్, సిర్పూర్(యూ) మండలాల పరిధిలోని గ్రామాలు అంధకారంలో ఉండిపోయాయి. సుమారు 500 ఇళ్లు ధ్వంసం.. ఈదురు గాలులకు జిల్లాలోని సుమారు 500 ఇళ్లు ధ్వంసమయ్యూరుు. నిర్మలఖ పరిధిలోని 4 మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం రైతులను కూడా నిండా ముంచింది. అకాల వర్షానికి జిల్లా వ్యాప్తంగా వెయ్యి ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కాగా, వర్షం బీభత్సం సృష్టించిన నిర్మలఖ మండలాల్లో మంత్రులు జోగురామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సందర్శించారు. ఇళ్లు ధ్వంసమైన బాధితులను పరామర్శించారు. -
ఏనుగుల దాడి.. పంట నష్టం
చిత్తూరు: గజరాజుల దాడులతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని వి.కోట మండల పరిధిలోని పెద్దూరు, నారాయణతండా, రామాపురం తండాలలో రెండు రోజుల నుంచి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజామున 22 ఏనుగులు పంటపొలాలపై దాడులు చేశాయి. ఏనుగుల ధ్వంసంతో టమాట, బీన్స్ పంట నామరూపాల్లేకుండా పోయింది. దీంతో గ్రామస్తులు భయంతో ఇళ్లను నుంచి బయటకు రావడంలేదు. పంటల నష్టంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. (వి.కోట) -
అకాల వర్షం.. అపార నష్టం
* వడగళ్ల వానతో నేలకొరిగిన పంటలు * పిడుగుపాటుతో ఆరుగురు మృతి సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం గాలివాన, వడగళ్లతో కూడిన అకాలవర్షాలు భారీనష్టాన్ని కలిగించాయి. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లగా.. మరోవైపు పిడుగు లు పడి ఆరుగురు మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఒకరు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. పొలం పనులకు వెళ్లిన రంగారెడ్డి జిల్లా గండేడ్ మండలం మహమ్మదాబాద్‌కు చెందిన నీరేటి మహేందర్(13), నీరేటి వెంకటయ్య(22), బేడిసందమ్మ(50)లు వర్షం వస్తుండడం తో ఓ మర్రిచెట్టు కిందకు చేరారు. అదే సమయంలో పిడుగు పడడంతో వీరంతా మృత్యువాతపడ్డారు. తీవ్రంగా గాయపడిన మహేందర్ తండ్రి నీరేటి పెద్ద యాదయ్యను ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మం డలంలోని అంబట్పల్లిలో లక్ష్మమ్మ (40), తెలకపల్లి మండలం గట్టు నెల్లికుదురులో భాస్కర్‌గౌడ్(18) అనే ఇంటర్ విద్యార్థి పిడుగుపాటుకు గురై మృతి చెందారు. వీరిద్దరూ పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకుంటూ పిడుగుపాటుకు గురయ్యారు. షాద్‌నగర్ మండలంలోని మదనాపూర్లో పిడుగుపాటుతో మరో మహిళ తీవ్రంగా గాయపడింది. అలాగే కర్నూలు జిల్లా నందవరంలో పిడుగుపాటుకు ఉప్పర రాముడు(55) అనే రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఇదిలా ఉండగా మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండురోజులుగా కురుస్తున్న అకాలవర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నాశనమైంది. పెద్దసంఖ్యలో పశువులు మృత్యువాత పడ్డాయి. మరోవైపు రంగారెడ్డి జిల్లాలో యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, శంషాబాద్ మండలాల్లో పంటలు నేల కొరగడం తో తీవ్రంగా నష్టం వాటిల్లింది. వచ్చే 36గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు: వాతావరణ శాఖ విదర్భ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉన్నట్టు విశాఖ వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రంపూట ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నట్టు తెలిపింది. వచ్చే 36 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ సోమవారం తెలి పింది. ఇవి అకాల వర్షాలు కావని, సాధారణంగా ఏప్రిల్ నుంచి ఇలా వేసవి వర్షాలు కురవడం మామూలేనని ఆ శాఖ అధికారులు తెలిపారు. ‘‘పగలు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతోపాటు వడగాల్పులు ఉంటాయి. సాయంత్రం వాతావరణం చల్లగా మారగానే ఆకాశం మేఘావృతమై ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఏటా ఇలాంటి వేసవి వర్షాలు ఏప్రిల్‌లో ఆరంభమవుతాయి. అయితే రాష్ట్రంలో ఈ సంవత్సరం మార్చిలోనే ఇలా వడగండ్ల వర్షం కురిసింది’’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి ‘సాక్షి’కి వివరించారు. కాగా గడచిన 24 గంటల్లో కోస్తాంధ్రలోని వీరఘట్టంలో గరిష్టంగా 4 సెం.మీ. వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణశాఖ వెల్లడించింది. పాడేరులో 1 సెం.మీ, రాయలసీమలోని ఆలూరులో 2, కర్నూలులో 1, తెలంగాణలోని భువనగిరిలో గరిష్టంగా 3 సెం.మీ., కామారెడ్డిలో ఒక సెం.మీ. వర్షపాతం కురిసినట్టు పేర్కొంది. హైదరాబాద్‌లోనూ పలుచోట్ల ఓ మోస్తరు వర్షం పడింది. సోమవారం రాత్రి 8.30 గంటల వరకు 0.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. -
రైతుల నెత్తిన అకాల పిడుగు
సాక్షి, ముంబై: కొన్నిరోజులుగా రాష్ట్రంలో అక్కడక్కడ ఈదురు గాలులతో కురుస్తున్న అకాల వర్షాల వల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పశువులు కూడా పెద్ద సంఖ్యలో చనిపోయాయి. చేతికొచ్చిన పంటలు, బత్తాయి, మామిడి, ద్రాక్ష తదితర తోటల్లో పండ్లు నేల రాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీటి నుంచి తేరుకోకముందే ధుళే జిల్లాలో శనివారం అర్ధరాత్రి నుంచి చల్లని ఈదురు గాలులతో కురుస్తున్న అకాల వర్షంవల్ల వెయ్యికి పైగా మేకలు, గొర్రెలు మృతి చెందాయి. వాటిపైనే ఆధారపడిన గొర్రెల మంద యజమానులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. దాదాపు రూ.ఐదు లక్షలకుపైగా నష్టపోయామని గొర్రెల యజమానులు బోరుమన్నారు. జిల్లా కలెక్టర్ ప్రకాశ్ మహాజన్‌తోపాటు తహసీల్ధార్ దత్తా శేజ్వాల్ ఘటనాస్థలికి చేరుకుని నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. మేకల కాపరులకు ప్రభుత్వం ద్వారా సాధ్యమైనంత త్వరగా నష్ట పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఖాందేశ్ ప్రాంతంలోని ధుళే, నందూర్బార్ జిల్లా లో గత మూడు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. అయితే శనివారం రాత్రి వర్ష తీవ్రత ఎక్కువైంది. దీంతో పాచోర్ తాలూకాలో చల్లని గాలులవల్ల ఓ రైతు మృతి చెందాడు. జామ్నేర్ తాలూకాలో పిడుగుపడి ఓ రైతు దుర్మరణం చెం దాడు. నందూర్బార్లో అడవిలోకి మేతకు వెళ్లిన మేకలు, గొర్రెలు చలి కారణంగా కొన్ని మరణిం చగా, మరికొన్ని అస్వస్థతకు గురయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రజాప్రతినిధులు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సందెట్లో సడేమియా అన్నట్లు రైతులను పరామర్శించేందుకు పెద్ద సంఖ్యలో తరలిరావడం మొదలైంది. ఇదివరకు పత్తాలేకుండా పోయిన ప్రజాప్రతినిధులు అకాల వర్షాల పుణ్యమా అని ఏ గ్రామంలో చూసినా వారి పర్యటనలే కనిపిస్తున్నాయి. నష్టపరిహారం చెల్లించేలా చూస్తామని హామీలు ఇవ్వడం, రైతులను ఓదార్చడం లాంటి దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు ఆకా శం మబ్బులు కమ్ముకుని ఉండడంవల్ల పంటలు, పండ్ల నాణ్యత తగ్గిపోయి గిట్టుబాటు ధర లభిం చదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ద్రాక్ష పంటలకు ప్రసిద్ధి చెందిన నాసిక్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ద్రాక్ష పంట కోతకు వచ్చింది. కానీ చల్లని గాలుల వల్ల ద్రాక్ష చెట్లపైనే కుళ్లిపోయి పూర్తిగా దెబ్బతింటున్నా యి. కనీసం పెట్టుబడైనా తిరిగి వస్తుందా అనే నమ్మకం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
కుప్పంలో మళ్లీ ఏనుగుల బీభత్సం
చిత్తూరు: జిల్లాలోని కుప్పంలో ఏనుగులు మళ్లీ బీభత్సం సృష్టించాయి. వేపలవల్లి గ్రామ శివారు ప్రాంతంలోకి ఏనుగుల గుంపు ప్రవేశించడంతో అక్కడి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కుప్పం వేపలపల్లి వద్ద రోడ్డుపైన 21 ఏనుగులు విడిది చేశాయి. వాటిని గమనించిన స్థానికులు ఉరుకులు పరుగులతో గ్రామంలోకి చేరుకున్నారు. గ్రామ శివారులోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు బిగ్గరగా ఘీంకరిస్తూ పంట పోలాల్లోకి వెళ్లాయి. అక్కడి పంటపోలాలను ఏనుగుల మంద నాశనం చేసినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సకాలంలో అప్రమత్తమయ్యారు. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు నానాకష్టాలు పడ్డారు. ఆ రోడ్డుమార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేసినట్టు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. -
చిత్తూరు జిల్లాలో ఏనుగల బీభత్సం
చిత్తూరు: జిల్లాలో బుధవారం ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఏనుగలన్నీ గుంపులుగా వచ్చిగుడిపల్లి మండలం సంగనపల్లి ఎం కొత్తూరూ, కోడిగానిపల్లి, చిన్నగొల్లపల్లి గ్రామ శివారులోని పంటపోలాలపై దాడులు చేశాయి. భయంకరంగా ఘీంకారాలు చేస్తూ పంట పోలాలను ధ్వంసం చేశాయి. దీంతో సమీప గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖా అధికారులు స్పందించి గ్రామస్తులను ఇళ్లల్లోంచి బయటకు రావద్దంటూ దండోరా వేయిస్తున్నారు. కాగా, కుప్పం వేపనపల్లి మార్గంలో రాకపోకలను పోలీసులు నిలిపివేసినట్టు సమాచారం. -
పంటల నష్టంతో.. ఆగని ఆత్మహత్యలు
సాక్షి నెట్వర్క్: పంటల నష్టం చూసిన రైతుల గుం డెలు పొలాల్లోనే రాలిపోతున్నాయి. రాష్ర్ట వ్యా ప్తం గా బుధవారం నలుగురు రైతులు బలవన్మర ణం చెందగా, ఒకరు గుండెపోటుతో మరణించారు. మరొకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విశాఖ జిల్లా ఎ.కోడూరు గ్రామానికి చెందిన రైతు కర్రి కాసుబాబు (48) తనకున్న అరెకరంతో పాటు కౌలుకు చేస్తున్న రెండెకరాల్లోగల వరి ముం పునీటితో పనికిరాకుండా పోయింది. దీంతో అప్పులు తీర్చే మార్గం కానరాక మంగళవారం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన రైతు చింతకుంట లక్ష్మీరాజం (50) తనకున్న 2 ఎకరాల 30 గుంటల్లో వరి సాగుచేయగా ఆశించిన దిగుబడి రాలేదు. దీంతో మానసికంగా కుంగిపోయిన లక్ష్మీరాజం బుధవారం వేకువజామున ఇంట్లోనే ఉరేసుకున్నాడు. కర్నూలు జిల్లా మిడుతూరు మండల పరిధిలోని అలగనూరు గ్రామానికి చెందిన రైతు షేక్ రసూల్ (48) తనకున్న 10 ఎకరాల్లో పత్తి, కంది సాగు చేశాడు. ఇటీవలి భారీ వర్షాలతో పత్తి పంట పూర్తిగా దెబ్బతినడంతో అప్పులు తీర్చేదారి లేక మంగళవారం అర్ధరాత్రి మద్యంలో పురుగుల మందు కలుపుకు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ జిల్లా గూడూరు మండలం చిన్న ఎల్లాపురం శివారు లైన్‌తండాకు చెందిన బానోతు చందు (35) తనకున్న మూడు ఎకరాలలో పత్తి, వరి వేశాడు. చేతికొచ్చిన పత్తి వర్షంతో తడిసి పాడవగా, వరి నేలకొరిగింది. దీంతో అప్పులు ఎలా తీర్చాలో అర్థంగాక, బుధవారం క్రిమి సంహారకమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండ లం రఘుదేవపురం పంచాయతీ పరిధిలోని రాపాకకు చెందిన రైతు సాని రాముడు (65) నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి వేశాడు. వర్షాలు పడడంతో నాలుగు ఎకరాల పంట నీటి మునిగిపోయింది. బుధవారం ఉదయం పొలానికి వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు. కాగా, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని పార్థసారధిపురంలో బుధవారం ఓ కౌలు రైతు ఆత్మహత్యకు యత్నించాడు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం కమలాపురం గ్రామానికి చెందిన తొర్లపాటి విష్ణు.. అత్తగారి గ్రామమైన పార్థసారధిపురంలో ఉంటూ, భూమిని కౌలుకు తీసుకుని నాలుగు ఎకరాలలో పత్తి, ఒక ఎకరంలో వరి సాగు చేశాడు. ఇందుకోసం రూ. 50 వేలు అప్పు చేశాడు. బుధవారం పురుగు మందు పిచికారీ చేసేందుకని పంటచేల వద్దకు వెళ్లాడు. దెబ్బతిన్న పంటలను చూసి తీవ్ర ఆవేదనతో అక్కడే పురుగులమందు తాగి ఇంటికి వచ్చి, విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు అతడ్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.