అకాల వర్షాలు, వడగళ్లు రైతులను నిండా ముంచాయి. ఆరుగాలం కష్టించి పండించి, కోతకు వచ్చిన పంటంతా ఒక్క వానకు దెబ్బతిన్నది. ఇప్పుడేకాదు గత రెండేళ్లలోనూ పలు ప్రాంతాల్లో వడగళ్లకు పంటలు నాశనమయ్యాయి. ఈ క్రమంలో పంట నష్టం నివారణపై వ్యవసాయ విశ్వవిద్యాలయం కసరత్తు చేసింది. క్షేత్రస్థాయి సమాచారం, ఉపగ్రహ చిత్రాలు, ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో.. రాష్ట్రవ్యాప్తంగా వడగళ్లు, తీవ్ర ఈదురుగాలులకు ఆస్కారమున్న ప్రాంతాలను గుర్తించింది. ఆ ప్రాంతాల్లో పంట సీజన్‌ను ముందుకు జరపడం, వడగళ్లు, ఈదురుగాలులను తట్టుకునే రకాల వరిని వేయడం వంటివి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వడగళ్లు, తీవ్రస్థాయిలో ఈదురుగాలుల ప్రభావం ఉండే ప్రాంతాలను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాల యం మ్యాపింగ్ చేసింది. జిల్లాలు, వాటిలోని మండలాల వారీగా ఎక్కడెక్కడ వడగళ్ల వాన, ఈదురుగాలులకు ఎక్కువ అవకాశం ఉందో గుర్తించింది. ఈ వివరాలతోపాటు ఆయా చోట్ల చేపట్టాల్సిన చ ర్యలను సూచిస్తూ.. తాజాగా ప్రభుత్వానికి ఒక నివేదిక అందించింది. వడగళ్లు, ఈదురుగాలుల వల్ల ఈ ఏడాది రాష్ట్రంలో భారీగా పంటలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.
మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన వడగళ్ల వానలు, ఈదురుగాలులకు 12 లక్షల ఎకరాలకుపైగా పంటలకు నష్టం జరిగినట్టు అంచనా. ఇందులోనూ వరి భారీగా దెబ్బతిన్నది. మొక్కలు నేలకొరగడంతోపాటు గింజలు రాలిపోయాయి. ఈ నేపథ్యంలో అకాల వర్షాల నష్టాన్ని తప్పించుకునేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.
అన్ని అంశాలను క్రోడీకరించి..
ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం వడగళ్ల ప్రాంతాలను మ్యాపింగ్ చేసింది. కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాల నుంచి వచ్చిన సమాచారం ఒకవైపు.. ఉపగ్రహ చిత్రాలు, సెన్సర్లు, డ్రోన్ల సాయంతో వర్సిటీ అగ్రో క్లైమెట్ రీసెర్చ్ సెంటర్ ఈ మ్యాపింగ్ చేపట్టింది. గత కొన్నేళ్ల లెక్కలను పరిగణనలోకి తీసుకొంది.
ఏయే జిల్లాల్లో, ఏయే మండలాల్లో వడగళ్లకు ఎక్కువ ఆస్కారం ఉందన్నది గుర్తించింది. ఈ మేరకు ‘గ్రౌండ్ ట్రూత్ డేటా’తో నివేదికను రూపొందించింది. ఆయా ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించింది. ఈ ప్రాంతాల్లోని గ్రామాల్లో రైతుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.
గతేడాది కంటే అధికంగా వడగళ్ల వానలు
2022లో రెండు నెలల్లో మొత్తంగా 11 రోజులు మాత్రమే వడగళ్ల వానలు కురిశాయి. అదే ఈ ఏడాది మార్చిలో ఐదు రోజులు.. ఏప్రిల్‌లో 15 రోజులు, మేలో ఇప్పటివరకు రెండు రోజులు వడగళ్లు పడ్డాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11 సార్లు (మార్చిలో 4, ఏప్రిల్‌లో 7) వడగళ్ల వానలు పడ్డాయి.
ఆదిలాబాద్ జిల్లాలో 9 సార్లు (మార్చిలో 3, ఏప్రిల్‌లో 4, మేలో 2), నల్గొండ జిల్లాలో 5 సార్లు (మార్చిలో 4, ఏప్రిల్‌లో 1), నిజామాబాద్ జిల్లాలో రెండు (మార్చిలో 1, ఏప్రిల్‌లో 1), మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల జిల్లాల్లో మార్చి నెలలో ఒకసారి.. వరంగల్, జనగామ జిల్లాల్లో ఏప్రిల్ నెలలో ఒకసారి వడగళ్ల వానలు కురిశాయి. ఇక చాలా చోట్ల ఈదురుగాలుల తీవ్రత కనిపించింది.
సీజన్ ముందుకు.. వడగళ్లు తట్టుకునే రకాలు..
రాష్ట్రంలో పంటల సీజన్‌ను కాస్త ముందుకు జరపాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో.. దీనికి అనుగుణంగా ముందుకు సాగడంపై వ్యవసాయ విశ్వవిద్యాలయం పలు సూచనలు చేసింది. ఏటా మే నెలాఖరు, జూన్ తొలివారం నాటికే వానాకాలం వరిసాగు జరిగేలా రైతులను ప్రోత్సహించాలని.. సెప్టెంబర్ నెలాఖరు, అక్టోబర్ నెల ప్రారంభానికే వానాకాలం పంట చేతికి వస్తుందని పేర్కొంది. దీనితో అక్టోబర్‌లో వచ్చే అకాల వర్షాల ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉందని సూచించింది.
వానాకాలం వరి కోతలు పూర్తికాగానే అక్టోబర్ తొలివారంలోనే యాసంగి వరి సాగు ప్రారంభిస్తే.. ఫిబ్రవరి నెలాఖరు, మార్చి ప్రారంభం నాటికే పంట చేతికి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీనితో మార్చి నెల మధ్య నుంచి మొదలయ్యే అకాల వర్షాల నుంచి పంటను కాపాడుకునే వీలుంటుందని తెలిపింది. నేరుగా వరి గింజలు వెదజల్లే పద్ధతి పాటించాలని సూచించింది. ఇది సాధ్యంకాకపోతే వడగళ్లను, ఈదురుగాలులను తట్టుకునే వంగడాలను రైతులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇప్పటికే వరిలో జేజీఎల్–24423 రకాన్ని రైతులకు అందుబాటులో ఉంచింది. మరో ఏడు వంగడాలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు సాతున్నాయి.
ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ వడగళ్ల ప్రమాదం?
వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్రవ్యాప్తంగా వడగళ్లు పడే ప్రాంతాలను గుర్తించింది. వీటిని జిల్లాలు, మండలాల వారీగా మ్యాపింగ్ చేస్తోంది. పలు జిల్లాలకు సంబంధించి మ్యాపింగ్ పూర్తయింది. మరికొన్నింటికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని విశ్వవిద్యాలయం వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటివరకు మ్యాపింగ్ పూర్తయిన జిల్లాలకు సంబంధించి వడగళ్ల ప్రభావిత ప్రాంతాలివీ..
► ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి, కూసుమంచి, బోనకల్, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్, ముదిగొండ, ఎర్రుపాలెం మండలాలు.
► భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, భద్రాచలం, గుండాల, టేకులపల్లి, బూర్గంపాడు, దమ్మపేట, పినపాక, ఇల్లెందు, టేకులపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట, పాల్వంచ మండలాలు.
► నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని నవీపేట్, మాక్లూర్, నిజామాబాద్ రూరల్, డిచ్‌పల్లి, సిరికొండ, ధర్పల్లి, పిట్లం, బిచ్కుంద, మద్దూర్, దోమకొండ, ఎల్లారెడ్డి మండలాలు.
► ఆదిలాబాద్ జిల్లాలో బోథ్, ఇచ్చోడ, సిరికొండ, నేరడిగొండ, బజార్ హత్నూర్, తలమడుగు, జైనథ్ మండలాలు.
► మంచిర్యాల జిల్లాలో దండేపల్లి మండలం.
► మహబూబాబాద్ జిల్లాలోని పెద్ద వంగర, దంతాలపల్లి, తొర్రూరు, గూడూరు మండలాలు.
► వరంగల్ జిల్లాలోని నర్సంపేట, ఖానాపురం, నల్లబెల్లి, వర్ధన్నపేట, నెక్కొండ మండలాలు.
► జనగామ జిల్లాలో బచ్చన్నపేట, నర్మెట్ట, జనగామ, లింగాల ఘన్‌పూర్ మండలాలు.
► నల్లగొండ జిల్లాలో గుర్రంపోడు, మర్రిగూడ, నాంపల్లి, చండూరు, శాలిగౌరారం, మునుగోడు, కనగల్, నల్లగొండ, కట్టంగూరు, డిండి, దేవరకొండ, చందపేట, ఉట్కూరు, నకిరేకల్ మండలాలు.
► సిద్దిపేట జిల్లాలో చిన్నకోడూరు, నంగనూరు, దౌలతాబాద్, రాయపోలు, జగదేవ్‌పూర్, హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, గజ్వేల్, కొండపాక, నారాయణపేట, మిరుదొడ్డి, కొమురవెల్లి, దుబ్బాక, తొగుట, మద్దూరు, సిద్దిపేట రూరల్, చేర్యాల మండలాలు.
► మహబూబ్‌నగర్ జిల్లాలో గండీడ్, హన్వాడ, బాలానగర్ మండలాలు.
► రంగారెడ్డి జిల్లాలో పరిగి, చేవెళ్ల, మొయినాబాద్ మండలాలు.
► వికారాబాద్ జిల్లా తాండూరు, పెద్దేముల్, కోటపల్లి, బషీరాబాద్ మండలాలు.
Comments
Please login to add a commentAdd a comment