ఆరు, ఏడు తరగతులు విజయవాడలో అభ్యాసం
మే 10న చివరిగా ఏపీకి వచ్చి వెళ్లిన సీతారాం
స్టీల్ ప్లాంట్ ఉద్యమాల్లో పాల్గొన్న జాతీయ నేత
జాతీయ ప్రధాన కార్యదర్శిగా విశాఖలోనే ఎంపిక
సాక్షి, అమరావతి/సాక్షి, పాడేరు/గాజువాక: అస్తమించిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఆంధ్రప్రదేశ్‌తో చాలా అనుబంధం ఉంది. ఆయన స్వస్థలం కాకినాడ అయినా.. తండ్రి సర్వేశ్వర సోమయాజి బదిలీపై విజయవాడ ఆర్టీసీలో ఉన్నతాధికారిగా పనిచేసిన సమయంలో ఆరు, ఏడు తరగతులను ఏచూరి విజయవాడలోనే చదువుకున్నారు. ఆ తరువాత హైదరాబాద్‌కు వెళ్లారు. 1978లో స్టూడెండ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఎఫ్‌ఐ) జాతీయ అధ్యక్షుడి హోదాలో విజయవాడకు వచ్చారు. విద్యార్థి నాయకుడిగా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా, జనరల్ సెక్రటరీగా అనేక కార్యక్రమల్లో పాల్గొన్నారు.
గతేడాది నవంబర్‌లో ప్రజారక్షణభేరి ర్యాలీ, సభకు హాజరయ్యారు. 2022లో దేశ రక్షణ భేరి బహిరంగ సభకు వచ్చారు. అదే ఏడాది జనవరిలో పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలోనూ పాలుపంచుకున్నారు. 2010లో సీపీఎం అఖిల భారత విస్తృతస్థాయి సమావేశాల్లో పాల్గొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మూడు రోజుల పాటు విజయవాడలో ఉండి రాష్ట్రమంతా పర్యటించారు. చివరిగా ఈ ఏడాది మే 10న విజయవాడలో ఇండియా కూటమి నిర్వహించిన కార్యక్రమంలో ఏచూరి పాల్గొన్నారు. ఏచూరి విద్యాభ్యాసం, నివాసం అంతా ఢిల్లీ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ వచి్చనప్పుడు తెలుగులోనే మాట్లాడేవారు.
విశాఖతో ప్రత్యేక అనుబంధం
సీతారాం ఏచూరికి విశాఖతో ఎనలేని అనుబంధం ఉంది. 2015 ఏప్రిల్ 14 నుంచి 19వ తేదీ వరకు విశాఖలోని పోర్టు స్టేడియంలో నిర్వహించిన సీపీఎం 21వ జాతీయ మహాసభల్లో ఆయన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేట్‌పరం కాకుండా ఢిల్లీస్థాయిలో పోరాడటంలోను, షిప్‌యార్డు, బీహెచ్‌పీవీ, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ రక్షణ కోసం జరిగిన ఉద్యమాల సందర్భంగా ఏచూరి ఢిల్లీ నుంచి విశాఖకు అనేక సార్లు వచ్చారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్ స్థాపన కోసం జరిగిన ఉద్యమాల్లోను ఆయన పాల్గొన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ప్రకటన చేసిన తరువాత జరుగుతున్న ఉద్యమాల్లో కూడా ఆయన ప్రసంగించారు. గత ఏడాది అక్టోబర్ 5న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్‌ప్లాంట్ వద్ద జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆయన మృతి వార్త ఈ ప్రాంత ఉద్యమకారులను, వామపక్షవాదులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
కూనవరంలో థింసాతో సందడి
ఎన్నికల ప్రచారం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూనవరంలో మే 9న సీతారాం ఏచూరి పర్యటించారు. ఆ సమయంలో థింసా నృత్యంతో సందడి చేశారు. గిరిజనులతో ఫోటోలు దిగారు. ఆయన మృతికి సీపీఎం, సీపీఐతో పాటు కారి్మక సంఘాల నేతలు, అసంఘటిత రంగ కారి్మకులు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు.
గొప్ప మేధావి
ఏచూరి గొప్ప మేధావి, కార్మికవర్గ పక్షపాతి, లౌకిక శక్తుల బలోపేతానికి అంకితమైన నాయకుడు అని సీసీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి పి.మధు అన్నారు. ఆయన మరణం దేశానికి, వామపక్ష ఉద్యమానికి తీరని లోటు అని పేర్కొన్నారు.
ఎంతో బాధను మిగిల్చింది
సీతారాం ఏచూరి తుదిశ్వాస వదలడం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు, లౌకికశక్తులకు తీరని లోటు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, వి.శ్రీనివాసరావు అన్నారు. పార్లమెంటు సభ్యుడిగా దేశాభివృద్ధి కోసం ఆయన చేసిన ఉపన్యాసాలు చిరస్థాయిగా ఉంటాయన్నారు. అనేక దేశాల కమ్యూనిస్టు పార్టీల నాయకులతో ఆయనకు స్నేహ సంబంధాలుండేవన్నారు. ఆయన మరణం పట్ల పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తోందని చెప్పారు.
రాష్ట్ర పార్టీ తరపున ఢిల్లీలో నివాళులు
ఏచూరికి విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచీ విజయవాడతో అనుబంధం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, సీహెచ్ బాబూరావు చెప్పారు. పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున పార్టీ సీనియర్ నాయకులు పి.మధు, కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు ఈనెల 14న ఢిల్లీలో ఆయన భౌతికకాయానికి నివాళులరి్పంచి అంత్యక్రియల్లో పాల్గొంటారని చెప్పారు.
సీతారాం ఏచూరి మృతి తీరని లోటు
సీతారాం ఏచూరి మృతి పట్ల అసెంబ్లీ స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటన్నారు. ఏచూరి పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమన్నారు.
చిరస్మరణీయులు: ఎస్‌ఎఫ్‌ఐ
దేశంలోని శ్రామిక ప్రజల సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటం చేసిన సీతారాం ఏచూరి చిరస్మరణీయులని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఢిల్లీలో కళాశాల రోజుల్లో ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడిగా జీవితాన్ని ప్రారంభించి.. రాజకీయాల్లో ఎన్నో ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించారని కొనియాడింది. ఏచూరి కుటుంబ సభ్యులకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రసన్న కుమార్, ఎ.అశోక్ ప్రగాఢ సంతాపం తెలిపారు.
విలువలతో కూడిన రాజకీయాలు: యూటీఎఫ్
కామ్రేడ్ సీతారాం ఏచూరి కమ్యూనిస్టు విలువలతో కూడిన రాజకీయాలు చేసిన గొప్ప నాయకుడని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎస్.ప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మృతి తీరని లోటన్నారు. దేశంలో వామపక్ష శక్తుల మధ్యనేకాక అంతర్జాతీయంగా అన్ని కమ్యూనిస్టు సంస్థల మధ్య ఐక్యత సాధించడానికి ఆయన కృషి చేశారన్నారు. త్వరలో కాకినాడలో జరిగే యూటీఎఫ్ స్వరో్ణత్సవ మహాసభలకు ముఖ్య అతిథిగా ఆహా్వనించాలని నిర్ణయించామని, ఇంతలోనే ఈ వార్త వినాల్సి వచ్చిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment