
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ మొదటి వారం నుంచి రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, బలమైన ఈదురు గాలులతో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతినగా.. అరటి, బొప్పాయి, మిరప, నిమ్మ, కూరగాయలు సాగు చేసిన రైతులు నష్టపోయారు. జిల్లాల వారీగా అకాల వర్షాలతో ఉద్యాన పంటలకు జరిగిన నష్టంపై అధికారులు ప్రాథమిక నివేదిక రూపొందించారు. పెద్దపల్లి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, జనగామ తదితర జిల్లాల్లో ఉద్యాన పంటలు ఎక్కువ విస్తీర్ణంలో దెబ్బతిన్నాయి. ప్రాథమిక నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 41,383 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.
ఇందులో 38,653 ఎకరాల (93 శాతం) విస్తీర్ణంలో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. నిమ్మ, బత్తాయి తోటలతో పాటు మిరప, సపోట, బొప్పాయి పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఏప్రిల్ 7 నుంచి 24 మధ్య ఉద్యాన పంటలకు జరిగిన నష్టం రూ.29.74 కోట్ల మేర ఉంటుందని ఉద్యాన శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. జిల్లాల వారీగా ఉద్యాన పంటలకు జరిగిన నష్టంపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించిన నేపథ్యంలో, ప్రభుత్వం నుంచి అందే ఆదేశాల మేరకు ఉద్యాన పంటలకు జరిగిన నష్టంపై గ్రామాలు, రైతుల వారీగా పూర్తి వివరాలు సేకరిస్తామని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు చాలా చోట్ల ఉద్యాన పంటల నష్టం మొత్తం సాగు విస్తీర్ణంలో 33 శాతం లోపు ఉన్నట్లు ప్రాథమిక నివేదిక వెల్లడిస్తోంది.