పత్తి రైతు కలవరం
గజ్వేల్, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రధాన పంటగా ఆవిర్భవించిన పత్తి సాగుపై రైతుల్లో కలవరం వ్యక్తమవుతున్నది. చేలల్లో విత్తనాలు వేసి వారం రోజులు గడుస్తున్నా.. వర్షాల జాడ లేక మొలకెత్తని పరిస్థితి నెలకొన్నది. ఫలి తంగా ఇప్పటికే భారీ నష్టం జరిగిపోయింది. కొన్నేళ్లుగా వరుస నష్టాలతో కునారిల్లుతున్న రైతు ఈసారైనా గట్టెక్కాలనుకుంటుండగా.. భిన్నమైన పరిస్థితులు నెలకొనడంతో ఆందోళన నెలకొన్నది. జిల్లాలో మొక్కజొన్న తర్వాత పత్తి రెండో ప్రధాన పంటగా కొనసాగుతోంది. కానీ కొన్నేళ్లుగా ఈ పంట సాగు రైతులకు కలిసి రావడం లేదు. మొల కెత్తే దశనుంచి పత్తి చేతికందే వరకు రైతులు ఎంతో శ్రమిస్తుండగా.. చివరకు మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కక అల్లాడుతున్నారు.
గతేడాది 1.20 లక్షల హెక్టార్లలో పత్తి సాగైంది. సుమారు 2.8 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడులు రాగా పత్తి రైతుల అవసరాల దృష్ట్యా జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, తొగుట, జోగిపేట, జహీరాబాద్‌లలో ఏర్పాటుచేసిన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కేంద్రాలు నామ్‌కే వస్తేగా మిగిలిపోయాయి. గజ్వేల్, సిద్దిపేటలలో కేంద్రాలను మొక్కుబడిగా తెరిచారు. కానీ కొనుగోళ్లు మాత్రం జరపలేదు. ఈ పరిణామం వ్యాపారులకు కలిసి వచ్చింది.
ఇష్టానుసారంగా రైతులను దండుకున్నారు. చేదు అనుభవాలను మరిచి ఈసారైనా పత్తి సాగు కలిసొస్తేందేమోననే భావనతో రైతులు ఈ పంట సాగుకు సిద్ధమయ్యారు. జిల్లాలో 1.73లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనావేసింది. ఇందుకోసం 7.18లక్షల బీటి పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని భావించారు. ఇందులో భాగంగానే జిల్లాకు ఇప్పటివరకు 4లక్షల విత్తన ప్యాకెట్లు విడుదలు కాగా లక్ష ప్యాకెట్లు అమ్ముడుపోయినట్లు వ్యవసాయశాఖ చెబుతున్నది. కొనుగోలుచేసిన విత్తనాలను రైతులు చేలల్లో వేశారు. విత్తన రూపేణా రైతుల రూ.9.30 కోట్ల వరకు, ఎరువులు, దున్నకాలు, కూలీల ఇతర పెట్టుబడుల రూపేణా మరో రూ.20 కోట్ల వరకు ఖర్చు చేశారు.
వర్షాలు కురవకపోవడం వల్ల ఈ పెట్టుబడులు నష్టపోవాల్సి దుస్థితి నెలకొన్నది. సాగుకు సంబంధించి గజ్వేల్ సబ్‌డివిజన్ పరిధిలో ప్రతిఏటా సాధారంగా 20 వేల హెక్టార్ల వరకు పత్తిని సాగుచేస్తారు. ఈసారి అవసరాలకోసం ఈ సబ్‌డివిజన్ పరిధిలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్ మండలాలకు లక్ష విత్తన ప్యాకెట్లు కేటాయించారు. ఇందులో ఇప్పటికే 30వేల ప్యాకెట్లకు పైగా అమ్ముడయ్యాయి. ఇదే క్రమంలో ఈసారి వారం రోజుల కిందట కురిసిన కొద్దిపాటి వర్షానికి సుమారు 15వేల ఎకరాల్లో విత్తనాలు వేశారు.
ఎకరానికి 2 విత్తన ప్యాకెట్ల చొప్పు 30 వేల ప్యాకెట్ల(ఒక్కో ప్యాకెట్ 450 గ్రాములు, ధర రూ.930) విత్తనాలను వేశారు. వర్షాలు కురిసి విత్తనాలు మొలుస్తాయనే ఆశతో విత్తనాలు వేసినప్పటికీ...పరిస్థితి భిన్నంగా మారటంతో రైతుల్లో కలవరం నెలకొన్నది. ఒక్క గజ్వేల్‌లోనే కాదు జిల్లాలోని అన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొన్నది. వర్షాలు ఆలస్యం కావడంతోపాటు ఎండ తీవ్రత పెరగటం, ఎలుకల కారణంగా విత్తనాలు దెబ్బతినే పరిస్థితి నెలకొన్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
14ఎకరాల్లో పత్తి విత్తనం వేసిన..
వర్షాలు కురుస్తయ్ కాద అనుకుని వారం రోజుల కిందట్నే..14 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేసిన. ఇందుకోసం 28 బీటీ విత్తన ప్యాకెట్లు కొనుగోలు చేసిన. వర్షం జాడ లేదు. ఎండకు భూమిలో వేసిన విత్తనంకు కాక పుడుతుంది. మరోవైపు ఎలుకలు తింటున్నయ్. ఇప్పటికైనా వానలు పడాలే. లేదంటే కష్టమైతది.
- కామేపల్లి హరిబాబు
(పత్తి రైతు, రిమ్మనగూడ)
వర్షాలు వచ్చిన తర్వాతే
పత్తి విత్తనాలు వేయాలి
వర్షాలు రాకుండానే పత్తి విత్తనాలు వేయడం మంచిది కాదు. వర్షాలు వచ్చేదాక వేచి వుంటే బాగుంటుంది. జూలై నెలాఖరు వరకు బీటీ పత్తి విత్తనాలు వేసినా ఇబ్బంది లేదు. దిగుబడులు కొంత తగ్గినా.. మొలవని స్థితిలో విత్తనాల నష్టానికి గురి కాకుండా ఉంటుంది. రైతులు ఈ విషయాన్ని తెలుసుకోవాలి.
-జేడీఏ హుక్యా నాయక్