ఉద్యాన పంటల్లో భారీగా దిగుబడులు
టమాట, చీనీ ధరలు లేక విలవిల్లాడిన రైతన్నలు
డ్రాగన్ ఫ్రూట్ రైతులదీ అదే దారి
కూరగాయల ధరలు సైతం అంతంత మాత్రమే
కంది, మిర్చి రైతుల ఆవేదన
పంటలు బాగా పండితే ధరలుండవు. మంచి ధరలున్నప్పుడు దిగుబడి సరిగా రాదు. రాష్ట్రంలోని ఉద్యాన రైతుల దీనస్థితి ఇది. ‘ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రా’గా పిలుచుకునే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ఏడాది ఉద్యాన పంటల దిగుబడి ఆశించిన మేరకు వచ్చినా ధరలు లేక రైతులు దారుణంగా నష్టపోయారు. వాణిజ్య పంటలైన ద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్ వంటివి పంటలకు సైతం ఆశించిన ధర లభించక ఆర్థికంగా దెబ్బతిన్నారు. – సాక్షి ప్రతినిధి, అనంతపురం
చీనీ రైతులకు నష్టాలే
ఆంధ్రప్రదేశ్‌లో మేలిమి రకం చీనీ అనంతపురం జిల్లాలోనే పండుతుంది. ప్రస్తుతం టన్ను చీనీ ధర రూ.20 వేలు కూడా పలకడం లేదు. తొలినాళ్లలో గరిష్టంగా రూ.40 వేలు పలికింది. టన్నుకు రూ.60 వేల లభిస్తేనే రైతుకు బాగా గిట్టుబాటు అవుతుంది. గత ఏడాది డ్రాగన్ ఫ్రూట్స్ టన్ను ధర రూ.1.80 లక్షలు పలికింది. ఈ ఏడాది రూ.1.20 లక్షలకు పడిపోయింది. దానిమ్మకు మంచి ధరలు ఉన్నా.. అకాల వర్షాలు, వైరస్, తెగుళ్లతో దిగుబడి సరిగా రాలేదు.
టమాట రైతు చిత్తు
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా టమాట, పచ్చిమిర్చి రైతులు విలవిల్లాడుతున్నారు. ఈ పంటలు టన్నుల కొద్దీ దిగుబడి వచ్చినా ధరలు లేక నష్టపోయారు. టమాటాలకు ఐదు నెలలుగా కేజీ రూ.10కి మించి ధర లేదు. ఒక్కోసారి కూలి ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు.
కొన్నిసార్లు ధరలు లేక మండీలోనే టమాట బాక్సులను వదిలేసి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇక కందిరైతు అవస్థలు చెప్పడానికి లేదు. ధర గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. క్వింటాల్‌కు రూ.7,500 కనీస మద్దతు ధర కల్పించాలని రైతులు రోడ్డెక్కినా.. సర్కారు కనికరించడం లేదు.
గిట్టుబాటు కావడం లేదు
నేను రెండు ఎకరాల్లో మిరప సాగు చేశాను. సుమారు రూ.రెండు లక్షల పెట్టుబడి పెట్టాను. ప్రస్తుతం క్వింటాల్ ధర రూ.15 వేలు ఉంది. ధరలు ఉన్నట్టుండి పడిపోయాయి. దీంతో పూర్తిగా నష్టం వచ్చింది. ఒకప్పుడు క్వింటాల్ ధర రూ.35 వేలు ఉండేది. ఇలా ఉంటేనే మిరప రైతుకు లాభం. లేదంటే అప్పుల్లో కూరుకుపోవాల్సిందే. – రవి, మిరప రైతు, ఒంటిమిద్ది, కళ్యాణదుర్గం మండలం
ధర పడిపోయింది
గత ఏడాదికీ ఇప్పటికీ చూస్తే డ్రాగన్ ఫ్రూట్స్ ధర పడిపోయింది. గతంలో టన్ను రూ.1.80 లక్షల వరకూ పలికింది. ఇప్పుడు ధర పూర్తిగా పడిపోయింది. ఉత్పత్తి ఎక్కువై ఇలా అయిందా.. మార్కెట్‌లోనే రేటు లేదా అనేది అర్థం కావడం లేదు. – రమణారెడ్డి, మర్తాడు, గార్లదిన్నె మండలం
Comments
Please login to add a commentAdd a comment