వెంకటాపురం (కె) మండలంలో నీటిలో కొట్టుకుపోతున్న మిరపకాయలను ఏరుతున్న రైతులు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్ల వానలతో యాసంగి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మొక్కజొన్న, వరి, శనగ పంటలతోపాటు మామిడిపై ప్రభావం ఉన్నట్టు చెప్తున్నారు.
ప్రస్తుతం జిల్లాల వారీగా పంట నష్టంపై ప్రాథమిక అంచనాలను సిద్ధం చేస్తున్నామని.. మొత్తం నష్టంపై త్వరలో స్పష్టత వస్తుందని వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ అకాల వర్షాల ప్రభావం ఉందన్నారు. కాగా పంట నష్టంపై కేంద్రానికి లేఖ రాయాలని వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది.
ఇప్పటికే వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అద్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు హెలికాప్టర్ ద్వారా పంట నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. బాధితులతోనూ మాట్లాడారు.
మొక్కజొన్న, మామిడి, వరిలపై ప్రభావం
యాసంగి తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 72.61 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అందులో వరి 56.44 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 6.48 లక్షల ఎకరాలు, శనగ 3.64 లక్షల ఎకరాలు, వేరుశనగ 2.42 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇక రాష్ట్రంలో 3.50 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి.
అకాల వర్షాలు, వడగళ్ల కారణంగా ప్రధానంగా వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొక్కజొన్న విరిగిపోయింది. వరి నేల వాలింది. వడగళ్లు, ఈదురుగాలుల ప్రభావంతో.. మామిడి పూత, పిందెలు, కాయలు రాలిపోయాయి. మామిడి దిగుబడి తగ్గి నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో ఈసారి 12-13 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేశామని.. కానీ ప్రస్తుత నష్టంతో దిగుబడి సగం దాకా పడిపోయే అవకాశం ఉందని ఉద్యానశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇక టమాటా, బీరకాయ, పచ్చిమిర్చి, బొబ్బర్లు, మినుములు వంటి పంటలకూ వేల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.
గాలిలో దీపంలా పంటలు!
మూడేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో పంటల బీమా అమలయ్యేది. కానీ ఇప్పుడు పంటనష్టాలకు పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. కొత్త పంటల బీమా విధానాన్ని తీసుకొస్తామని వ్యవసాయశాఖ పలు సందర్భాల్లో చెప్పినా ఆచరణలోకి రాలేదు. దీనితో పంటల పరిస్థితి గాలిలో దీపంలా మారిపోయిందని రైతు సంఘాలు వాపోతున్నాయి. రైతుబంధుతో ఎంతో ప్రయోజనం ఉన్నా పంట నష్టం పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాయి.
పిడుగుపడి ముగ్గురు విద్యార్థులకు గాయాలు
నిజామాబాద్ పట్టణంలోని మాలపల్లిలో ఉన్న ఓ మదర్సాలో శనివారం రాత్రి పిడుగుపడటంతో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిలో ఓ విద్యార్థి పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.
కన్నీళ్లు మిగిల్చిన వడగళ్లు
► ఖమ్మం జిల్లా పరిధిలో 10,418 మంది రైతులకు చెందిన 20,748 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
► సూర్యాపేట జిల్లాలో 14,429 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని.. 7,097 మంది రైతులు సుమారు 69.77 కోట్ల మేర నష్టపోయారని ప్రాథమికంగా అంచనా వేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 4,282 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. నల్లగొండ జిల్లాలో 610 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది.
► కరీంనగర్ జిల్లాలో 14,300 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. మొక్కజొన్న, వరి బాగా నష్టపోయినట్టు గుర్తించారు.
► జగిత్యాల జిల్లాలో 4,600 ఎకరాల్లో మామిడి, 600 ఎకరాల్లో నువ్వులు, మొక్కజొన్న, వరికి.. పెద్దపల్లి జిల్లాలో 1,622 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు.
► ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, జేఎస్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో మొక్కజొన్న, మిర్చి, పొగాకుతోపాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడి, బొప్పాయి నేలరాలాయి. భూపాలపల్లిలో ఓపెన్ కాస్ట్ గనుల్లో వాన నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
► ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో మూడు వేల ఎకరాల్లో మొక్కజొన్న, మిర్చికి నష్టం వాటిల్లింది. ఇతర పంటలకూ భారీగానే నష్టం జరిగిందని రైతులు చెప్తున్నారు.
► సంగారెడ్డి జిల్లాలోని 18 మండలాల్లో 4,425 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ముఖ్యంగా జొన్న, శనగ పంటలకు నష్టం జరిగింది.
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం అందించి ఆదుకోవాలి. కోతకు వచ్చిన మొక్కజొన్న, మిర్చి పంటలు నేలకొరిగాయి. మామిడి పిందెలు రాలిపోయాయి. వరికి అపార నష్టం వాటిల్లింది.
ఉడకబెట్టి, ఆరబెట్టి కల్లాల్లో ఉంచిన పసుపు తడిసిపోయింది. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి బాధిత రైతులందరికీ పరిహారం అందేలా చూడాలి. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకాన్ని అమల్లోకి తేవాలి.
► తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment