సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలు... వడగళ్ల వానలు... ఈదురుగాలులు రాష్ట్ర వ్యవసాయాన్ని అతలాకుతలం చేశాయి. నెలలో రెండోసారి కురిసిన వర్షాలతో అంచనాలకు మించి నష్టం జరిగి ఉండొచ్చని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. కేవలం నాలుగైదు లక్షల ఎకరాలే అనుకోవడానికి వీలులేదని, ఊహకందని నష్టం జరిగిందని అంచనా వేస్తున్నాయి. అన్ని జిల్లాల్లోని పంటలు ప్రభావితం కాగా, కొన్ని జిల్లాల్లో అయితే ఏకంగా పంటలు ఊడ్చుకుపోయాయి.
రాష్ట్రంలో మూడున్నర లక్షల ఎకరాల్లో మామిడి తోటలు వేశారు. దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి ఉత్పత్తి కావాల్సి ఉంది. కానీ ఈసారి మొదట్లోనే పూత సరిగా లేదు. కాత రాలేదు. దానికితోడు గత నెల, ఇప్పుడు కురిసిన వడగళ్ల వాన, ఈదురు గాలులకు 75 శాతం ఉత్పత్తి పడిపోతుందని ఉద్యానశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే 12 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తికి అంచనాకుగాను, కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నులే (25 శాతమే) వచ్చే అవకాశముందని చెబుతున్నారు.
మామిడి తోటలను లీజుకు తీసుకున్న వ్యాపారులు, కాత అంచనా ప్రకారం రైతులకు అడ్వాన్సులు ఇచ్చారు. కానీ ఇప్పుడు కాయలు రాలిపోవడంతో అనేకచోట్ల రైతులు వ్యాపారులకు లీజు డబ్బు వెనక్కు ఇవ్వాల్సి వస్తుంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. కొన్నిచోట్లనైతే మామిడి కాయంతా రాలి పాడైపోయింది. కనీసం తక్కువ ధరకు కూడా అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో బహిరంగ మార్కెట్లో మామిడి కాయలు, పండ్ల ధర భారీగా పెరుగుతుంది. ఫలితంగా వినియోగదారులపైనా ప్రభావం పడనుంది.
పొలాల్లోనే నేలపాలు...
ఈ యాసంగిలో 72.61 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అందులో వరి 56.44 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 6.48 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. శనగ 3.64 లక్షల ఎకరాలు, వేరుశనగ 2.42 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. వరి ఇప్పటివరకు 40 శాతం వరకు కోతలు పూర్తయినట్లు అంచనా. అందులో చాలావరకు ఇంకా మార్కెట్‌కు రాకపోవడంతో తడిసిపోయింది. ఆ రకంగా రైతులకు నష్టం వాటిల్లగా, మరోవైపు ఇప్పటివరకు 60 శాతం వరకు పంట కోత దశలోనే ఉంది. అంటే 33 లక్షల ఎకరాలు ఇంకా కోత దశలోనే ఉందని అంచనా.
అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలులకు అన్ని జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున వరి దెబ్బతింది. పొలాల్లోనే వరి గింజలు నేల రాలాయి. కొన్నిచోట్ల ఒక్క గింజ కూడా లేకుండా రాలిపోయింది. దీంతో ఊహకందని విధంగా వరికి నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ వర్గాలే చెబుతున్నాయి. అలా నేల రాలిన గింజలు ఏమాత్రం పనికి రావని, దాంతో అనేక జిల్లాల్లో రైతులు వాటిని కోయకుండా వదిలేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
ఒకవేళ ఎక్కడైనా చేతికి వచ్చినా అది రంగు మారి ఉంటుంది. దాన్ని అమ్ముకోవడం కూడా కష్టమే. ఈ పరిస్థితుల్లో పంటలు కేవలం నాలుగైదు లక్షల ఎకరాల్లోనే నష్టం జరిగిందన్న అంచనాకు వచ్చే పరిస్థితి లేదు. వ్యవసాయ వర్గాలు నిష్పక్షపాతంగా అంచనా వేస్తే తప్ప రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగదన్న చర్చ జరుగుతోంది. మరోవైపు మొక్కజొన్న పంటలూ దెబ్బతిన్నాయి. వడగళ్లు, ఈదురుగాలులకు చాలాచోట్ల మొక్కజొన్న పంట నేల వాలిపోయింది. మిగిలిన పంటలదీ ఇదే పరిస్థితి.
Comments
Please login to add a commentAdd a comment