మరో నాలుగేళ్లూ మండే ఎండలే! | ABK Prasad Special Article On Rise In Temperature | Sakshi
Sakshi News home page

మరో నాలుగేళ్లూ మండే ఎండలే!

Published Thu, Jun 9 2022 12:29 AM | Last Updated on Thu, Jun 9 2022 12:29 AM

ABK Prasad Special Article On Rise In Temperature - Sakshi

సుమారు నూటాపాతికేళ్ల భారతదేశ చరిత్రలో ఈ 2022వ సంవత్సరం ప్రతికూల కారణాల వల్ల ప్రత్యేకమైనది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, ఎట్టకేలకు వేసవి తగ్గుముఖం పడుతోందని సంతోషపడటానికి లేదు. రాబోయే నాలుగేళ్లూ కూడా ఎండలు ఇలాగే మండిపోతాయని ఇప్పటికే ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. వీటి ఫలితంగా వడగాడ్పులూ, ఉక్కపోతలతో పాటు ఆహార భద్రతా సంక్షోభం, అనారోగ్యాలు కలగడం లాంటి ఎన్నో విపరిణామాలను మానవాళి ఎదుర్కోవాల్సి ఉంది. దీనికి తక్షణం మనం చేయవలసిందల్లా శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో వినడం, పర్యావరణ కార్యకర్తలు ఏం చేయమని చెబుతున్నారో చేయడం!

‘‘ఇప్పుడే కాదు, రాబోయే నాలుగేళ్ల పాటూ అదనంగా 1.5 డిగ్రీల చొప్పున తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఫలితంగా మరింతగా మంచు కరిగిపోవడం, సముద్ర జలరాశులు పోటెత్తిపోవడం, తీవ్ర స్థాయిలో వడగాడ్పులు వీయడం తదితర అసాధారణ పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది. ఫలితంగా ప్రజల ఆహార భద్రత, ఆరోగ్యం, పరిసరాలు, భద్రమైన అభివృద్ధికి చేటు మూడే ప్రమాదం ఉంది’’. – ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) హెచ్చరిక: 2022 మే మూడో వారంలో విడుదల చేసిన ప్రకటన.

అంతేగాదు, దక్షిణాసియా పాత, కొత్త వలస సామ్రాజ్య పాలకుల యుద్ధోన్మాద వ్యూహాలు కూడా వాతావరణ పరిస్థితులు వికటించ డానికి దోహదపడుతున్నాయి. ఫలితంగా దక్షిణాసియాలో కీలక స్థానంలో ఉన్న భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్‌ లాంటి దేశాలు వాతావరణ రక్షణకు మునుపటికన్నా ఎక్కువ శ్రద్ధతో, మెలకువతో, జాగరూకతతో వ్యవహరించాల్సిన అత్యవసర పరిస్థితులు నేడు ఏర్పడ్డాయి. ఈ పరిణామాల ఫలితంగా దక్షిణాసియా దేశాలలో తరచుగా ఇకపైన ఎప్పటికన్నా ఎక్కువగా సుదీర్ఘకాలంపాటు వడ గాడ్పులూ, ఉక్కిరిబిక్కిరి చేసే ఉక్కబోతలూ ఎక్కువయ్యే ప్రమాదం ఉందని సుప్రసిద్ధ పర్యావరణ, వాతావరణ శాస్త్రవేత్త షకీల్‌ అహ్మద్‌ రోమ్‌షూ హెచ్చరిస్తున్నారు. గత దశాబ్దాలుగా ప్రపంచ వాతావరణం అసాధారణ రీతిలో వేడెక్కిపోతుండటాన్ని గురించి శాస్త్రవేత్తలు ఆందో ళన వ్యక్తం చేస్తూనే ఉన్నారని మనం మరవ కూడదు.

ఎండల్లోనే పుట్టిన తరం
2000 సంవత్సరం నుంచీ ఈ ఉష్ణోగ్రతల తీవ్రత నమోదవడాన్ని శాస్త్రవేత్తలు గమనిస్తూనే వస్తున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకునే, ‘‘2000 తర్వాత పుట్టిన యువతరాలు ఈ ఉష్ణోగ్రతల తీవ్రతను చవిచూడకుండా ఉన్న రోజులు లేవు’’ అని మరో ప్రసిద్ధ శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ కోల్‌ (పుణె) వ్యాఖ్యానించారు. ఉత్తరాది నుంచి దక్షిణాది పర్యంతం 1951 తర్వాత 40 డిగ్రీల సెల్సియస్‌కు వీసమెత్తు కూడా తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. క్రమేణా పెక్కు రాష్ట్రాలలో 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరి ప్రజా జీవితాలను దుర్భరం చేస్తూ వచ్చాయి. ఫలితంగా 1992 నుంచి 2015 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వేడిగాలుల కారణంగా అకాల మరణానికి గురైన వారి సంఖ్య 24 వేల మందికి పైగానేనని తేలింది. ఇక 1901–2022 సంవత్సరాల మధ్య కాలంలో చరిత్రకు తెలిసి నంతవరకూ 2022 మార్చి నెల అత్యంత తీవ్రతర ఉష్ణోగ్రతకు తొలి ఆనవాలుగా మిగిలిపోయింది.

అంతేగాదు, వర్ధమాన దేశాలను తమ దోపిడీకి గురి చేసేందుకు వలస సామ్రాజ్య పెట్టుబడిదారీ రాజ్యాలకు ఇండో–ఫసిఫిక్‌ ప్రాంతం ఎలా కేంద్రమవుతూ వచ్చిందో... అదే మోతాదులో నిత్యం వాతా వరణ పరిస్థితులు తారుమారు కావడానికి కూడా కేంద్రమవుతోంది. ఈ దారుణ పరిస్థితులు చివరికి ఏ దశకు చేరుకుంటున్నాయంటే– ఇటీవలనే పదమూడేళ్ల ఆరవ్‌ సేuŠ‡ అనే వాతావరణ పరిరక్షణకు నడుం బిగించిన ముక్కుపచ్చలారని ఔత్సాహికుడు ఓ పెద్ద చెట్టు బొమ్మ సాయంతో దేశ ప్రజలకొక విజ్ఞానపూర్వకమైన సందేశం ఇచ్చాడు: ‘‘అయ్యా, నా తోటి మానవులారా, నన్ను (చెట్టును) నాశనం చేయకండి. నేను మీకు నీడనూ, ఆహారాన్నీ, నీటినీ, ప్రాణవాయువునూ దానం చేస్తూంటాను’’! 
అంతేగాదు, ఈ శతాబ్దం ప్రారంభమైన తర్వాత ప్రపంచ ఆహార సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డోంగ్యూ అత్యంత శాస్త్రీయమైన పద్ధతుల్లో చెట్లూ చేమల ప్రాధాన్యతను ఉగ్గడిస్తూ విశిష్టమైన ఒక సందేశం ఇచ్చాడు: ‘‘మానవ నాగరికతకూ, వ్యవసాయానికీ, ఆహార భద్రతకూ, గ్రామీణ జీవన స్రవంతికీ... చెట్లూ చేమలు ఎంతగా అని వార్యమైన పరిసరాలో మనం గుర్తించి గౌరవించాలి!’’

పటపటలు, చిటచిటలు...
అందుకే వేసవి తాపం ఎందరో కవులకు ‘హాట్‌ టాపిక్‌’ అయింది. దీనికిగానూ మన సారస్వతంలో ఇవ్వదగిన ఎన్నో ఉదాహరణ లున్నాయి. 17వ శతాబ్దంలోనే తంజావూరు రఘునాథనాయకుడు తన వాల్మీకి చరిత్రలో వేసవి భీష్మతాపం ఎలా ఉండేదో ధ్వన్యనుకరణ ద్వారా వర్ణించాడు. ‘పటపట/ తటతట/ చిటచిట/ కటకట’ శబ్దాలను ప్రయోగిస్తూ గ్రీష్మాన్ని బొమ్మకట్టాడు.
‘పటపట పగిలెన్‌ కుంభిణి
తటతట పథికుల మనంబు చల్లడపడియెన్‌
చిటచిట ఎగసెన్‌ దవిశిఖి
కటకట గ్రీష్మంబు ఒకింత కనబడునంతన్‌’.

అంతేగాదు, దావాగ్ని మూలాన మండిపోతున్న కొండలు, బంగారు ‘మలాము’ వేసినట్లు మెరిసిపోయాయట! ఎటుచూసినా ‘అఖండ దావాగ్ని శిఖలే’ అల్లుకుపోయాయన్నాడు! ఇక చలిగొండ ధర్మన్న కవి (చిత్ర భారతం) కూడా నిప్పులు చెరిగే వేసవి తీవ్రతను ‘మిటమిట/ పెటపెట/ బొటబొట/ చిటచిట’ శబ్దాలతో వర్ణించకుండా ఉండలేకపోయాడు! అలాగే ‘వైజయంతీ విలాసం’లో సారంగు తమ్మయ్య వేసవిలో భూమి ‘వేడి మంగలం’లా సెగలు కక్కిందన్నాడు. చివరికి భూమికి దిగి రావడానికి ఇష్టం లేక మంచుకొండను కౌగిలించుకుని కూర్చున్న శివపార్వతుల్ని సహితం భూమ్మీదనున్న చెట్ల నీడను ఆశ్రయించేటట్టు చేసినవాడు ఎవరో కాదు, మన కొంటె కోణంగి శ్రీనాథుడే సుమా! ‘హరుడు కైలాస కుధర నాథాగ్ర వసతి/ విడిచి వటమూల తలముల విశ్రమించె’ అన్నాడు. ఇంకో కొంటె కోణంగి తెనాలి రామకృష్ణుడు మండు వేసవిని పోలికలేని వస్తువులతో పోల్చి వర్ణించడంలో దిట్ట. 
‘పంపా తరంగ రింఖణ
ఝంపా సంపాద్యమాన జలకణ రేఖా
సంపాత శితలానల 
సంపద వదలించె పరమశైవోత్తంసున్‌’. 

అలాగే మేఘాలు కమ్ముకు రావడాన్నీ, వర్షించడాన్నీ, వాటి క్రమాభివృద్ధినీ సూచించేలా పాలవేకరి కదిరీపతి ‘శుక్తసప్తతి’ రచనలో ప్రకృతిని ఎంతో చలనశీలంగా వర్ణించాడు. ఎంతగానో ఆశావహు లమై ఉరుములు మెరుపుల కోసం ఎదురుచూస్తున్న ఈనాటి మనల్ని ఎలా ఆకట్టుకోజూశాడో గమనించండి:

‘‘అప్పుడొక్కించుక మబ్బు గానబడి
యింతై అంతౖయె మించి
విష్ణుపదం బంతయు నాక్రమించి
జన సందోహే క్షణాంధత్వ
క్వచ్చపలంబై కడు గర్జిత ప్రబలమై
సంజాత ఝంఝా మరుద్విపులంబై
ఒక వాన వట్టె వసుధా విర్భూత పంకంబుగన్‌...
పెళ పెళారని బెడిదంపు పిడుగులురల
ఝల్లు ఝల్లున పెనుజల్లు చల్లుచుండ
బోరుబోరున వర్షంబు ధారలురిసె’’!

ఇప్పుడు ఆ ధారల కోసమే జనులు పడిగాపులు పడి ఉన్నారు. కానీ, ఎటుతిరిగీ మరో నాలుగేళ్లపాటు తీవ్ర ఉష్ణోగ్రతల మధ్యనే కాపురాలు వెలగబెట్టక తప్పదన్న తాజా హెచ్చరికలే ఆశలమీద నీళ్లు చల్లుతున్నాయి. అయినా వర్షాగమ వార్తలు ఏ మూల నుంచి వినబడినా ఆప్తవాక్యంగానే భావించుకోవాలి. 


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement