రైతులకు అపార నష్టం
నిండా ముంచిన వడగళ్ల వానలు
నేలరాలిన మామిడి పూతపిందెలు
5 లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత ఆరు రోజులుగా కురిసిన అకాల వర్షాలు, పెనుగాలులు రైతులను నిలువునా ముంచాయి. వడగండ్ల వానలు, గాలులు అన్నదాతలకు కడగండ్లు మిగిల్చాయి. జిల్లాల నుంచి అధికారికంగా అందిన ప్రాథమిక అంచనా ప్రకారమే 2.51 లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. వాస్తవంగా నష్టపోయిన పంట విస్తీర్ణం 5 లక్షల ఎకరాలకుపైగా ఉంటుందని అనధికారిక అంచనా. కోత, పొట్ట దశలో ఉన్న వరి పంట దెబ్బతినడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే సుమారు 81 వేల ఎకరాల్లో వరి పైరు దెబ్బతింది. మొత్తం పది జిల్లాల్లో వర్షాలు రైతులను ముంచేశాయి. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో దీనివల్ల అధిక నష్టం జరిగింది.
1.81 లక్షల ఎకరాల్లో పంటలు..
ప్రాథమికంగా అధికారులు పంపిన నివేదిక ప్రకారం వర్షాలతో పది జిల్లాల్లో 1.81లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
వరి, మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు, సజ్జ పంటలకు అధిక నష్టం వాటిల్లింది.
ఉద్యాన పంటల్లో మామిడి తోటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. 38 వేల ఎకరాల్లో మామి డి పూత, పిందెలు రాలిపోయాయి.
17,500 ఎకరాల్లో మిరప,7,500 ఎకరాల్లో కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. మొత్తమ్మీద 69 వేల పైగా ఎకరాల్లో కూరగాయల తోటలు ధ్వంసమయ్యాయి.
ఇదంతా ప్రాథమికంగా అందిన సమాచారమే. వాస్తవంగా దెబ్బతిన్న పంట విస్తీర్ణం దీనికి రెట్టింపు ఉంటుందని అధికారులు సైతం అనధికారికంగా అంగీకరిస్తున్నారు.
9 మంది మృతి
వడగండ్ల వానలు పెద్ద సంఖ్యలో ప్రజలను కూడా గాయపరిచాయి. వడగండ్లు మీద పడటంవల్ల 3,058 మంది గాయపడ్డారు. గత ఆరు రోజుల్లో వడగండ్ల వాన వల్ల మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. వరంగల్ జిల్లాలో ఆరుగురు, అనంతపురం జిల్లాలో ఇద్దరు, నిజామాబాద్ జిల్లాలో ఒకరు మృతిచెందారు. ఈ వర్షాలకు 1,362 పశువులు, 5,300 కోళ్లు చనిపోయాయి. 536 ఇళ్లు కూలిపోయాయి. వరంగల్ జిల్లా యార్డులో ఆరబెట్టిన 800 టన్నుల ఎండుమిర్చి తడిసిపోయింది. గాలి వానలవల్ల 561 విద్యుత్తు స్తంభాలు, 25 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 12.7 కి.మీ. పొడవునా విద్యుత్తు వైర్లు తెగిపోయాయి.
వచ్చే 36 గంటల్లో వర్షాలు
గురువారం నుంచి వచ్చే 36 గంటల్లో తెలంగాణ, రాయలసీమ, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా వడగండ్లతో కూడిన వానలు గానీ సాధారణ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.