Maize
-
మరింత లాభసాటిగా వ్యవసాయం
వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడానికి ఇంధన ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. రాష్ట్రంలో అత్యధిక శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తుండటంతో రైతులకు మరింత ఆదాయం సమకూర్చడానికి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఓవైపు వ్యవసాయ ఉత్పత్తుల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. మరోవైపు ఇంధన తయారీపై దృష్టి పెట్టింది. ఇందుకోసం రాష్ట్రంలో బయో ఇథనాల్ తయారీకి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తోంది. బయో ఇథనాల్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రిలో అస్సాగో యూనిట్‌కు స్వయంగా శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా క్రిభ్కో, డాల్వకోట్ యూనిట్లకు వర్చువల్‌గా శంకుస్థాపనలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే అస్సాగో, క్రిభ్కో, అవేశా ఫుడ్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఈఐడీ ప్యారీ, డాల్వకోట్, ఎకో స్టీల్, చోడవరం షుగర్స్, రోచే గ్రీన్ ఆగ్రో, నితిన్‌సాయి, గ్రేస్ వెంచర్స్ వంటి 20కిపైగా సంస్థలు రాష్ట్రంలో రూ.3,000 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. మరికొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. ఈ యూనిట్ల అన్నింటి ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిపి చూస్తే రోజుకు 5,000 కిలో లీటర్లకు పైగా బయో ఇథనాల్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది దేశంలోనే అత్యధికమని చెబుతున్నాయి. –సాక్షి, అమరావతి పెట్టుబడుల ఆకర్షణ.. రాష్ట్రంలో రైతులు ధాన్యం, మొక్కజొన్నలను అత్యధికంగా సాగు చేస్తుండటమే కాకుండా భారీగా ఎగుమతులు చేస్తున్నారు. దీంతో ఇథనాల్ తయారీలో పెట్టుబడులు పెట్టడానికి సంస్థలు ముందుకు వస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 13 మిలియన్ టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి అయ్యింది. అలాగే మూడు మిలియన్ టన్నులకు పైగా మొక్కజొన్న ఉత్పత్తి అయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో రాష్ట్రం నుంచి 6 మిలియన్ టన్నుల బియ్యం (నాన్ బాస్మతి), ఒక మిలియన్ టన్ను మొక్కజొన్నను ఎగుమతి చేశారు. మిగులు ఆహార ఉత్పత్తుల నుంచి ఇథనాల్‌ను తయారు చేయడానికి కేంద్రం అనుమతించడంతో పెట్టుబడిదారుల చూపు మనరాష్ట్రంపై పడింది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తోంది. విత్తనం నుంచి విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అండగా నిలుస్తోంది. దీంతో వ్యవసాయం నుంచి ఇంధన తయారీకి హబ్‌గా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతోంది. ఏడాదికి 3.1 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం.. ప్రస్తుతం దేశంలో ఆహార ధాన్యాల నుంచి 760 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతోంది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి 2025–26 నాటికి అదనంగా 1,016 కోట్ల లీటర్లు అవసరమవుతుందని అంచనా. ఇథనాల్ కలపడాన్ని ప్రస్తుతం ఉన్న 10 శాతం నుంచి 20 శాతానికి పెంచడం వల్ల ఏటా ఇంధన దిగుమతి వ్యయంలో రూ.51,600 కోట్ల మేర విదేశీమారక ద్రవ్యం ఆదా అవుతుందని నీతిఆయోగ్ అంచనా. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం ఏటా 16 కోట్ల లీటర్ల పెట్రోల్‌ను విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో 20 శాతం లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏడాదికి 3.1 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరమవుతుందని అంచనా. క్లీన్ ఎనర్జీకి పెద్దపీట.. పర్యావరణహిత క్లీన్ ఎనర్జీ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, బయో ఇథనాల్ తయారీని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో రోజుకు 5,000 కిలోలీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో 20కుపైగా ఇథనాల్ యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. – ప్రవీణ్ కుమార్, రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్, ఏపీఐఐసీ వీసీ–ఎండీ, ఏపీఈడీబీ సీఈవో -
దున్నకుండానే మొక్కజొన్న, వేరుశనగ! తక్కువ శ్రమ.. ఖర్చు ఆదా
దుక్కి దున్నకుండానే మొక్కజొన్న సాగు(జీరో టిల్లేజి) పద్ధతి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇటీవల చాలా ప్రాచుర్యం పొందింది. దీనికి ఏకైక కారణం డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ అందుబాటులోకి తెచ్చిన ‘డబుల్ వీల్ మార్క్ర్’ (రెండు చక్రాలతో రంధ్రాలు వేసే పరికరం). సార్వా(ఖరీఫ్)లో వరి సాగు చేసిన భూముల్లో దుక్కి దున్నకుండా ఈ పరికరంతో రైతులు సులభంగా నేలపై రంధ్రాలు చేసి విత్తనాలు వేసుకుంటున్నారు. వరి కోసిన తర్వాత తక్కువ సమయంలోనే మొక్కజొన్న విత్తుకోవడానికి ఈ పరికరం రైతులకు ఎంతో ఉపయోగ పడుతోంది. నాలుగేళ్ల క్రితం ఈ పరికరం తొలుత అందుబాటులోకి వచ్చింది. సార్వా వరి తర్వాత మొక్కజొన్న పంటను వరుసగా మూడు దఫాలు సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్న రైతులు ఉత్తరాంధ్రలో ఉన్నారు. వరుసల మధ్య దూరం తగ్గించుకునే చిన్న మార్పు చేసుకొని దుక్కిలేని పద్ధతిలో వేరుశెనగ విత్తుకోవడానికి కూడా ఈ పరికరం ఉపయోగపడుతోందని రైతులు సంతోషిస్తున్నారు. మొక్కజొన్నతో పాటు వేరుశనగ మొక్కల మధ్య 20 సెం.మీ. దూరం, వరుసల మధ్య 60 సెం.మీ.ల దూరంలో డబుల్ వీల్ మార్కర్‌తో రంధ్రాలు చేసి దుక్కి చేయకుండానే మొక్కజొన్న విత్తుకోవచ్చు. అదేవిధంగా వేరుశనగ విత్తుకోవడానికి మార్కర్‌లో స్వల్ప మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. మొక్కల మధ్య 20 సెం.మీ. దూరం, వరుసల మధ్య 40 సెం.మీ.ల దూరంలో వేరుశనగ విత్తుకోవాలి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో గత రబీలో వరి కోసిన 48,146 ఎకరాల్లో దున్నకుండా డబుల్ వీల్ మార్కర్‌తో మొక్కజొన్నను సాగు చేశారు. 18 మండలాల్లో సుమారు 25 లక్షల వ్యంతో మండలానికి 40 చొప్పున 720 పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ తెలిపింది. ఈ పరికరాలన్నీ ఎల్. సత్యనారాయణ తయారు చేసి ఇచ్చినవే. సమాన దూరంలో విత్తనాలు నాటడం వలన గాలి, వెలుతురు ధారాళంగా సోకి, పంటలకు పురుగులు, తెగుళ్ల బెడద తక్కువగా ఉంది. చేను ఏపుగా పెరిగి సాధారణ పద్ధతిలో కంటే జీరోటిల్లేజ్ పద్ధతిలో మేలైన దిగుబడులు నమోదు అవుతుండటం విశేషం. మహిళలు ఉపయోగించడానికి డబుల్ వీల్ మార్క్ర్ అనువుగా ఉండటం మరో విశేషం. మహిళా రైతులకు, ముఖ్యంగా చిన్న, సన్నకారు ఒంటరి మహిళా రైతులకు ఈ ఆవిష్కరణ ఎంతో ఉపయోగకరంగా ఉంది. నెల కాలం కలిసి వస్తుంది! తొలకరి వరి చేను కోసిన తరువాత పొలంలో వరి కొయ్యకాళ్లలో దుక్కి దున్నకుండానే పదును చూసుకుని డబుల్ వీల్ మార్కర్‌ను నడిపి మొక్కజొన్న విత్తనాలు నేరుగా విత్తుకోవాలి. ఈ విధానంలో రైతులకు దుక్కి ఖర్చులు ఆదా అవ్వటమే కాకుండా నెల రోజుల పంట కాలం కలిసి వస్తుంది. మొక్కజొన్న సాగు ప్రారంభమైన తొలినాళ్లలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో రైతులకు కొయ్యతో గాని, కొయ్యతో చేసిన పెగ్ మార్కర్ అనే పరికరంతో గాని వరి మాగాణిల్లో నేరుగా రంధ్రాలు చేసి మొక్క జొన్న విత్తనాలు విత్తేవారు. పెగ్ మార్కర్ పరికరాన్ని ఉపయోగించేటప్పుడు ఎక్కువ శ్రమ, ఎక్కువ సమయం వృథా అవుతుండేది. మగ కూలీలు మాత్రమే పెగ్ మార్కర్‌ను ఉపయోగించేవారు. 2016 నుంచి ప్రయోగాలు కూలీల ఖర్చు, శ్రమ తగ్గించుకుంటూ మొక్కజొన్న, వేరుశెనగ పంటలను దుక్కి దున్నకుండా నేరుగా ఎలా విత్తుకోవాలనే అంశంపై డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ప్రతినిధి హరిబాబు (84999 28483) 2016 నుంచి అనేక ప్రయోగాలు చేసి ఎట్టకేలకు సఫలీకృతులయ్యారు. తొలుత ఒక చక్రం ఉన్న మార్కర్‌ను, తర్వాత ఐదు చక్రాల మార్క్ర్లను డిజైన్ చేసి రైతులకు అందించారు. వీటితో సరైన ఫలితాలు రాకపోవడంతో డబుల్ వీల్ మార్క్ర్ను డిజైన్ చేశారు. ఇది రైతులకు ఉపయోగకరంగా ఉండటంతో మంచి స్పందన వచ్చింది. ఆముదాలవలసలోని ఏరువాక కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సూచనల మేరకు ఉక్కుతో రెండు చక్రాల మార్కర్ (డబుల్ వీల్ మార్కర్) పరికరం దిద్దుకుంది. తుది రూపుదిద్దిన సత్యనారాయణ డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ రూపొందించిన డబుల్ వీల్ మార్కెర్కు రైతు లంకలపల్లి సత్యనారాయణ (83741 02313) మార్పులు చేసి బరువు తగ్గించి 2019లో తుది రూపుదిద్దారు. సత్యనారాయణ వ్యవసాయం చేస్తూనే వెల్డర్‌గా పనిచేస్తున్నారు. ఆ అనుభవంతో సులభంగా ఒక వ్యక్తి తన పొలానికి భుజాన వేసుకొని తీసుకుని వెళ్లేందుకు వీలుగా డబుల్ వీల్ మార్కర్ పరికరాన్ని మార్చారు. మొదట తన పొలంలో ఉపయోగించి సంతృప్తి చెందిన తర్వాత, తానే తయారు చేసి రూ. 2,900కు ఇతర రైతులకు అందిస్తున్నారు. 2021 రబీ నాటికి రణస్థలం మండలంలో రైతులకు 85 డబుల్ వీల్ మార్కర్లను ఇచ్చారు. ఆ తర్వాత రైతుల్లో ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. – గంగి నాగరాజు, సాక్షి, రణస్థలం, శ్రీకాకుళం జిల్లా -
ప్రభుత్వ జోక్యంతో పెరిగిన మొక్కజొన్న ధర
సాక్షి, అమరావతి: మార్కెట్లో పంటల ధరలు పతనమైన ప్రతిసారీ రైతన్నను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తోంది. వ్యాపారులతో పోటీ పడి పంటలను కొంటూ ధరల పెరుగుదలకు కృషి చేస్తోంది. తాజాగా మొక్కజొన్న విషయంలోనూ ప్రభుత్వ చొరవ ఫలించింది. కనీస మద్దతు ధరకంటే తక్కువ పలికిన మొక్కజొన్న ధర ప్రభుత్వ జోక్యంతో తిరిగి రూ.2 వేలకు పైగా పలుకుతుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.. గత మూడేళ్లుగా మంచి ధరలు పలికిన మొక్కజొన్న కొద్ది రోజుల క్రితం కనీస మద్దరు ధరకంటే తక్కువ ధర పలకడంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వెంటనే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద పంట కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. 20 రోజులు కూడా తిరక్కుండానే ధరలు పెరిగాయి. మొక్కజొన్న మద్దతు ధర క్వింటాలుకు రూ.1,962 కాగా, రెండు నెలల క్రితం వరకు రూ.2 వేలకు పైగా పలికింది. కొద్ది రోజుల క్రితం అనూహ్యంగా ధర తగ్గుతున్నట్లు ధరలను రోజూ సమీక్షించే సీఎం యాప్ ద్వారా గుర్తించారు. అకాల వర్షాలు, ఇతర కారణాలను బూచిగా చూపించి మొక్కజొన్నను కనీస మద్దతు ధరకంటే తక్కువకు కొంటున్నట్లు గుర్తించారు. దీంతో సీఏం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఏపీ మార్క్‌ఫెడ్ రంగంలోకి దిగింది. 66 వేల టన్నుల మొక్కజొన్నను నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా కనీస మద్దతు ధరకు కొనుగోలు ప్రారంభించింది. పంట అధికంగా సాగయ్యే గుంటూరు, ఎన్టీఆర్, అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, బాపట్ల, పల్నాడు, శ్రీ సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో 1,548 ఆర్బీకేల పరిధిలో ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 24,871 మంది రైతులు నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు 4,500 మంది రైతుల నుంచి రూ.65.14 కోట్ల విలువైన 33,199 టన్నుల మొక్కజొన్నను కనీస మద్దతు ధరకు కొన్నారు. వారం రోజుల్లోనే చెల్లింపులు కూడా చేస్తున్నారు. ఇప్పటికే రూ.20.59 కోట్లు చెల్లించారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలవడంతో వ్యాపారులు సైతం ధర పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ప్రస్తుతం రూ.2 వేల వరకు చెల్లించి కళ్లాల వద్దే కొంటున్నారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా మార్కెట్లో ధరలు నిలకడగా కొనసాగేంత వరకు ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను కొనసాగిస్తామని ఏపీ మార్క్‌ఫెడ్ ప్రకటించింది. ధర మరింత పెరిగే అవకాశం ప్రభుత్వ జోక్యంతో మొక్కజొన్న ధర పెరుగుతోంది. వారం క్రితం వరకు క్వింటా రూ. 1,750 కంటే తక్కువగా ఉండగా, ప్రస్తుతం రూ 2 వేల వరకు చెల్లించి మరీ కొంటున్నారు. ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దు. కనీస మద్దతు ధర దక్కని ఏ రైతు అయినా వారి పంటను ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా అమ్ముకోవచ్చు. – రాహుల్ పాండే, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్ నష్టం రాకుండా.. కష్టం లేకుండా.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పలివెలకి చెందిన ఈ రైతు పేరు టి.శ్రీనివాస్. తన సోదరుడితో కలిసి 20 ఎకరాల్లో వరి పంట వేశారు. పదెకరాల్లో సాధారణ రకం.. మరో పదెకరాల్లో బొండాలు రకాలు ఊడ్చారు. సాధారణ ర కం ధాన్యం 200 క్వింటాళ్ల వరకు దిగుబడి వ చ్చింది. రూ.4.08 లక్షల విలువైన ఆ ధాన్యాన్ని ఈ నెల 22న ఆర్బీకేలో విక్రయించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేపట్టిన తర్వాత రైతులకు ఎంతో మేలు జరుగుతోందన్నాడు. ‘ఒకప్పుడు దళారి చెప్పిందే రేటు.. అతను కొనేదే ధాన్యం అన్నట్టు ఉండేది. ఏనాడూ పూర్తిగా మద్దతు ధ ర చూసేవాళ్లం కాదు. ఇప్పుడు పొలం దగ్గరకే వచ్చి ధాన్యం కొనే పరిస్థితిని ప్రభుత్వం కల్పించడంతో రైతుల కష్టం చాలా వరకు తగ్గిపోయింది’అని చెప్పాడు. బొండాలు ధాన్యాన్ని ఆరబెట్టాల్సి ఉందని, ఆ ధాన్యాన్ని కూడా ప్రభుత్వం మద్దతు ధర కు కొ నుగోలు చేస్తామని చెప్పడంతో మార్కెట్లో వ్యా పారులు ధర పెంచి కొంటున్నారని చెప్పాడు. గింజ కూడా వదలడం లేదు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రుకి చెందిన ఈ రైతు పేరు చింతలపాటి బలరామరాజు. ఆయనకు 8 ఎకరాలు సొంత పొలం ఉంది. మరో 15 ఎకరాలను కౌలుకు తీసుకుని మొత్తం 23 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. మొత్తం 2,280 బస్తాల (ఒక్కొక్క బస్తా 40 కేజీలు) ధాన్యాన్ని ఆర్బీకేలో విక్రయించగా.. వారం రోజుల్లోనే రూ. 18,60,480 నగదు ఆయన ఖాతాలో జమయ్యింది. ‘మా గ్రామంలో ఒక్క గింజ కూడా వదలకుండా ధాన్యం కొంటున్నారు. అందుకు నేనే ఉదాహరణ. ఒకప్పుడు ధాన్యం అమ్మితే డబ్బులు కోసం ఆరేసి నెలలు ఎదురు చూడాల్సి వచ్చేది. వర్షాల సమయంలో అయితే ఆర్బీకే సిబ్బంది నుంచి వీఆర్వో, జిల్లాస్థాయి అధికారుల వరకూ గ్రామాల్లోనే ఉండి ధాన్యం కొన్నారు. రోజుకు 25 వాహనాల్లో ఊరిలో మొత్తం ధాన్యాన్ని తరలించేశారు. ఖరీఫ్‌తో పోలిస్తే రబీలో నాకు మంచి దిగుబడి వచ్చింది’ అని బలరామరాజు వివరించారు. -
Bathukamma: మక్క సత్తు ముద్దలు తిన్నారా? ఇలా చేసుకోండి! ఆరోగ్య ప్రయోజనాలివే!
బతుకమ్మ వేడుకల్లో భాగంగా ‘అమ్మ’కు వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ఇక బతుకమ్మ అంటేనే సత్తుపిండి ఘుమఘుమలు ఉండాల్సిందే! ఎక్కువగా పెసరపప్పు, నువ్వులు, పల్లీలతో సత్తుపిండిని తయారు చేసుకుంటారు. వీటితో పాటు మొక్కజొన్న గింజలతో చేసే సత్తు(మక్క సత్తు అని కూడా అంటారు)తో చేసిన ముద్దలు(లడ్డూలు) కూడా ఎంతో రుచికరంగా ఉంటాయి. మొక్కజొన్న గింజలు, బెల్లం లేదంటే చక్కెర.. నెయ్యి ఉంటే చాలు మక్క సత్తు ముద్దలు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకోండి ►ముందుగా మొక్కజొన్న గింజలు వేయించి.. చల్లారాక పొడి చేసుకోవాలి. ►అదే విధంగా బెల్లం తరుము లేదంటే పంచదారను పొడి చేసి పెట్టుకోవాలి. ►ఈ రెండింటి మిశ్రమంలో నెయ్యి వేసి ఉండలుగా చుట్టుకుంటే మక్క సత్తు ముద్దలు రెడీ. మొక్కజొన్నతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! ►మొక్కజొన్న వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ►దీనిలో విటమిన్- ఏ, విటమిన్- బీ, సీ ఎక్కువ. ►మొక్కజొన్నలోని బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ►ఇందులో విటమిన్ బీ12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలం. ఇవి ఎర్రరక్త కణాల ఉత్పత్తికి తోడ్పడి.. రక్తహీనతను నివారించేందుకు దోహదపడతాయి. ఫోలిక్ యాసిడ్ గర్భవతులకు మేలు చేస్తుంది. చదవండి: Malida Muddalu: మలీద ముద్దల తయారీ విధానం! వీటిని తింటే ఇన్ని ఆరోగ్య లాభాలా?! -
Health Tips: మొక్కజొన్న తింటే ఇన్ని ఉపయోగాలా? ఆరోగ్యంతో పాటు..
మెుక్కజొన్న అతి చౌకగా లభించే ఆహారం. దీని గింజలను కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు. ముసురు పట్టినప్పుడు మొక్కజొన్న కండె కాల్చుకుని తింటూ ఉంటే ఆ మజానే వేరు. మెుక్కజొన్న గింజల నుంచి పాప్‌కార్న్, కార్న్ ఫ్లేక్స్ తయారుచేస్తారు. మెుక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు. ఇది చాలా బలవర్థకమైన ఆహారం. మొక్కజొన్న కేవలం ఆస్వాదించడానికే కాదు.. దీనిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం.. అవేమిటో చూద్దామా..? మంచి చిరుతిండి ►మొక్కజొన్న గింజలు తినటం ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తుంది. కంకులుగా వున్నప్పుడే వాటిని తినేయవచ్చు లేదా మసాలాలు, కారాలు కూడా తగిలించి తినచ్చు. గ్రేవీలో వేసి ఫ్రైడ్‌రైస్‌తో కలిపి తినవచ్చు లేదా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వంటి వాటితో కూడా చేర్చితే సాయంకాలం వేళ మంచి చిరుతిండి. ►మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి1, బి6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. ►మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఉందని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ చెబుతోంది. ఎముకలకు బలం ►పీచు పుష్కలంగా ఉంది. ఇది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. ఆహారంలో పీచు ఉండడంతో మొక్కజొన్న మలబద్ధకం, మెులలు వంటివి రాకుండా కాపాడుతుంది. పేగుకేన్సర్‌ను అరికడుతుంది. ►ఎముకల బలానికి పోషకాలైన కాపర్, ఐరన్, అవసరమైన లవణాలు, మినరల్స్ మెుక్కజొన్నలో పుష్కలంగా ఉన్నాయి. ►పసుపు రంగులో ఉండే ఈ చిన్న గింజలలో మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్ వంటివి కూడా ఉండడంతో ఎముకలు గట్టిపడేలా చేస్తుంది. ►కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. చర్మం ఆరోగ్యంగా.. అందంగా. ►మెుక్కజొన్నలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతిమంతంగా ఉంచడమేకాదు... శరీరంపై ముడతలు రాకుండా చేస్తాయి. ►మెుక్కజొన్న గింజల నుంచి తీసిన నూనె చర్మ సంబంధ వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే లినోలిక్ యాసిడ్ చర్మం మీద వచ్చే మంటలను, దద్దుర్లను తగ్గిస్తుంది. ఎర్ర రక్తకణాల వృద్ధి ►రక్తహీనత ఉన్నవారికి మొక్కజొన్న అద్భుతమైన వరం. ►మెుక్కజొన్నలో ఉండే ఫోలిక్ యాసిడ్ రక్తహీనతను తగ్గించి ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తుంది. గుండె ఆరోగ్యం పదిలం ►మొక్కజొన్న రక్తకణాల్లో కొవ్వుస్థాయులను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ►రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించి రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది తద్వారా గుండెపోటు, పక్షవాతం, బీపీ మొదలైన సమస్యలను అదుపులో ఉంచుతుంది. జుట్టుకు బలం ►రోజూ మొక్కజొన్న తినేవారికి జుట్టు బలంగా ఉంటుంది. మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి జుట్టును పట్టులా మృదువుగా... మెరుపులీనేలా చేస్తుంది. ►మొక్కజొన్న తక్షణశక్తిని ఇచ్చే ఆహారం. దీనిని తినడం వల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇందులో ఖనిజాలు, పోషకాల శాతం కూడా ఎక్కువగానే ఉన్నాయి. సరైన ఆహారం ►మొక్కజొన్న తరచు తినడం వల్ల హైపర్ టెన్షన్ కూడా దూరం అవుతుంది. బీపీ, షుగర్, గుండె జబ్బులు అన్నిటికీ సరైన ఆహారం మొక్కజొన్న. ►అందుకే వర్షాకాలంలోనూ, చలికాలంలోనూ సరదాకి తినడానికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి మేలు చేసే మొక్కజొన్నను ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండచ్చు. చదవండి: Health Tips: ఈ పండ్ల గింజల్లో సైనైడ్‌ను విడుదల చేసే కారకాలు! తిన్నారంటే అంతే సంగతులు! జాగ్రత్త! Tips To Increase Platelet Count: ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయిందా? బొప్పాయితో పాటు గుమ్మడి, గోధుమ గడ్డి.. ఇంకా ఇవి తింటే.. -
రైతుకు సిరులు... ఒంటికి సత్తువ!
ప్రపంచీకరణలో గ్రామీణ ఉపాధులు పోయాయి. ఐతే అతివృష్టి, లేకుంటే అనావృష్టి. వర్షపు నీరు సముద్రం పాలవుతోంది. భూగర్భ జల వనరులు పాతాళానికి దిగాయి. పంటలకు నీరుండదు. ఈ నేపథ్యంలో తక్కువ నీటితో పండే చిరుధాన్యాల పంటలే రైతుకు మేలు. జొన్న, రాగి, కొర్ర, సజ్జ (సొద్ద), సామ, అరికె, వరిగె, ఊద, ఓట్లు, బార్లీ వంటివి చిరుధాన్యాలుగా వ్యవహరిస్తారు. 1960ల్లో, మన దేశంలో ఒక మనిషి ఏడాదికి సగటున 32.9 కిలోల చిరుధాన్యాలను తినేవాడు. 2010 నాటికి వీటి వాడకం 4.2 కిలోలకు.... అంటే 87%కి పడి పోయింది. ‘పెరిగిన ఆదాయాలు, పట్టణీకరణ వలన గోదుమ ఉపయోగం పెరిగింది. దీన్ని శ్రేష్ఠమైన తిండి అనుకుంటున్నారు. చిరుధాన్యాల వాడకం తగ్గింది. వీటిని నాసిరకం తిండిగా భావిస్తున్నారు’ అని 2014లో ‘అనువర్తిత ఆర్థిక పరిశోధన జాతీయ మండలి’ తెలిపింది. 1960వ దశకం మధ్యలో ఒక పట్టణవాసి సగటున సంవ త్సరానికి 27 కిలోల గోదుమలు తినేవాడు. ఇది 2010లో రెట్టింపయింది. కొన్ని దశాబ్దాల నుండి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా గోదుమ, బియ్యానికి రాయితీ లిస్తున్నది. అందువలన ప్రజల్లో ప్రత్యేకించి పట్టణ జనాభాలో వీటి ఉపయోగం పెరిగింది. చిరుధాన్యాల వాడకం తగ్గింది. ‘2013–ఆహార భద్రతా చట్టం’ చేయక ముందు గోదుమలు, బియ్యాన్ని మాత్రమే ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో చేర్చింది. ఫలితంగా ముతక ధాన్యాల వినియోగం పడిపోయిందని ప్రభుత్వేతర సంస్థ ‘ధన్’ నాయకుడు మునియప్పన్ కార్తికేయన్ అన్నారు. 1956 నుండి చిరుధాన్యాల పంట విస్తీర్ణం తగ్గింది. సజ్జ 23%, రాగి 49%, జొన్న 64%, ఇతర ధాన్యాల సాగునేల 85% తగ్గింది. ఈ విస్తీర్ణం ఇంకా తగ్గితే దేశం చిరుధాన్య పంటలను కోల్పోతుంది. చిరుధాన్యాలు తక్కువ నీటితో అధిక ఉష్ణోగ్రతలు గల గరుగు, పొడి నేలల్లో, కరువు ప్రదేశాల్లో పండుతాయి. వీటి ఉత్పత్తి ఖర్చు తక్కువ. దిగుబడి ఎక్కువ. విత్తనాల పేటెంటు, బహుళ జాతి సంస్థల గొడవలు లేవు. ముందు ఏడాది గింజలను మరుసటి సంవత్సరం విత్తనాలుగా వాడవచ్చు. మెరుగుపర్చబడిన చిరుధాన్యాల విత్తనాలు రోగనిరోధక శక్తిని పెంచుకొని ఉత్పత్తిని బాగా పెంచాయి. 2013లో ప్రపంచంలో చిరుధాన్యాల ఉత్పత్తిలో 1,09,10,000 టన్నులతో భారత్ మొదటి స్థానంలో ఉంది. వరికి కావలసిన నీటిలో 28% నీరే వీటికి సరిపోతుంది. ప్రస్తుత కరువుకే కాక పెరగబోయే భవిష్యత్తు కరువులకు కూడా ఇవి పరిష్కారమవుతాయి. ఈ పంటలతో మనకు తిండి గింజలు, పశువులకు మేత లభిస్తాయి. వీటిలో ఆమ్ల శాతం తక్కువ. పీచు శాతం, పోషక విలువలు ఎక్కువ. ఊదల్లో గోదుమల కంటే 531%, బియ్యం కంటే 1,033% ఇనుము ఎక్కువ. సజ్జల్లో గోదుమల కంటే 314%, బియ్యం కంటే 611% ఇనుము ఎక్కువ. సామలలో గోదుమల కంటే 265%, బియ్యం కంటే 516% ఇనుము ఎక్కువ. సామలలో గోదుమల కంటే 839%, బియ్యం కంటే 3,440% సున్నం ఎక్కువ. బియ్యంలో కంటే సజ్జలు, గోదుమల్లో 4 రెట్ల సున్నం ఎక్కువ. ఊదల్లో గోదుమల కంటే 313%, బియ్యం కంటే 783% ఖనిజ లవణాలు ఎక్కువ. కొర్రల్లో గోదుమల కంటే 220%, బియ్యం కంటే 550% ఖనిజ లవణాలు ఎక్కువ. గోదుమలు, బియ్యం కంటే చిరుధాన్యాలలో పోషక పదార్థాలు, నత్రజని అధికం. కేవలం బియ్యం తిన్న ఆడపిల్లల కంటే 60% జొన్నలు, 40% బియ్యం తిన్న ఆడపిల్లల ఎదుగుదల రేటు ఎక్కువని హైదరాబాదు ‘భారతీయ చిరుధాన్యాల పరిశోధక సంస్థ’, ‘జాతీయ పోషకాహార సంస్థ’ 2015 ఏడాది అధ్యయనాల్లో తెలిపాయి. (చదవండి: ఒప్పుకొందామా? తప్పందామా?) ఇతర పంటలతో పోల్చితే చిరుధాన్యాల పంటలు పర్యావరణానికి తక్కువ హానికరం. ఈ పరిస్థితుల్లో ఈ పంటలు ఉపయోగకరం. చిరుధాన్యాల పునరుద్ధరణ పోషకాహార లోపాన్ని పరిష్కరిస్తుంది. రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. అందుకే పలు ప్రయోజనాల చిరు ధాన్యాలను పండిద్దాం. వ్యవసాయాన్ని గిట్టుబాటు చేసుకుందాం. (చదవండి: పడిలేచిన కెరటం... ‘పోలవరం’) - సంగిరెడ్డి హనుమంత రెడ్డి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
ఫాస్ట్ఫుడ్స్కు స్వస్తి.. పూర్వీకుల ఆహారంపై మక్కువ చూపుతున్న జనం
తరం మారుతోంది...వారి స్వరం కూడా మారుతోంది. ఆరోగ్యమే మహా భాగ్యమంటూ చిరుధాన్యాలను తమ ఆహార మెనూలో చేర్చి అగ్రస్థానం కల్పిస్తున్నారు. తమ జాబితాలో మొదటి స్థానంలో ఉండే బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్, జంక్ ఫుడ్లను తొలగిస్తూ ఆరోగ్యప్రద ఆహారాలకు ప్రధానంగా యువత ప్రాధాన్యమిస్తున్నారు. ఫాస్ట్ఫుడ్స్కు క్రమేపీ దూరమవుతూ.. చిరు ధాన్యాల వైపు జనం దగ్గరవుతున్నారు. ఆహారపు అలవాట్లలో మార్పు రావడంతో ఇందుకు అనుగుణంగా మార్కెట్ కూడా మారుతోంది. చిరుధాన్యాల పట్ల ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుండడంతో బియ్యం దుకాణాల్లో ఇవి కూడా అమ్మకానికి పెడుతున్నారు. బిస్కెట్లు, చాక్లెట్లు, చపాతి, మురుకులు, ఇడ్లీలు కూడా చిరుధాన్యాలతో తయారు చేస్తున్నారు. కరోనా రాకతో మరింత గిరాకీ మనిషికి హిమోగ్లోబిన్ 15 గ్రాములుంటే వ్యాధి నిరోధక శక్తి బాగుంటుందని వైద్యులు సూచిస్తున్నారు. అన్నిటికంటే రాగులు ద్వారా శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు అందుతాయి. ముఖ్యంగా ఎముకలకు కాల్షియాన్ని అందిస్తుంది. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు రాగికి బెల్లం జతచేసిన ఆహార పదార్ధాలు ఇళ్లల్లో తయారీ చేయిస్తూ తమ పిల్లలకు అందిస్తున్నారు. గ్లూకోజ్ స్థాయులను కూడా నియంత్రించడంలో రాగులు దోహదపడుతుండడంతో మధుమేహులు కూడా ఆకర్షితులవుతున్నారు. వీటితోపాటు జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలను కూడా తమ ఆహారంలో చేర్చుకుంటున్నారు. బెల్లంతో చేసిన తినుబండారాలను ఇప్పుడు ఎక్కువగా తీసుకుంటున్నారు. బెల్లం పాకంతో వేరుశెనగ, నువ్వు ఉండలు, రాగి లడ్డు, మినపలడ్డు, రాగి అట్టులను యువత ఇష్టపడుతుండడంతో మిఠాయి దుకాణాల్లో ఇవి స్థానం దక్కించుకుంటున్నాయి. -
ఆగమాగం!
సాక్షి నెట్వర్క్: ఉమ్మడి వరంగల్, మంచిర్యాల జిల్లాల్లో శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షం రైతులను ఆగం చేసింది. మహబూబాబాద్, వరంగల్ రూరల్ జిల్లాల్లో భారీ వర్షం కురవగా.. జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లితో పాటు వరంగల్ అర్బన్ జిల్లాలోనూ వర్షం కురిసింది. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వరి ధాన్యం, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. అంతా నిద్రలో ఉన్న సమయంలో వర్షం కురవగా రైతులు తేరుకుని కొనుగోలు కేంద్రాలకు వచ్చే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాంటాలు కాని ధాన్యంతో పాటు కాంటాలు పూర్తయిన ధాన్యం కూడా తడిసిపోయింది. లారీల కొరత, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు పూర్తయిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించడం లేదు. దీంతో తీరని నష్టం వాటిల్లింది. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మంచిర్యాల జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టించడంతో జనం బెంబేలెత్తిపోయారు. పలు చోట్ల ఇళ్లపైకప్పులు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చెట్లు పడిపోయాయి. జిల్లావ్యాప్తంగా సగటున 41.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా భీమారంలో 110 మిల్లీమీటర్ల వర్షం పడింది. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. అర్ధరాత్రికావడం.. భారీ వర్షం రావడంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు ఆగమాగం అయ్యారు. జిల్లావ్యాప్తంగా 155 విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో విద్యుత్ శాఖకు సుమారు రూ.15 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో కారుపై పడిన చెట్టు -
మొక్కజొన్నను వెంటనే తరలించాలి
సాక్షి, మధిర: ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గాన్ని కరోనా రహితంగా మార్చేందుకు స్థానిక ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందులో భాగంగా ప్రతి పల్లెకు, ప్రతిగడపకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామంలో పర్యటించిన ఆయన.. స్థానికంగా ఉన్న వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సమయంలో పలువురు రైతులు వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలోని సమస్యలను భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువచ్చారు. లారీలు లేకపోవడంతో మొక్కజొన్నలు, ధాన్యం అక్కడి ఉండిపోయిందని వర్షం వస్తే తీవ్రంగా నష్టపోతామని వారు భట్టివి వివరించారు. దీనికి స్పందించిన భట్టి విక్రమార్క.. కొనుగోలు చేసిన ధాన్యం, మొక్కజొన్నలను వెంటనే తరలించేందుకు లారీలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతేకాక రైతులకు ఇటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లుతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మాస్కులు, శానిటైజర్ల పంపిణీ ఎడవల్లి గ్రామంలో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో హమాలీలు, కూలీలకు మాస్కులు, శానిటైజర్లను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరోనాపై వారికి అవగాహన కల్పించారు. ముదిగొండ మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో పండ్లు, కూరగాయల అమ్మకం దార్లకు, పోలీసులు, వాలంటీర్లకు మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. -
ఏపీ: పల్లెల్లో పంటల కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: గ్రామస్థాయిలో పంటల కొనుగోళ్లు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం శనగలు, కందులు, జొన్న, మొక్కజొన్న, పసుపు, అపరాల కొనుగోలుకు మండల స్థాయిలో కేంద్రాలను ఏర్పాటుచేసింది. కానీ, ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో రైతులు తమ పంటలను ఈ కేంద్రాలకు తరలించడానికి ఇబ్బందిపడే అవకాశాలు ఉండటంతో గ్రామస్థాయిలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దీంతో 786 కేంద్రాల ఏర్పాటుకు మార్క్‌ఫెడ్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు దాదాపు 700 కేంద్రాలను పెట్టగా.. మిగిలినవి రెండు మూడ్రోజుల్లో ఏర్పాటుకానున్నాయి. అంతేకాక.. ► ఈ కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ లేకుండా చేసేందుకు రైతుల పేర్లను అధికారులు ముందుగా నమోదు చేసుకోవాలి. ► నిర్ణయించిన సమయం, తేదీల్లోనే రైతులు తమ పంటలను ఈ కేంద్రాలకు తరలించాలి. ► అలాగే, గతంలో రెండు, మూడు ఏజెన్సీలే పంటలను కొనుగోలు చేస్తే.. ఇప్పుడు స్వయం సహాయక సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సర్కారు అనుమతిస్తోంది. మొక్కజొన్న కొనుగోలుకు నిర్ణయం ► రాష్ట్రంలో 3.64 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు 350 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ► 1.50 లక్షల మెట్రిక్ టన్నుల జొన్న కొనుగోలుకు 95 కేంద్రాలను ఏర్పాటుచేసింది. ► శనగలకు 185, కందులకు 140, పసుపుకు 11, అపరాలకు 5 కేంద్రాలను కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ► ఇక క్వింటాల్ మొక్కజొన్నకు రూ.1,760 లు.. క్వింటాల్ జొన్నకు రూ.2,550లను ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. ► ఇప్పటి దాకా రైతుల నుంచి కొనుగోలు చేసిన శనగల్లో 14,500 మెట్రిక్ టన్నులను మార్క్‌ఫెడ్ పౌర సరఫరాల శాఖకు సరఫరా చేస్తోంది. ► పంటను కొనుగోలు చేసే ఏజెన్సీలను వాటి ట్రాక్ రికార్డు ఆధారంగా ఖరారు చేశారు. గ్రామస్థాయిలో ఏర్పాట్లు పూర్తి: రద్యుమ్న, మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు గ్రామస్థాయిలో చర్యలు తీసుకున్నాం. వర్షాలవల్ల పంట దెబ్బతినకుండా కొనుగోలు చేసిన పంటలను మండల కేంద్రాల్లోని గోదాములకు తరలిస్తాం. హమాలీల సమస్య లేకుండా వ్యవసాయ కార్మికులను ఏజెన్సీలు వినియోగించుకునే ఏర్పాటు కూడా చేశాం. కేంద్రాల వద్ద రద్దీ నియంత్రణకు రైతులు ముందుగానే పేర్లను నమోదు చేసుకోవాలి. కరోనా: రోజుకు వెయ్యి పరీక్షలు! -
1 నుంచి జొన్న, మొక్కజొన్న కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: వచ్చే నెల (ఏప్రిల్) 1 నుంచి జొన్న, మొక్కజొన్నను కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులు ఇబ్బంది పడకుండా తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఐదెకరాలలోపు మొక్కజొన్న పంట మొత్తాన్ని కొనుగోలు చేసి చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవాలన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం మార్కెటింగ్ శాఖపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. తర్వాత వివరాలను వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మీడియాకు వివరించారు. కన్నబాబు ఏం చెప్పారంటే.. - ఈ సీజన్లో 15 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి వచ్చే అవకాశముందని అంచనా వేశాం. ఇందులో సగం ఉత్పత్తిని అయినా కొనాలని సీఎం ఆదేశించారు. 5 ఎకరాలలోపు ఉన్న రైతుల పంట మొత్తం కొనుగోలు చేస్తాం. అత్యధికంగా ఒక్కో రైతు నుంచి 150 క్వింటాళ్ల వరకు మొక్క జొన్నని కనీస మద్దతు ధరలకు కొంటాం. - ఏప్రిల్ 1 నుంచి 150 మొక్క జొన్న, జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయనున్నాం. - ఖరీఫ్, రబీలో వరి ఉత్పత్తి పెరగడంతో గోడౌన్ల ఏర్పాటుపై కూడా సీఎం సమీక్ష చేశారు. మన గోడౌన్లతోపాటు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) గోడౌన్లను కూడా తీసుకోవాలని ఆదేశించారు. - వచ్చే ఏడాది నుంచి ‘మిషన్ గోడౌన్స్ (గిడ్డంగుల నిర్మాణం)’ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. ఇప్పటికే రూ.321 కోట్లు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చారు. వీటి కోసం స్థలాలు చూడాలని జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేశాం. - ఈ ఏడాది అన్ని రైతు భరోసా కేంద్రాల్లో వేరుశనగ విత్తనాల పంపిణీ చేస్తాం. - విత్తన సేకరణ ఎలా జరుగుతుందో పర్యవేక్షించాలని, నాణ్యమైన విత్తన సేకరణలో రాజీ పడొద్దని సీఎం సూచించారు. పుడ్ ప్రాసెసింగ్‌పై సీఎం సమీక్ష - అరటి, టమాట, నిమ్మ, చీనీ వంటి వాటిని శుద్ధి చేసి విక్రయించడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని పుడ్ ప్రాసెసింగ్‌పై జరిగిన సమీక్షలో సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. - అరటికి గతంలోనే క్వింటాల్‌కి రూ.800 గిట్టుబాటు ధర ప్రకటించాం. - గోదావరి డెల్టాలో రబీకు సాగునీటి ఎద్దడి రాకుండా, చివరి ప్రాంతాలకు నీరందని పరిస్ధితి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. - సీలేరు నుంచి ఇప్పటికే 8 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నాం. అవసరమైతే మరో వేయి క్యూసెక్కులు నీటిని విడుదల చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
మహారాజశ్రీ మొక్కజొన్న..
మొక్కజొన్నేంటి.. అదీ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్లాస్టిక్ సమస్యలకు పరిష్కారం చూపడమేంటి? దానికీ.. దీనికీ సంబంధమేంటి? ఇదే కదా మీ అనుమానం.. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) దేశంలోనే తొలిసారిగా ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.. ఆ వివరాలు మీకోసం.. – సాక్షి, హైదరాబాద్ అసలు సమస్యేంటి? ఈ ఎయిర్‌పోర్టుకు రోజూ వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. అలాగే ఎయిర్‌పోర్టుకు వచ్చే వారి బంధువులు, స్నేహితులు, పర్యాటకులతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. వీరందరికీ టీ, కాఫీలు, భోజనం, తాగునీరు కావాలి. అక్కడ ఇవన్నీ ప్లాస్టిక్ ప్యాకింగ్‌తోనే లభిస్తాయి. దీంతో నిత్యం టన్నుల కొద్ది ప్లాస్టిక్ వ్యర్థాలు పోగవుతున్నాయి. ఇదో పెద్ద సమస్యగా మారింది. దీంతో ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎయిర్‌పోర్టులో ఎలాంటి ప్లాస్టిక్ వినియోగానికి తావు లేకుండా చర్యలు చేపట్టాలని జీహెచ్ఐఏఎల్ నిర్ణయించింది. దీనికి మొక్కజొన్నే పరిష్కారమని భావించింది. పరిష్కారమిలా... మొక్కజొన్నతో తయారు చేసిన ప్లేట్లు వంటివాటికి భూమిలో కలిసిపోయే గుణం ఉంది. పైగా.. ఒక రోజులో 2 టన్నుల వ్యర్థాలను ఎరువుగా మార్చే సామర్థ్యమున్న కంపోస్ట్ ప్లాంట్ ఎయిర్‌పోర్టుకు ఉంది. దీంతో పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో మొక్కజొన్న, చెక్క తదితరాలతో తయారు చేసిన ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలు, ట్రేలు, ఫోర్క్‌లు, స్ట్రిరర్లు, స్పూన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రయాణికులు వాడిపారేసిన తర్వాత ఆ వ్యర్థాలను సేకరించి.. కంపోస్టు ప్లాంటుకు తరలిస్తారు. దాన్ని అది ఎరువుగా మారుస్తుంది. ఇప్పటికే ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయిన కంపోస్టును ఎయిర్‌పోర్టులో మొక్కలకు ఎరువులుగా వాడుతున్నారు. రసాయనిక ఎరువులు వాడకుండా ఈ రకంగానూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నారు. జీహెచ్ఐఏఎల్ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ విధానానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన వస్తోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఈ ప్లేట్ల వినియోగాన్ని ప్రవేశపెట్టాం. మా వద్ద10 మెగావాట్ల సోలార్ ప్లాంటు, కంపోస్ట్ ప్లాంటు, ఎలక్ట్రిక్ చార్జింగ్ యూనిట్, నీటి పరిరక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఎయిర్‌పోర్టు సిబ్బందీ ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో వస్త్రంతో చేసిన సంచులనే వాడుతున్నారు. –ఎస్జీకే కిశోర్, సీఈవో, జీహెచ్ఐఏఎల్ -
‘మొక్కజొన్నపై ఫాల్ ఆర్మీ దాడి!’
సాక్షి, హైదరాబాద్: ఆఫ్రికన్ దేశాల్లో మొక్కజొన్నను నాశనం చేసిన ఫాల్ ఆర్మీ వామ్–స్పొడోప్తెరా ఫ్రూగిపెర్దా అనే పురుగు ఇప్పుడు మన దేశంలోని పంటలపై దాడి చేస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఆ పురుగు ఇటీవల కర్ణాటక శివమొగ్గ ప్రాంతంలోని మొక్కజొన్న పంటలో గుర్తించారు. పంటను అమాంతం నాశనం చేసే ఈ పురుగు విషయంలో అప్రమత్తం కావాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలను, జిల్లా వ్యవసాయాధికారులను ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఆదేశించారు. ఆఫ్రికన్ దేశాల నుంచి ఇతర దేశాలకు ఇది విస్తరిస్తుందని ఆయన వివరించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) కూడా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిందన్నారు. కర్ణాటక పక్కనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉండటంతో ఈ పురుగు ప్రభావం ఎలా ఉంటుందనే భయం అందరినీ కలవరపరుస్తోంది. ఈ పురుగు సోకితే పంటపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. రాష్ట్రంలో 10.78 లక్షల ఎకరాల్లో సాగు... రాష్ట్రంలో ఖరీఫ్‌లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 13.40 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 10.78 లక్షల ఎకరాల్లో సాగైంది. రాష్ట్ర ఆహారధాన్యాల పంటల్లో వరి తర్వాత అత్యంత కీలకమైన పంట మొక్కజొన్న కావడంతో రైతులు దీనిపై అధికంగా ఆశలు పెంచుకుంటారు. ఆసియాలోనే తొలిసారిగా గత నెలలో కర్ణాటకలో ఈ పురుగును గుర్తించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. -
మార్క్‌ఫెడ్ ద్వారానే మక్కల కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: యాసంగిలో పండిన మక్కలకు కనీస మద్దతు ధర చెల్లించి, ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్ ఫెడ్ ద్వారానే కొనుగోలు చేయాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. మక్కలకు మద్దతు ధర చెల్లించకుండా గ్రామాల్లో దళారులే తక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల రైతులు నష్టపోతున్నారని మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, ఎండీ జగన్మోహన్ శనివారం సీఎంకు తెలిపారు. మక్కల కొనుగోలుకు రుణం తీసుకోవడానికి ప్రభుత్వం పూచీకత్తుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేసీఆర్ మార్క్‌ఫెడ్‌కు కావాల్సిన గ్యారంటీ ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు తెరిచి, మార్క్‌ఫెడ్‌ను సమన్వయం చేసుకుని మక్కల కొనుగోలు చేయాలని మంత్రి హరీశ్ రావును కోరారు. ‘‘రైతులెవరూ తక్కువ ధరకు మక్కలను అమ్ముకోవాల్సిన అవసరం లేదు. క్వింటాలుకు రూ.1,425 చెల్లించి ప్రభుత్వం తరçఫునే కొనుగోలు చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మార్క్‌ఫెడ్ రంగంలోకి దిగి వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తుంది. రైతులు తొందరపడి మక్కలను తక్కువ ధరకు అమ్ముకోవద్దు. రూపాయి కూడా నష్టపోకుండా చూడాలి’’అని సీఎం అన్నారు. -
భారీ వర్షం
ఇందూరు : జిల్లాలో మంగళ, బుధవారాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మంగళవారం రాత్రి వరకు ఆయా ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి. ఐదు మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా 19 మండలాల్లో సాధారణం, 12 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కమ్మర్పల్లి మండలంలో 42.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కోటగిరి మండలంలో 40.4 మిల్లీ మీటర్లు, కామారెడ్డిలో 35.6, బోధన్‌లో 34.0, సదాశివనగర్‌లో 31.2, జుక్కల్‌లో 29.6, బీర్కూర్‌లో 24.0, రెంజల్లో 23.8, మద్నూరులో 20, వర్నిలో 18.4, బిచ్కుందలో 16.4, మాక్లూర్‌లో 15.8, లింగంపేట్‌లో 15.6, నవీపేట్లో 15.4, ఎడపల్లిలో 12.2, నందిపేట్‌లో 12, తాడ్వాయిలో 11.4, మోర్తాడ్‌లో 11.4, గాంధారిలో 10.4, నిజాంసాగర్‌లో 9, దోమకొండలో 8.2, పిట్లంలో 8, బాల్కొండలో 4.4, నాగిరెడ్డిపేట్లో 3.2, భిక్కనూరులో 3, భీమ్‌గల్‌లో 2.2, ఆర్మూర్‌లో 2.8, మాచారెడ్డిలో 2.2, మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. -
సమ్మర్ సలాడ్స్
చీపొమెగ్రనేట్ స్వీట్‌కార్న్ సలాడ్ కావలసినవి ► దానిమ్మకాయ - ఒకటి, స్వీట్‌కార్న్ - సగం కండె, అరటిపండు - సగం ► ద్రాక్ష - అరకప్పు, జామపండు - సగం, ఖర్జూరాలు - పది తయారి: స్వీట్‌కార్న్ అంటే తియ్యగా ఉండే మొక్కజొన్న కండె. దీనినే అమెరికన్ కార్న్ అని కూడా అంటారు. ఇది కూరగాయల మార్కెట్లలోనూ, సూపర్ మార్కెట్లలోనూ దొరుకుతుంది. ఇవి లేతగా, గిల్లితే పాలుకారుతుంటాయి. వండాల్సిన అవసరం ఉండదు. పచ్చిగానే తినవచ్చు. ముందుగా మొక్కజొన్న గింజలు ఒలిచి పక్కన ఉంచుకోవాలి. దానిమ్మకాయ గింజలను ఒలిచి అందులో వేసిన తర్వాత అరటి, జామపండ్లను సన్నని ముక్కలుగా కట్ చేసి కలుపుకోవాలి. ఖర్జూరాన్ని గింజలు తీసేసి సన్నని ముక్కలు చేసి ఫ్రూట్మిక్స్లో కలిపితే పొమెగ్రనేట్ - స్వీట్‌కార్న్ సలాడ్ రెడీ. వాటర్మెలన్ సలాడ్ కావలసినవి: ► పుచ్చకాయ ముక్కలు -ఒక కప్పు ► తర్బూజముక్కలు - అర కప్పు ► పుదీన - రెండు రెమ్మలు ► పెరుగు - ఒక టేబుల్ స్పూన్ ► ఉప్పు - చిటికెడు ఇది చాలా సులభంగా చేసుకోదగిన సలాడ్. ఒక బౌల్లో పుచ్చకాయ, తర్బూజ ముక్కలు వేసి అందులో పుదీన ఆకులు, పెరుగు, ఉప్పు కూడా కలపాలి. అంతే! వాటర్మెలన్ సలాడ్ రెడీ. సాధారణంగా పుచ్చకాయ తినేటప్పుడు, సలాడ్ల కోసం ముక్కలు కోసినప్పుడు గింజలను వదిలేస్తుంటారు. నిజానికి గింజలలో అనేక ఔషధగుణాలుంటాయి. కాబట్టి గింజలను తినాలి. అలాగే తర్బూజ గింజలు కూడా తినవచ్చు. వీటిని విడిగా తీసుకోవడం సులభం కాబట్టి ఎండబెట్టి పొడి చేసుకుని వాడుకోవచ్చు. అయితే గింజ నలిగేటట్లు నమలాలి . స్ట్రాబెర్ర గ్రేప్ సలాడ్ కావలసినవి ► స్ట్రాబెర్రీలు - పది (సన్నగా ముక్కలు చేయాలి) ► ద్రాక్ష - ఒక కప్పు, సపోటాముక్కలు - అర కప్పు ► జామముక్కలు - అర కప్పు, నల్లద్రాక్షరసం - ఒక టేబుల్ స్పూన్ ► గార్నిష్ చేయడానికి: క్రీమ్ - మూడు టీ స్పూన్లు, చెర్రీలు - నాలుగు తయారి స్ట్రాబెర్రీ, జామ, సపోట ముక్కలను, ద్రాక్షపండ్లను కలపాలి. సర్వ్ చేసే ముందు ఈ ముక్కలను కప్పులో వేసి ఒక్కొక్క కప్పులో ఒక టీ స్పూన్ ద్రాక్షరసం వేసి పైన క్రీమ్ పెట్టి చెర్రీతో అలంకరించాలి. ముందుగా క్రీమ్ పెట్టి దాని మీద ద్రాక్షరసం వేసినా బాగుంటుంది. పిల్లలు క్రీమ్ ఇష్టపడతారు కాబట్టి కాస్త ఎక్కువ క్రీమ్ వేసి మధ్యలో చెర్రీ పెట్టి దాని చుట్టూ ద్రాక్షరసం రకరకాల బొమ్మల షేప్ వచ్చేటట్లు వేస్తే ఆనందంగా తింటారు. -
'రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'
- విడుతల వారిగా మార్కెట్‌ను అభివృద్ధి చేస్తాం - జిల్లా కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం - ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్: వ్యవసాయ రైతుల సంక్షేమ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందనీ.. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక మార్కెట్‌యార్డులో సింగిల్‌విండో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల ఏడ్చిన రాష్ట్రం అభివృద్ధి చెందదని, రైతులు సంతోషిస్తే రాష్ట్రాలు బాగుపడుతాయన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.35200కోట్లు కేటాయించి ప్రాజెక్ట్ నిర్మాణానికి పూనుకున్నారని ఆయన కొనియాడారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే జిల్లాలో 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఇక జిల్లా సస్యశ్యామలం కానుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. రానున్న రెండేళ్లలో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా రైతులు అష్టకష్టలు పడి పండించిన ధాన్యం తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోకుండా ఉండేందుకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి సాధ్యమైనంత త్వరగా రైతులకు డబ్బులు చెల్లించడం జరుగుతుందన్నారు. మార్కెట్‌యార్డులలో దళారి వ్యవస్థను రూపుమాపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాట్లు ఆయన తెలిపారు. అనంతరం మార్కెట్‌యార్డు ఆవరణలో ఉన్న మొక్కజొన్న ధాన్యాన్ని పరిశీలించారు. రైతులకు ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువ ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని మార్కెట్ కార్యదర్శి అనంతయ్యకు సూచించారు. అనంతరం తానుకూడా ఓ రైతునని, పంట పొలాల వద్ద నీరు పెట్టడం, నాగళితో దున్నడం వంటి వ్యవసాయపనులన్నింటిని చేశానని తన చిన్ననాటి ఙ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో చెర్మైన్ కే.వెంకటయ్య, మార్కెట్ కార్యదర్శులు అనంతయ్య, నవీన్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు రాజేశ్వర్‌గౌడ్, రామకృష్ణ, చందుయాదవ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
చింత తీర్చేది చిరుధాన్యాలే!
జొన్న రొట్టె, సజ్జ మలీద, రాగి సంకటి... ఇవన్నీ తెలంగాణ ఆహార వ్యవస్థ నుంచి విడదీయలేని వంటలు. పెళ్లిళ్లలో జొన్న తలంబ్రాలు.. మన చేలల్లో జొన్న పంటలు. సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, దేశీ మక్కలు(మొక్కజొన్నలు) ఇవ న్నీ తెలంగాణ వైశిష్ట్యాలు. తెలంగాణ మెట్ట భూముల దిక్కు చూస్తే 60 నుంచి 70 శాతం వరకూ ఈ చిరుధాన్యాలనే సాగు చేసేవారు. అయితే, ఎప్పుడైతే ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లో బియ్యాన్ని చేర్చారో అప్పటి నుంచి చిరుధాన్యాల సంస్కృతి కనుమరుగవుతున్నది. కిలో బియ్యం రూ. 2కు, రూ.1కు, ఉచితంగా ఇవ్వటంతో జొన్నలు, సజ్జలు, కొర్రలు తినేటి జనం ఆహార భ్రష్టులై బియ్యానికి బానిసలయ్యారు. ఇప్పుడు బియ్యం కబంధ హస్తాలు తెలంగాణ జనాన్ని సంపూర్ణంగా తమ అధీనంలోకి తీసుకున్నాయి. కిలో రూ.2కే బియ్యం ఇచ్చిన మొదటి సంవత్సరంలోనే మెదక్ జిల్లాలో చిరుధాన్యాలు పండే లక్ష హెక్టార్ల భూమిని రైతులు బీళ్లుగా వదిలేశారు. అప్పటి నుంచి సంప్రదాయక ఆహార పద్ధతుల పతనం ప్రారంభమైంది. క్రమంగా చిరుధాన్యాలనేవి మాయమయ్యే పరిస్థితి వచ్చింది. మధుమేహం, రక్తపోటు బియ్యం పుణ్యమే పీడీఎస్ ద్వారా ప్రభుత్వం బియ్యం సరఫరా చేసిన ప్రభావం కేవలం సాగు భూములపైనే కాక ప్రజల ఆరోగ్యం, ప్రత్యేకించి పిల్లల పౌష్టికత మీద తీవ్ర ప్రభావం చూపింది. బియ్యం వాడకంతో పోషకాల కొరత ఏర్పడి ప్రజలు మధుమేహం, రక్తపోటు సహా పలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఒకే రకమైన ఆహార పదార్థాలను పదేపదే తినటం ద్వారా పోషకాల సమతుల్యత దెబ్బతింటోంది. ప్రజల ఆహారపు అలవాట్లకు స్కూల్, హాస్టల్, అంగన్వాడీ భోజనాలు గండి కొట్టాయి. వీటన్నింటా పిల్లల ఆహారంలో వరి బియ్యం తప్ప మరే ఆహారానికి చోటు లేదు. జొన్నరొట్టె, రాగి సంకటి, కొర్ర బువ్వను తిన్న పేద పిల్లలు సైతం బలంగా ఎదిగేవారు. చిరుధాన్యాలలో పిల్లల ఎదుగుదల, ఆరోగ్యానికి అవసరమైన ఇనుము, సున్నం, కాల్షియం, బీటాకెరోటిన్, నియాసిన్, ఇతర సూక్ష్మ పోషకాలు దండిగా ఉన్నాయి. పిల్లల పెరుగుదలకు, ఆరోగ్యానికి, వాళ్ల శరీరంలో శక్తి నింపడానికి చాలా అవసరమైనవి ఈ పోషకాలు. బియ్యంలో వీటి కొరత చాలా ఎక్కువ. కానీ, ఈ పరిస్థితుల్లో కార్డుల మీద 6 కిలోల చొప్పున, హాస్టళ్లకు సన్న బియ్యం ఇవ్వాలన్న నిర్ణయంప్రజల ఆరోగ్యానికి మేలు చేయబోదనే విషయం ప్రభుత్వం గుర్తించాలి. చిరుధాన్యాలను ఆహారంగా అందిస్తే పోషక లోపాన్ని సవరించటం సాధ్యమవుతుంది. తద్వారా వీటి సాగు పెరుగుతుంది. కరువు కాలానికి తగిన పంటలు తెలంగాణలో సాగునీటి కొరత చాలా ఎక్కువ. ఈ సమస్యకు సరైన సమాధానం సాగు నీరు అవసరం లేని పంటలైన చిరుధాన్యాలు పండించడమే. పోయిన దశాబ్దం కరువు దశాబ్దంగా గడిచింది. వాతావరణ మార్పు వల్ల రాబోయే కాలంలో నీటి కొరత ఇంకా తీవ్రమవుతుంది. ఎండ తీవ్రత కూడా పెరిగే అవకాశాలున్నాయి. వీటితోనే అపౌష్టికత కూడా పెద్ద సమస్యవుతుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కొత్త సేద్య ప్రణాళికను రూపొందించుకోకుండా.. వరి, చెరకు సాగును ప్రోత్సహిస్తూ ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టిపెడుతూ ఉంటే భవిష్యత్తులో దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో మనం చిరుధాన్యాల గురించి ఇంకోసారి ఆలోచించాలి. తెలంగాణను చిరుధాన్యాల రాష్ట్రంగా ప్రకటించాలి. చిరుధాన్యాల సాగును, వినియోగాన్ని ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ప్రోత్సహించాలి. అప్పుడే మనం ఒక కొత్త రాష్ట్రంలో భవిష్యత్తు గురించి సవ్యంగా ఆలోచిస్తున్నామని చెప్పుకోగలం. వాతావరణ మార్పుల నేపథ్యంలో వరి, గోధుమ సాగు మరింతగా సమస్యల మయం కాబోతున్నందున దేశ ఆహార భద్రత ప్రమాదంలో చిక్కుకోనుంది. ఈ తరుణంలో మనకు అండగా నిలిచేది చిరుధాన్యాలే. ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణ కూడా ఒక చిరుధాన్యాల రాష్ట్రం అయితే.. ఈ దేశపు ఆహార భద్రతను కాపాడిన రాష్ట్రంగా మనం భవిష్యత్తులో ఒక స్థానాన్ని పొందగలుగుతాం. (వ్యాసకర్త డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డెరైక్టర్) satheeshperiyapatna@gmail.com చిరుధాన్యాలకు సారవంతమైన భూములు అవసరం లేదు. సారం అంతగా లేని భూముల్లో కూడా ఇవి పెరుగుతాయి.వర్షాధార పంటలైన చిరుధాన్యాలకు నీటి తడులు పెట్టాల్సిన అవసరం లేదు. తక్కువ వర్షాలు కురిసినా మంచి దిగుబడులొస్తాయి. చిరుధాన్యాలు పోషకాల భాండాగారాలు. పౌష్టికాహార లోపాన్ని జయించడానికి ఇవి ఆధారంగా నిలుస్తాయి. అధిక సాగు నీరు అవసరమయ్యే వరి, గోధుమ సాగులో సమస్యలు జటిలమవుతున్న నేపథ్యంలో తెలంగాణను చిరుధాన్యాల సాగు ప్రధాన రాష్ట్రంగా ప్రకటించడం మేలన్న డిమాండ్ ముందుకొస్తోంది. కరువు కాలంలోనూ ప్రజలకు పౌష్టికాహారాన్ని, ఆహార భద్రతను అందించగలిగేది చిరుధాన్యాలేనన్న వాస్తవాన్ని పాలకులు గుర్తించాలంటున్నారు పీ వీ సతీష్. -
మొక్కజొన్న కొనుగోళ్లలో గోల్మాల్
* మార్క్‌ఫెడ్ అధికారుల హస్తలాఘవం.. 1.70 లక్షల బస్తాలు మాయం * రైతులకిచ్చింది క్వింటాల్‌కు రూ. 800, రికార్డుల్లో చూపింది రూ. 1,300 * అవకతవకలను గుర్తించిన కేంద్ర గిడ్డంగుల సంస్థ అధికారులు * అక్రమాలను నిర్ధారించిన జీఎంను రాత్రికి రాత్రే బదిలీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్ చేసిన మొక్కజొన్న కొనుగోళ్లలో భారీ గోల్మాల్ జరిగింది. రైతుల పేరు చెప్పి భారీగా నిధులు మింగేశారు. నాసిరకం మొక్కజొన్నను చౌకగా వ్యాపారుల నుంచి కొని.. రైతుల నుంచి నాణ్యమైన మొక్కజొన్న కొన్నట్లు రికార్డుల్లో చూపించారు. ఆ నాసిరకం మొక్కజొన్నను ‘కేంద్ర గిడ్డంగుల సంస్థ’ గోదాములకు పంపి.. తప్పంతా ఆ సంస్థ మీద నెట్టేయాలని మార్క్‌ఫెడ్ అధికారులు ప్రయత్నించారు. అసలు రైతుల వద్ద కొన్నట్లుగా చూపిస్తున్న లెక్కలకు, కేంద్ర గిడ్డంగులకు చేరిన లెక్కలకు పొంతనే లేదు. మెదక్ జిల్లాలో మొత్తం 10.02 లక్షల బస్తాలు కొనుగోలు చేయగా.. గోదాములకు చేరింది 8.33 లక్షల బస్తాలే. అంటే దాదాపు 1.7 లక్షల బస్తాల జాడ లేదు. కేంద్ర గిడ్డంగుల సంస్థ అధికారులు మేల్కొనడంతో గోల్మాల్ వ్యవహారం బయటపడింది. నాసిరకం మొక్కజొన్నను తమ గిడ్డంగులకు పంపించారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ‘కేంద్ర గిడ్డంగుల సంస్థ (సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్) ఇటీవల మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించింది. అవాక్కయ్యే వాస్తవాలు.. మార్క్‌ఫెడ్ సేకరించిన మొక్కజొన్నను కేంద్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లో నిల్వ చేస్తారు. అయితే తమ గోదాముల్లో నాసిరకం సరుకు నిల్వ ఉండటాన్ని గుర్తించిన అధికారులు.. మొత్తం వ్యవహారంపై విచారణ చేశారు. మొక్కజొన్న కొనుగోళ్లలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని గుర్తించారు. మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసినట్లుగా చెబుతున్న 1.70 లక్షల బస్తాల మొక్కజొన్న అసలు గోదాములకే రాలేదని విచారణలో తేలింది. నేరుగా రైతుల నుంచి ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) సంఘాల ద్వారా మొక్కజొన్నను సేకరించాలనే నిబంధనను మార్క్‌ఫెడ్ అధికారులు ఉల్లంఘించి.. మెదక్ జిల్లాలో దళారుల నుంచి సేకరించినట్లు గుర్తించారు. రైతులు, వ్యాపారుల నుంచి రూ. 800కు క్వింటాల్ చొప్పున కొనుగోలు చేసి.. రూ. 1,300 చొప్పున నాణ్యమైన సరుకు కొనుగోలు చేసినట్లుగా రికార్డుల్లో చూపినట్లు గుర్తించారు. ఐకేపీ సంఘాలు కొనుగోలు చేసినట్లుగా చెబుతున్న దానికి, మార్క్‌ఫెడ్ అధికారులు చెబుతున్న లెక్కలకు కూడా పొంతన లేదని కూడా వెల్లడైంది. ముందే 60 లారీల సరుకు తిరస్కరణ.. నాసిరకం మొక్కజొన్నలను నాణ్యమైన సరుకుగా పేర్కొని తమ గోదాముల్లో నిల్వ చేయడం కోసం మార్క్‌ఫెడ్ అధికారులు పక్కా ప్రణాళికతో కుట్ర చేశారని కేంద్ర గిడ్డంగుల సంస్థ అధికారులు మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారులకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ‘లారీల్లో నాలుగువైపులా నాణ్యమైన మొక్కజొన్నతో కూడిన బస్తాలను ఉంచి.. లోపల నాణ్యత లేని సరుకును పెట్టి పంపిస్తున్నారు. అసలే సిబ్బంది కొరత ఉన్న మాకు.. అన్ని లారీలను, అన్ని బస్తాలను తనిఖీ చేయడం సాధ్యం కాదు. ఉన్నంతలో మేం తనిఖీ చేసి మార్క్‌ఫెడ్ పంపిన వాటిలో 60 లారీల నాసిరకం సరుకును గుర్తించి తిరస్కరించాం. మిగతా వందలాది లారీల్లోనూ నాసిరకం సరుకే మా గోదాములకు చేరింది. దీనిపై మార్క్‌ఫెడ్ జిల్లా అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన రాలేదు. అందుకోసం మార్క్‌ఫెడ్ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకొస్తున్నాం..’ అని ఆ నివేదికలో వెల్లడించారు. మార్గదర్శకాలను పట్టించుకోలేదు... మొక్కజొన్న సేకరణ కోసం జారీ చేసిన మార్గదర్శకాలను మార్క్‌ఫెడ్ అధికారులు పాటించలేదని గిడ్డంగుల సంస్థ తమ నివేదికలో పేర్కొంది. మొక్కజొన్న సేకరణకు ముందే గన్నీ బ్యాగులు, హమాలీల రేట్లకు సంబంధించి ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర కార్యాలయం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా.. జిల్లా మేనేజర్ చాలా ఆలస్యం చేశారని ఎత్తిచూపింది. రవాణాకు సంబంధించి కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో ట్రాక్టర్లు, టెంపోలు వినియోగించినందున తక్కువ రవాణా చార్జీలు చెల్లించారంటూ జిల్లా పాలనా యంత్రాంగాన్ని కావాలనే తప్పుదోవ పట్టించారని నివేదికలో స్పష్టం చేసింది. గిడ్డంగులకు పంపించిన మొక్కజొన్నకు సంబంధించిన వివరాలను ట్రక్కుల వెంట జిరాక్స్ కాపీలపై ఇచ్చి పంపించడం నిబంధనలకు విరుద్ధమని.. అలాంటి వాటిని గిడ్డంగుల్లో అనుమతించడానికి వీల్లేకపోయినా తీసుకున్నారని పేర్కొంది. గన్నీ బ్యాగుల నాణ్యతా ఏమాత్రం పెరగకపోయినా.. ధరలు మాత్రం పెంచేశారని వివరించింది. రాత్రికి రాత్రే జీఎం బదిలీ.. రాష్ట్ర విభజన తర్వాత మార్క్‌ఫెడ్‌నూ విభజించారు. రెండు మార్క్ఫెడ్లకు కలిపి ఒకే ఎండీ ఉన్నా... తెలంగాణ మార్క్‌ఫెడ్ జనరల్ మేనేజర్‌గా సహకార శాఖ అధికారి కిరణ్మయిని ప్రభుత్వం నియమించింది. మొక్కజొన్న కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని రికార్డుల పరిశీలనలో ఆమె గుర్తించారు. ఈ గోల్మాల్ను బయటపెట్టి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని భావించారు. మెదక్ జిల్లాకు ఆకస్మిక తనిఖీకి వెళ్లిన జనరల్ మేనేజర్... గతేడాది కొనుగోళ్లలో జరిగిన గోల్‌మాల్‌తో పాటు ప్రస్తుతం జరుగుతున్న కొనుగోళ్లలోనూ అవకతవకలు జరుగుతున్నాయని నిర్ధారించారు. ఈ మేరకు రూపొందించిన నివేదికను మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారులకు సమర్పించారు. బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు కూడా. అయితే నివేదిక సమర్పించిన రోజే ఆమె మార్క్‌ఫెడ్ నుంచి బదిలీ కావడం గమనార్హం. ఆమె సమర్పించిన నివేదిక, అందుకు సంబంధించిన రికార్డులనూ మార్క్‌ఫెడ్ అధికారులు మాయం చేశారు. ఈ గోల్మాల్ నుంచి తప్పించుకోవడానికి మార్క్‌ఫెడ్ అధికారులు గట్టిగా ప్రయత్నాలు చేశారు. ఎలాంటి ఆధారాలూ లభించకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వ పెద్దలకూ ఈ భారీ గోల్మాల్ గురించి తెలుసని... అందుకే గోల్మాల్ను బయటపెట్టాలని చూసిన జీఎంను బదిలీ చేశారని సమాచారం. -
మృత్యుఘోష
ఆరుగాలం కష్టించి సాగుచేసిన పంట కళ్లముందే ఎండిపోతోంది. కరుణించాల్సిన వరుణుడు కనికరం చూపడం లేదు. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తడిసిమోపడవుతున్నాయి...ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న రైతన్న పురుగుల మందే చివరివిందుగా చేసుకుని తనువు చాలిస్తున్నాడు. కుటుంబాలను ఒంటరిచేసి వెళ్లిపోతున్నాడు. తాజాగా గురువారం ఒక్కరోజే జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇరువురు రైతన్నలు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, తీవ్ర ఆందోళనతో గుండెపోటుకు గురై మరో అన్నదాత నేలకూలాడు. జగదేవ్‌పూర్ : అప్పులబాధలు తాళలేక ఓ రైతులు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని చేబర్తి పంచాయతీ నర్సన్నపేట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బుకల కొండయ్య (28), స్వప్న అనే దంపతులు తమకున్న మూడెకరాలలో పత్తి, మొక్కజొన్న పంటలను సాగు చేసేవారు. అయితే ప్రతి ఏటా వ్యవసాయంలో నష్టపోతూ వస్తున్నారు. ఈసారి కూడా పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేశాడు. ఈ నేపథ్యం లో పంటల పెట్టుబడులు, కుటుంబ పోషణకు సుమారు రూ. 3 లక్షల మేర అప్పులు చేశాడు. అయితే పంట లు చేతికందక అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడం వారం రోజులుగా దిగాలుగా ఉన్నాడు. అయితే బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. అయితే విషయాన్ని గమనించిన కొం డయ్య తల్లి స్థానికుల సాయంతో గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. పరిస్థితి విషమించడంతో అంబులెన్స్‌లో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భా ర్య స్వప్న, ఇద్దరు కుమార్తులు ఉన్నా రు. ఈ మేరకు ఎస్ఐ వీరన్న కేసును దర్యాప్తు చేస్తున్నారు. కొండయ్య మృతితో నర్సన్నపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నాయకుల పరామర్శ : నర్సన్నపేట గ్రామంలో అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కొండయ్య కుటుంబ సభ్యులను గురువారం సాయంత్రం టీడీపీ గజ్వేల్ ఇన్చార్జ్ బుర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎల్లు రాంరెడ్డి, జెడ్పీటీసీ రాంచంద్రం, చేబర్తి సర్పంచ్ జమునాబాయి, నాయకులు భూమయ్యయాదవ్, ఇంద్రసేనారెడ్డి, బుద్ద చిన్న సత్యం, శ్రీకాంత్, ఎర్రవల్లి ఎంపీటీసీ భాగ్యమ్మ, శ్రీనివాస్‌రెడ్డిలు, శరత్‌లు పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా బుర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో 57 రైతు ఆత్మహత్యలు జరిగినట్లు చెప్పారు. జగదేవ్‌పూర్ మండలంలో ఇప్పటికి వరకు ఆరుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నా రు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఒక్క కుటుంబానికి ప్రభుత్వం 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. -
పత్తి రైతు కలవరం
గజ్వేల్, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రధాన పంటగా ఆవిర్భవించిన పత్తి సాగుపై రైతుల్లో కలవరం వ్యక్తమవుతున్నది. చేలల్లో విత్తనాలు వేసి వారం రోజులు గడుస్తున్నా.. వర్షాల జాడ లేక మొలకెత్తని పరిస్థితి నెలకొన్నది. ఫలి తంగా ఇప్పటికే భారీ నష్టం జరిగిపోయింది. కొన్నేళ్లుగా వరుస నష్టాలతో కునారిల్లుతున్న రైతు ఈసారైనా గట్టెక్కాలనుకుంటుండగా.. భిన్నమైన పరిస్థితులు నెలకొనడంతో ఆందోళన నెలకొన్నది. జిల్లాలో మొక్కజొన్న తర్వాత పత్తి రెండో ప్రధాన పంటగా కొనసాగుతోంది. కానీ కొన్నేళ్లుగా ఈ పంట సాగు రైతులకు కలిసి రావడం లేదు. మొల కెత్తే దశనుంచి పత్తి చేతికందే వరకు రైతులు ఎంతో శ్రమిస్తుండగా.. చివరకు మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కక అల్లాడుతున్నారు. గతేడాది 1.20 లక్షల హెక్టార్లలో పత్తి సాగైంది. సుమారు 2.8 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడులు రాగా పత్తి రైతుల అవసరాల దృష్ట్యా జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, తొగుట, జోగిపేట, జహీరాబాద్‌లలో ఏర్పాటుచేసిన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కేంద్రాలు నామ్‌కే వస్తేగా మిగిలిపోయాయి. గజ్వేల్, సిద్దిపేటలలో కేంద్రాలను మొక్కుబడిగా తెరిచారు. కానీ కొనుగోళ్లు మాత్రం జరపలేదు. ఈ పరిణామం వ్యాపారులకు కలిసి వచ్చింది. ఇష్టానుసారంగా రైతులను దండుకున్నారు. చేదు అనుభవాలను మరిచి ఈసారైనా పత్తి సాగు కలిసొస్తేందేమోననే భావనతో రైతులు ఈ పంట సాగుకు సిద్ధమయ్యారు. జిల్లాలో 1.73లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనావేసింది. ఇందుకోసం 7.18లక్షల బీటి పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని భావించారు. ఇందులో భాగంగానే జిల్లాకు ఇప్పటివరకు 4లక్షల విత్తన ప్యాకెట్లు విడుదలు కాగా లక్ష ప్యాకెట్లు అమ్ముడుపోయినట్లు వ్యవసాయశాఖ చెబుతున్నది. కొనుగోలుచేసిన విత్తనాలను రైతులు చేలల్లో వేశారు. విత్తన రూపేణా రైతుల రూ.9.30 కోట్ల వరకు, ఎరువులు, దున్నకాలు, కూలీల ఇతర పెట్టుబడుల రూపేణా మరో రూ.20 కోట్ల వరకు ఖర్చు చేశారు. వర్షాలు కురవకపోవడం వల్ల ఈ పెట్టుబడులు నష్టపోవాల్సి దుస్థితి నెలకొన్నది. సాగుకు సంబంధించి గజ్వేల్ సబ్‌డివిజన్ పరిధిలో ప్రతిఏటా సాధారంగా 20 వేల హెక్టార్ల వరకు పత్తిని సాగుచేస్తారు. ఈసారి అవసరాలకోసం ఈ సబ్‌డివిజన్ పరిధిలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్ మండలాలకు లక్ష విత్తన ప్యాకెట్లు కేటాయించారు. ఇందులో ఇప్పటికే 30వేల ప్యాకెట్లకు పైగా అమ్ముడయ్యాయి. ఇదే క్రమంలో ఈసారి వారం రోజుల కిందట కురిసిన కొద్దిపాటి వర్షానికి సుమారు 15వేల ఎకరాల్లో విత్తనాలు వేశారు. ఎకరానికి 2 విత్తన ప్యాకెట్ల చొప్పు 30 వేల ప్యాకెట్ల(ఒక్కో ప్యాకెట్ 450 గ్రాములు, ధర రూ.930) విత్తనాలను వేశారు. వర్షాలు కురిసి విత్తనాలు మొలుస్తాయనే ఆశతో విత్తనాలు వేసినప్పటికీ...పరిస్థితి భిన్నంగా మారటంతో రైతుల్లో కలవరం నెలకొన్నది. ఒక్క గజ్వేల్‌లోనే కాదు జిల్లాలోని అన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొన్నది. వర్షాలు ఆలస్యం కావడంతోపాటు ఎండ తీవ్రత పెరగటం, ఎలుకల కారణంగా విత్తనాలు దెబ్బతినే పరిస్థితి నెలకొన్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. 14ఎకరాల్లో పత్తి విత్తనం వేసిన.. వర్షాలు కురుస్తయ్ కాద అనుకుని వారం రోజుల కిందట్నే..14 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేసిన. ఇందుకోసం 28 బీటీ విత్తన ప్యాకెట్లు కొనుగోలు చేసిన. వర్షం జాడ లేదు. ఎండకు భూమిలో వేసిన విత్తనంకు కాక పుడుతుంది. మరోవైపు ఎలుకలు తింటున్నయ్. ఇప్పటికైనా వానలు పడాలే. లేదంటే కష్టమైతది. - కామేపల్లి హరిబాబు (పత్తి రైతు, రిమ్మనగూడ) వర్షాలు వచ్చిన తర్వాతే పత్తి విత్తనాలు వేయాలి వర్షాలు రాకుండానే పత్తి విత్తనాలు వేయడం మంచిది కాదు. వర్షాలు వచ్చేదాక వేచి వుంటే బాగుంటుంది. జూలై నెలాఖరు వరకు బీటీ పత్తి విత్తనాలు వేసినా ఇబ్బంది లేదు. దిగుబడులు కొంత తగ్గినా.. మొలవని స్థితిలో విత్తనాల నష్టానికి గురి కాకుండా ఉంటుంది. రైతులు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. -జేడీఏ హుక్యా నాయక్ -
నట్టేట ముంచారు
మొక్కజొన్న రైతుకు కుచ్చుటోపీ పండిన పంటను తీసుకెళ్లి ఎగనామం చక్రాయపేట:మొక్కజొన్న సాగు చేస్తే ఖర్చులన్నీ తామే భరిస్తామన్నారు.. దగ్గరుండి పంటను చూసుకుంటామన్నారు.. పండిన కంకులను తామే కొంటామన్నారు.. దిగుబడి రాకపోతే చేతి నుంచి డబ్బు చెల్లిస్తామన్నారు.. ఇలా రైతులకు ఎన్నో ఆశలు రేపిన కావేరీ విత్తన కంపెనీ కుచ్చుటోపీ పెట్టింది. రైతులను నిలువునా ముంచేసి కంపెనీ ప్రతినిధులు ఉడాయించారు. దీంతో తీవ్రంగా నష్టపోయిన మొక్కజొన్న రైతులు పోలీసులను ఆశ్రయించనున్నారు. మొక్కజొన్న సాగుచేస్తే ఖర్చులన్నీ తామే భరిస్తామని..పండిన కంకులను పచ్చివే టన్ను రూ. 11వేలతో కొంటామని దిగుబడి రాకుంటే చేతి నుంచి చెల్లిస్తామని రైతులను నమ్మించి మండల వ్యాప్తంగా సుమారు వంద ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయించారు. ఎంత చేసినా దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది.ఎకరాకు నాలుగైదు టన్నులు కాదుకదా నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి రాలేదు. అంతేగాక 10 రోజుల్లో డబ్బు చెల్లిస్తామని చెప్పి వచ్చిన దిగుబడిని కూడా లారీల్లో తీసుకెళ్లి చేతులెత్తేశారు. మరికొందరు రైతులు కంకులను వలిపించి విత్తనాలను సంచుల్లో నింపి ఇళ్లల్లోనే ఉంచుకున్నారు. తమను నిలువునా మోసం చేసిన కావేరి విత్తన కంపెనీ వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు పోలీసులను ఆశ్రయించనున్నారు. నమ్మకం కుదిరేందుకు.. రైతులకు నమ్మకం కలిగించేందుకు కావేరీ విత్తన కంపెనీ ఆర్గనైజర్ పోరుమామిళ్ల మండలం చెన్నారెడ్డిపేటకు చెందిన గురివిరెడ్డి,ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన రమణారెడ్డి (సబ్‌ఆర్గనైజర్) మండలంలో ఒక గదిని అద్దెకు తీసుకున్నారు.నిత్యం రైతుల పొలాల వద్దకు వెళ్లి పంటలను పర్యవేక్షిస్తూ వచ్చారు. వారి సూచనల మేరకు రైతులు రసాయన, సేంద్రీయ ఎరువులు వాడారు. క్రమం తప్పకుండా నీటి తడులు అందించారు. ఇలా రైతుల చేత ఎకరాకు రూ. 20 వేల వరకు ఖర్చు చేయించారు. పంట కోశాక పచ్చి కంకులే కొంటామన్న కంపెనీ ప్రతినిధులు 15 రోజులపాటు ఎండనిచ్చి తూకాలు వేయడంతో ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. ఇదేమిటని నిలదీయడంతో సరకు తూకం వేయండి.. డబ్బు ఇస్తామని చెప్పి ఉడాయించారని రైతులు వాపోతున్నారు. తాము తీవ్రంగా నష్టపోవడమే కాకుండా అప్పుల పాలు కావాల్సివచ్చిందని ఆవేదన చెందుతున్నారు. -
మొక్కజొన్న సాగు.. కొన్ని మెలకువలు
ఖరీఫ్‌లో మొక్కజొన్న పంటను వర్షాధారంగాను, నీటి వసతి కింద కూడా పండించుకోవచ్చు. ఈ పంటను విత్తనాల కోసం, కండెల కోసం, పాప్ కార్న్ కోసం, కూరగాయగా బేబీ కార్న్ రూపంలోనూ పండించుకోవచ్చు.విత్తనం కోసం పండించడానికి మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రీసెర్చ్ హైబ్రిడ్స్తోపాటు, వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన డీహెచ్ఎం 117, డీహెచ్ఎం 119, డీహెచ్ఎం 121 రకాలు సాగుకు అనుకూలం.వర్షాధారం పంటను జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. విత్తనం, భూమిలోని శిలీంద్రం నుంచి తొలిదశ మొక్కలను కాపాడటం కోసం 3 గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్ లేదా మాంకోజెబ్లలో ఏదైనా ఒక మందుతో విత్తన శుద్ధి చేయాలి. ఎకరాకు 8 కిలోల సంకర రకాల విత్తనాన్ని బోదెలపైన 1/3 వంతు ఎత్తులో విత్తితే వర్షం ఎక్కువైనప్పుడు నీరు బయటకు పోవడానికి వీలుంటుంది. బోదెకు, బోదెకు మధ్య దూరం 60 సెం. మీ., మొక్క కు, మొక్కకు మధ్య 20 సెం. మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి.పంట విత్తిన తరువాత రెండు, మూడు రోజుల లోపు అట్రజిన్ అనే కలుపు మందును తేలిక నేలల్లో ఎకరాకు 800 గ్రాములు, బరువు నేలల్లో అయితే ఎకరాకు 1200 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం వల్ల వెడల్పాటి, కొన్ని గడ్డి జాతి కలుపు మొక్కలను దాదాపు ఒక నెల వరకు అదుపు చేయవచ్చు.సంకర రకాలలో మంచి దిగుబడి కోసం ఎకరానికి 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేయాలి. 1/3 వ వంతు నత్రజనిని, మొత్తం భాస్వరాన్ని, సగభాగం పొటాష్ ఎరువును ఆఖరి దుక్కిలో వేయాలి. మిగిలిన 1/3 వ వంతు నత్రజనిని 30-35 రోజులకు, మరో 1/3వ వంతు 50-55 రోజుల మధ్య వేయాలి. మిగతా 1/2వ వంతు పొటాష్ ఎరువును పూత దశలో వేసుకోవాలి. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ -
వేసవిలో కుండపోత
ఖమ్మం, న్యూస్‌లైన్: మధ్యాహ్నం వరకు సూర్యుడు తన ప్రతాపం చూపించాడు... ఎండవేడిమికి జనం అల్లాడారు...అంతలోనే ఆకాశంలో మబ్బులు ఆవరించాయి... మధ్యాహ్నం నుంచి రాత్రి వర కు భారీవర్షం కురిసింది. ఇలా జిల్లాలో శుక్రవా రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కుండపోత కురియగా... పలుచోట్ల పిడుగులు పడ్డాయి. అకాలవర్షం అన్నదాతను అతలాకుతలం చేసింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మిర్చి, మొక్కజొన్న పంటలు తడిసి పోయాయి. విక్రయించేందుకు వ్యవసాయ మార్కెట్లకు, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన పంటఉత్పత్తులు తడిసి ముద్ద అయ్యాయి. పిడుగుపాటు కారణంగా పినపాక మండలంలో ఓ మహిళ మృతిచెందగా, ఇల్లెందు మండలం లో 32 మేకలు చనిపోయాయి. గాలి దుమారం తో పలుచోట్ల లైన్లు తెగి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం ప్రాంతాల్లో డ్రైన్లు పొంగి పొర్లడంతో రోడ్లపైకి, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్షం మూలంగా జిల్లాలో సుమారు రూ. 30కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు రైతులు సంఘాల నాయకులు చెబుతుండగా.. అసలు నష్టమే జరగలేదని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడం గమనార్హం. భారీవర్షంతో... ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రైతులు తెచ్చిన మిర్చి, పత్తి, మొక్కజొన్న ఉత్పత్తులు తడిసి పోయాయి. నగరంలో డ్రైన్లు పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో వరదనీరు రోడ్లపైకి రావడంతో రోడ్లు జలమయం అయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కాలనీల్లో నీరు నిలిచిపోయి ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రఘునాధపాలెం మండలంలో వీవీపాలెం, రఘునాథపాలెం, చింతగుర్తి, వేపకుంట్ల, గణేశ్వరం, మల్లేపల్లి, ఈర్లపుడి, రాంక్యాతండా, పంగిడి, మంచుకొండ, బూడిదంపాడు, చిమ్మపుడి, కోటపాడు ప్రాంతాల్లో మిర్చి, ధాన్యం తడిసిపోయాయి. మామిడి కాయలు నేలరాలాయి. కూరగాల పంటలు దెబ్బతిన్నాయి. ఇల్లెందు నియోజకవర్గంలో వరి చేతికొచ్చే దశలో భారీవర్షం కురవడంతో తీవ్రనష్టం వాటిల్లింది. మామిడి నేలరాలింది. కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. మాణిక్యారం గ్రామానికి చెందిన సూర్నపాక వీరభద్రం మేకల గుంపు మీద పిడుగు పడగా 32 మేకలు అక్కడిక్కడే మృతి చెందాయి. సుమారు రూ. 1.50 ల క్షలు నష్టం వాటిల్లింది. బయ్యారం మండలంలో 500 హెక్టార్లలో వరికి నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. వెంకట్యాతండాలో ఇంటి గోడ కూలి రెండు గొర్రె పొట్టేళ్లు మృతి చెందాయి. టేకులగుంపులో పిడుగు పడి దుక్కిటెద్దు మృతి చెందింది. మధిర నియోజకవర్గంలోని బోనకల్, చింతకాని మండలాల్లో గంటపాటు వర్షం కురిసింది. కల్లాల్లో ఉన్నమిర్చి, ధాన్యం, మొక్కజొన్న పంటలు తడిశాయి. ముష్టికుంట్ల, బోనకల్, ఆళ్లపాడు, మోటమర్రి గ్రామాల్లో ఈ నష్టం ఎక్కువగా ఉంది. ముదిగొండ మండలంలోని మాధాపురం, ఎడవల్లి, మేడేపల్లి, కమలాపురం తదితర గ్రామాల్లో వర్షం కురిసింది. ఈవర్షానికి కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. రైతులు ఉరుకులు పరుగులతో మొక్కజొన్నలపై పట్టాలు కప్పారు. ముదిగొండ, వెంకటాపురం, గోకినేపల్లి, చిరుమర్రి గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయమేర్పడింది. వర్షపునీటితో వీధులన్నీ జలమయ్యాయి. పినపాక మండలంలో పిడుగుపాటుకు చిరుమల్ల గ్రామంలో ఈసం సుజాత(35)అనే మహిళ మృతి చెందినది. బూర్గంపాడు మండలంలోని 200ల ఏకరాల్లో మామిడి నేలరాలింది. 50ఎకరాల్లో వరిపంట తడిసింది. అదే విధంగా మార్కెట్ గోడౌన్‌కు తీసుకువచ్చిన ధాన్యం సైతం తడిసిపోయింది. అశ్వాపురం మండలంలో కురిసిన వర్షం, గాలి దుమారానికి 50ఎకరాల వరిపంట నేలకొరిగింది. మణుగూరు మండలంలో సాంబాయిగూడెం, రామానుజవరంలో కోసిన పనలు తడిసినాయి. పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలంలోని బీరోలు, సుబ్లేడు, పాతర్లపాడు తదితర గ్రామాలలో కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి తీవ్ర నష్టం వాటి ల్లింది. వెదుళ్లచెరువు, కొక్కిరేణి గ్రామాలలో కల్లాల్లో ఆరబోసిన పసుపు పంట కూడా తడిసి తీవ్ర నష్టం వాటిల్లింది. నేలకొండపల్లి, కూసుమంచి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, ఖమ్మం రూరల్ మండలంలోని తీర్ధాల, ముత్తగూడెం, కొత్తూరు, ఏదులాపురం, గోళ్లపాడు తదితర గ్రామాలలో కల్లాల్లో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసి తీవ్ర నష్టం వాటిల్లింది. సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న కంకులు వర్షానికి తడవడం, మామిడి కాయలు రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేంసూరు మండలంలో శుక్రవారం వీచిన గాలులతో మామిడి కాయలు రాలిపోయాయి. పెనుబల్లి మండలంలో రబీ వరి పంట మూడు వేల ఎకరాలలో ఇంకా కోతలు పూర్తి కాకపోవటంతో నేలవాలింది. మిషన్లతో కోతలు కోసి కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిపోయింది. తల్లాడ మండలంలో కల్లాల్లో కాటా వేసిన ధాన్యం తడిసింది. వైరా నియోజకవర్గంలో వరి, మొక్కజొన్న, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా వైరా మండలంలో కోతకు వచ్చిన వరి పొలాలు నేలవాలాయి. ధాన్యం పొలాల్లో తడిసిపోయింది. కొనుగోలు కేంద్రం లేకపోవడంతో ఏఎంసీ ప్రాంగణంలో ఆరబోసిన మొక్కజొన్న, వరి ధాన్యం 200 క్వింటాళ్ళు తడిసి పోయాయి. కొణిజర్ల మండలంలో వరి 600 ఎకరాల్లో కోయాల్సి ఉండగా పూర్తిగా వరి పనలు వాలిపోయాయి. మరో 600 ఎకరాలల్లో ధాన్యం తడిసిపోయింది. మిర్చి కూడా కల్లాల్లో తడిసిపోయింది. ఏన్కూరు మండలంలో మొక్కజొన్న 60 ఎకరాలలో పూర్తిగా తడిసిపోయింది. పత్తి 100 క్వింటాళ్ళు ఏఎంసీలో తడిసిపోయింది. కారేపల్లి మండలంలో మామిడి కాయాలు నేల రాలగా, కల్లాల్లో మిర్చి తడి సిపోయింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో దాదాపు 500 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. చంద్రుగొండ మండలంలో కల్లాల్లోని మిర్చి తడిసి ముద్దయింది. కొత్తగూడెం నియోజకవర్గంలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురిసింది. వర్షం కారణంగా కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కొత్తగూడెం పట్ణణంలో అండర్‌బ్రిడ్జిలో భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. మామిడి కాయలు రాలిపోవడంతో రైతులకు నష్టం వాటిల్లింది. భద్రాచలం డివిజన్లోని చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లో భారీ వర్షం కురిసింది. వాజేడు మండలంలో కల్లాల్లో ఆరబోసిన 6వేల క్వింటాళ్ల మిర్చి, 500 క్వింటాళ్ల వరి ధాన్యం వర్షార్పణం అయింది. దుమ్ముగూడెం మండలంలో సున్నంబట్టి, బైరాగుల పాడు, బండిరేవు గ్రామాలలో కోసివుంచిన వరిపనలు వర్షానికి తడిసిముద్దయ్యాయి. -
కండెదశలో గండం !
చివరి దశలోను మొక్కజొన్న రైతులకు సాగునీటి కష్టాలు తప్పటం లేదు. ఆయకట్టు భూముల్లో సాగుచేసిన మొక్కజొన్న పంటకు నీటిని అందించడం రైతులకు కత్తిమీద సాములా మారింది. నగరం మండలంలోని పలు గ్రామాల్లో ఈ రబీ సీజన్లో సుమారు 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేపట్టారు. సాగు చేసి 60 నుంచి 70 రోజులు కావటంతో ప్రస్తుతం పంట కండెదశలో ఉంది. ఈ తరుణంలో పంటకు నీటిని అందించి ఎరువులు వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పంట కాలువల్లో అరకొరగా ఉన్న నీటిని పొలాలకు మళ్లించేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా చివరి భూములకు నీటి తడులు అందించేందుకు రైతులు అష్టకష్టాలను ఎదుర్కొంటున్నారు. కాలువలపై డీజిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసి ట్యూబ్‌ల సాయంతో నీటిని పంపుతున్నారు. ఈ క్రమంలో నీటి తడులకు ఎకరాకు రూ.1500 నుంచి రూ. 2000లకు పైగా అదనపు ఖర్చును భరించాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాల్లోని చివరి భూముల్లో వేసిన మొక్కజొన్న నీటి తడులు అందక ఎండిపోతోంది. బోరుల్లో కూడా నీరు అందకపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. నీరు అందక ఎండుతున్న పంటను చూసి రైతులు కంటతడిపెడుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటను రక్షించుకునేందుకు బోరులు వేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. మొక్కజొన్న పంట చేతికొచ్చే తరుణంలో సాగునీటి సమస్య ఉత్పన్నం కావడంతో ఆ ప్రభావం దిగుబడులపై పడనుందని ఆందోళన చెందుతున్నారు.నీటి వసతి కలిగిన రైతులు అదనపు ఖర్చుకు వెనుకాడక పంటను రక్షించుకుంటున్నారు.