న్యూఢిల్లీ: సూర్య ప్రతాపానికి దాదాపు సగం భారతదేశ రాష్ట్రాలు చెమటతో తడిసి ముద్దవుతున్నాయి. భానుడి భగభగలతో మొదలైన వడగాల్పులు మరో 3–4 రోజులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ వేడి వేడి వార్తను పట్టుకొచ్చింది. మండే ఎండలను భరిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి. రుతుపవనాలు తలుపుతట్టినా వడగాల్పులు మాత్రం వదిలిపోవట్లేవు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలుసహా విదర్భ ప్రాంతాల్లో తీవ్రస్థాయి నుంచి అతి తీవ్రస్థాయిలో వడగాల్పుల పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే బిహార్‌లో రెడ్‌అలర్ట్‌ను ప్రకటించారు. శనివారం(జూన్ 17)దాకా జార్ఖండ్‌లో స్కూళ్లు తెరుచుకోనేలేదు. ఛత్తీస్‌గఢ్, గోవాల్లోనూ ఇదే పరిస్థితి. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు, రాత్రిపూట ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ శనివారం తెలిపిన వివరాల ప్రకారం..
► తెలంగాణ, రాయలసీమ, మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంతం, తమిళనాడు రాష్ట్ర ప్రజలు ఆదివారం(జూన్ 18న) కూడా వడగాల్పులను భరించాల్సిందే.
► ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, యానాం, మధ్యప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతాలు, తూర్పు యూపీ, బిహార్‌లో మరో రెండు రోజులు ఎండలు మరింత మండుతాయి.
► ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో మరో నాలుగు రోజులపాటు వడగాల్పులు కొనసాగుతాయి.
► పశ్చిమబెంగాల్‌లోని గంగా పరీవాహక ప్రాంతాలు, జార్ఖండ్‌లో మరో 3 రోజులు ఎండలు మరింత ముదురుతాయి.
► రాత్రిపూట సైతం ఉష్ణోగ్రతలు పైస్థాయిలోనే ఉండే అవకాశం ఉంది.
► విదర్భ, ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతాల్లో ఆదివారం ఈ పరిస్థితులు ఉంటాయి.
► మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్‌లలో రెండు రోజులు రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువే ఉండనున్నాయి.
► మధ్య భారతం, తూర్పు భారతం, దక్షిణ భారతదేశంలో వచ్చే మూడు రోజులూ ఉష్ణోగ్రతల్లో మార్పేమీ ఉండదు.
► ఆ తర్వాత మాత్రం 2–4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment