కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో నాలుగు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వరి, పత్తి, మొక్కజొన్న, సోయాతోపాటు పలు పంటలు తీవ్రం గా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంటలు నీటిపాలు కావడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆలస్యంగా తేరుకున్న వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు మొక్కుబడిగా సర్వే చేసి చేతులు దులుపుకున్నారు.
గురువారం వరకు సర్వే చేసిన లెక్కలను శుక్రవారం ఉన్నతాధికారులకు నివేదించారు. జిల్లాలో 15,530 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం జరగగా, 13,276 ఎకరాల్లో వరి, 2,253 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. 24 మండలాల్లో వరి, ఐదు మండలాల పరిధిలో పత్తి బాగా దెబ్బతిన్నట్లు నివేదించారు. జిల్లావ్యాప్తంగా 169 ఇళ్లు వర్షానికి పాక్షికంగా ధ్వం సం కాగా, ఒక పశువు మృతి చెందిందని రెవె న్యూ యంత్రాంగం నివేదికలో పేర్కొంది.
జిల్లాలో సాగైన పంటల్లో 3శాతం మాత్రమే నీటిపాలైనట్లు అధికారులు గుర్తించడంపై రైతు లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేలల్లో వర్షపు నీరు నిలిచి వరి, మొక్కజొన్న మొలకలొస్తుండగా జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయి లో అప్రమత్తంగా లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్షాలు ఆంధ్ర ప్రాంతంలోనే అధిక ప్రభావం చూపుతున్నాయని, జిల్లాలో పెద్దగా నష్టం లేదని క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు తేలిగ్గా తీసుకుంటున్నారు.
భారీ నష్టం..
నాలుగు రోజులుగా కురిసిన వర్షంతో జిల్లావ్యాప్తంగా 35వేల ఎకరాల్లో వరిపంట నీటమునిగినట్లు క్షేత్రస్థాయి పరిశీలిస్తే తెలుస్తోంది. పత్తి దాదాపు 12వేల ఎకరాల్లో తడిసిపోయి రంగుమారుతున్నట్లు చెబుతున్నారు. మొక్కజొన్న కోతలు దాదాపు పూర్తికాగా కల్లాల్లో, మార్కెట్‌యార్డుల్లో ఆరబెట్టుకున్నారు. వర్షాలకు తడిసి మక్కలు, కంకులు రంగుమారి, ముక్కిపోతున్నాయి. కానీ అధికారులు మొక్కజొన్న నష్టాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. జిల్లాలో సోయాబీన్ పంటకు కూడా తీవ్ర నష్టం జరిగింది. దాదాపు 5వేల ఎకరాల్లో పంట దెబ్బతిని రైతులు లబోదిబోమంటున్నప్పటికీ అధికారులు అటువైపు చూడలేదు. జిల్లావ్యాప్తంగా 50 మండలాలకు పైగా వర్షం ప్రభావమున్నప్పటికీ 26 మండలాల్లోనే పంటలు దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించారు. ఉద్యాన పంటలకు నష్టం లేదని ఆ శాఖ అధికారులు చెబుతుండగా, క్షేత్రస్థాయిలో పలు పంటలు దెబ్బతిన్నట్లు రైతులు మొత్తుకుంటున్నారు. నష్టం జరిగిన 26 మండలాల్లో 5 మండలాల్లోనే పత్తి పంటకు నష్టం వాటిల్లినట్లు గుర్తించడం వ్యవసాయ శాఖ నిర్లక్ష్యాన్ని మరోసారి తేటతెల్లం చేస్తోంది. దెబ్బతిన్న రోడ్లపై సర్వే చేస్తున్నామని ఆర్‌అండ్‌బీ అధికారులు పేర్కొన్నారు.
మరో ఐదు రోజులు వర్షాలు
అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో మరో ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పొలాలు, చేలల్లో వర్షపు నీరు నిల్వ ఉంటే నష్టం భారీగా పెరిగే అవకాశముంది. ఎప్పటికప్పుడు నివేదికలందించాల్సిన అధికారులు అప్రమత్తంగా లేకపోవడంతో అన్నదాతలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు 2.4 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పెద్దపల్లి, జూలపల్లి మండలాల్లో 5.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
మంత్రి సమీక్ష
వర్షం నష్టంపై మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులతో సమీక్షించారు. పంట గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరో రెండు రోజులు వర్షాలున్నందున ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో టార్ఫాలిన్లు, కనీస వసతులు కల్పించాలన్నారు. జమ్మికుంటలో తేమ కొలిచే పరికరాలు లేకపోవడంపై ఆ శాఖ అధికారులను మందలించారు. వెంటనే తెప్పించాలని ఆదేశించారు. మద్దతు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మద్దతు ధర, రైతుల సమస్యలపై ఫిర్యాదులకు సోమవారం లోగా ప్రతి మార్కెట్‌యార్డులో సెక్రటరీ, వ్యవసాయ అధికారి, రెవెన్యూ అధికారులతో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. మొక్కజొన్న నష్టం లేకపోవడమేమిటని అధికారులను ప్రశ్నించారు. త్వరలో పూర్తిస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఇన్‌చార్జి కలెక్టర్ అరుణ్‌కుమార్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అంచనా.. వంచన!
Published Sat, Oct 26 2013 2:56 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM
Advertisement
Advertisement