సుల్తానాబాద్‌లో మొలకెత్తిన వడ్లను చూపిస్తున్న రైతు, పెద్దపల్లి జిల్లా కొత్తపల్లి కేంద్రంలో చెరువును తలపిస్తున్న వర్షపునీరు
సాక్షి నెట్‌వర్క్: అకాల వర్షాలు రైతులను ఆగమాగం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తీవ్ర వేగంతో వీస్తున్న ఈదురుగాలులు దాటికి చాలా చోట్ల వరి నేలకొరిగింది. వరి గింజలు రాలిపోయాయి. మరోవైపు వరి కోతలు పూర్తిచేసి.. ధాన్యాన్ని కల్లాలకు, కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కళ్ల ముందే ధాన్యం తడిసిపోతున్నా, నీటిలో కొట్టుకుపోతున్నా ఏమీ చేయలేక కన్నీళ్లు పెడుతున్నారు.
తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు పాట్లు పడుతున్నారు. వానకు తడిసిన ధాన్యాన్ని ఆరబోయడం, మళ్లీ వానకు తడిసిపోవడం, మళ్లీ ఆరబోయాల్సి రావడంతో అరిగోస పడుతున్నారు. వరుసగా వానలతో తడిసే ఉంటుండటంతో.. చాలాచోట్ల ధాన్యంలో మొలకలు వస్తున్నాయి. మరోవైపు మామిడి పూర్తిగా దెబ్బతినగా.. మొక్కజొన్న, శనగ, పెసర, మామిడి, పెసర, నువ్వుల పంటలకు నష్టం జరిగింది.
ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో నష్టం ఎక్కువగా ఉంది. మరికొన్ని రోజులూ వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.
కొనుగోళ్లలో ఆలస్యంతో..
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం సమస్యగా మారిందని.. కొనుగోళ్లు ఊపందుకుని ఉంటే ఈ బాధ ఉండేది కాదని రైతులు అంటున్నారు. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కూడా వర్షాలు తెరిపినివ్వడం లేదని.. తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక పలుచోట్ల కొనుగోళ్లు జరుగుతున్నా తేమ, తరుగు పేరుతో మిల్లర్లు ధాన్యం తీసుకునేందుకు మెలిక పెడుతున్నారు. లేకుంటే క్వింటాల్‌కు నాలుగైదు కిలోలకుపైగా కోత పెడుతున్నారని రైతులు వాపోతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో..
అకాల వర్షం మరోసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులను ఆగమాగం చేసింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి 19,568 ఎకరాల్లో పంటలు నష్టపోగా.. అందులో 17 వేల ఎకరాల్లో వరి పంటే దెబ్బతిన్నది. ఇంకా పంట నష్టం సర్వే కొనసాగుతూనే ఉంది. ఇక వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో 40వేల టన్నులకుపైగా ధాన్యం తడిసిపోయినట్టు అధికారులు చెప్తున్నారు.
రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. టార్పాలిన్లు అందుబాటులో లేక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి మొలకలెత్తుతోంది. జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కథలాపూర్, సారంగాపూర్, పెగడపల్లి, వెల్గటూర్ మండలాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఏకధాటిగా కురిసిన వానతో భారీగా ధాన్యం తడిసిపోయింది. పలుచోట్ల కొట్టుకుపోయింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో
వరంగల్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం అన్నదాతను అతలాకుతలం చేసింది. అన్ని పంటలు కలిపి 1,52,577 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. మహబూబాబాద్ జిల్లాలో భారీగా వరి చేన్లు నీట మునిగాయి. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు పోసిన ధాన్యం తడిసిపోయింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో..
అకాల వర్షాలు ఉమ్మడి మెదక్ జిల్లా రైతులను కొలుకోలేని దెబ్బతీశాయి. సిద్దిపేట జిల్లాలో సుమారు 91,569 ఎకరాల్లో, మెదక్ జిల్లాలో 13,947 వేల ఎకరాల్లో, సంగారెడ్డిలో 5,682 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోతకొచ్చే దశలోని వరి నేలకొరిగింది. మామిడికి తీవ్ర నష్టం వాటిల్లింది.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంట నష్టం గణనీయంగా ఉంది. కామారెడ్డి జిల్లాలో 42వేల మంది రైతులకు చెందిన 60,289 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. నిజామాబాద్ జిల్లాలో 25 వేల ఎకరాలకుపైగా పంటలు దెబ్బతినగా.. అందులో వరి 19,500 ఎకరాలు, నువ్వులు 4,500 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే తడిసిపోతున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో..
నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో 52 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో 30 వేల ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 13,905 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 8,014 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రధానంగా వరి పంట దెబ్బతిన్నది.
సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో నష్టం ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు 40వేల క్వింటాళ్ల ధాన్యం తడిసినట్టు అంచనా. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల, మోటకొండూరు, వలిగొండ మండలాల్లో ధాన్యం తడిసి మొలకెత్తుతోంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని మంచిర్యాల, నిర్మల్, కుమురం భీం, ఆదిలాబాద్ జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వరితోపాటు మొక్కజొన్న, శనగ, పెసర, మామిడి, పెసర పంటలు దెబ్బతిన్నాయి.
ఖమ్మం ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరితోపాటు మొక్కజొన్న, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లాలో 15,494 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఏన్కూరు, ఖమ్మం అర్బన్, కూసుమంచి, సత్తుపల్లి, వేంసూరు, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో వరి నేలవాలింది. జిల్లాలో ఇప్పటివరకు 197 కొనుగోలు కేంద్రాలను తెరవగా.. 102 కేంద్రాల్లోనే కొనుగోళ్లు చేపట్టారు. పెద్ద సంఖ్యలో రైతులు ధాన్యాన్ని తీసుకురాగా.. వానలకు తడిసిపోతోందని వాపోతున్నారు.
పాలమూరు ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అకాల వర్షాలకు 3,299 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. వరితోపాటు మామిడికి నష్టం వాటిల్లింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో..
రంగారెడ్డి ఉమ్మడి జిల్లాను వడగళ్ల వానలు వణికిస్తున్నాయి. ఈదురుగాలులు, వడగళ్లతో పంటలు చేలలోనే దెబ్బతిన్నాయి. మామిడి కాయలు నేలరాలాయి. ఆదివారం రాత్రి కొందుర్గు మండలంలో వడగళ్ల వానకు వరి, మామిడి, కూరగాయల పంటలకు నష్టం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment