govarthan Reddy
-
రబీలోనూ ప్రత్యామ్నాయ పంటలు
సాక్షి, అమరావతి : రబీ సీజన్లోనూ నెలకొన్న వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది. సీజన్లో నెలకొన్న బెట్ట పరిస్థితులకనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలుచేసేందుకు కార్యాచరణ సిద్ధంచేసింది. సీజన్ ఆరంభమై నెలన్నర రోజులైన నేపథ్యంలో.. రబీసాగు లక్ష్యం 55.96 లక్షల ఎకరాలుగా కాగా, ఇందుకు 3,64,372 క్వింటాళ్ల విత్తనం అవసరమని వ్యవసాయ శాఖ ఇండెంట్ పెట్టింది. దీంతో 3,78,200 టన్నులను ఆర్బీకేల్లో పొజిషన్ చేయగా, ఇప్పటివరకు 2,49,647 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు. ప్రధానంగా 2.45 లక్షల క్వింటాళ్ల శనగ, 3,500 క్వింటాళ్ల వేరుశనగ, 500 క్వింటాళ్ల చొప్పున వరి, పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేశారు. గతేడాది ఇదే సమయానికి 10.81 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకాగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 8.5 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై వ్యవసాయ శాఖ దృష్టిసారించింది. ఇప్పటికే ఆ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీజన్లో నెలకొన్న వాతావరణ పరిస్థితులను ప్రతీ 15 రోజులకోసారి సమీక్షిస్తూ తదనుగుణంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. అలాగే, అచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సిఫార్సులకనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రూపొందించారు. గోదావరి ప్రాజెక్టు కింద సాగునీరు గోదావరిలో పుష్కలంగా నీరుండడంతో ఈ ప్రాజెక్టు పరిధిలో వ్యవసాయ, ఆక్వా అవసరాలకు తగినంత నీరివ్వనున్నారు. ఐఏబీ–డీఏఏబీ సమావేశంలో ఏ మేరకు సాగునీరు ఉందో అంచనావేస్తూ ఎంత విస్తీర్ణంలో సాగుకు నీరు ఇవ్వగలమో రైతులకు ముందుగానే చెబుతున్నారు. సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు కాలువల కింద నీటి సరఫరాను నిలిపివేసే తేదీలపై ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం కల్పింస్తున్నారు. ఇక శివారు ప్రాంతాల్లో (టెయిల్ ఎండ్ ఏరియాస్) సాధ్యమైనంత త్వరగా నాట్లు వేసుకునేలా అవగాహన కల్పింంచడంతో పాటు నీటి యాజమాన్య పద్ధతులు విధిగా పాటించేలా రైతులను అప్రమత్తం చేయనున్నారు. గోదావరి డెల్టా పరిధిలో వెదజల్లు సాగును ప్రోత్సహించడంతో పాటు అత్యధిక నీటి వినియోగమయ్యే పంటల్లో ఒకటైన మొక్కజొన్న సాగును కాలువల కింద ప్రోత్సహించకూడదని నిర్ణయించారు. వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో ఐఏబీ, డీఏఏబీ సమావేశాలను సంయుక్తంగా నిర్వహించనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం మెట్ట ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా అపరాల సాగును, కాలువల ఎగువ ప్రాంతాల్లో అపరాలతో పాటు మొక్కజొన్న సాగును ప్రోత్సహిస్తారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకనుగుణంగా 14 జిల్లాల పరిధిలో కనీసం 60వేల ఎకరాల్లో కంటిజెంట్ ప్లానింగ్ అమలుచేస్తారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం 6,229 క్వింటాళ్ల విత్తనం అవసరమని గుర్తించారు. వీటిని సబ్సిడీపై రైతులకు అందించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఆర్బీకే స్థాయిలో విస్తృత ప్రచారం స్వల్పకాలంలో చేతికొచ్చే పంటల సాగును ప్రోత్సహించేలా రూపొందించిన ఈ కార్యాచరణను ఆర్బీకేల ద్వారా కరపత్రాలు, వాల్ పోస్టర్లతో ప్రచారం చేస్తున్నారు. అంతేకాక.. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికనుగుణంగా సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులకు సంబంధించి శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో కూడిన చిన్నపాటి వీడియో, ఆడియో సందేశాలతో రైతులకు అవగాహన కల్పింస్తున్నారు. -
ఎందుకంత తొందర రామోజీ!?
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలుచేస్తున్నామని చెప్పారు. అంతేకాక.. అన్నదాతలకు రైతుభరోసా సాయాన్ని అందజేయడంతోపాటు 60వేల క్వింటాళ్ల విత్తనాలను ఆర్బీకేల్లో పొజిషన్ కూడా చేశామన్నారు. డిమాండ్ మేరకు మరిన్ని విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లుచేస్తున్నామని ఆయన చెప్పారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రైతులను భయభ్రాంతులకు గురిచేసేలా ఈనాడులో వస్తున్న కథనాలపై ఆయన మండిపడ్డారు. గతంలో ఎన్నడూలేని విధంగా రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అహరహం శ్రమిస్తున్నారని చెప్పారు. ఎన్నో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో రైతులకు ముఖ్యమంత్రి అండగా నిలుస్తుంటే ఎల్లో మీడియా ఓర్వలేక విషం కక్కుతోందన్నారు. సాధారణంగా ఖరీఫ్ సీజన్ సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉంటుందని, ఆ మాత్రం అవగాహన లేకపోతే ఎలా అని రామోజీని కాకాణి ప్రశ్నించారు. ఆగస్టు నెలాఖరులోగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడితే విత్తుకోవాలని రైతులు ఎదురుచూస్తున్నారని మంత్రి చెప్పారు. ఆ దిశగా ఆర్బీకేల ద్వారా అవగాహన కూడా కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో రైతులు ఆర్బీకేల ద్వారా విత్తనాలు తీసుకుంటున్నారని మంత్రి చెప్పారు. వచ్చే నెలాఖరు తర్వాత సమీక్ష.. మరోవైపు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఖరీఫ్ సీజన్లో నెలకొన్న వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు తగిన ఆదేశాలు జారీచేస్తున్నారని.. ఈ విషయంలో ఇప్పటికే సమీక్ష కూడా నిర్వహించారని ఆయన గుర్తుచేశారు. ఈ విషయం రామోజీకి తెలియకపోవచ్చని.. ఎందుకంటే ఆయన నిత్యం చంద్రబాబు పల్లకీ మోయటంలో మునిగితేలుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక సెప్టెంబర్ నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతున్నప్పటికీ ఇంతలోనే రైతులకు లేని బాధ మీకెందుకని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. సెప్టెంబర్ నెలాఖరు తర్వాత పూర్తిస్థాయిలో పరిస్థితిని సమీక్షించి ఆ తర్వాత రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. నిజానికి.. చంద్రబాబు, కరువు కవల పిల్లలని, టీడీపీ ఐదేళ్లూ కరువు విలయతాండవం చేసిన విషయాన్ని మంత్రి కాకాణి గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో ఏటా కరువు మండలాలు ప్రకటించినా ఏ ఒక్క ఏడాది రైతులకు పైసా కూడా పరిహారం ఇవ్వలేదని.. అయినా ఏనాడు ఈనాడు సింగిల్ కాలమ్ వార్త కూడా రాసిన పాపాన పోలేదన్నారు. రైతులకు రూ.2,558 కోట్లు ఎగ్గొట్టిన బాబు ఐదేళ్లలో 24.80 లక్షల మంది రైతులకు రూ.2,558 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ (పంట నష్టపరిహారం) బకాయిలు ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైపరీత్యాల వేళ జరిగే పంట నష్టపరిహారాన్ని ఆ సీజన్ ముగియకుండానే ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని కాకాణి చెప్పారు. అలాగే, ఇప్పటివరకు 22.74 లక్షల మంది రైతులకు రూ.1,965 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందించామన్నారు. ఇక టీడీపీ ఐదేళ్లలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల బీమా పరిహారం ఇస్తే.. ఈ నాలుగేళ్లలో రైతులపై పైసా భారం పడకుండా 54.48 లక్షల మందికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.7,802 కోట్ల బీమా పరిహారం చెల్లించిందన్నారు. ఈ నాలుగేళ్లలో రైతులకు ప్రత్యేకంగా రూ.1,70,769 కోట్ల లబ్ధిచేకూర్చిన ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలని మంత్రి కాకాణి హితవు పలికారు. -
కొర్రీలు పెట్టొద్దు.. ఉదారంగా ఉండండి
సాక్షి, అమరావతి: అకాల వర్షాలవల్ల పంటలు దెబ్బతిన్న సన్న, చిన్నకారు రైతులను ఆదుకునే విషయంలో ఉదారంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పంట నష్టం అంచనాలు తయారుచేయడంలోగానీ, పరిహారం అందించడంలోగానీ ఎలాంటి కొర్రీలు వేయకుండా ఆదుకోవాలన్నారు. ఆ మేరకు క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులతో గురువారం మంగళగిరిలోని వ్యవసాయ శాఖ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు అధికార యంత్రాంగం ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలన్నారు. అలాగే, రబీ పంటలు చేతికొచ్చే వేళ ఇటీవల కురిసిన అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీసాయని, ఇలాంటి సందర్భంలో వారికి అన్ని విధాలా అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే, దెబ్బతిన్న పంటలకు కనీస మద్దతు ధరలు దక్కేలా చూడాలన్నారు. అవసరమైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మార్కెట్లో జోక్యం చేసుకుని రైతుల వద్ద ఉన్న ఉత్పత్తులను కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేయాలన్నారు. తడిసిన, మొలకెత్తిన, రంగుమారిన ధాన్యం సేకరణలో కూడా రైతులకు అండగా నిలవాలని కాకాణి అన్నారు. పక్కాగా ఖరీఫ్ కార్యాచరణ.. ఇక పంట నష్టం అంచనా కోసం ఏర్పాటుచేసిన ఎన్యూమరేషన్ బృందాలు క్షేత్రస్థాయిలో రైతులను ఇబ్బంది పెట్టకుండా నిబంధనల మేరకు ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జూన్ నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు చెయ్యాలన్నారు. ఖరీఫ్ సీజన్లో 6.18 లక్షల క్వింటాళ్ల విత్తన పంపిణీ కోసం తయారుచేసిన యాక్షన్ ప్లాన్‌ను పక్కాగా అమలుచేయాలని మంత్రి సూచించారు. డిమాండ్ మేరకు ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సిద్ధంచేయాలన్నారు. సమీక్షలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, సహకార, మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ చేవూరు హరికిరణ్, ఉద్యాన, మార్కెటింగ్ శాఖ కమిషనర్లు డాక్టర్ ఎస్ఎస్æ శ్రీధర్, రాహుల్ పాండే, ఏపీ సీడ్స్, ఆగ్రోస్ ఎండీలు డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని మల్కారంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన టీ గోవర్ధన్‌రెడ్డి (68) తనకున్న మూడెకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎప్పటి లాగానే ఈ ఖరీఫ్‌లో వరి సాగు చేయడానికి సిద్ధమయ్యాడు. నారు మడి తయారు చేయడానికి వీలుగా మడిని తడపాలని మంగళవారం సాయంత్రం బోరు మోటారు వద్దకు వెళ్లాడు. మోటారు ఆన్ చేయడానికి స్టార్టర్ డబ్బాను పట్టుకున్నాడు. అయితే.. అప్పటికే కరెంటు తీగలు డబ్బాకు తగిలి ఉండడంతో విద్యుదాఘాతానికి గురైన గోవర్ధన్‌రెడ్డి అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. గమనించిన తోటి రైతులు వచ్చి చూసే సరికి ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో ఒక కుమారుడికి వివాహం కావాల్సి ఉంది.