ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు.. అధికారులకు సీఎం జగన్‌ ఆదేశం | CM Jagna Reviw Meeting Untimely Rains Crop Damage Buy Wet Grain | Sakshi
Sakshi News home page

ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు.. అధికారులకు సీఎం జగన్‌ ఆదేశం

Published Tue, May 9 2023 9:13 AM | Last Updated on Tue, May 9 2023 9:31 AM

CM Jagna Reviw Meeting Untimely Rains Crop Damage Buy Wet Grain - Sakshi

సాక్షి, అమరావతి: అకాల వర్షాలతో తడిసిన, మొలకెత్తిన, తేమ శాతం అధికంగా ఉన్న ధాన్యం కొనుగోలు విషయంలో ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్లపైన, వ్యవసాయ క్షేత్రాల వద్ద రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన తరలించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  

ఏ రైతూ మిల్లర్ల వద్దకు వెళ్లొద్దు 
ఇప్పటికే వ్యవసాయ క్షేత్రాల నుంచి మిల్లులకు ధాన్యం రవాణా చేయడానికి అనుమతిచ్చాం. వర్షాల ప్రభావం ఉన్న జిల్లాల్లో గన్నీ బ్యాగ్‌ల కొరత లేకుండా చూడాలి. అవసరమైతే పొరుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గన్నీ బ్యాగ్‌లను ఆయా జిల్లాలకు తరలించాలి. రైతులు మిల్లులను సందర్శించడం, మిల్లర్లను కలవడం వల్ల రైతులపై అనవసరమైన ఒత్తిళ్లు తీసుకొస్తారు. ఇది ప్రతికూల సందేశానికి దారితీస్తుంది. ఆర్బీకేల ద్వారా రైతులకు ఎఫ్‌టీవో జనరేట్‌ అవుతుంది. చెల్లింపుల విషయంలో ఏ ఒక్క రైతూ మిల్లర్‌ దగ్గరకు వెళ్లనవసరం లేదు.

ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాలి. ఆఫ్‌లైన్‌ ద్వారా కొన్న వివరాలను 24 గంటల్లో ఆన్‌లైన్‌లో మార్చుకోవాలి. విరిగిన నూక శాతాన్ని అంచనా వేసేందుకు మినీ మిల్లుల సంఖ్యను పెంచాలి. ఆర్బీకేల ద్వారా నూక శాతాన్ని నిష్పక్షపాతంగా అంచనా వేయొచ్చు. అధిక తేమ, విరిగిన, పగుళ్లు, పలువలు మారడం, మొలకెత్తడం వంటి కారణాలతో కొనుగోళ్లను తిరస్కరించడం ద్వారా రైతులు ఇబ్బంది పడకుండా చూడాలి. వరి విస్తీర్ణం ఎక్కువగా ఉండి.. మిల్లింగ్‌ సామర్థ్యం తక్కువగా ఉన్న ఎన్టీఆర్, ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆధునిక రైసు మిల్లుల ఏర్పాటును ప్రోత్సహించాలి. కాగా ఆదివారం నాటికి కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో 6.5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. 

ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లోనే కొనుగోలు 
సాధారణంగా 5 శాతం మొలక ధాన్యానికి మినహాయింపు ఉంటుంది. వర్షాల వల్ల ప్రస్తుతం మొలక శాతం 7–10 వరకు ఉంటోంది. అయినా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. వాస్తవానికి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. కానీ, వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆఫ్‌లైన్‌లో కొనుగోలుకు చర్యలు చేపట్టింది. వాటిని సమీపంలోని మిల్లులకు తరలిస్తున్నారు. ప్రస్తుతం రైతులు వాటిని ఆరబెట్టుకోలేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నేరుగా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. వాటిని బాయిల్డ్‌ రకంగా పరిగణించి బాయిల్డ్‌ మిల్లులకు తరలిస్తున్నారు.

మండలానికి ఒకటి చొప్పున మొబైల్‌ మినీ మిల్లులు ఏర్పాటు చేశారు. ఈ మినీ మిల్లుల ద్వారా మిల్లరు రైతుల ఎదుటే ధాన్యాన్ని మరాడించి ఎంత శాతం నూక వస్తుందో పరిశీలిస్తున్నారు. డిప్యూటీ తహసీల్దార్‌ క్యాడర్‌ అధికారులను కస్టోడియన్‌ ఆఫీసర్లుగా మిల్లుల వద్ద నియమించి రైతులకు సమస్య రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆర్బీకేలో ధాన్యం అప్పగించి రసీదు పొందే వరకే రైతు బాధ్యత. ఆ తర్వాత మిల్లర్లు పిలిచిన వెళ్లవద్దంటూ ఆర్బీకేల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

ధాన్యం సేకరణ పద్ధతి ఇలా.. 
దశాబ్దాలుగా రైతుల గిట్టుబాటు ధరను దోచుకుంటున్న మిల్లర్లు, దళారులకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. సాధారణంగా తొలుత ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతు ఆర్బీకేలోని ధాన్యం సేకరణ సిబ్బంది (వీఏఏ)ను సంప్రదిస్తారు. సదరు అధికారి క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ధాన్యం శాంపిళ్లను తీసుకుని ఆర్బీకేలోని ల్యాబ్‌లో పరీక్షిస్తారు. ఎఫ్‌ఏక్యూ నిబంధనల ప్రకారం.. ధాన్యం ఉన్నది, లేనిది నిర్ధారించి.. తేమ 17శాతం కంటే ఎక్కువ ఉంటే ఆరబెట్టేందుకు సూచిస్తారు. ధాన్యం శాంపిళ్లు నిబంధనల ప్రకారం ఉంటే.. రైతుకు ధాన్యం ఎప్పుడు తరలించేది షెడ్యూల్‌ను ఖరారు చేస్తూ మెసేజ్‌ రూపంలో రైతు మొబైల్‌కు సమాచారం పంపిస్తారు.

అనంతరం షెడ్యూల్‌ ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు హమాలీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని వాహనంలో లోడింగ్‌ చేస్తారు. తర్వాత తూకం వేసి ట్రాక్‌ షీట్‌ జనరేట్‌ చేస్తారు. అప్పుడు మాత్రమే సదరు రైతు ధాన్యం ఏ మిల్లుకు వెళ్లేది తెలుస్తుంది. ధాన్యం లోడింగ్‌లో రైతు సొంతంగా హమాలీలను ఏర్పాటు చేసుకుని ధాన్యాన్ని తరలిస్తే ప్రభుత్వం ఆర్బీకే, మిల్లు మధ్య దూరాన్ని బట్టి ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఎక్కువగా మిల్లరు లేదా ఏజెన్సీ ఏర్పాటు చేసిన హమాలీలు, వాహనాల్లోనే సరుకును రవాణా చేస్తున్నారు. ట్రాక్‌ షీట్‌ జనరేట్‌ అయిన తర్వాత మిల్లుకు ధాన్యాన్ని తరలిస్తారు. ఈ క్రమంలోనే ఫండ్‌ ట్రాన్సఫర్‌ ఆర్డర్‌ (ఎఫ్‌టీవో) వస్తుంది. అందులో రైతు విక్రయించిన ధాన్యం బరువు, దానికి చెల్లించే నగదు, హామీలు, రవాణా తదితర వివరాలు పొందుపరుస్తారు.

ఒకసారి ఎఫ్‌టీవో జనరేట్‌ అయిన తర్వాత ఆర్బీకే సిబ్బందే ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తారు. మిల్లు దగ్గర ప్రభుత్వం నియమించిన కస్టోడియన్‌ అధికారి ధాన్యం వచ్చినట్టు ధ్రువీకరించి.. మిల్లరు లాగిన్‌కు ఫార్వర్డ్‌ చేస్తారు. మిల్లరు కూడా ధాన్యం వచ్చినట్టు ధ్రువీకరించుకుంటారు. అనంతరం ఎఫ్‌టీవోలో చూపించిన ప్రకారం రైతుకి నిర్ణీత వ్యవధిలో ధాన్యం నగదు జమవుతాయి. మిల్లర్లు తరుగు కింద ధాన్యం తగ్గించినా, రైతు నుంచి డబ్బు డిమాండ్‌ చేసినా, ఇతర విషయాలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1967 వివరాలను ఎఫ్‌టీవో రసీదుపై ముద్రించారు. 

ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏప్రిల్‌ రెండో వారం నుంచి అనేక జిల్లాల్లో రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రబీ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నగదు చెల్లింపులను ప్రభుత్వం ఎలాంటి ఆలస్యం చేయకుండా నిర్ణీత వ్యవధిలోగా చెల్లిస్తోంది. అక్కడక్కడ రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ నెంబరు అనుసంధానం కాకపోవటంవల్ల నగదు జమకాకుండా పెండింగ్‌లో ఉంది.

మరోవైపు.. ఈ ప్రక్రియలో హమాలీలు, రవాణా చార్జీలు రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు చెల్లిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని రైతులెవరూ అధైర్యపడకుండా ఉండాలని.. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని విక్రయించాలని.. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఉన్నతాధికారులు రైతులకు సూచిస్తున్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం తమకెంతో మేలు చేస్తోందని.. సకాలంలో డబ్బులు చెల్లిస్తోందని రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. దళారీలకు అమ్ముకుని ఉంటే బాగా నష్టం జరిగేదని.. ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరకు అమ్ముకోవడం బాగా కలిసొచ్చిందని వారంటున్నారు. జిల్లాల వారీగా చూస్తే.. 

►శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 4,460 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసింది. ఎన్నడూ లేని విధంగా ఈ దఫా జిల్లాలో తెగుళ్లు తగ్గుముఖం పట్టి అధిక దిగుబడులు, అధిక ధరలతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. 

►బాపట్ల జిల్లాలో ఏప్రిల్‌ 10 నుంచి రబీ కొనుగో­ళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ జిల్లాలో 2,244 మంది రైతుల నుంచి 13,516 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది.   

►ప్రకాశం జిల్లాలోనూ ఏప్రిల్‌లోనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇక్కడ మొత్తం 35 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు 3 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. జిల్లాలో తడిసిన ధాన్యం ఎక్కడాలేదు. వర్షం వచ్చినా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. గోనె సంచులను ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాల్లోనే అవసరమైనన్ని అందుబాటులో ఉంచారు. 

►తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం నాటికి 24,766 మంది రైతుల నుండి 1,69,370 మెట్రిక్‌ టన్నులు ధాన్యం సేకరణకు కూపన్లు విడుదల చేశారు. సోమవారం ఆన్‌లైన్‌లో 2,579.200 మెట్రిక్‌ టన్నులు, ఆఫ్‌లైన్‌లో 2,620.748 మెట్రిక్‌ టన్నులు మొత్తంగా చూస్తే 14,733 మంది రైతులు నుండి 1,33,302.680 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.  

►పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా దాళ్వా సీజన్‌లో ఇప్పటివరకు 33,929 మంది రైతుల నుంచి 3.20 లక్షల టన్నులను కొనుగోలు చేశారు.  
►ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1.50 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 12,581 మంది రైతుల నుంచి రూ.297 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.  
►కృష్ణాజిల్లాలో ఇప్పటివరకు 19,020 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.

►అనకాపల్లి జిల్లాలో ధాన్యం సేకరణ సోమవారం నుంచి ప్రారంభమైంది. జిల్లాలో 39 ఆర్బీకేల ద్వారా 14 కొనుగోలు కేంద్రాలు సిద్ధంచేశారు. ఇందుకు ప్రభుత్వం స్పెషలాఫీసర్లను నియమించింది. రానున్న రోజుల్లో వర్షాలుపడే అవకాశం ఉన్నందున పంట నష్టం కలుగకుండా తగిన ముందస్తు చర్యలు చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా ప్రత్యేకాధికారి జె. నివాస్‌ ఆదేశించారు.  

ప్రభుత్వం చొరవతో 40 క్వింటాళ్లు అమ్ముకున్నా 
ప్రభుత్వం చొరవ తీసుకుని మద్దతు ధరతో మొక్కజొన్న కొనుగోలు చేపట్టడం శుభపరిణామం. నిజానికి.. మొక్కజొన్నకు ధరలు తగ్గిపోయాయి. మద్దతు ధర రూ.1,962 ఉండగా.. దళారీలు క్వింటా కేవలం రూ.1,500–1,600 ధరకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు. కానీ, ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలూ ఏర్పాటుచేయడంతో సోమవారం 40 క్వింటాళ్లు అమ్ముకున్నా. దళారీలకు అమ్ముకుని ఉంటే దాదాపు రూ.15వేల వరకు నష్టం జరిగేది. మద్దతు ధరతో అమ్ముకోవడం బాగా కలిసొచ్చింది. 
– సంగ నాగశేఖర్, ముతలూరు, రుద్రవరం మండలం, నంద్యాల జిల్లా

రైతులకు సకాలంలో డబ్బులు అందుతున్నాయి 
నేను సుమారు ఐదెకరాలు సాగుచేస్తున్నా. దాళ్వా వరి సాగుకు సంబంధించి ఇప్పటివరకు మాసూళ్లు చేసిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేసింది. సకాలంలోనే డబ్బులు కూడా అందాయి. వాతావరణంలో మార్పులవల్ల కొంత పంట మాసూళ్లు ఆలస్యమైంది. ఇప్పుడు మిగిలిన పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. గిట్టుబాటు ధర ఉండడం సంతోషం. 
    – బొక్కా రాంబాబు, రైతు, కొండేపూడి, పాలకోడేరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా 

ఎప్పుడూ లేని విధంగా బస్తాకు రూ.1,530 ఇచ్చారు 
ఎన్నడూ, ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఈ ప్రభుత్వం ధాన్యం డబ్బు అందించింది. 75 కిలోల బస్తాకు రూ.1,530 ఇచ్చింది. గతంలో దళారులు కమీషన్‌ తీసుకునేవారు. డబ్బులకు రెండునెలలు పట్టేది. ఇప్పుడు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి నేరుగా మా ఖాతాలో డబ్బు జమచేసింది. సంచులు కూడా సకాలంలో ఇచ్చింది. ధాన్యం రవాణాకూ లారీని ఏర్పాటుచేస్తున్నారు.  
– పొన్నాడ రాఘవరావు, రైతు, యర్రమళ్ల, ఏలూరు జిల్లా

ఆదాయం బాగుంది.. సంతోషంగా ఉంది 
నేను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మడపల్లి గ్రామంలో సొంత పొలంలో వరి సాగుచేశాను. మొత్తం 30 పుట్ల దిగుబడి వచ్చింది. ఈ ధాన్యాన్ని ఆర్బీకే ద్వారా విక్రయించా. ఆదాయం బాగుంది. సంతోషంగా ఉంది.  
– కొండారెడ్డి, రైతు, మడపల్లి, చేజెర్ల మండలం, నెల్లూరు జిల్లా 

రైతులకు సహకరించాం  
మడపల్లిలో సుమారు 560 ఎకరాల్లో వరిని సాగుచేశారు. పంటను కాపాడేందుకు రైతులకు సూచనలు, సలహాలిచ్చాం. ఏ సమయంలో పంటను కోయాలో వివరించాం. చివరలో ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా సేకరిస్తున్నాం.  
– ఎ. మమత, మడపల్లి, వీఏఏ, చేజెర్ల మండలం, నెల్లూరు జిల్లా  

వారం రోజుల్లో డబ్బులు జమయ్యాయి  
బాపట్ల జిల్లా చినగంజాం మండలం, చింతగుంపల్లి గ్రామానికి చెందిన నేను 110 క్వింటాళ్ళ ధాన్యాన్ని ఏప్రిల్‌ 25న మా గ్రామంలోని ఆర్బీకే ద్వారా రైస్‌మిల్లుకు తోలాను. క్వింటాకు రూ.2,060 చొప్పున రూ.2,26,600 నగదు ఈనెల 4న నా అకౌంట్‌కు జమచేశారు. గతంలో దళారులు మా వద్ద ధాన్యం కొనుగోలు చేసి నెలల తరబడి వారి చుట్టూ తిప్పుకునే వాళ్లు. ప్రస్తుతం గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు సకాలంలో నగదు జమచేయటం చాలా సంతోషంగా ఉంది.  
– కరణం శ్రీనివాసరావు, చినగంజాం మండలం, బాపట్ల జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement