ఎముకలు కొరికే చలి దేశాన్ని గజగజలాడిస్తోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడం.. మునుపెన్నడూ లేని రీతిలో పొగమంచు (Dense Fog) పలు ప్రాంతాల్ని కప్పేస్తోంది. దట్టంగా వ్యాపిస్తుండడంతో చాలా చోట్ల ఉదయం 10-11 గంటల దాకా కూడా రాత్రిని తలపిస్తోంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై పెను ప్రభావం పడుతోంది. ఇక.. శుక్ర, శనివారాల్లో ఉదయం వేళ పొగమంచు దట్టంగా కమ్ముకునే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది.
మరీ ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనిష్ఠ ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడిపోయిందక్కడ. పొగమంచు కొన్ని ప్రాంతాల్లో 50 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించనంతగా మంచు కమ్మేసింది. చలి పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో ఇప్పటికే అక్కడి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అటు గాలి నాణ్యత కూడా పడిపోయింది.
మరోవైపు పొగమంచు కారణంగా దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతోంది. విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్లు కూడా ఆలస్యం అవుతున్నాయి. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్‌లలో పడిగాపులు పడాల్సి వస్తోంది. పొగమంచు దట్టంగా పేరుకుపోయి.. రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో.. పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు సైతం సంభవిస్తున్నాయి.
వీళ్లు జాగ్రత్త!
ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతుండడంతో.. సీజనల్ డిసీజ్‌లు వ్యాపించే అవకాశాలున్నాయని.. అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవాళ్లు, ఆస్తమా తదితర శ్వాసకోశ సమస్యలు ఉన్న వాళ్లు మరీ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో..
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో ఉదయం వేళ పొగమంచు కమ్ముకునే అవకాశాలు ఉన్నాయని.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణశాఖ సూచించింది. రాష్ట్రం వైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి దిగువ స్థాయిలో గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో మంచు కురవొచ్చని అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment