మొక్క జొన్న రైతుకు మరో షాక్! | maize Purchases till 31st only | Sakshi
Sakshi News home page

మొక్క జొన్న రైతుకు మరో షాక్!

Published Fri, Dec 20 2013 4:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM

maize Purchases till 31st only

గజ్వేల్, న్యూస్‌లైన్: ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్రంగా నష్టపోయి కష్టాల్లో ఉన్న మొక్కజొన్న రైతులను మరింత ముంచేందుకు రంగం సిద్ధమైంది. ఉత్పత్తుల్లో 10 శాతం కూడా కొనుగోలు చేయకుండానే ప్రభుత్వరంగ సంస్థ మార్క్‌ఫెడ్...మక్కల కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసేందుకు సిద్ధమైంది. అందుకు ఈ నెల 31వ తేదీ గడువు విధించిన అధికారులు, ఇప్పటికే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. నిజానికి ఈనెల 15నే కేంద్రాలను మూసేయాలని నిర్వాహకులకు మార్క్‌ఫెడ్ నుంచి ఈ-మెయిల్ ద్వారా ముందుగా సమాచారమందించారు. కానీ, గజ్వేల్‌కు చెందిన ఓ రైతు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో గడువును 31 వరకు పొడిగించారు. కానీ ఈ పదిరోజుల్లో రైతులు తమ వద్ద ఉన్న ఉత్పత్తులను అమ్ముకోవడం సాధ్యంకాని పరిస్థితి. దీంతో ఇక తామంతా దళారుల బారిన పడడం ఖాయమని రైతులు ఆందోళన చెందుతున్నారు.
 
 జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 1.25 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగైంది. పత్తి తర్వాత ఇది ప్రధాన పంటగా ఆవిర్భవించింది. ఈసారి రైతులు మొక్కజొన్నపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ నవంబర్ నెల మూడో వారంలో తెరిపి లేకుండా వారం రోజుల పాటు కురిసిన వర్షాలకు ఈ పంటకు అపార నష్టం వాటిల్లింది. మొక్కజొన్న కట్ చేసే సమయంలో వర్షాలు కురవడంతో మొక్కజొన్న కండెలకు మొలకలు వచ్చి, మక్కలు పూర్తిగా రంగు మారాయి. నష్టాన్ని మినహాయిస్తే జిల్లావ్యాప్తంగా రైతులవద్ద సుమారు 62 లక్షల క్వింటాళ్లకుపైగా మొక్కజొన్న ఉత్పత్తులు ఉన్నట్లు అధికారుల అంచనా. దీంతో సర్కార్ రెండు నెలల కిందట జిల్లాలో 14 ఐకేపీ కేంద్రాలను తెరిచి వీటి ద్వారా క్వింటాలుకు రూ.1,310 చెల్లించి ఉత్పత్తులను కొనుగోళ్లు జరిపారు. ప్రైవేటు వ్యాపారులు మాత్రం క్వింటాలుకు రూ.1,050 మించి చెల్లించలేదు. పైగా క్వింటాలుకు 2కిలోలను తరుగు పేరిట కోత విధించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తమ ఉత్పత్తులను ఐకేపీ కేంద్రాలకే తరలిస్తున్నారు.
 
 వర్షాల కారణంగా గతంతో పోలిస్తే ఈసారి ఆలస్యంగా నూర్పిళ్లు జరిగాయి. అందువల్ల మక్కలు ఇప్పుడిప్పుడే మార్కెట్‌లోకి రావడం ఊపందుకున్నది. జిల్లావ్యాపంగా ఉన్న ఐకేపీ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు కేవలం 3.8 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయగలిగారు. ఈ లెక్కన చూస్తే రైతులు పండించిన మక్కల్లో కనీసం 10 శాతం కూడా కొనుగోలు చేయలేదన్నమాట. చాలా కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత, రవాణా పరమైన ఇబ్బందులతో కొనుగోళ్లు వేగంగా సాగడం లేదు. గజ్వేల్ మార్కెట్ యార్డులోని కేంద్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రైతులు తమ లైన్ కోసం రోజుల తరబడి నీరిక్షించాల్సి వస్తోంది. ఈ సమస్యలన్నీ పరిష్కరించి, కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చూడాల్సిన ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తొలుత ఈనెల 15న మక్కల కొనుగోలు కేంద్రాలను మూసేయాలని మార్కెఫెడ్ ద్వారా కేంద్రాల నిర్వాహకులకు ఈ-మెయిల్స్ సమాచారమందింది.
 
 సింగాటం రైతు ఫిర్యాదుతో 31 వరకు పొడగింపు
 ఈనెల 12న గజ్వేల్ మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రానికి గజ్వేల్ మండలం సింగాటం గ్రామానికి చెందిన పంజ రాజమల్లు అనే రైతు తాను పండించిన 120 క్వింటాళ్ల మక్కలను తీసుకొని వచ్చాడు. ఈనెల 15న కొనుగోలు కేంద్రాన్ని మూసేస్తున్నట్లు కేంద్ర నిర్వాహకులు చెప్పడంతో అతను దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. అప్పటికే  కేంద్రంలో మక్కల నిల్వలు పేరుకుపోగా, 15వ తేదీ లోగా తన మక్కలను అమ్ముకోలేమోనని ఆందోళన చెందాడు.
 
 వెంటనే ఈ విషయాన్ని నేరుగా జిలా కలెక్టర్‌కు ఫోన్‌లో వివరించాడు. వెంటనే స్పందించిన కలెక్టర్ కొనుగోళ్లను 31వరకు పొడగించాలని మార్కెఫెడ్ అధికారులకు సూచించారు. అందువల్లే 15నే కొనుగోలు కేంద్రాలు మూసివేయాలన్న నిర్ణయాన్ని మార్క్‌ఫెడ్ అధికారులు మార్చుకున్నారు. అయితే కలెక్టర్ ఆదేశాల మేరకు 31వరకు కొనుగోళ్లు జరిపినా రైతులకు పెద్దగా ప్రయోజనం చేకూరే అవకాశం లేదు. ఇప్పటివరకు 3.8 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేయగా మరో 12 రోజుల్లోగా సుమారు 2 లక్షల క్వింటాళ్లకు మించి కొనుగోళ్లను చేపట్టే అవకాశం లేదు. ఈ పరిస్థితిల్లో మిగిలిపోయిన ఉత్పత్తులన్నీ అతి తక్కువ ధరకే వ్యాపారులకు, దళారులకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 31న కేంద్రాలను మూసేస్తాం
 ఈనెల 31న ఐకేపీ మక్కల కొనుగోలు కేంద్రాలను ఎట్టిపరిస్థితుల్లో మూసేస్తాం. ఇందుకు సంబంధించి మాకు స్పష్టమైన ఆదేశాలందాయి. రైతులు ఈలోగా ఉత్పత్తులు అమ్ముకుంటే మేలు.
 -శ్రీదేవి, ఐకేపీ ఏపీఎం(మార్కెటింగ్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement