Hailstorms
-
వడగాడ్పులకు 100 మంది బలి!
బలియా/పట్నా: ఉత్తరాదిన కొనసాగుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో జనం పిట్టల్లా రాలుతున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో మూడు రోజుల్లోనే 100 మంది వరకు ప్రజలు చనిపోయారు. భరించలేని ఎండలు, వడగాడ్పులకు తాళలేక యూపీలో 54, బిహార్‌లో 44 మరణాలు నమోదయ్యాయి. ఈ నెల 15, 16, 17 తేదీల్లో యూపీలోని బలియా ఆస్పత్రిలో చేరిన సుమారు 400 మంది జ్వర బాధితుల్లో 54 మంది వివిధ కారణాలతో చనిపోయారని అధికారులు తెలిపారు. ఎండలు విపరీతంగా ఉండడంతో ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలకు గురై ఆస్పత్రికి వస్తున్నారని బలియా ప్రధాన వైద్యాధికారి(సీఎంవో) డాక్టర్ జయంత్ కుమార్ తెలిపారు. మొత్తం 54 మందిలో 40 శాతం మంది జ్వరంతో, 60 శాతం మంది ఇతర వ్యాధులతో చనిపోయారని డాక్టర్ కుమార్ చెప్పారు. ఎక్కువ మంది 60 ఏళ్లకు పైబడిన వారేనన్నారు. మరణాలకు కచ్చితమైన కారణాలను కనుగొనేందుకు లక్నో నుంచి వైద్య బృందాలను పంపించింది. బల్లియా జిల్లా ఆస్పత్రిలో మరిన్ని ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఏర్పాటు చేశారు. వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది సంఖ్యను కూడా పెంచామని అధికారులు తెలిపారు. ఆజంగఢ్ డివిజన్ ఆరోగ్య శాఖ అదనపు డైరెక్టర్ ఓపీ తివారీ శనివారం మీడియాతో మాట్లాడుతూ..లక్నో నుంచి రానున్న ఆరోగ్య శాఖ బృందం బల్లియాకు వచ్చి పరీక్షలు నిర్వహిస్తుందని, మరణాలకు కారణాలను నిర్ధారిస్తామని చెప్పారు. బహుశా గుర్తించని ఏదో ఒక వ్యాధి మరణాలకు కారణమై ఉండొచ్చు, ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. వేసవి, శీతాకాలాల్లో డయాబెటిక్ రోగులతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, రక్తపోటు ఉన్నవారిలో మరణాల రేటు సాధారణంగా ఎక్కువగా ఉంటుంది’అని తివారీ చెప్పారు. శుక్రవారం బలియాలో 42.2 డిగ్రీల సెల్సియస్ ఉషో్టగ్రత నమోదైందని ఐఎండీ తెలిపింది. సాధారణం కంటే ఇది 4.7 డిగ్రీలు ఎక్కువని పేర్కొంది. సీఎంఎస్ తొలగింపు బలియా జిల్లా ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్(సీఎంఎస్) డాక్టర్ దివాకర్ సింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆస్పత్రిలో మరణాలకు కారణాలపై నిర్లక్ష్యపూరితంగా వ్యాఖ్యలు చేశారంటూ ఆజంగఢ్‌కు బదిలీ చేసింది. డాక్టర్ ఎస్కే యాదవ్‌కు సీఎంఎస్ బాధ్యతలను అప్పగించింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ..నిత్యం 125 నుంచి 135 మంది రోగులు ఆస్పత్రిలో చేరుతున్నారని తెలిపారు. 15న 23 మంది, 16న 20 మంది, 17న 11మంది వేర్వేరు కారణాలతో చనిపోయినట్లు తెలిపారు. బిహార్‌లో 44 మంది.. బిహార్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. గత 24 గంటల్లో తీవ్ర వడగాల్పుల కారణంగా 44 మంది చనిపోయారు. వీరిలో ఒక్క పటా్నలోనే 35 మంది ప్రాణాలు కోల్పోయారు. పట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వంద మంది వరకు వడదెబ్బ బాధితులు చేరినట్లు అధికారులు తెలిపారు. ఎండలకు తోడు రాష్ట్రంలోని 18 ప్రాంతాల్లో తీవ్రమైన వడగాడ్పులు, నాలుగు చోట్ల వడగాడ్పులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయని అధికారులు తెలిపారు. షేక్‌పురాలో అత్యధికంగా 44.2 డిగ్రీలు, పటా్నలో 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం పాఠశాలలు, అంగన్వాడీలకు వేసవి సెలవులను 24 వరకు పొడిగించింది. -
సగం రాష్ట్రాలకు వడగాల్పుల వెతలు
న్యూఢిల్లీ: సూర్య ప్రతాపానికి దాదాపు సగం భారతదేశ రాష్ట్రాలు చెమటతో తడిసి ముద్దవుతున్నాయి. భానుడి భగభగలతో మొదలైన వడగాల్పులు మరో 3–4 రోజులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ వేడి వేడి వార్తను పట్టుకొచ్చింది. మండే ఎండలను భరిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి. రుతుపవనాలు తలుపుతట్టినా వడగాల్పులు మాత్రం వదిలిపోవట్లేవు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలుసహా విదర్భ ప్రాంతాల్లో తీవ్రస్థాయి నుంచి అతి తీవ్రస్థాయిలో వడగాల్పుల పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే బిహార్‌లో రెడ్అలర్ట్ను ప్రకటించారు. శనివారం(జూన్ 17)దాకా జార్ఖండ్‌లో స్కూళ్లు తెరుచుకోనేలేదు. ఛత్తీస్‌గఢ్, గోవాల్లోనూ ఇదే పరిస్థితి. