సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలుచేస్తున్నామని చెప్పారు. అంతేకాక.. అన్నదాతలకు రైతుభరోసా సాయాన్ని అందజేయడంతోపాటు 60వేల క్వింటాళ్ల విత్తనాలను ఆర్బీకేల్లో పొజిషన్ కూడా చేశామన్నారు. డిమాండ్ మేరకు మరిన్ని విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లుచేస్తున్నామని ఆయన చెప్పారు.
మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రైతులను భయభ్రాంతులకు గురిచేసేలా ఈనాడులో వస్తున్న కథనాలపై ఆయన మండిపడ్డారు. గతంలో ఎన్నడూలేని విధంగా రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అహరహం శ్రమిస్తున్నారని చెప్పారు. ఎన్నో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో రైతులకు ముఖ్యమంత్రి అండగా నిలుస్తుంటే ఎల్లో మీడియా ఓర్వలేక విషం కక్కుతోందన్నారు.
సాధారణంగా ఖరీఫ్ సీజన్ సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉంటుందని, ఆ మాత్రం అవగాహన లేకపోతే ఎలా అని రామోజీని కాకాణి ప్రశ్నించారు. ఆగస్టు నెలాఖరులోగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడితే విత్తుకోవాలని రైతులు ఎదురుచూస్తున్నారని మంత్రి చెప్పారు. ఆ దిశగా ఆర్బీకేల ద్వారా అవగాహన కూడా కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో రైతులు ఆర్బీకేల ద్వారా విత్తనాలు తీసుకుంటున్నారని మంత్రి చెప్పారు.
వచ్చే నెలాఖరు తర్వాత సమీక్ష..
మరోవైపు.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఖరీఫ్ సీజన్‌లో నెలకొన్న వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు తగిన ఆదేశాలు జారీచేస్తున్నారని.. ఈ విషయంలో ఇప్పటికే సమీక్ష కూడా నిర్వహించారని ఆయన గుర్తుచేశారు. ఈ విషయం రామోజీకి తెలియకపోవచ్చని.. ఎందుకంటే ఆయన నిత్యం చంద్రబాబు పల్లకీ మోయటంలో మునిగితేలుతున్నారని ఎద్దేవా చేశారు.
ఇక సెప్టెంబర్ నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతున్నప్పటికీ ఇంతలోనే రైతులకు లేని బాధ మీకెందుకని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. సెప్టెంబర్ నెలాఖరు తర్వాత పూర్తిస్థాయిలో పరిస్థితిని సమీక్షించి ఆ తర్వాత రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
నిజానికి.. చంద్రబాబు, కరువు కవల పిల్లలని, టీడీపీ ఐదేళ్లూ కరువు విలయతాండవం చేసిన విషయాన్ని మంత్రి కాకాణి గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో ఏటా కరువు మండలాలు ప్రకటించినా ఏ ఒక్క ఏడాది రైతులకు పైసా కూడా పరిహారం ఇవ్వలేదని.. అయినా ఏనాడు ఈనాడు సింగిల్ కాలమ్ వార్త కూడా రాసిన పాపాన పోలేదన్నారు.
రైతులకు రూ.2,558 కోట్లు ఎగ్గొట్టిన బాబు
ఐదేళ్లలో 24.80 లక్షల మంది రైతులకు రూ.2,558 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ (పంట నష్టపరిహారం) బకాయిలు ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైపరీత్యాల వేళ జరిగే పంట నష్టపరిహారాన్ని ఆ సీజన్ ముగియకుండానే ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని కాకాణి చెప్పారు. అలాగే, ఇప్పటివరకు 22.74 లక్షల మంది రైతులకు రూ.1,965 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ అందించామన్నారు.
ఇక టీడీపీ ఐదేళ్లలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల బీమా పరిహారం ఇస్తే.. ఈ నాలుగేళ్లలో రైతులపై పైసా భారం పడకుండా 54.48 లక్షల మందికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.7,802 కోట్ల బీమా పరిహారం చెల్లించిందన్నారు. ఈ నాలుగేళ్లలో రైతులకు ప్రత్యేకంగా రూ.1,70,769 కోట్ల లబ్ధిచేకూర్చిన ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలని మంత్రి కాకాణి హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment