అకాల వర్షం.. పంట ఉత్పత్తులకు నష్టం
అకాల వర్షం.. పంట ఉత్పత్తులకు నష్టం
Published Wed, Mar 15 2017 12:56 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
- జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఓ మోస్తరు వర్షం
- ఆదోని మార్కెట్ యార్డులోతడిసి ముద్దయిన దిగుబడులు
జిల్లా పశ్చిమన ఉన్న ఆదోని, ఆలూరు, మంత్రాలయం తదితర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆదోని పట్టణంలో వర్షం తీవ్రత అధికంగా ఉండడంతో మురుగు కాల్వలు రోడ్డెక్కి పారాయి. మార్కెట్ యార్డుకు తెచ్చిన పంట ఉత్పత్తులు తడిచిపోయాయి. మిగతా ప్రాంతల్లో కూడా కల్లాల్లో ఉన్న ఆరబోసిన ఉత్పత్తులకు నష్టం వాటిల్లినట్లు తెలిసింది.
ఆదోని అగ్రికల్చర్/టౌన్: ఆదోనిలో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి మురుగు కాలువలు పొంగి పారాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుని మొదలైన వర్షం అరగంటకుపైగా కురిసింది. ఉరుములు, మెరుపులు, పెనుగాలతో కూడిన వర్షం కావడంతో పట్టణంతోపాటు శివారు జనం భీతిల్లిపోయారు. వర్షం కారణంగా మార్కెట్‌యార్డులో విక్రయానికి ఉంచిన ఉత్పత్తులు తడిసిపోయాయి. వేసవి కాలం కావడంతో రైతులు వర్షం గురించి పెద్ద జాగ్రత్తలు తీసుకోలేదు. సాయంత్రం సమయంలో ఉన్నట్టుండి కురిసిన వర్షం పంట ఉత్పత్తులను ముంచేసింది. పత్తి, వేరుశెనగ దిగుబడులు పూర్తిగా తడిచిపోయాయి. మంగళవారం మార్కెట్ యార్డుకు 7664 క్వింటాళ్ల పత్తి, 1061 క్వింటాళ్ల వేరుశెనగ, 141 క్వింటాళ్ల ఆముదం దిగుబడులను రైతులు విక్రయానికి ఉంచారు. పత్తి క్వింటాల్‌కు రూ.6,111, వేరుశెనగ రూ.6,310, ఆముదం రూ.3633 వరకు కొనుగోళ్లు జరిగాయి. సాయంత్రం అకాలంగా వర్షం రావడంతో ఉత్పత్తుల నిల్వలు అలాగే నిలిచిపోయాయి. టెండర్లు, తూకాలు ముగిసిన అనంతరం వర్షం కురిసింది. దీంతో రైతులకు నష్టం వాటిల్లే అవకాశం లేదని కమీషన్ ఏజెంట్లు తెలిపారు. వ్యాపారులు, కొనుగోలుదారులు నష్టం చవిచూడాల్సి వచ్చింది.
కౌతాళంలో వర్షం
కౌతాళం: వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతూ జనం బెంబేలెత్తిపోతున్న క్రమంలో మంగళవారం అనుకోకుండా మేఘాలు కమ్ముకుని వర్షం కురిసింది. దాదాపు గంటకు పైగా ఉరుములతో కూడిన వర్షం ఏకధాటిగా కురిసింది.
Advertisement
Advertisement