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు, రాత్రిపూట ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. ► తెలంగాణ, రాయలసీమ, మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంతం, తమిళనాడు రాష్ట్ర ప్రజలు ఆదివారం(జూన్ 18న) కూడా వడగాల్పులను భరించాల్సిందే. ► ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, యానాం, మధ్యప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతాలు, తూర్పు యూపీ, బిహార్‌లో మరో రెండు రోజులు ఎండలు మరింత మండుతాయి. ► ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో మరో నాలుగు రోజులపాటు వడగాల్పులు కొనసాగుతాయి. ► పశ్చిమబెంగాల్లోని గంగా పరీవాహక ప్రాంతాలు, జార్ఖండ్‌లో మరో 3 రోజులు ఎండలు మరింత ముదురుతాయి. ► రాత్రిపూట సైతం ఉష్ణోగ్రతలు పైస్థాయిలోనే ఉండే అవకాశం ఉంది. ► విదర్భ, ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతాల్లో ఆదివారం ఈ పరిస్థితులు ఉంటాయి. ► మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్‌లలో రెండు రోజులు రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువే ఉండనున్నాయి. ► మధ్య భారతం, తూర్పు భారతం, దక్షిణ భారతదేశంలో వచ్చే మూడు రోజులూ ఉష్ణోగ్రతల్లో మార్పేమీ ఉండదు. ► ఆ తర్వాత మాత్రం 2–4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గొచ్చు. -
టీవీ, రేడియోల్లోనూ వాతావరణ హెచ్చరికలు
న్యూఢిల్లీ: తీవ్ర వాతావరణ హెచ్చరికలను ఇకపై టీవీలు, రేడియోల్లోనూ ప్రసారం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ వర్షాలు, తుపాన్లు, వడగాలుల గురించి మొబైల్ ఫోన్లకు మెసేజీలు పంపే ప్రక్రియను ఇప్పటికే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ప్రారంభించింది. రెండో దశలో టీవీ, రేడియో తదితర మాధ్యమాల ద్వారా కూడా హెచ్చరికల మెసేజీలను పంపే ప్రక్రియ ఈ ఏడాది చివర్లో మొదలవుతుందని ఎన్డీఎంఏ అధికారి ఒకరు చెప్పారు. -
కాపు కాసే ‘మ్యాపింగ్’! రాష్ట్రంలో వడగళ్లు పడే అవకాశమున్నది ఇక్కడే!
అకాల వర్షాలు, వడగళ్లు రైతులను నిండా ముంచాయి. ఆరుగాలం కష్టించి పండించి, కోతకు వచ్చిన పంటంతా ఒక్క వానకు దెబ్బతిన్నది. ఇప్పుడేకాదు గత రెండేళ్లలోనూ పలు ప్రాంతాల్లో వడగళ్లకు పంటలు నాశనమయ్యాయి. ఈ క్రమంలో పంట నష్టం నివారణపై వ్యవసాయ విశ్వవిద్యాలయం కసరత్తు చేసింది. క్షేత్రస్థాయి సమాచారం, ఉపగ్రహ చిత్రాలు, ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో.. రాష్ట్రవ్యాప్తంగా వడగళ్లు, తీవ్ర ఈదురుగాలులకు ఆస్కారమున్న ప్రాంతాలను గుర్తించింది. ఆ ప్రాంతాల్లో పంట సీజన్‌ను ముందుకు జరపడం, వడగళ్లు, ఈదురుగాలులను తట్టుకునే రకాల వరిని వేయడం వంటివి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వడగళ్లు, తీవ్రస్థాయిలో ఈదురుగాలుల ప్రభావం ఉండే ప్రాంతాలను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాల యం మ్యాపింగ్ చేసింది. జిల్లాలు, వాటిలోని మండలాల వారీగా ఎక్కడెక్కడ వడగళ్ల వాన, ఈదురుగాలులకు ఎక్కువ అవకాశం ఉందో గుర్తించింది. ఈ వివరాలతోపాటు ఆయా చోట్ల చేపట్టాల్సిన చ ర్యలను సూచిస్తూ.. తాజాగా ప్రభుత్వానికి ఒక నివేదిక అందించింది. వడగళ్లు, ఈదురుగాలుల వల్ల ఈ ఏడాది రాష్ట్రంలో భారీగా పంటలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన వడగళ్ల వానలు, ఈదురుగాలులకు 12 లక్షల ఎకరాలకుపైగా పంటలకు నష్టం జరిగినట్టు అంచనా. ఇందులోనూ వరి భారీగా దెబ్బతిన్నది. మొక్కలు నేలకొరగడంతోపాటు గింజలు రాలిపోయాయి. ఈ నేపథ్యంలో అకాల వర్షాల నష్టాన్ని తప్పించుకునేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. అన్ని అంశాలను క్రోడీకరించి.. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం వడగళ్ల ప్రాంతాలను మ్యాపింగ్ చేసింది. కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాల నుంచి వచ్చిన సమాచారం ఒకవైపు.. ఉపగ్రహ చిత్రాలు, సెన్సర్లు, డ్రోన్ల సాయంతో వర్సిటీ అగ్రో క్లైమెట్ రీసెర్చ్ సెంటర్ ఈ మ్యాపింగ్ చేపట్టింది. గత కొన్నేళ్ల లెక్కలను పరిగణనలోకి తీసుకొంది. ఏయే జిల్లాల్లో, ఏయే మండలాల్లో వడగళ్లకు ఎక్కువ ఆస్కారం ఉందన్నది గుర్తించింది. ఈ మేరకు ‘గ్రౌండ్ ట్రూత్ డేటా’తో నివేదికను రూపొందించింది. ఆయా ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించింది. ఈ ప్రాంతాల్లోని గ్రామాల్లో రైతుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. గతేడాది కంటే అధికంగా వడగళ్ల వానలు 2022లో రెండు నెలల్లో మొత్తంగా 11 రోజులు మాత్రమే వడగళ్ల వానలు కురిశాయి. అదే ఈ ఏడాది మార్చిలో ఐదు రోజులు.. ఏప్రిల్‌లో 15 రోజులు, మేలో ఇప్పటివరకు రెండు రోజులు వడగళ్లు పడ్డాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11 సార్లు (మార్చిలో 4, ఏప్రిల్‌లో 7) వడగళ్ల వానలు పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లాలో 9 సార్లు (మార్చిలో 3, ఏప్రిల్‌లో 4, మేలో 2), నల్గొండ జిల్లాలో 5 సార్లు (మార్చిలో 4, ఏప్రిల్‌లో 1), నిజామాబాద్ జిల్లాలో రెండు (మార్చిలో 1, ఏప్రిల్‌లో 1), మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల జిల్లాల్లో మార్చి నెలలో ఒకసారి.. వరంగల్, జనగామ జిల్లాల్లో ఏప్రిల్ నెలలో ఒకసారి వడగళ్ల వానలు కురిశాయి. ఇక చాలా చోట్ల ఈదురుగాలుల తీవ్రత కనిపించింది. సీజన్ ముందుకు.. వడగళ్లు తట్టుకునే రకాలు.. రాష్ట్రంలో పంటల సీజన్‌ను కాస్త ముందుకు జరపాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో.. దీనికి అనుగుణంగా ముందుకు సాగడంపై వ్యవసాయ విశ్వవిద్యాలయం పలు సూచనలు చేసింది. ఏటా మే నెలాఖరు, జూన్ తొలివారం నాటికే వానాకాలం వరిసాగు జరిగేలా రైతులను ప్రోత్సహించాలని.. సెప్టెంబర్ నెలాఖరు, అక్టోబర్ నెల ప్రారంభానికే వానాకాలం పంట చేతికి వస్తుందని పేర్కొంది. దీనితో అక్టోబర్‌లో వచ్చే అకాల వర్షాల ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉందని సూచించింది. వానాకాలం వరి కోతలు పూర్తికాగానే అక్టోబర్ తొలివారంలోనే యాసంగి వరి సాగు ప్రారంభిస్తే.. ఫిబ్రవరి నెలాఖరు, మార్చి ప్రారంభం నాటికే పంట చేతికి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీనితో మార్చి నెల మధ్య నుంచి మొదలయ్యే అకాల వర్షాల నుంచి పంటను కాపాడుకునే వీలుంటుందని తెలిపింది. నేరుగా వరి గింజలు వెదజల్లే పద్ధతి పాటించాలని సూచించింది. ఇది సాధ్యంకాకపోతే వడగళ్లను, ఈదురుగాలులను తట్టుకునే వంగడాలను రైతులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇప్పటికే వరిలో జేజీఎల్–24423 రకాన్ని రైతులకు అందుబాటులో ఉంచింది. మరో ఏడు వంగడాలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు సాతున్నాయి. ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ వడగళ్ల ప్రమాదం? వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్రవ్యాప్తంగా వడగళ్లు పడే ప్రాంతాలను గుర్తించింది. వీటిని జిల్లాలు, మండలాల వారీగా మ్యాపింగ్ చేస్తోంది. పలు జిల్లాలకు సంబంధించి మ్యాపింగ్ పూర్తయింది. మరికొన్నింటికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని విశ్వవిద్యాలయం వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటివరకు మ్యాపింగ్ పూర్తయిన జిల్లాలకు సంబంధించి వడగళ్ల ప్రభావిత ప్రాంతాలివీ.. ► ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి, కూసుమంచి, బోనకల్, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్, ముదిగొండ, ఎర్రుపాలెం మండలాలు. ► భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, భద్రాచలం, గుండాల, టేకులపల్లి, బూర్గంపాడు, దమ్మపేట, పినపాక, ఇల్లెందు, టేకులపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట, పాల్వంచ మండలాలు. ► నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని నవీపేట్, మాక్లూర్, నిజామాబాద్ రూరల్, డిచ్పల్లి, సిరికొండ, ధర్పల్లి, పిట్లం, బిచ్కుంద, మద్దూర్, దోమకొండ, ఎల్లారెడ్డి మండలాలు. ► ఆదిలాబాద్ జిల్లాలో బోథ్, ఇచ్చోడ, సిరికొండ, నేరడిగొండ, బజార్ హత్నూర్, తలమడుగు, జైనథ్ మండలాలు. ► మంచిర్యాల జిల్లాలో దండేపల్లి మండలం. ► మహబూబాబాద్ జిల్లాలోని పెద్ద వంగర, దంతాలపల్లి, తొర్రూరు, గూడూరు మండలాలు. ► వరంగల్ జిల్లాలోని నర్సంపేట, ఖానాపురం, నల్లబెల్లి, వర్ధన్నపేట, నెక్కొండ మండలాలు. ► జనగామ జిల్లాలో బచ్చన్నపేట, నర్మెట్ట, జనగామ, లింగాల ఘన్పూర్ మండలాలు. ► నల్లగొండ జిల్లాలో గుర్రంపోడు, మర్రిగూడ, నాంపల్లి, చండూరు, శాలిగౌరారం, మునుగోడు, కనగల్, నల్లగొండ, కట్టంగూరు, డిండి, దేవరకొండ, చందపేట, ఉట్కూరు, నకిరేకల్ మండలాలు. ► సిద్దిపేట జిల్లాలో చిన్నకోడూరు, నంగనూరు, దౌలతాబాద్, రాయపోలు, జగదేవ్‌పూర్, హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, గజ్వేల్, కొండపాక, నారాయణపేట, మిరుదొడ్డి, కొమురవెల్లి, దుబ్బాక, తొగుట, మద్దూరు, సిద్దిపేట రూరల్, చేర్యాల మండలాలు. ► మహబూబ్‌నగర్ జిల్లాలో గండీడ్, హన్వాడ, బాలానగర్ మండలాలు. ► రంగారెడ్డి జిల్లాలో పరిగి, చేవెళ్ల, మొయినాబాద్ మండలాలు. ► వికారాబాద్ జిల్లా తాండూరు, పెద్దేముల్, కోటపల్లి, బషీరాబాద్ మండలాలు. -
పంటలు అస్తవ్యస్తం.. ఊహకందని నష్టం
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలు... వడగళ్ల వానలు... ఈదురుగాలులు రాష్ట్ర వ్యవసాయాన్ని అతలాకుతలం చేశాయి. నెలలో రెండోసారి కురిసిన వర్షాలతో అంచనాలకు మించి నష్టం జరిగి ఉండొచ్చని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. కేవలం నాలుగైదు లక్షల ఎకరాలే అనుకోవడానికి వీలులేదని, ఊహకందని నష్టం జరిగిందని అంచనా వేస్తున్నాయి. అన్ని జిల్లాల్లోని పంటలు ప్రభావితం కాగా, కొన్ని జిల్లాల్లో అయితే ఏకంగా పంటలు ఊడ్చుకుపోయాయి. రాష్ట్రంలో మూడున్నర లక్షల ఎకరాల్లో మామిడి తోటలు వేశారు. దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి ఉత్పత్తి కావాల్సి ఉంది. కానీ ఈసారి మొదట్లోనే పూత సరిగా లేదు. కాత రాలేదు. దానికితోడు గత నెల, ఇప్పుడు కురిసిన వడగళ్ల వాన, ఈదురు గాలులకు 75 శాతం ఉత్పత్తి పడిపోతుందని ఉద్యానశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే 12 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తికి అంచనాకుగాను, కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నులే (25 శాతమే) వచ్చే అవకాశముందని చెబుతున్నారు. మామిడి తోటలను లీజుకు తీసుకున్న వ్యాపారులు, కాత అంచనా ప్రకారం రైతులకు అడ్వాన్సులు ఇచ్చారు. కానీ ఇప్పుడు కాయలు రాలిపోవడంతో అనేకచోట్ల రైతులు వ్యాపారులకు లీజు డబ్బు వెనక్కు ఇవ్వాల్సి వస్తుంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. కొన్నిచోట్లనైతే మామిడి కాయంతా రాలి పాడైపోయింది. కనీసం తక్కువ ధరకు కూడా అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో బహిరంగ మార్కెట్లో మామిడి కాయలు, పండ్ల ధర భారీగా పెరుగుతుంది. ఫలితంగా వినియోగదారులపైనా ప్రభావం పడనుంది. పొలాల్లోనే నేలపాలు... ఈ యాసంగిలో 72.61 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అందులో వరి 56.44 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 6.48 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. శనగ 3.64 లక్షల ఎకరాలు, వేరుశనగ 2.42 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. వరి ఇప్పటివరకు 40 శాతం వరకు కోతలు పూర్తయినట్లు అంచనా. అందులో చాలావరకు ఇంకా మార్కెట్‌కు రాకపోవడంతో తడిసిపోయింది. ఆ రకంగా రైతులకు నష్టం వాటిల్లగా, మరోవైపు ఇప్పటివరకు 60 శాతం వరకు పంట కోత దశలోనే ఉంది. అంటే 33 లక్షల ఎకరాలు ఇంకా కోత దశలోనే ఉందని అంచనా. అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలులకు అన్ని జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున వరి దెబ్బతింది. పొలాల్లోనే వరి గింజలు నేల రాలాయి. కొన్నిచోట్ల ఒక్క గింజ కూడా లేకుండా రాలిపోయింది. దీంతో ఊహకందని విధంగా వరికి నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ వర్గాలే చెబుతున్నాయి. అలా నేల రాలిన గింజలు ఏమాత్రం పనికి రావని, దాంతో అనేక జిల్లాల్లో రైతులు వాటిని కోయకుండా వదిలేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఒకవేళ ఎక్కడైనా చేతికి వచ్చినా అది రంగు మారి ఉంటుంది. దాన్ని అమ్ముకోవడం కూడా కష్టమే. ఈ పరిస్థితుల్లో పంటలు కేవలం నాలుగైదు లక్షల ఎకరాల్లోనే నష్టం జరిగిందన్న అంచనాకు వచ్చే పరిస్థితి లేదు. వ్యవసాయ వర్గాలు నిష్పక్షపాతంగా అంచనా వేస్తే తప్ప రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగదన్న చర్చ జరుగుతోంది. మరోవైపు మొక్కజొన్న పంటలూ దెబ్బతిన్నాయి. వడగళ్లు, ఈదురుగాలులకు చాలాచోట్ల మొక్కజొన్న పంట నేల వాలిపోయింది. మిగిలిన పంటలదీ ఇదే పరిస్థితి. -
5 లక్షల ఎకరాల్లో పంట నష్టం.. విరిగిపోయిన మొక్కజొన్న.. నేల రాలిన మామిడి
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్ల వానలతో యాసంగి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మొక్కజొన్న, వరి, శనగ పంటలతోపాటు మామిడిపై ప్రభావం ఉన్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం జిల్లాల వారీగా పంట నష్టంపై ప్రాథమిక అంచనాలను సిద్ధం చేస్తున్నామని.. మొత్తం నష్టంపై త్వరలో స్పష్టత వస్తుందని వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ అకాల వర్షాల ప్రభావం ఉందన్నారు. కాగా పంట నష్టంపై కేంద్రానికి లేఖ రాయాలని వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అద్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు హెలికాప్టర్ ద్వారా పంట నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. బాధితులతోనూ మాట్లాడారు. మొక్కజొన్న, మామిడి, వరిలపై ప్రభావం యాసంగి తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 72.61 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అందులో వరి 56.44 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 6.48 లక్షల ఎకరాలు, శనగ 3.64 లక్షల ఎకరాలు, వేరుశనగ 2.42 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇక రాష్ట్రంలో 3.50 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. అకాల వర్షాలు, వడగళ్ల కారణంగా ప్రధానంగా వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొక్కజొన్న విరిగిపోయింది. వరి నేల వాలింది. వడగళ్లు, ఈదురుగాలుల ప్రభావంతో.. మామిడి పూత, పిందెలు, కాయలు రాలిపోయాయి. మామిడి దిగుబడి తగ్గి నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఈసారి 12-13 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేశామని.. కానీ ప్రస్తుత నష్టంతో దిగుబడి సగం దాకా పడిపోయే అవకాశం ఉందని ఉద్యానశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇక టమాటా, బీరకాయ, పచ్చిమిర్చి, బొబ్బర్లు, మినుములు వంటి పంటలకూ వేల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. గాలిలో దీపంలా పంటలు! మూడేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో పంటల బీమా అమలయ్యేది. కానీ ఇప్పుడు పంటనష్టాలకు పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. కొత్త పంటల బీమా విధానాన్ని తీసుకొస్తామని వ్యవసాయశాఖ పలు సందర్భాల్లో చెప్పినా ఆచరణలోకి రాలేదు. దీనితో పంటల పరిస్థితి గాలిలో దీపంలా మారిపోయిందని రైతు సంఘాలు వాపోతున్నాయి. రైతుబంధుతో ఎంతో ప్రయోజనం ఉన్నా పంట నష్టం పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. పిడుగుపడి ముగ్గురు విద్యార్థులకు గాయాలు నిజామాబాద్ పట్టణంలోని మాలపల్లిలో ఉన్న ఓ మదర్సాలో శనివారం రాత్రి పిడుగుపడటంతో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిలో ఓ విద్యార్థి పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. కన్నీళ్లు మిగిల్చిన వడగళ్లు ► ఖమ్మం జిల్లా పరిధిలో 10,418 మంది రైతులకు చెందిన 20,748 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ► సూర్యాపేట జిల్లాలో 14,429 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని.. 7,097 మంది రైతులు సుమారు 69.77 కోట్ల మేర నష్టపోయారని ప్రాథమికంగా అంచనా వేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 4,282 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. నల్లగొండ జిల్లాలో 610 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. ► కరీంనగర్ జిల్లాలో 14,300 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. మొక్కజొన్న, వరి బాగా నష్టపోయినట్టు గుర్తించారు. ► జగిత్యాల జిల్లాలో 4,600 ఎకరాల్లో మామిడి, 600 ఎకరాల్లో నువ్వులు, మొక్కజొన్న, వరికి.. పెద్దపల్లి జిల్లాలో 1,622 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. ► ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, జేఎస్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో మొక్కజొన్న, మిర్చి, పొగాకుతోపాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడి, బొప్పాయి నేలరాలాయి. భూపాలపల్లిలో ఓపెన్ కాస్ట్ గనుల్లో వాన నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ► ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో మూడు వేల ఎకరాల్లో మొక్కజొన్న, మిర్చికి నష్టం వాటిల్లింది. ఇతర పంటలకూ భారీగానే నష్టం జరిగిందని రైతులు చెప్తున్నారు. ► సంగారెడ్డి జిల్లాలోని 18 మండలాల్లో 4,425 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ముఖ్యంగా జొన్న, శనగ పంటలకు నష్టం జరిగింది. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం అందించి ఆదుకోవాలి. కోతకు వచ్చిన మొక్కజొన్న, మిర్చి పంటలు నేలకొరిగాయి. మామిడి పిందెలు రాలిపోయాయి. వరికి అపార నష్టం వాటిల్లింది. ఉడకబెట్టి, ఆరబెట్టి కల్లాల్లో ఉంచిన పసుపు తడిసిపోయింది. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి బాధిత రైతులందరికీ పరిహారం అందేలా చూడాలి. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకాన్ని అమల్లోకి తేవాలి. ► తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి -
వడగళ్ల దెబ్బ! వేల ఎకరాల్లో పంట నష్టం.. ఆరు జిల్లాల్లో ప్రభావం..
సాక్షి, హైదరాబాద్: వడగళ్ల వానలు రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల్లో పంట నష్టం కలిగించాయి. వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో టమాటా, బీరకాయ, మొక్కజొన్న, పచ్చిమిర్చి, బొబ్బర్లు, మినుములు తదితర పంటలకు నష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల పొట్టదశకు వచ్చిన వరి నేలవాలింది. మామిడి పిందెలు, కాయలు రాలి తీవ్ర నష్టం వచ్చిందని రైతులు వాపోతున్నారు. ఆరు జిల్లాల్లో ప్రభావం.. అకాల వర్షాలతో ప్రధానంగా ఆరు జిల్లాల్లో పంటలపై ప్రభావం పడింది. సుమా రు 50 మండలాల్లోని 650 గ్రామాల్లో నష్టం జరిగిందని.. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో నష్టం తీవ్రంగా ఉందని అధికారులు చెప్తున్నారు. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్, మర్పల్లి మండలాల్లో అయితే పంట పొలాలన్నీ వడగళ్లతో నిండిపోయి మంచు ప్రాంతంలా మారిపోయాయి. ఆ పంటలు చేతికందే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. దీనితోపాటు సంగారెడ్డి, కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోనూ పలుచోట్ల వడగళ్లతో పంటలు దెబ్బతిన్నాయి. నేడు మంత్రి పర్యటన వికారాబాద్ జిల్లా మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని.. శుక్రవారం రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలసి నష్టాన్ని పరిశీలిస్తానని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మామిడి, గులాబీ, ఉల్లి, బొప్పాయితోపాటు మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్టు తెలుస్తుందన్నారు. -
వణికిపోయిన ఢిల్లీ నగరం.. ఏమా గాలుల వేగం! వీడియోలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గాలివాన విజృంభించింది. సోమవారం సాయంత్రం కురిసిన ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన ధాటికి జనజీవనం స్తంభించింది. ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు ఇక్కట్లుపడ్డారు. విమానాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాలు ల్యాండింగ్ సమస్యను ఎదుర్కొన్నాయి. అధికారుల నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో కొద్దిసేపు గాలిలో చక్కర్లు కొట్టాయి. ఇక భీకర గాలుల కారణంగా రోడ్డుపై వెళ్తున్న కార్లు సైతం వణికాయి. పార్కింగ్ చేసి ఉన్న వాహనాలపై చెట్లు కూలడంతో ధ్వంసమయ్యాయి. ఏపీ భవన్లో ఈదురు గాలులు బెంబేలెత్తించాయి. గాలుల వేగానికి నగరంలోని పలు కార్యాలయాల్లో అద్దాలు పగలిపోయాయి. వీటికి సంబంధించిన దృశ్యాలు ట్విటర్లో ట్రెండ్ అయ్యాయి. #WATCH | Bus trapped under an uprooted tree in the aftermath of a hailstorm in Delhi, causing traffic snarls near Sanchar Bhawan. pic.twitter.com/4Z91pAofpR — ANI (@ANI) May 30, 2022 #WATCH | Delhi gets a relief from scorching heat with a heavy downpour & thunderstorm. Visuals from National Media Centre. pic.twitter.com/7ZZuf05GMg — ANI (@ANI) May 30, 2022 #WATCH | Delhi witnesses uprooted trees amidst a heavy rainfall that hit the national capital. Visuals from Bhai Vir Singh Marg. pic.twitter.com/213buZrif2 — ANI (@ANI) May 30, 2022 #WATCH | Delhi: A car trapped under an uprooted tree in Connaught Place as the national capital received sudden rainfall accompanied by hailstorm. The car was unoccupied and was in the parking lot. pic.twitter.com/wdc7QDK2ZY — ANI (@ANI) May 30, 2022 #WATCH | Delhi: Heavy rain and thunderstorm lashed the national capital this afternoon. Visuals from BJP headquarters. pic.twitter.com/k8TDvjAtQy — ANI (@ANI) May 30, 2022 #WATCH | Bus trapped under an uprooted tree in the aftermath of a hailstorm in Delhi, causing traffic snarls near Sanchar Bhawan. pic.twitter.com/4Z91pAofpR — ANI (@ANI) May 30, 2022 -
అకాల వర్షాలతో రైతులు లబోదిబో
(విశాఖ దక్షిణ)/పీలేరు /గంగవరం(చిత్తూరు జిల్లా)/పెదదోర్నాల/హిందూపురం: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లాలో పిడుగు పాటుకు ఒకరు మరణించగా, ఓ ఆవు మృతి చెందింది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. కల్లాల్లో మిర్చి తడిసిపోయింది. శ్రీకాకుళం జిల్లా రాజాం, పాలకొండ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అనంతపురం జిల్లా హిందూపురంలో గాలివాన హోరెత్తింది. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లేపాక్షి మండలంలోని కల్లూరు ఎస్సీ కాలనీలో కొబ్బరి చెట్టుపై భారీ శబ్దంతో పిడుగు పడటంతో స్థానికులు ఆందోళన చెందారు. చిత్తూరు జిల్లా పీలేరు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన రైతు పి.వెంకటరమణ (50) పిడుగుపాటుకు గురై మరణించగా.. గొర్రెలు మేపుకునేందుకు వెళ్లిన నాగరాజ, హరిబాబు, చంద్రకళ తీవ్రంగా గాయపడ్డారు. వారిని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గంగవరం మండలం మామడుగు గ్రామానికి చెందిన త్యాగరాజులు పొలం వద్ద నుంచి పాడి పశువును ఇంటికి తోలుకొస్తుండగా పిడుగు పడింది. ఈ క్రమంలో ఆవును వదిలేసి త్యాగరాజులు పరుగులు తీశాడు. అయితే ఆవు మాత్రం అక్కడికక్కడే మృతి చెందింది. రానున్న 48 గంటల్లో మోస్తరు వర్షాలు కొమరిన్ ప్రాంతం, దాని పరిసర ప్రాంతాల మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, పశ్చిమ బెంగాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రానున్న 48 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు, కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులు 30–40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలు.. చిత్తూరు జిల్లా ముడివేడులో 58 మి.మీ, శ్రీకాకుళం జిల్లా భామనిలో 52, అనంతపురం జిల్లా హిందూపురం ఆర్టీవో ఆఫీసు ప్రాంతంలో 50, ప్రకాశం జిల్లా బి.చెర్లపల్లిలో 45, మార్కాపురం ప్రాంతంలో 44, అనంతపురం జిల్లా హిందూపూర్ ప్రాంతంలో 44, విజయనగరంలో 41 మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు చెప్పారు. పాడేరులో రెండు సెంటీ మీటర్లు, చింతపల్లిలో సెంటీ మీటర్ వర్షపాతం నమోదైంది. -
బాధితులకు సీఎం పరామర్శ
షోలాపూర్, న్యూస్‌లైన్: దక్షిణ షోలాపూర్ తాలూకాలోని పలు ప్రాంతాలలో వడగండ్ల వర్షం కురిసి పంటలు కోల్పోయిన రైతులను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మంగళవారం ఓదార్చారు. ఎడ్లబండిపై చవాన్ తాలూకాలోని హోటగి, పతాటె వాడి, కాజికణబసు గ్రామాల్లో పర్యటించారు. ఈ గ్రామాలలో వడగండ్ల వానవల్ల పంట పొలాలకు తీవ్రనష్టం వాటిల్లింది. పండ్ల తోటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ద్రాక్ష తోటలు ఎందుకు పనికిరాకుండా పోయాయి. పశువులు, గొర్రెలు అధిక సంఖ్యలో మృతి చెందాయి. స్థానిక ఇళ్లలో గోడలు కూలి, పైకప్పులు పడిపోవడంతో కొంతమంది నిరాశ్రయులయ్యారు. సీఎం చవాన్ ఉదయం విమానం ద్వారా పట్టణ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే స్వాగతాలను పక్కనపెట్టి వెంటనే వడగండ్ల వానకు దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించేందుకు ప్రాధాన్యతనిచ్చారు. ఆయన వెంట పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావు ఠాక్రే, పునరావాస శాఖ సహాయ మంత్రి పతంగ్‌రావు కదంతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. నష ్టనివారణ విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనేకమంది ముఖ్యమంత్రికి తమ ప్రాంతాలకు సంబంధించిన నివేదికలు అందజేశారు. మధ్యాహ్నం సీఎం తన పర్యటనను ముగించుకొని ఉస్మానాబాద్‌కు వెళ్లారు. -
రైతులకు అపార నష్టం
నిండా ముంచిన వడగళ్ల వానలు నేలరాలిన మామిడి పూతపిందెలు 5 లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత ఆరు రోజులుగా కురిసిన అకాల వర్షాలు, పెనుగాలులు రైతులను నిలువునా ముంచాయి. వడగండ్ల వానలు, గాలులు అన్నదాతలకు కడగండ్లు మిగిల్చాయి. జిల్లాల నుంచి అధికారికంగా అందిన ప్రాథమిక అంచనా ప్రకారమే 2.51 లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. వాస్తవంగా నష్టపోయిన పంట విస్తీర్ణం 5 లక్షల ఎకరాలకుపైగా ఉంటుందని అనధికారిక అంచనా. కోత, పొట్ట దశలో ఉన్న వరి పంట దెబ్బతినడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే సుమారు 81 వేల ఎకరాల్లో వరి పైరు దెబ్బతింది. మొత్తం పది జిల్లాల్లో వర్షాలు రైతులను ముంచేశాయి. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో దీనివల్ల అధిక నష్టం జరిగింది. 1.81 లక్షల ఎకరాల్లో పంటలు.. ప్రాథమికంగా అధికారులు పంపిన నివేదిక ప్రకారం వర్షాలతో పది జిల్లాల్లో 1.81లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు, సజ్జ పంటలకు అధిక నష్టం వాటిల్లింది. ఉద్యాన పంటల్లో మామిడి తోటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. 38 వేల ఎకరాల్లో మామి డి పూత, పిందెలు రాలిపోయాయి. 17,500 ఎకరాల్లో మిరప,7,500 ఎకరాల్లో కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. మొత్తమ్మీద 69 వేల పైగా ఎకరాల్లో కూరగాయల తోటలు ధ్వంసమయ్యాయి. ఇదంతా ప్రాథమికంగా అందిన సమాచారమే. వాస్తవంగా దెబ్బతిన్న పంట విస్తీర్ణం దీనికి రెట్టింపు ఉంటుందని అధికారులు సైతం అనధికారికంగా అంగీకరిస్తున్నారు. 9 మంది మృతి వడగండ్ల వానలు పెద్ద సంఖ్యలో ప్రజలను కూడా గాయపరిచాయి. వడగండ్లు మీద పడటంవల్ల 3,058 మంది గాయపడ్డారు. గత ఆరు రోజుల్లో వడగండ్ల వాన వల్ల మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. వరంగల్ జిల్లాలో ఆరుగురు, అనంతపురం జిల్లాలో ఇద్దరు, నిజామాబాద్ జిల్లాలో ఒకరు మృతిచెందారు. ఈ వర్షాలకు 1,362 పశువులు, 5,300 కోళ్లు చనిపోయాయి. 536 ఇళ్లు కూలిపోయాయి. వరంగల్ జిల్లా యార్డులో ఆరబెట్టిన 800 టన్నుల ఎండుమిర్చి తడిసిపోయింది. గాలి వానలవల్ల 561 విద్యుత్తు స్తంభాలు, 25 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 12.7 కి.మీ. పొడవునా విద్యుత్తు వైర్లు తెగిపోయాయి. వచ్చే 36 గంటల్లో వర్షాలు గురువారం నుంచి వచ్చే 36 గంటల్లో తెలంగాణ, రాయలసీమ, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా వడగండ్లతో కూడిన వానలు గానీ సాధారణ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. -
కడగండ్ల వాన.. వడగళ్ల వానలు
* ఈదురు గాలులతో భారీగా పంటనష్టం * దెబ్బతిన్న వరి, మొక్కజొన్న.. * తడిసిపోయిన మిర్చి వేల ఎకరాల్లో నష్టం.. * రాలిపోయిన మామిడిపూత * పలుచోట్ల ధ్వంసమైన ఇళ్లు, గుడిసెలు సాక్షి, నెట్వర్క్: కాలం కాని కాలంలో ఒక్కసారిగా కురిసిన వడగళ్ల వానలు అన్నదాతను కన్నీటిలో ముంచేశాయి. వేల ఎకరాల్లో పంటలను దెబ్బతీసి, కోట్లాది రూపాయల నష్టాన్ని మిగిల్చాయి. వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు నేలవాలాయి. వడగళ్లు, ఈదురుగాలులకు మామిడిపూత రాలిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. గాలుల బీభత్సానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దెబ్బతిన్న వరి, మొక్కజొన్న: వరంగల్ జిల్లాలో వడగళ్ల వానలకు స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్గడ్, మద్దూరు, చేర్యాల, నర్మెట, బచ్చన్నపేట, నెక్కొండ, హన్మకొండ, గీసుకొండ, పర్వతగిరి, దుగ్గండి, చెన్నారావుపేట, గూడూరు, సంగెం, కేసముద్రం, ఆత్మకూరు మండలాల్లో పంటలు దెబ్బతిన్నారుు. 14వేల హెక్టార్లలో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. 15 గ్రామాల్లో మిర్చి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి పూత రాలిపోయింది. మొక్కజొన్న, వరి నేలకొరిగాయి. పలుచోట్ల పూరి గుడిసెలు కూలిపోగా.. వడగళ్లతో పలువురు గాయపడ్డారు. తడిసిన మిర్చి: ఖమ్మం జిల్లాలో వడగళ్ల వానలు మిర్చి రైతులకు కన్నీళ్లు పెట్టించాయి. మొక్కజొన్న, మామిడి పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లింది. పాల్వంచ మండలంలో మామిడిపూత రాలిపోయింది. పలు ఇళ్లు, గుడిసెలు నేలమట్టమయ్యాయి. వాజేడులో కల్లాల్లో ఉన్న మిర్చి తడిసి రూ. 40లక్షల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా. పినపాక, బూర్గంపాడు మండలాల్లో వెయ్యి ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతిన్నది. వెంకటాపురం మండలంలో 1,400 ఎకరాల్లో మిర్చి, 1,000 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఇల్లెందులో 500 ఎకరాల్లో మొక్కజొన్న నేలవాలింది. 5,520 హెక్టార్లలో నష్టం: కరీంనగర్ జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వడగళ్ల వానలు, ఈదురుగాలులకు 5,520 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. 1,177 హెక్టార్లలో మామిడి తోటలు, 2,550 హెక్టార్లలో మొక్కజొన్న, 600 హెక్టార్లలో వరి, 240 హెక్టార్లలో ఆవాలు, 1,600 హెక్టార్లలో నువ్వులు, 500 హెక్టార్లలో సజ్జలు దెబ్బతిన్నట్లు తెలిపారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో నష్టం మరింత పెరిగే అవకాశాలున్నాయి. నేలవాలిన పంటలు: ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు కురిసిన వర్షం రైతులకు తీరని నష్టం తెచ్చిపెట్టింది. జొన్న, మొక్కజొన్న, వరి, నువ్వులు, శనగ, వేరుశనగ పంటలు బాగా దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఆరబెట్టిన పసుపు నానిపోయింది. టమాటా పంట కూడా బాగా దెబ్బతిన్నంది. అంతా అతలాకుతలం: నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం కారణంగా వరి, మొక్కజొన్న తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈదురు గాలులకు ఎర్రజొన్న, నువ్వు పంటలు నేలకొరుగుతున్నాయి. వర్ని మండలం తిమ్మాపూర్‌లో పిడుగుపాటుకు ఒకరు మరణించారు. బాల్కొండ మండలంలో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. ఆరబెట్టిన పసుపు, ఎర్ర జొన్నలు తడిసి ముద్దయ్యాయి. మాక్లూర్ మండలంలో సుమారు 600 ఎకరాల్లో టమాటా, 400 ఎకరాల్లో మిర్చి, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బోధన్ మండలంలో వరి, మొక్కజొన్న నేలమట్టమయ్యాయి. డిచ్పల్లిమండలంలో ఉల్లి పంటకు నష్టం జరిగింది. జిల్లాలో 12,910 ఎకరాలలో వివిధ పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా అంచనా వేశారు. నేలరాలిన బత్తాయి, మామిడిపూత: నల్లగొండ జిల్లాలో బత్తాయి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. వరి నేలకొరిగింది. భువనగిరి, తుర్కపల్లిలో, ఆలేరు, రామన్నపేట మండలాల్లో వడగళ్ల వానకు పలు పంటలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. దెబ్బతిన్న ద్రాక్ష, ఉల్లి: రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట, పరిగి, ఘట్కేసర్ ప్రాంతాల్లో వడగళ్ల వానలు పంటలను దెబ్బతీశాయి. శామీర్‌పేటలో దాదాపు ఆరు వందల ఎకరాల్లో ద్రాక్షతోట దెబ్బతిన్నట్లు అధికారుల ప్రాథమిక అంచనా. మోమిన్‌పేటలో దాదాపు 800 ఎకరాల్లో ఉల్లి పంట నీటమునిగింది. 224 ఇళ్లు ధ్వంసం: మెదక్ జిల్లాలో వడగళ్ల వానల ధాటికి గత రెండు రోజుల్లోనే 224 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 16 మండలాల పరిధిలో 937.5 హెక్టార్ల పంటలు దెబ్బతిన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, వరి, శనగ పంటలకు నష్టం వాటిల్లింది. 996 హెక్టార్లలో కూరగాయలు, మామిడి, అరటి తోటలకు నష్టం వాటిల్లినట్లు ఉద్యానశాఖ నిర్ధరించింది. రాజధానిని ముంచెత్తిన వాన: హైదరాబాద్ నగరాన్నీ అకాల వర్షాలు వీడడం లేదు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షంతో పాటు వడగళ్లు కురియడంతో పలు చోట్ల రహదారుల పక్కన నిలిపిన వాహనాల అద్దాలు పగిలాయి. కొన్ని చోట్ల రహదారులపై వరద నీరు పోటెత్తడంతో కాలువలను తలపించాయి. గ్రేటర్ పరిధిలో ప్రధాన రహదారులపై సుమారు 477 చోట్ల భారీగా వర్షపు నీరు నిలవడంతో ట్రాఫిక్ స్తంభించింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అల్పపీడనాలకు.. తేమ తోడైంది! అసాధారణ వర్షాలకు కారణమిదే వేసవి మంటెక్కించే ముందు అక్కడక్కడా ఒకటీ అరా జల్లులు పడటం మనం చూసే ఉంటాం. కానీ ఈ ఏడాది మార్చి మొదటివారంలో కూడా వడగళ్ల వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలు పంటలన్నీ నాశనం చేస్తున్నాయి. పడమటి గాలుల్లో వచ్చిన మార్పులు.. దేశ మధ్యప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనాలు వీటికి బంగాళాఖాతంతోపాటు అరేబియా సముద్రం నుంచి కూడా తేమ అందుతూండటం దీనికి కారణమని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత నెలలో అత్యంత అసాధారణ రీతిలో పశ్చిమ గాలుల్లో తేడాలు చోటు చేసుకున్నాయని, తెలంగాణలోని కొన్ని భాగాలతోపాటు విదర్భ, దక్షిణ మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వరుసగా భూతల అల్పపీడనాలు ఏర్పడ్డాయని వాతావరణ సమాచార సేకరణ సంస్థ ‘స్కైమెట్’ శాస్త్రవేత్త పి.మహేశ్ తెలిపారు. మూడు, నాలుగు రోజుల వ్యవధిలోనే వరుసగా అల్పపీడనాలు ఏర్పడటం.. పీడనాన్ని భర్తీ చేసేందుకు దేశానికి ఇరువైపులా ఉన్న సముద్రాల నుంచి తేమతో కూడిన గాలులు దూసుకురావడంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని ఆయన చెప్పారు. మహారాష్ట్రను ఆవరించిన అల్పపీడనం ప్రభావంతో మరో మూడు నాలుగు రోజులపాటు చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. -
హైద్రాబాద్‌లో వడగండ్ల వాన