అకాల వర్షం రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. ఆరుగాలం శ్రమను నీటిపాలు చేసింది. చేతికొచ్చిన పంటలన్నీ వర్షార్పణమయ్యాయి. కొనుగోలు కేంద్రాలు, కల్లాలు, మార్కెట్‌యార్డుల్లో ఉన్న ధాన్యం నీటమునిగింది. వేలాది ఎకరాల్లో వరి నేలకొరిగింది. కూరగాయల తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొక్కజొన్న కంకులు, నువ్వులు, పసుపు తడిసిపోయాయి.
సాక్షి, కరీంనగర్ : నాలుగు రోజులుగా జిల్లాలో రోజుకో చోట కురుస్తున్న వర్షంతో ఇప్పటికే చాలా మేర పంటలు
నష్టపోయిన రైతులను గురువారం నుంచి శుక్రవారం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వాన రైతన్నకు కన్నీరే మిగిల్చింది. శుక్రవారం ఒక్క రోజే జిల్లాలో 21.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ధర్మపురిలో అత్యధికంగా 142.1 మి.మీ. నమోదు కాగా, పన్నెండు మండలాల్లో ఒక మి.మీ.కు తక్కువగా వర్షపాతం నమోదైంది.
గురువారం సాయంత్రం నుంచే మబ్బులు ఉండడంతో రైతులు తాము తెచ్చిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు కొనుగోలు కేంద్రాల్లోనే రాత్రంతా జాగారం చేశారు. గురువారం రాత్రే వర్షం మొదలవగా కొందరు కుప్పలపై కవర్లు కప్పుకుని రక్షించుకోగా చాలా చోట్ల కవర్లు లేక ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. ఐకేపీ, సహకార సంఘాల కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ కమిటీల్లో కొనుగోళ్లు ఆలస్యంగా మొదలవడంతో తమ వంతు వచ్చేవరకు పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో కురుస్తున్న వర్షాలు రైతులకు తీరని నష్టం మిగిలిస్తున్నాయి. మబ్బులు, వర్షంతో శుక్రవారం కొనుగోళ్లు నిలిచిపోయాయి.
తడిసిన ధాన్యం
కరీంనగర్ మండలం కొత్తపల్లి, బాహుపేట, జూబ్లీనగర్, చామనపల్లి, నగునూరు, చెర్లబూత్కూర్, మొగ్దుంపూర్, దుర్శేడు గ్రామాల్లోని ఐకేపీ, సింగిల్‌విండో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన 5 వేల క్వింటాళ్ల ధాన్యం తడిసింది. మండలంలో 2 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వేములవాడ మార్కెట్‌యార్డులో నిల్వ ఉన్న 15 వేల బస్తాల ధాన్యం కుప్పలు వర్షపు నీటిలో ముని గాయి. అనుపు రం, లింగంపె ల్లి గ్రామాల్లో అమ్మకానికి తీసుకువచ్చిన ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు బోరుమన్నారు.
బోయినపల్లి, ఇల్లంతకుంట, శంకరపట్నం, మానకొండూర్, బెజ్జంకి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. కొడిమ్యాల మండలంలో వంద ఎకరాల్లో కోతకు వచ్చిన పొలం నీటమునిగింది. హుజూరాబాద్‌లో 1200 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు నీటిపాలయ్యాయి. కమలాపూర్ ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం బస్తాల్లో నింపినప్పటికీ మిల్లుకు తరలించకపోవడంతో బస్తాలన్నీ తడిసిపోయాయి. మంథని డివిజన్ పరిధిలో 29 వేల ఎకరాల్లో వరి నీట మునిగిం ది. ఎల్కతుర్తి, ధర్మపురి, పెగడపల్లి, గొల్లపల్లి, ధర్మారం ఐకేపీ కేంద్రాల్లో వరిధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. కథలాపూర్ మండలంలో ఆరబోసిన నువ్వులు, పసుపు తడిసిపోయాయి. మహాముత్తారం మండలం పోలారం, ములుగుపల్లి గ్రామాల్లో కోసి పొలాల్లోనే ఉన్న వరి మెదలు నీట మునిగాయి. కమాన్‌పూర్‌లో 200 ఎకరాల్లో వరి నేలవాలింది.
నేలకొరిగిన పంటలు
చొప్పదండి, గంగాధర మండలాల్లో కోతకు వచ్చిన వరి నేలవాలింది. జగిత్యాల మండలంలో 1500 ఎకరాల్లో వరి నేలకొరిగింది. నువ్వు, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. సారంగాపూర్‌లో వెయ్యి ఎకరాల్లో వరి నేలవాలింది. కాటారం మండలం గంగారం, విలాసాగర్, ధర్మాసాగర్, దామెరకుంట గ్రామాల్లో 600 ఎకరాల మేర వరి నేలవాలింది. మల్హర్‌లో 700, రాయికల్‌లో 100 ఎకరాల పంట నేలకొరిగింది.
టార్పాలిన్ల కొరత
నాలుగైదు రోజులుగా వర్షం కురుస్తున్నా... రానున్న 48గంటల్లో వర్షం కురిసే అవకాశముం దని ముందే తెలిసినా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచలేదు. ధాన్యం రక్షణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వర్షం పడుతున్నా కప్పేందుకు టార్పాలిన్లు లేక తడిసి ముద్దయిం ది. కుప్పల వద్ద నిలిచి ఉన్న వర్షపునీటిని తొల గించుకునేందుకు రైతులు నానాకష్టాలు పడ్డా రు. అధికారుల తీరును ఎండగట్టారు.
జిల్లాకు వర్షసూచన
జగిత్యాల జోన్, న్యూస్‌లైన్ : రానున్న ఐదు రోజులపాటు ఆకాశం మేఘావృతమై ఉండి 79 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశముందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డెరైక్టర్ డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. గంటకు 7నుంచి 10 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు. వర్షాలు పడుతున్నందున వరి కోయరాదని, పంట నీళ్లలో మునిగిపోతే కాలువలు తీసి నీరు బయటకు వెళ్లేలా చూడాలని చెప్పారు. గింజలు మొలకెత్తకుండా ఉప్పు ద్రావణం పిచికారీ చేయాలన్నారు. శుక్రవారం 38.8 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని పేర్కొన్నారు. మే 10న 50 మి.మీ., 11న 17 మి.మీ., 12న 4 మి.మీ., 13న 4 మి.మీ., 14న 4 మి.మీ. వర్షం కురిసే అవకాశముందని తెలిపారు.
రైతుల రాస్తారోకో
కేంద్రాలకు ధాన్యం తెచ్చి మూడు రోజులైనా.. కొనుగోలు చేయలేదని, ఇప్పుడు వర్షంతో ధాన్యమంతా నీటిపాలైందని ఆవేదన చెందిన రైతులు పలు చోట్ల ఆందోళనకు దిగారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జగిత్యాల-నిజామాబాద్ జాతీయ రహదారిపై రెండు గంటలు రాస్తారోకో చేశారు. గొల్లపల్లిలో స్థానిక రహదారిపై ధర్నాకు దిగారు. చొప్పదండి మండలం గుమ్లాపూర్‌లో తూకం వేసిన బస్తాలు తడిసినా... మిల్లర్లు, అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు రాస్తారోకోకు దిగారు. ఐకేపీ కేంద్రాలు ఆలస్యంగా ఏర్పాటు చేయడంతోనే నష్టం వాటిల్లిందని వెల్గటూర్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మికుంట మార్కెట్‌యార్డులోనూ రైతులు ఆందోళన చేశారు.
పంటనష్టం
అంచనా వేస్తాం
- ప్రసాద్, జేడీఏ, కరీంనగర్
కరువు.. అకాలవర్షాలు.. ఈదురుగాలులు వచ్చి పంటనష్టం జరిగినప్పుడు.. ఆయా ప్రాంతాల్లో నష్టం అంచనా వేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీలు ఇప్పటికీ ఉన్నాయి. వర్షపాతం ఎక్కువగా నమోదైన మండలాల్లో వీఆర్వో, ఏఈవోలు పర్యటించి.. పంటనష్టం అంచనా వేస్తారు. వారు పంపిన నివేదికను మేం ప్రభుత్వానికి పంపిస్తాం.
వర్షార్పణం
Published Sat, May 10 2014 2:17 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
Advertisement