ఇంతలో ఎంత మార్పు! | Meanwhile a change! | Sakshi
Sakshi News home page

ఇంతలో ఎంత మార్పు!

Published Fri, May 30 2014 11:31 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Meanwhile a change!

గజ్వేల్, న్యూస్‌లైన్: బీటీ పత్తి విత్తనాలపై రైతుల్లో క్రమంగా అవగాహన కలుగుతోంది. అన్ని కంపెనీల విత్తనాలు ఒకే రకమైన ఫలితాలను ఇస్తాయన్న వాస్తవాన్ని గమనిస్తున్నారు. ఫలితంగా వ్యాపారులకు సిరులు కురిపించిన కొన్ని కంపెనీలకు చెందిన బీటీ విత్తనాలకు ఈసారి జిల్లాలో  ఆదరణ తగ్గుతోంది. దీంతో కోట్ల రూపాయల బ్లాక్ మార్కెట్‌కు తెరపడింది.. మూడేళ్లుగా ఈ వ్యవహారంపై ‘సాక్షి’ సాగిస్తున్న అక్షర సమరానికితోడు వ్యవసాయశాఖ చేసిన ప్రయోగాత్మక ప్రచార పర్వం కారణంగా రైతుల ఆలోచన విధానంలో మార్పురావడానికి కారణమైంది.

ఈసారి కూడా ఓ కంపెనీకి చెందిన బీటీ విత్తనం అధిక దిగుబడులనిస్తున్నదని దుష్ర్పచారాన్ని లేవదీసీ టోకెన్ అమౌంట్ పేరిట ముందస్తు వసూళ్లు చేసిన ప్రయత్నానికి ఈనెల 4న ‘సాక్షి’ మెయిన్‌లో ప్రచురితమైన కథనంతో అధికారులు అప్రమత్తం కావడంతో అడ్డుకట్ట పడింది. జిల్లాలో పత్తి ప్రధాన పంటగా ఆవిర్భవించింది. ప్రతి ఏటా 1.50 లక్షల హెక్టార్లకుపైగా ఈ పంటను సాగుచేస్తున్నారు. పత్తి సాగుపై రైతుల ఆసక్తిని ఆసరాగా చేసుకుని వివిధ కంపెనీలు తమదైన శైలిలో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ‘తెల్ల బంగారం’ చుట్టూ కోట్ల రూపాయల టర్నోవర్ సాగుతున్నది.
 
 రెండేళ్ల కిందట జిల్లాలో ఖరీఫ్‌లో 1.32లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి సాగుచేయనున్న దృష్ట్యా 4 లక్షలకుపైగా బీటీ విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో కావేరి, నూజివీడు, అజిత్, మార్వెల్  తదితర 35 కంపెనీల నుంచి సుమారు 3.5లక్షలకు పైగా విత్తన ప్యాకెట్‌లు విడుదలైతే ఓ ప్రధాన కంపెనీ మాత్రం  కేవలం 15వేల ప్యాకెట్లను మాత్రమే మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఫలితంగా రైతులు ఆ కంపెనీ రకాల కోసం ఎగబడ్డారు. సాధారణంగా రూ.930కి విక్రయించాల్సిన విత్తన ప్యాకెట్‌లు కొరత కారణంగా వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు తెరతీశారు.
 
 ఒక్కో ప్యాకెట్‌ను రూ.3వేలకుపైగా విక్రయించి లక్షలు దండుకున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మ(అగ్రికల్చర్ టెక్నాలజీ మెనేజ్‌మెంట్ ఏజేన్సీ), వ్యవసాయశాఖ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వివిధ రకాల విత్తనాలను వేసిన పత్తి క్షేత్రాలపై అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే జిల్లాలో గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామంలో గతేడాది, ఈసారికూడా పలువురు భూముల్లో నాలుగైదు రకాలకు చెందిన విత్తనాలను సాగు చేయించి అన్నీ ఒకే రకమైన ఫలితాలనిస్తాయని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఈ ప్రయోగ ఫలితాలను కరపత్రాల ద్వారా రైతులకు వివరించగలిగారు. ఈ ప్రచారంలోనూ ‘సాక్షి’ తనదైన పాత్రను పోషించింది. ఎన్నోసార్లు ప్రత్యేక కథనాలను ప్రచురించి రైతుల ఆలోచనా విధానంలో మార్పుకు నాంది పలికింది.
 
 ప్రస్తుతం ఇలా....
 జిల్లాలో ఈసారి 1.73లక్షల హెక్టార్లకుపైగా పత్తి సాగయ్యే అవకాశమున్నదని వ్యవసాయశాఖ భావిస్తున్నది. ఇందుకోసం 6 లక్షల విత్తనాల ప్యాకెట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. 35 రకాల కంపెనీలకు విక్రయాలకు సంబంధించి వ్యవసాయశాఖ అనుమతినిచ్చారు. స్టాకు కొరత కూడా లేదు. కానీ ఈసారి కూడా ఓ ప్రధాన కంపెనీకి చెందిన ప్యాకెట్లు అధిక దిగుబడులనిస్తాయనే అపోహను కంపెనీల ప్రతినిధులు, వ్యాపారులు గజ్వేల్ కేంద్రంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే ఆ కంపెనీకి చెందిన ప్యాకెట్లు ఇవ్వడానికి టోకెన్ అమౌంట్ పేరిట రైతుల వద్ద రూ.100 నుంచి రూ.150 వసూలు చేశారు. ఈ విషయాన్ని పసిగట్టిన ‘సాక్షి’ ఈనెల ‘పక్కాగా బాక్ల్ దందా’ పేరిట మెయిన్‌లో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. ముందస్తు వసూళ్లను వ్యవసాయశాఖ కట్టడి చే సింది. ఈ విషయాన్ని గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ ‘న్యూస్‌లైన్’కు ధ్రువీకరించారు. బీటీ విత్తనాలన్నీ ఒకేరకమైనా ఫలితాలనిస్తాయని మరోసారి రైతులు చాటిచెప్పడంతో విత్తనాల ఎమ్మార్పీ ధర రూ .930 ఉండగా దీనికి రూ.100నుంచి రూ.200 తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఒక కంపెనీకి చెందిన విత్తనాలు మాత్రమే ప్రస్తుతం ఎమ్మార్పీకి విక్రయిస్తున్నారు. అయితే కంపెనీలు ఈ నష్టాన్ని భరించడానికి డీలర్లకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయాన్ని గజ్వేల్‌లో వ్యవసాయాధికారులు, విత్తనాల డీలర్లు ధ్రువీకరించారు.
 
 కోట్ల రూపాయల బ్లాక్ మార్కెట్‌కు తెర
 బ్రాండెడ్‌గా చెలామణి అయిన కొన్ని కంపెనీల ఆటలకు కళ్లెం పడింది.  వాటికి చెందిన విత్తనాల విక్రయాలకు సంబంధించి.. రెండేళ్లుగా విభిన్న పరిస్థితి తలెత్తిన కారణంగా కోట్ల రూపాయల అక్రమ దందాకు తెరపడింది. గతంలో ఒక్కో ప్యాకెట్‌పై రెండు రెట్లు అధికంగా ధరలను వసూలు చేయడం ద్వారా వ్యాపారులు కోట్లు దండుకున్నారు. అంతేకాకుండా కృత్రిమ కొరతను సష్టించి అక్రమ నిల్వలు తెప్పించుకుని అందినకాడికి దండుకున్నారు. ఈసారి పరిస్థితులు మారిపోవడంతో వారంతా డీలాపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement