గత ఏడాది కంటే అధిక ఉష్ణతాపం
రాష్ట్రంలో సగటు వడగాలులు ఆరు రోజులు
ఈ సీజన్‌లో అవి నాలుగు రెట్లకు పెరగవచ్చన్న ఐఎండీ
మూడు వారాల ముందే మొదలైన వడగాలులు
ఇప్పటికే రాయలసీమలో మండుతున్న ఉష్ణోగ్రతలు
రేపటి నుంచి కోస్తాంధ్రలోనూ హీట్‌వేవ్స్ ప్రతాపం
సాక్షి, విశాఖపట్నం: వేసవి దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను అట్టుడుకించనుంది. ఈ సీజన్‌లో ఏప్రిల్, మే నెలల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతోపాటు అసాధారణ తాపాన్ని వెదజల్లనుంది. గత ఏడాది ఉష్ణ తీవ్రత అధికంగానే ఉంది. ఈ వేసవిలో అంతకు మించి ఎండలు, వడగాలులకు ఆస్కారం ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాకు వచ్చింది. సాధారణంగా మే నెలలో ఎండలు మండుతాయి. ఆ నెలలోనే ఎక్కువగా వడగాలులూ వీస్తాయి. కానీ.. ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఒక నెల ముందుగానే మార్చి మూడో వారం నుంచే ఎండలు విజృంభిస్తున్నాయి.
ఎన్నడూ లేనివిధంగా మార్చి నెలాఖరు నుంచే వడగాలులు వీస్తున్నాయి. ఏప్రిల్ ఆరంభం నుంచే మే నెల నాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల 40 నుంచి 44 డిగ్రీలు రికార్డవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇవి మరింతగా ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా మే నెలలో అగ్నిగుండాన్ని తలపించేలా ఎండలు, వడగాలులు ప్రతాపం చూపనున్నాయి. సాధారణం కంటే 5–8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదై తీవ్ర వడగాలులకు దారితీయనున్నాయి.
మే నెలలో ఎన్నికల దృష్ట్యా ప్రజలు, నాయకులు వడదెబ్బ బారిన పడకుండా, మరణాలు సంభవించకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేయాలని భారత ఎన్నికల సంఘానికి ఐఎండీ సూచించింది. అంతేకాదు.. తమకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఏప్రిల్, మే నెలల్లో ఏయే రోజుల్లో ఉష్ణతీవ్రత, వడగాలుల ప్రభావం ఎక్కడ, ఎలా ఉంటుందో ముందుగానే తెలియజేస్తామని కూడా వెల్లడించింది.
పెరగనున్న వడగాలుల రోజులు
మరోవైపు రాష్ట్రంలో ఈ వేసవిలో వడగాలుల రోజులు కూడా పెరగనున్నాయని ఐఎండీ అంచనా వేసింది. రాష్ట్రంలో వేసవి కాలంలో సగటున ఐదు రోజులు వడగాలులు వీస్తాయి. కానీ.. గత ఏడాది జూన్ ఆఖరు వరకు వేసవి సీజన్ కొనసాగడంతో మూడు రెట్ల అధికంగా 17 రోజులు వడగాలులు/తీవ్ర వడగాలుల రోజులు నమోదయ్యాయి.
2020లో మూడు, 2021లో మూడు, 2022లో ఒక్కరోజు చొప్పున వడగాలుల రోజులు రికార్డయ్యాయి. 2019లో మాత్రం అత్యధికంగా 25 రోజులు వడగాలులు వీచాయి. ఈ ఏడాది కూడా సగటు కంటే నాలుగు రెట్లు అధికంగా వడగాలులు వీచేందుకు ఆస్కారం ఉందని ఐఎండీ విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. ఇదే ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
రాయలసీమలో ఉష్ణతీవ్రత
రాష్ట్రంలో వడగాలుల ప్రభావం అప్పుడే మొదలైంది. కోస్తాంధ్ర కంటే రాయలసీమలోనే ఉష్ణతీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. మంగళవారం రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా నెల్లూరు జిల్లా కలిగిరిలో 43.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ఇది ఐదు డిగ్రీలు అధికం. ఇంకా వగరూర్ (కర్నూలు)లో 43.5, ఒంటిమిట్ట (వైఎస్సార్)లో 43.4, తెరన్నపల్లి (అనంతపురం), ఎం.నెల్లూరు (తిరుపతి), అనుపూర్ (నంద్యాల)లలో 43 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాల్లో వడగాలులు వీచాయి. ఇంకా మరికొన్ని జిల్లాల్లో 40–42 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కోస్తాలోనూ..
రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పలుచోట్ల 2–3 డిగ్రీలు, అక్కడక్కడ 4–5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాయలసీమతోపాటు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని వెల్లడించింది. అదే సమయంలో వేడి, తేమ, అసౌకర్య వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. ఈ నెల 7వ తేదీ నుంచి గాలిలో మార్పు వల్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని అమరావతి వాతావరణం కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment