గంపెడాశలు.. గంగపాలు | Crops destroyed by untimely rains, farmers lost crops | Sakshi
Sakshi News home page

గంపెడాశలు.. గంగపాలు

Published Tue, Apr 14 2015 3:07 AM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM

గంపెడాశలు.. గంగపాలు

గంపెడాశలు.. గంగపాలు

* తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలకు నీట మునిగిన పంటలు
* 80 వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
* సుమారు రూ. 200 కోట్ల వరకూ నష్టం

 
 సాక్షి, హైదరాబాద్: నిండు కరువుతో విలవిల్లాడిన రైతన్న ఆశలన్నీ అకాల వర్షాలతో గల్లంతయ్యాయి.. ఎంతో కొంత చేతికందకపోతుందానన్న గంపెడాశలూ గంగ పాలయ్యాయి. కాలంగాని కాలంలో కురిసిన వాన రాష్ట్రవ్యాప్తంగా అపార నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన వరి నీటమునిగిపోగా.. కోతదశలో ఉన్న మామిడి నేల రాలిపోయింది. మిగతా పంటలూ భారీగా దెబ్బతిన్నాయి. వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా ప్రకారమే దాదాపు 80 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా.. ఏకంగా రూ. 200 కోట్ల మేర నష్టం వాటిల్లింది. మరోవైపు వాన బీభత్సంపై సీఎం కేసీఆర్ వెంటనే అధికారులతో సమీక్షించారు. వీలైనంత త్వరగా రైతులను ఆదుకోవాలని ఆదేశించారు.
 
 అపార నష్టం..
 రెండు, మూడు రోజులుగా కురిసిన వర్షాలకు ఎనిమిది జిల్లాల్లో అపార నష్టం వాటిల్లింది. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో నష్టం సంభవించగా.. నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లోనూ నష్టం భారీగా ఉంది. మొత్తంగా 40 మండలాల్లోని 328 గ్రామాల్లో 52,352 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇందులో దాదాపు 29 వేల ఎకరాల్లో వరి దెబ్బతిన్నది. కోత దశలో ఉన్న వరి నీటిపాలవడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. నువ్వుల పంట 5,934 హెక్టార్లలో దెబ్బతినగా... 2,089 హెక్టార్లలో సజ్జ, 769 హెక్టార్లలో మొక్కజొన్న, 510 హెక్టార్లలో జొన్న పంటలు దెబ్బతిన్నాయి. వీటికితోడు 11 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.
 
  ముఖ్యంగా అన్ని జిల్లాల్లోనూ మామిడి తోటల బాగా నష్టం వాటిల్లింది. దాదాపు 7వేల హెక్టార్లలో మామిడి దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. 250 హెక్టార్లలో అరటి, 75 హెక్టార్లలో బొప్పాయి పంటలకు నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఇక కూరగాయల తోటలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. మరోవైపు అకాల వర్షాల కారణంగా వివిధ జిల్లాల్లో 150 వరకు ఇళ్లు దెబ్బతిన్నాయని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. పిడుగుపాటు, వర్షాల తీవ్రతతో గోడలు కూలి, పంట నష్టం తట్టుకోలేక పురుగుల మందు తాగి.. ఇలా వివిధ కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు రైతులు మృత్యువాత పడ్డారు. కానీ జిల్లాల నుంచి మృతిచెందిన ఘటనలకు సంబంధించిన సమాచారమేదీ రాలేదని ఉన్నతాధికారులు ప్రకటించారు.
 
 మిషన్ కాకతీయకు బ్రేక్..

 అకాల వర్షాలతో ‘మిషన్ కాకతీయ’ పథకానికి బ్రేక్ పడింది. మెదక్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పరిధిలో చెరువుల పునరుద్ధరణ పనులన్నీ దాదాపు పూర్తిగా నిలిచిపోగా.. ఆదిలాబాద్, వరంగల్‌లో కొన్ని డివిజన్‌ల పరిధిలో పనులు ఆగిపోయాయి. ప్రాథమిక సమాచారం మేరకు సుమారు 800 చెరువుల పరిధిలో పనులు పూర్తిగా నిలిచినట్లు తెలుస్తోంది.
 
 నేడు కూడా వర్షాలు
వచ్చే 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు.   
 
 ఆదుకుంటాం: సీఎం
 వర్షాల కారణంగా సంభవించి న నష్టంపై సీఎం కేసీఆర్ సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా మృతి చెందిన వారి  కుటుంబాలను, పంట నష్టపోయిన రైతులను, ఇళ్లు కోల్పోయినవారిని ఆదుకుంటామని  ఈ సందర్భంగా చెప్పారు. పిడుగుపాటు, వడగళ్లు, భారీ వర్షాల కారణంగా జరిగిన ప్రమాదం వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. వెంటనే జిల్లాల వారీగా మృతుల వివరాలను పంపాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అకాల వర్షాల వల్ల జరిగిన పంటనష్టం, కూలిపోయిన, దెబ్బతిన్న ఇళ్లు, మరణించిన పశువుల సంఖ్య తదితర అంశాలపై పూర్తిస్థాయి నివేదికలను జిల్లా కలెక్టర్ల నుంచి తెప్పించాలని ప్రభుత్వ సీఎస్‌కు కేసీఆర్ ఆదేశించారు.  నివేదికలు రాగానే ఆర్థిక సాయం అందించాలన్నారు.  
 
 అంతా అస్తవ్యస్తం
సాక్షి, నెట్‌వర్క్: వర్షాలతో  పలు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్టలో గోడ కూలిపోయి యమున అనే మహిళ మృతి చెందింది.   నల్లగొండ తడకమళ్ల ఐకేపీ కేంద్రంలో ధాన్యం నీటమునిగింది. వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు రాస్తారోకో చేశారు. రామన్నపేట మార్కెట్‌లో సిందం మల్లయ్య అనే రైతుకు చెందిన 30 బస్తాల ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.36.28 కోట్ల నష్టం జరిగింది.
 
 నువ్వులు, వరితో పాటు మామిడి, అరటి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల ఇళ్లు, కోళ్ల ఫారాలు దెబ్బతిన్నాయి. ఇక వరంగల్  జిల్లాలో పసుపు పంటకు నష్టం వాటిల్లింది. బచ్చన్నపేట మండలంలోని లింగంపల్లి, పడమటి కేశ్వాపూర్, మన్‌సాన్‌పల్లిలో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, దిలావర్‌పూర్, ఖానాపూర్, కడెం, మామడ మండలాల్లో సజ్జ, నువ్వు, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగింది. జైపూర్, చెన్నూర్ మండలాల్లో మామిడి దెబ్బతిన్నది. మహబూబ్‌నగర్ జిల్లాలో వరి పంటకు నష్టం వాటిల్లింది. మెదక్ జిల్లాలో 76 ఇళ్లు దెబ్బతిన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement