భారీగా పంటలు నీటమునక.. పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, గెడ్డలు
వరుసగా మూడుసార్లు వరదలతో కోనసీమ లంకలు విలవిల
వాతావరణ శాఖ హెచ్చరించినా ‘ఏలేరు’పై సర్కారు ఉదాసీనత
ముంపులో ఏలేరు పరీవాహక మండలాల్లోని పంట పొలాలు
అనేకచోట్ల దెబ్బతిన్న కరెంటు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు.. రహదారులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/శ్రీకాకుళం (పీఎన్ కాలనీ)/ఎచ్చెర్ల క్యాంపస్/అనకాపల్లి/సాక్షి ప్రతినిధి, కాకినాడ: భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నదులు, వాగులు, చెరువులు, గెడ్డలు పొంగిపొర్లాయి. ఈ వర్షాలు మంగళవారం తగ్గుముఖం పట్టినా.. ఇంకా నదులు, కాలువలు పొంగిపొర్లుతునే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడడంతో పరివాహక ప్రాంతాల్లోని వాగులు, ఏర్లు పొంగి ప్రవహించాయి. పలుచోట్ల చెరువులు దెబ్బతిన్నాయి. అనేకచోట్ల గండ్లు పడ్డాయి. ఫలితంగా వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఏడువేల ఎకరాలకు పైగా పంట నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా.
ఈ జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవడంతో గేట్లు ఎత్తివేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడంతో కాకినాడ జిల్లా ఏలేరు పరీవాహక ప్రాంతం రైతుల కొంప ముంచింది. విజయనగరం జిల్లాలో మాత్రం ఈ వర్షాలు మేలు చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. మంగళవారం ఆయా జిల్లాల్లో ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
శ్రీకాకుళం జిల్లాలో 1,230 హెక్టార్లలో పంట నష్టం..
భారీ వర్షాల కారణంగా వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో 1,230 హెక్టార్లలో పంట నీట మునిగినట్లు సమాచారం. కానీ, వాస్తవ పరిస్థితులు చూస్తుంటే మూడువేల హెక్టార్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కె.కొత్తూరు, గార, రాగోలు వంటి ప్రాంతాల్లో కూరగాయల పంటలు సుమారు 78 ఎకరాల్లో నీటమునిగింది. జిల్లా వ్యాప్తంగా 50కి పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరోవైపు.. జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు.. రహదారులు దెబ్బతిన్నాయి. నాలుగు కల్వర్టులు కొట్టుకుపోయాయి. పొలాల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాలు కొన్నిచోట్ల పాక్షికంగా నీటమునిగి ఉండగా మరికొన్నిచోట్ల పూర్తిగా మునిగిపోయాయి.
విజయనగరం జిల్లాలో..
విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కొన్నిచోట్ల నష్టం కలిగించినా వ్యవసాయానికి ఎంతో మేలు చేశాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండల్లా మారాయి. రెండ్రోజుల పాటు కురిసిన వర్షాలకు విజయనగరం జిల్లాలో సుమారు 513 హెక్టార్లలో వరి పొలాలు నీటమునిగాయి. స్వల్పంగా 6.2 హెక్టార్లలో మొక్కజొన్న దెబ్బతింది. పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు 66 హెక్టార్లలో ఉద్యాన తోటలు నేలకొరిగాయి.
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో 14 ఇళ్లు శిథిలమవగా.. 8 పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెల్లిగడ్డపై కల్వర్టు దెబ్బతినగా.. బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి నదిలోని కాజ్‌వే కొట్టుకుపోయింది. కొన్నిచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. నాగావళి, చంపావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో 70 స్తంభాలు నేలకొరిగాయి. 26 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వీటన్నింటినీ మంగళవారం పునరుద్ధరించారు. తాటిపూడి, వట్టిగెడ్డ, మడ్డువలస, తోటపల్లి రిజర్వాయర్లు నిండిపోవడంతో దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు. \
అనకాపల్లి జిల్లాలో ఏడువేల ఎకరాలు..
అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 7 వేల ఎకరాలు నీట మునిగినట్లు తెలుస్తోంది. వీటిలో 6 వేల ఎకరాల్లో వరి పంట, మరో ఒక వెయ్యి ఎకరాల్లో చెరకు, మొక్కజొన్న, పత్తి, ఉద్యానవన, ఇతర పంటలు నీట మునిగాయి. వ్యవసాయ అధికారుల ఇచ్చిన నివేదిక ప్రకారం.. అనకాపల్లి జిల్లాలో 1,528 హెక్టార్ల వరి పంట నీట మునిగింది. జిల్లాలో 40 ఇళ్లు దెబ్బతిన్నాయి. వీటిలో 4 పూర్తిగా, 36 పాక్షికంగా దెబ్బతిన్నాయి. 48 విద్యుత్ పోల్స్‌కు నష్టం వాటిల్లింది. నర్సీపట్నం నియోజకవర్గంలోని తాండవ, కోనాం, కళ్యాణపులోవ రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవడంతో సోమవారం గేట్లు ఎత్తివేశారు. తాండవ రిజర్వాయర్ మినహా మిగతా రిజర్వాయర్లలో ఇన్‌ఫ్లో అదుపులోనే ఉంది.
‘కోనసీమ’ను ముంచేస్తున్న వర్షాలు.. వరదలు
అధిక వర్షాలు, వరుసగా మూడుసార్లు వరదలతో జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలు, పరిశ్రమలపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సాగుకు తొలి నుంచి అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. మొత్తం వరి ఆయకట్టు 1.90 లక్షల ఎకరాలు కాగా అధికారులు 1.63 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా వేశారు. జూలై వర్షాలు, వరదలకు సుమారు 3 వేల ఎకరాల్లో వరిచేలు దెబ్బతిన్నాయి. తాజాగా వరదలకు ముమ్మిడివరం మండలం అయినాపురం పరిసర ప్రాంతాల్లో సుమారు 800 ఎకరాల్లో వరిచేలు నీట మునిగాయి.
ఇవి కాకుండా లంక గ్రామాల్లో 5,996.30 ఎకరాల్లో అరటి, కురపాదులు, బొప్పాయి, తమలపాకు, పువ్వుల పంటలు దెబ్బతిన్నాయి. అలాగే, జిల్లాలో 1,800 వరకు ఇటుక బట్టీలున్నాయి. ఇటీవల వర్షాలు, వరదల కారణంగా.. రోజుకు 30 లక్షల ఇటుక తయారుచేయాల్సి ఉండగా, సగటున 12 లక్షల కూడా జరగడంలేదు. మరోవైపు.. కొబ్బరి పీచు పరిశ్రమల్లో కూడా సగం ఉత్పత్తి మించి జరగడంలేదు. కోనసీమ జిల్లాలో 400 వరకు చిన్నా, పెద్ద పరిశ్రమలున్నాయి. వర్షాలవల్ల డొక్క తడిచిపోవడంతో పీచు చేసే పరిస్థితి లేదు. అలాగే పీచు తడిసిపోవడంవల్ల తాడు తయారీ... క్వాయరు పిత్ బ్రిక్ తయారీ ఆగిపోతుంది.
ముందుచూపులేకే ఏలేరు ముంచింది..
ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడంతో ఏలేరు పరీవాహక ప్రాంత రైతుల కొంప ముంచింది. ఊళ్లకు ఊళ్లు, వేలాది ఎకరాల్లో వరి, ఇతర వాణిజ్య పంటలు నీట మునిగి రైతులు లబోదిబోమంటున్నారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలున్నా ప్రభుత్వం ఏలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలను నియంత్రించడంలో ఘోర వైఫల్యం ఏలేరు ముంపునకు కారణమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా కాకినాడ జిల్లాలో జగ్గంపేట, పెద్దాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం, తుని నియోజకవర్గాలలో సుమారు 67 వేల ఎకరాలు సాగవుతుంటాయి. ఈ ప్రాజెక్టు నుంచి మిగులు జలాలు విడుదల చేసిన ప్రతి సందర్భంలో దిగువన పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి.
పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాల్లో గట్లకు గండిపడి గ్రామాలపైకి అకస్మాత్తుగా వరద నీరు పోటెత్తింది. ఉగ్రరూపం దాల్చిన ఏలేరు, సుద్దగడ్డలతో పిఠాపురం నియోజకవర్గంలోని కాలనీలు, రోడ్లు పూర్తిగా నీటి మునిగాయి. గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా పెరిగిన వరద నీటితో పంట భూములు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు కాలనీలు ముంపులోనే ఉన్నాయి. 216 జాతీయ రహదారిలో గొల్లప్రోలు టోల్‌ప్లాజా వద్ద వరద నీరు ముంచెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
చచ్చినా ఇళ్లు ఖాళీ చేయం చింతూరులో వరదనీటిలోనే బాధితుల ఆందోళన
చింతూరు: ఏటా వరదలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, పరిహారం ఇచ్చి పునరావాసం కల్పిస్తేనే ఇళ్లను ఖాళీచేస్తామని లేదంటే వరద నీటిలోనే చచ్చిపోతామంటూ అల్లూరి జిల్లా చింతూరుకు చెందిన వరద బాధితులు తమ ఇళ్లను ఖాళీచేయకుండా వరదనీటిలో ఆందోళన చేపట్టారు. శబరి నది ఉధృతికి మంగళవారం చింతూరులో వరద పెరగడంతో శబరి ఒడ్డు ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి వెంటనే ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని గ్రామస్తులకు సూచించారు.
దీనిపై ఆగ్రహించిన బాధితులు ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు ఇళ్లను వరద ముంచెత్తిందన్నారు. వరద అంతకంతకూ పెరుగుతుండడం, బాధితులు ఇళ్లను ఖాళీచేసేందుకు ససేమిరా అనడంతో చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వభరత్, రంపచోడవరం సబ్‌కలెక్టర్ కల్పశ్రీ వెళ్లి బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తాము కష్టపడి సంపాదించిన సొమ్ము వరద పాలవుతోందని, ఇక తాము ఈ కష్టాలు పడలేమని స్పష్టంచేశారు. దీంతో.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని వారు హమీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించి ఇళ్లను ఖాళీచేసి పునరావాస కేంద్రాలకు వెళ్లారు.
బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి
వరద ముంపులో ఉన్న బాధితులను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. ఏటా వస్తున్న వరద నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజల రక్షణకు పటిష్టమైన ఏర్పాట్లుచేయాలి. ప్రజలు ఇబ్బందులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టాలి.– వంగా గీతా విశ్వనాథ్, మాజీ ఎంపీ, కాకినా
రైతాంగాన్ని నట్టేట ముంచిన వరద..
పభుత్వం, అధికారుల నిర్లక్ష్యంవల్లే ఏలేరు వరద ఉధృతి రైతులను నట్టేట ముంచింది. ఏలేరు ప్రాజెక్టులో 24 టీఎంసీల నీరుచేరే వరకు నీటిని నిల్వ ఉంచడం దారుణం. 19 టీఎంసీలు ఉన్నప్పుడే అధికారులు మెల్లమెల్లగా నీటిని విడుదల చేసి ఉంటే ఇంత ఉధృతి ఉత్పన్నమయ్యేది కాదు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి – గంథం శ్రీను, రైతు, మర్లావ, పెద్దాపురం మండలం
బీర పంట పోయింది..
రెండు ఎకరాల్లో బీర పంట సాగుచేశాను. గత జూలై వరదలకు పంట మొత్తం దెబ్బతింది. అప్పటికే ఎకరాకు రూ.40 వేల చొప్పున రూ.80 వేలు పెట్టుబడిగా పెట్టాను. పదకొండు రోజులు వరద నీరు ఉండడంతో పంట అంతా కుళ్లిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి. – ధూళిపూడి రామకృష్ణ, సలాదివారిపాలెం, ముమ్మిడివరం మండలం, కోనసీమ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment