సాక్షి నెట్‌వర్క్: పంటల నష్టం చూసిన రైతుల గుం డెలు పొలాల్లోనే రాలిపోతున్నాయి. రాష్ర్ట వ్యా ప్తం గా బుధవారం నలుగురు రైతులు బలవన్మర ణం చెందగా, ఒకరు గుండెపోటుతో మరణించారు. మరొకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
విశాఖ జిల్లా ఎ.కోడూరు గ్రామానికి చెందిన రైతు కర్రి కాసుబాబు (48) తనకున్న అరెకరంతో పాటు కౌలుకు చేస్తున్న రెండెకరాల్లోగల వరి ముం పునీటితో పనికిరాకుండా పోయింది. దీంతో అప్పులు తీర్చే మార్గం కానరాక మంగళవారం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన రైతు చింతకుంట లక్ష్మీరాజం (50) తనకున్న 2 ఎకరాల 30 గుంటల్లో వరి సాగుచేయగా ఆశించిన దిగుబడి రాలేదు. దీంతో మానసికంగా కుంగిపోయిన లక్ష్మీరాజం బుధవారం వేకువజామున ఇంట్లోనే ఉరేసుకున్నాడు.
కర్నూలు జిల్లా మిడుతూరు మండల పరిధిలోని అలగనూరు గ్రామానికి చెందిన రైతు షేక్ రసూల్ (48) తనకున్న 10 ఎకరాల్లో పత్తి, కంది సాగు చేశాడు. ఇటీవలి భారీ వర్షాలతో పత్తి పంట పూర్తిగా దెబ్బతినడంతో అప్పులు తీర్చేదారి లేక మంగళవారం అర్ధరాత్రి మద్యంలో పురుగుల మందు కలుపుకు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వరంగల్ జిల్లా గూడూరు మండలం చిన్న ఎల్లాపురం శివారు లైన్‌తండాకు చెందిన బానోతు చందు (35) తనకున్న మూడు ఎకరాలలో పత్తి, వరి వేశాడు. చేతికొచ్చిన పత్తి వర్షంతో తడిసి పాడవగా, వరి నేలకొరిగింది. దీంతో అప్పులు ఎలా తీర్చాలో అర్థంగాక, బుధవారం క్రిమి సంహారకమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండ లం రఘుదేవపురం పంచాయతీ పరిధిలోని రాపాకకు చెందిన రైతు సాని రాముడు (65) నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి వేశాడు. వర్షాలు పడడంతో నాలుగు ఎకరాల పంట నీటి మునిగిపోయింది. బుధవారం ఉదయం పొలానికి వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు.
కాగా, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని పార్థసారధిపురంలో బుధవారం ఓ కౌలు రైతు ఆత్మహత్యకు యత్నించాడు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం కమలాపురం గ్రామానికి చెందిన తొర్లపాటి విష్ణు.. అత్తగారి గ్రామమైన పార్థసారధిపురంలో ఉంటూ, భూమిని కౌలుకు తీసుకుని నాలుగు ఎకరాలలో పత్తి, ఒక ఎకరంలో వరి సాగు చేశాడు. ఇందుకోసం రూ. 50 వేలు అప్పు చేశాడు. బుధవారం పురుగు మందు పిచికారీ చేసేందుకని పంటచేల వద్దకు వెళ్లాడు. దెబ్బతిన్న పంటలను చూసి తీవ్ర ఆవేదనతో అక్కడే పురుగులమందు తాగి ఇంటికి వచ్చి, విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు అతడ్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
పంటల నష్టంతో.. ఆగని ఆత్మహత్యలు
Published Thu, Oct 31 2013 4:27 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement