పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం దింతెనపాడులో పడిన వడగళ్లు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/నెట్‌వర్క్: రాష్ట్రంలో ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో అనేకచోట్ల శనివారం అర్ధరాత్రి, ఆదివారం కూడా వానలు దంచికొట్టాయి. వర్షాలకు తోడు వడగళ్లు, ఈదురుగాలులు, పిడుగులు బెంబేలెత్తిస్తున్నాయి.
ప్రస్తుతం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకు మరఠ్వాడా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ.ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ఫలితంగా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
ఈ వర్షాల ప్రభావం నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, విజయనగరం, వైఎస్సార్, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, గుంటూరు, చిత్తూరు, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలోని 53 మండలాల్లోని 188 గ్రామాలపై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పిడుగుపాటుకు రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు వ్యక్తులు మరణించినట్లు నిర్ధారించారు.
పల్నాడులో ఇద్దరు, నంద్యాల, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వర్షాలకు కొన్నిచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందనే దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
► ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. అమలాపురంలో 81.2 మిల్లీమీటర్లు, సఖినేటిపల్లి మండలంలో 79.4, రాజోలు 64.4, తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో 61.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మామిడి, జీడిమామిడితో పాటు ఇతర వాణిజ్య పంటలకు, చెరకు, మొక్కజొన్న పంటలకు ఈ వర్షం మేలు చేసింది. నర్సరీ రైతులకూ ఈ వర్షం ఊరటనిచ్చింది. కోనసీమలో వరి రైతులకు వర్షం చేసిన మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా శివారు పొలాల్లో రబీ నీటి ఎద్దడి సమస్య తీరేలా వర్షం పడడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
► అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 22 మండలాల పరిధిలో ఆదివారం ఉదయం 62.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అడ్డతీగల మండలంలో వంతెన కొట్టుకుపోయింది.
► తిరుపతి జిల్లా వ్యాప్తంగా వడగండ్లతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యాయి. జిల్లాలోని అక్కడక్కడా ఎనిమిది చోట్ల పిడుగులు సైతం పడ్డాయి. ద్రోణి కారణంగా తీరంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం దాదాపు 8 మీటర్లు ముందుకు వచ్చింది. గడిచిన 20 రోజులు జిల్లాలో విపరీతమైన ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు ఈ వర్షాలు ఊరటనిచ్చాయి.
► ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆదివారం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఎర్రగుంట గ్రామంలో పిడుగుపాటుకు ఒక ఇల్లు పాక్షికంగా దెబ్బతినగా, పలు ఇళ్లల్లో టీవీలు కాలిపోయాయి.
► శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షాలతోపాటు పెద్దఎత్తున గాలులు వీచాయి. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడగా అధికారులు వెంటనే స్పందించి పునరుద్ధరించారు.
► పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఆదివారం వడగండ్ల వర్షం కురిసింది. నరసరావుపేట పట్టణంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వడగండ్లు పడడంతో జనం పరుగులు తీశారు. మాచర్ల, కారంపూడి, సత్తెనపల్లి, చిలకలూరిపేట ప్రాంతాల్లో కూడా వడగండ్ల వర్షం కురిసింది.
► శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆదివారం జల్లులు కురిశాయి. శ్రీకాకుళంలోని భద్రమ్మ తల్లి ఆలయంపై పిడుగు పడింది.
తూపిలిపాళెం సముద్ర తీరంలో ఒడ్డుకు చేరిన వేట సామగ్రి
నేడు కూడా వర్షాలు.. రేపటి నుంచి తగ్గుముఖం
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో సోమవారం కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు.
గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. ఇక మంగళవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయి. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో మంగళవారం ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో తెలిపింది.
ఆందోళన వద్దు.. ఆదుకుంటాం : మంత్రి కాకాణి
రాష్ట్రంలో అకాల వర్షాలవల్ల నష్ట్టపోయే ప్రతీ రైతును అన్ని విధాలా ఆదుకుంటామని వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. ఏ ఒక్క రైతు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. వారం రోజుల్లో పంట నష్టాన్ని అంచనా వేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారన్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే పంటనష్టం అంచనాకు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశామని, సీజన్ ముగియకుండానే ఈ పరిహారం జమచేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆదివారం రాత్రి మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment