కంచిలి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం
మొక్కు తీర్చుకోవడానికి వెళ్తుండగా దుర్ఘటన
మృతులు విశాఖ వాసులు
ఐదువందల పైచిలుకు కిలోమీటర్ల దూరం. జాతీయ రహదారిపై కారులో నిమ్మళంగా వెళ్తే దాదాపు పది గంటల సేపు ప్రయాణం. అప్పటికే వారు దాదాపు సగం దూరం ప్రయాణం పూర్తి చేశారు. ఇంకాసేపైతే ఆంధ్రాపరిధి దాటి ఒడిశాలోకి ప్రవేశిస్తారు. కానీ అక్కడే వారి ప్రయాణం ఆగిపోయింది. అంతసేపు కారు నడిపిన బడలిక.. అతి వేగం.. నిద్రమత్తు కలగలిపి వారి జీవిత ప్రయాణాన్ని ఆపేశాయి. అదుపు తప్పిన వారి కారు జాతీయ రహదారి పక్కన ఉన్న విద్యుత్‌స్తంభాన్ని ఢీకొంటే.. ఆ ధాటికి స్తంభం ఏకంగా విరిగిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కూతురికి ఐఐటీలో సీటు వచ్చిందని మొక్కు తీర్చుకోవడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
కంచిలి (శ్రీకాకుళం): కంచిలి మండల పరిధి పెద్దకొజ్జిరియా–చిన్నకొజ్జిరియా గ్రామ కూడళ్ల మధ్యలో మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వచ్చిన కారు అదుపు తప్పి, రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నేహా గుప్తా(18), కదిరిశెట్టి సోమేశ్వరరావు(49), లావణ్య(43) దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరంతా విశాఖకు చెందిన వారు. వివరాల్లోకి వెళ్తే..
మొక్కు తీర్చుకుందామని..
విశాఖలోని సీతమ్మధారకు చెందిన ముత్తా వెంకట రంగ రాజేష్ భార్య లావణ్య, కుమార్తె నేహా గుప్తా, తల్లి సుబ్బలక్ష్మితోపాటు తెలంగాణ రాష్ట్రం భద్రాచలానికి చెందిన తోడల్లుడు కదిరిశెట్టి సోమేశ్వరరావు, ఆయన భార్య రాధికలతో కలిసి కారులో ఒడిశా రాష్ట్ర పరిధి జాజ్‌పూర్‌లో గల గిరిజామాత అమ్మవారి దర్శనానికి బయల్దేరారు. నేహా గుప్తాకు ఐఐటీలో సీటు రావడంతో మొక్కు తీర్చుకోవడానికి తమ కారులోనే బయల్దేరారు. ఉదయం 9 గంటల సమయంలో కంచిలి మండలం చిన్నకొజ్జిరియా గ్రామకూడలి వద్దకు వచ్చేసరికి వాహనాన్ని నడుపుతున్న ముత్తా వెంకటరంగరాజేష్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో వాహనం అదుపు తప్పి, రోడ్డు పక్కన బెర్మ్‌వైపు దిగి ఆ పక్కన ఉన్న 33 కేవీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా అదుపు తప్పి మళ్లీ రోడ్డు మీదకు చేరి పల్టీ లు కొడుతూ మరికొంత దూరం వెళ్లిపోయి బోల్తాపడింది. కారు ఢీకొన్న వేగానికి విద్యుత్ స్తంభం ఏకంగా విరిగిపోయింది.
ప్రమాదంలో వాహనం నడుపుతున్న ముత్తా వెంకట రంగ రాజేష్ భార్య లావణ్య(43) కారులో నలిగిపోయి అక్కడికక్కడే చనిపోయారు. కుమార్తె నేహా గుప్తా(18), తోడల్లుడు కదిరిశెట్టి సోమేశ్వరరావు(49)లను స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో కన్నుమూశారు. మృతుడు సోమేశ్వరరావు భార్య కదిరిశెట్టి రాధిక తీవ్రగాయాలపాలవ్వడంతో పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను శ్రీకాకుళంలో ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వాహనం నడుపుతున్న వ్యక్తి వెంకట రంగ రాజేష్ తోపాటు ఆయన తల్లి సుబ్బలక్షి్మలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వీరికి సోంపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
మృతుడు కదిరిశెట్టి సోమేశ్వరరావు భద్రాచలంలో ఐటీసీ పేపర్ ఇండస్ట్రీ లో ఉద్యోగి. ఆయనకు భార్య రాధిక, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యాభర్తలు సోమవారం రాత్రి విశాఖపట్నం చేరుకున్నారు. అంతా కలిసి మంగళవారం వేకువజామున ఒడిశాలోని గుడికి బయల్దేరారు. ఇక రాజేష్ విశాఖపట్నంలో ఆటోమొబై ల్ స్పేర్‌పార్ట్స్ వ్యా పా రం చేస్తుంటారు. ప్ర మాదం జరిగిన విష యం తెలుసుకొని పరామర్శకు వచ్చిన బంధు వులకు చెబుతూ గుండెలు బాదుకుంటూ రో దించారు. నేహా పుట్టిన రోజు వేడుకలు ఈ నెల 21నే నిర్వహించారు.
అధికారుల పరిశీలన..
ప్రమాదం విషయాన్ని తెలుసుకొని కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు, స్థానిక తహసీల్దార్ ఎన్.రమే‹Ùకుమార్‌లు సంఘటన స్థలంతోపాటు, ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్‌ఐ పి. పారినాయడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం విషయం తెలుసుకొని సోంపేట ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్ సోంపేట ప్రభుత్వాసుపత్రికి వచ్చి వెంకట రంగ రాజేష్‌ను పరామర్శించారు. ప్రమాద విషయాన్ని అడిగి తెలుసుకొన్నారు.
హాహాకారాలు..
ప్రమాదంలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో తీవ్ర విషాదం చోటుచేసుకొంది. ప్రమాదం జరిగిన ప్రదేశమంతా బాధి తుల ఆర్తనాదాలతో మార్మోగింది. జాతీయ రహదారిలో వాహన రాకపోకలు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం, ఆ సమయంలో మరే వాహనం రాకపోవడంతో కుడివైపు ఉన్న ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో కారులో మూడు వరుసల్లో సీట్లలో ఆరుగురు కూర్చుండగా, ఎడమవైపు విద్యుత్ స్తంభం ఢీకొనడంతో ఆ వైపు కూర్చున్నవారంతా ప్రమాదానికి గురయ్యారు. మరోవైపు కూర్చున్న ముగ్గురు గాయాలతో బయటపడినట్లు సంఘటన స్థలంలో ప్రమాద స్థలంలో పరిస్థితిని చూస్తే అర్ధమవుతుంది.
⇒ విజయనగరం జిల్లా భోగాపురం వద్ద హైవేపై మితిమీరిన వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ఎక్కించి ఆవలి రోడ్డు వైపునకు వెళ్లి లారీని ఢీకొనడంతో నలుగురు జిల్లావాసులు దుర్మరణం చెందారు.
⇒మెళియాపుట్టి మండలం చినహంస సమీపంలో ధాన్యపు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేయబోయి ఎడ్జ్‌లో ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో ఓ యువకుడు, బాలిక మృతిచెందారు.ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై నలుగురు వెళ్లడం గమనార్హం..
⇒ కోటబొమ్మాళి మండలం పాకివలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు సంపతిరావు త్రివేణి(30) మృతిచెందారు.
⇒ తమిళనాడు నుంచి జార్ఖండ్‌కు వెళ్లేందుకు కొబ్బరికాయల లోడుతో వస్తున్న లారీ ఎచ్చెర్ల ఫరీదుపేట కొయ్యరాళ్ల కూడలి వద్ద విద్యుత్తు స్తంభాన్ని (టవర్‌ను) బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. క్యాబిన్‌లో ఉన్న డ్రైవర్ మృతిచెందగా వెనుక నిద్రిస్తున్న క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment