కడగండ్ల వాన.. వడగళ్ల వానలు
* ఈదురు గాలులతో భారీగా పంటనష్టం
* దెబ్బతిన్న వరి, మొక్కజొన్న..
* తడిసిపోయిన మిర్చి వేల ఎకరాల్లో నష్టం..
* రాలిపోయిన మామిడిపూత
* పలుచోట్ల ధ్వంసమైన ఇళ్లు, గుడిసెలు
సాక్షి, నెట్‌వర్క్: కాలం కాని కాలంలో ఒక్కసారిగా కురిసిన వడగళ్ల వానలు అన్నదాతను కన్నీటిలో ముంచేశాయి. వేల ఎకరాల్లో పంటలను దెబ్బతీసి, కోట్లాది రూపాయల నష్టాన్ని మిగిల్చాయి. వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు నేలవాలాయి. వడగళ్లు, ఈదురుగాలులకు మామిడిపూత రాలిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. గాలుల బీభత్సానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.
దెబ్బతిన్న వరి, మొక్కజొన్న: వరంగల్ జిల్లాలో వడగళ్ల వానలకు స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గడ్, మద్దూరు, చేర్యాల, నర్మెట, బచ్చన్నపేట, నెక్కొండ, హన్మకొండ, గీసుకొండ, పర్వతగిరి, దుగ్గండి, చెన్నారావుపేట, గూడూరు, సంగెం, కేసముద్రం, ఆత్మకూరు మండలాల్లో పంటలు దెబ్బతిన్నారుు. 14వేల హెక్టార్లలో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. 15 గ్రామాల్లో మిర్చి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి పూత రాలిపోయింది. మొక్కజొన్న, వరి నేలకొరిగాయి. పలుచోట్ల పూరి గుడిసెలు కూలిపోగా.. వడగళ్లతో పలువురు గాయపడ్డారు.
తడిసిన మిర్చి: ఖమ్మం జిల్లాలో వడగళ్ల వానలు మిర్చి రైతులకు కన్నీళ్లు పెట్టించాయి. మొక్కజొన్న, మామిడి పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లింది. పాల్వంచ మండలంలో మామిడిపూత రాలిపోయింది. పలు ఇళ్లు, గుడిసెలు నేలమట్టమయ్యాయి. వాజేడులో కల్లాల్లో ఉన్న మిర్చి తడిసి రూ. 40లక్షల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా. పినపాక, బూర్గంపాడు మండలాల్లో వెయ్యి ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతిన్నది. వెంకటాపురం మండలంలో 1,400 ఎకరాల్లో మిర్చి, 1,000 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఇల్లెందులో 500 ఎకరాల్లో మొక్కజొన్న నేలవాలింది.
5,520 హెక్టార్లలో నష్టం: కరీంనగర్ జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వడగళ్ల వానలు, ఈదురుగాలులకు 5,520 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. 1,177 హెక్టార్లలో మామిడి తోటలు, 2,550 హెక్టార్లలో మొక్కజొన్న, 600 హెక్టార్లలో వరి, 240 హెక్టార్లలో ఆవాలు, 1,600 హెక్టార్లలో నువ్వులు, 500 హెక్టార్లలో సజ్జలు దెబ్బతిన్నట్లు తెలిపారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో నష్టం మరింత పెరిగే అవకాశాలున్నాయి.
నేలవాలిన పంటలు: ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు కురిసిన వర్షం రైతులకు తీరని నష్టం తెచ్చిపెట్టింది. జొన్న, మొక్కజొన్న, వరి, నువ్వులు, శనగ, వేరుశనగ పంటలు బాగా దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఆరబెట్టిన పసుపు నానిపోయింది. టమాటా పంట కూడా బాగా దెబ్బతిన్నంది.
అంతా అతలాకుతలం: నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం కారణంగా వరి, మొక్కజొన్న తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈదురు గాలులకు ఎర్రజొన్న, నువ్వు పంటలు నేలకొరుగుతున్నాయి. వర్ని మండలం తిమ్మాపూర్‌లో పిడుగుపాటుకు ఒకరు మరణించారు. బాల్కొండ మండలంలో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. ఆరబెట్టిన పసుపు, ఎర్ర జొన్నలు తడిసి ముద్దయ్యాయి. మాక్లూర్ మండలంలో సుమారు 600 ఎకరాల్లో టమాటా, 400 ఎకరాల్లో మిర్చి, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బోధన్ మండలంలో వరి, మొక్కజొన్న నేలమట్టమయ్యాయి. డిచ్‌పల్లిమండలంలో ఉల్లి పంటకు నష్టం జరిగింది. జిల్లాలో 12,910 ఎకరాలలో వివిధ పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా అంచనా వేశారు.
నేలరాలిన బత్తాయి, మామిడిపూత: నల్లగొండ జిల్లాలో బత్తాయి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. వరి నేలకొరిగింది. భువనగిరి, తుర్కపల్లిలో, ఆలేరు, రామన్నపేట మండలాల్లో వడగళ్ల వానకు పలు పంటలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల చెట్లు నేలకూలాయి.
దెబ్బతిన్న ద్రాక్ష, ఉల్లి: రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట, పరిగి, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో వడగళ్ల వానలు పంటలను దెబ్బతీశాయి. శామీర్‌పేటలో దాదాపు ఆరు వందల ఎకరాల్లో ద్రాక్షతోట దెబ్బతిన్నట్లు అధికారుల ప్రాథమిక అంచనా. మోమిన్‌పేటలో దాదాపు 800 ఎకరాల్లో ఉల్లి పంట నీటమునిగింది.
224 ఇళ్లు ధ్వంసం: మెదక్ జిల్లాలో వడగళ్ల వానల ధాటికి గత రెండు రోజుల్లోనే 224 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 16 మండలాల పరిధిలో 937.5 హెక్టార్ల పంటలు దెబ్బతిన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, వరి, శనగ పంటలకు నష్టం వాటిల్లింది. 996 హెక్టార్లలో కూరగాయలు, మామిడి, అరటి తోటలకు నష్టం వాటిల్లినట్లు ఉద్యానశాఖ నిర్ధరించింది.
రాజధానిని ముంచెత్తిన వాన: హైదరాబాద్ నగరాన్నీ అకాల వర్షాలు వీడడం లేదు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షంతో పాటు వడగళ్లు కురియడంతో పలు చోట్ల రహదారుల పక్కన నిలిపిన వాహనాల అద్దాలు పగిలాయి. కొన్ని చోట్ల రహదారులపై వరద నీరు పోటెత్తడంతో కాలువలను తలపించాయి. గ్రేటర్ పరిధిలో ప్రధాన రహదారులపై సుమారు 477 చోట్ల భారీగా వర్షపు నీరు నిలవడంతో ట్రాఫిక్ స్తంభించింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
అల్పపీడనాలకు.. తేమ తోడైంది!
అసాధారణ వర్షాలకు కారణమిదే
వేసవి మంటెక్కించే ముందు అక్కడక్కడా ఒకటీ అరా జల్లులు పడటం మనం చూసే ఉంటాం. కానీ ఈ ఏడాది మార్చి మొదటివారంలో కూడా వడగళ్ల వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలు పంటలన్నీ నాశనం చేస్తున్నాయి. పడమటి గాలుల్లో వచ్చిన మార్పులు.. దేశ మధ్యప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనాలు వీటికి బంగాళాఖాతంతోపాటు అరేబియా సముద్రం నుంచి కూడా తేమ అందుతూండటం దీనికి కారణమని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గత నెలలో అత్యంత అసాధారణ రీతిలో పశ్చిమ గాలుల్లో తేడాలు చోటు చేసుకున్నాయని, తెలంగాణలోని కొన్ని భాగాలతోపాటు విదర్భ, దక్షిణ మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వరుసగా భూతల అల్పపీడనాలు ఏర్పడ్డాయని వాతావరణ సమాచార సేకరణ సంస్థ ‘స్కైమెట్’ శాస్త్రవేత్త పి.మహేశ్ తెలిపారు. మూడు, నాలుగు రోజుల వ్యవధిలోనే వరుసగా అల్పపీడనాలు ఏర్పడటం.. పీడనాన్ని భర్తీ చేసేందుకు దేశానికి ఇరువైపులా ఉన్న సముద్రాల నుంచి తేమతో కూడిన గాలులు దూసుకురావడంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని ఆయన చెప్పారు. మహారాష్ట్రను ఆవరించిన అల్పపీడనం ప్రభావంతో మరో మూడు నాలుగు రోజులపాటు చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.