
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై సూర్యుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. ఆదివారం అనేక ప్రాంతాల్లో నిప్పులు కురిపించాడు. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్ దాటిపోయాయి. మంచి ర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, రెండోస్థానంలో జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం ఎండపల్లి రాజారాంపల్లిలో 47.7 డిగ్రీలుగా నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలను ప్రకటించగా, అందులో కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోనివే 12 ప్రాంతాలు ఉండడం గమనార్హం. ఇందులో జగిత్యాల జిల్లాలోని 10 ప్రాంతాలు ఉండగా, కరీంనగర్ జిల్లాలో రెండున్నాయి.
జంకుతున్న జనం
ఉదయం నుంచే మొదలవుతున్న వేడి గాలులు రాత్రి వరకు కొనసాగుతుండడంతో జనాలు రోడ్లపైకి రావడానికి భయపడుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. కారుల్లో ఏసీలు కూడా పనిచేయనంత వేడి నెలకొందని వాహనదారులు పేర్కొంటున్నారు. ఇళ్లల్లో కూలర్లు , ఏసీలు లేకుండా ఒక్క నిమిషం ఉండలేని పరిస్థితి నెలకొంది. ఎండలతోపాటు వేడిగాల్పులు తీవ్రం గా వీస్తుండడంతో చిన్నారులు, వృద్ధుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో మధ్యాహ్నం తగిన జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్లపైకి రాకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
సింగరేణిలో బేజారు
సాధారణంగా జిల్లాలో నమోదయ్యే ఉష్ణోగ్రతల కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా సింగరేణి ప్రాంతంలో ఉంటాయి. రామగుండం, ఎన్‌టీపీసీ, గోదావరిఖని, కమాన్‌పూర్, సెంటినరీకాలనీ ప్రాంతాల్లో వేడి తీవ్రత, వడగాల్పులు అధికం. సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంంది. అయితే ఉష్ణోగ్రతల వివరాల్లో రామగుండం, గోదావరిఖని వివరాలను లెక్కించడం లేదనే విమర్శలున్నాయి. ప్రస్తుతం గోదావరిఖని, రామగుండం ప్రాంతాల్లో 48 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటి నమోదవుతున్నాయని కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాల్సి వస్తుందని యాజమాన్యం మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్‌ఎస్ పౌడర్లతో సరిపెడుతుందని ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment