సాక్షి, అమరావతి: అకాల వర్షాలవల్ల పంటలు దెబ్బతిన్న సన్న, చిన్నకారు రైతులను ఆదుకునే విషయంలో ఉదారంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పంట నష్టం అంచనాలు తయారుచేయడంలోగానీ, పరిహారం అందించడంలోగానీ ఎలాంటి కొర్రీలు వేయకుండా ఆదుకోవాలన్నారు.
ఆ మేరకు క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులతో గురువారం మంగళగిరిలోని వ్యవసాయ శాఖ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు అధికార యంత్రాంగం ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలన్నారు.
అలాగే, రబీ పంటలు చేతికొచ్చే వేళ ఇటీవల కురిసిన అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీసాయని, ఇలాంటి సందర్భంలో వారికి అన్ని విధాలా అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే, దెబ్బతిన్న పంటలకు కనీస మద్దతు ధరలు దక్కేలా చూడాలన్నారు. అవసరమైతే మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద మార్కెట్‌లో జోక్యం చేసుకుని రైతుల వద్ద ఉన్న ఉత్పత్తులను కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేయాలన్నారు. తడిసిన, మొలకెత్తిన, రంగుమారిన ధాన్యం సేకరణలో కూడా రైతులకు అండగా నిలవాలని కాకాణి అన్నారు.
పక్కాగా ఖరీఫ్ కార్యాచరణ..
ఇక పంట నష్టం అంచనా కోసం ఏర్పాటుచేసిన ఎన్యూమరేషన్ బృందాలు క్షేత్రస్థాయిలో రైతులను ఇబ్బంది పెట్టకుండా నిబంధనల మేరకు ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జూన్ నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు చెయ్యాలన్నారు. ఖరీఫ్ సీజన్‌లో 6.18 లక్షల క్వింటాళ్ల విత్తన పంపిణీ కోసం తయారుచేసిన యాక్షన్ ప్లాన్‌ను పక్కాగా అమలుచేయాలని మంత్రి సూచించారు.
డిమాండ్ మేరకు ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సిద్ధంచేయాలన్నారు. సమీక్షలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, సహకార, మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ చేవూరు హరికిరణ్, ఉద్యాన, మార్కెటింగ్ శాఖ కమిషనర్లు డాక్టర్ ఎస్‌ఎస్æ శ్రీధర్, రాహుల్ పాండే, ఏపీ సీడ్స్, ఆగ్రోస్ ఎండీలు డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment