‘అబ్బ! ఏమి ఎండలు...!’  | Rising Temperatures In Telugu States | Sakshi
Sakshi News home page

‘అబ్బ! ఏమి ఎండలు...!’ 

Published Thu, May 16 2019 1:35 AM | Last Updated on Thu, May 16 2019 1:35 AM

Rising Temperatures In Telugu States - Sakshi

ఎక్కడ చూసినా ఒకటే మాట. ‘అబ్బ! ఏమి ఎండలు...! ఇన్నాళ్ల జీవితంలో ఇంత ఎండలు ఎంత అరుదుగా చూశామో! ఇప్పుడే ఇలా ఉంటే, ఇక రోహిణి కార్తె వచ్చేసరికి బతకగలమా అని భయంగా ఉంది. రావి శాస్త్రి గారు దాదాపు 70 ఏళ్ల క్రితం ఒక చిన్న నాటకం రచించి, ఆనాటి ‘భారతి’ పత్రికలో వేయించారు. చరిత్రలో వివిధ కాలాలలో జరిగిన అయిదారు చారిత్రాత్మకమైన ఘట్టాలను నేపథ్యంగా తీసుకొని, ‘అయ్యో! ఇంతటి ఘోరకలి ఇంతకు మునుపెన్నడైనా చూశామా! ఇక రేపో మాపో ప్రళయం తప్పదు, ఈ లోకం పని అయిపోయినట్టే!’ అని ఎప్పటికప్పుడు, ఏ కాలానికి ఆ కాలంలో లోకులు ఎలా భయాందోళనలు చెందుతుంటారో ఆ నాటకంలో ఎత్తి చూపుతారు. రామాయణ కాలమైనా, మహా భారత యుద్ధం నాడయినా, చంద్రగుప్తుడి సమయంలోనైనా, జవహర్‌లాల్‌ నెహ్రూ జమానాలో అయినా, వర్తమాన అనుభవాలలో ఒక తాజాతనం, ఘాటూ, వాడీ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలనో, మానవ స్వభావాల ఉచ్చనీచాల అంచులనో చవి చూసినప్పుడు, ఆ తీవ్రత అప్పటికప్పుడు ‘నభూతో, న భవిష్యతి’ అనిపిస్తుంది.
 
జ్ఞాపకాలు జీవితానుభవాల ఛాయా చిత్రాల లాంటివి. ఈనాటి ఛాయా చిత్రం వెలుగూ మెరుపూ ఏడాది తిరిగేసరికి మారిపోతుంది. ఏ పాతికేళ్ల తరవాతో చూస్తే ఏవేవో కొత్త అందాలు కనిపించి, కొత్త ఆనందాన్నిస్తాయి. అందుకే, ముగిసి పోయిన తరువాత ఎంతటి దుఃఖానుభవమైనా, యధార్థంగా దాన్ని అనుభవిస్తున్నప్పుడు కలిగించిన వేదనను కలిగించదు. వెనక్కు తిరిగి, అయిపోయిన జీవితాన్ని అనుభవించిన దైన్యాన్నీ, మానావమానాలనూ, కష్టనష్టాలనూ నెమరు వేసుకుంటే, ‘మనోబలంతో ఎంతటి కష్టాలు ఎదుర్కొని బయటపడ్డాను!’ అన్న భావన అసలే చల్లబడిన ఆ పాత అనుభవాలకు, గంధపు పూత వేసి, ‘ఆ రోజులు మళ్లీ రావు!’ అనే సుఖకరమైన భావాన్ని కూడా కలిగిస్తుంది.

అబ్బ! ఏమి ఎండలు! ఇంత రాత్రయినా, చల్లదనమన్నమాట లేదు. దోసె పోస్తుంటే ఆవిర్లు వచ్చినట్టు, ఒకటే వేడిగాడ్పులు! అదుగో, ఎండకి ఫెటిల్లుమని పగిలి బూరుగ కాయలు ఎలా దూది చిమ్ముతున్నాయో, ఎండ వేడికి ఈ లోకం అంతా బూడిదైపోయి, ఆ బూడిదే గాలిలో ఎగురుతున్నట్టుగా! ఈసారి ఎండలతో ఈ సృష్టి పనై పోయింది. కావాలంటే, ఆ దున్నపోతుల మీదా, పందుల మీదా, ఏనుగుల మీదా అట్టలు కట్టిన బురద చూడండి. అదేమనుకొంటున్నారు? బ్రహ్మదేవుడు మళ్లీ సృష్టికి తయారీలు చేసుకొంటూ, ఈ ‘అచ్చు’లన్నీ పోసుకొని అట్టిపెట్టుకొంటున్నాడు...’ ఈ ఎండలు కృష్టదేవరాయల కాలం నాటివి. ఇవి ఆయన వర్ణనలు. అప్పటి ఎండలు అలా అనిపించాయి! వాటిని ఇప్పటి ఎండలతో పోలిస్తే...!   – ఎం. మారుతి శాస్త్రి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement