దండుకుంటే దండనే
గజ్వేల్: విత్తనాలు, ఎరువుల విక్రయంలో ఎమ్మార్పీ కంటే ఒక్క పైసా వసూలు చేసినా సహించేది లేదని ఇన్‌చార్జి కలెక్టర్ శరత్ స్పష్టం చేశారు. రవాణా, హమాలీ చార్జీల పేరుతో దండుకోవాలనుకుంటే దండన తప్పదని ఆయన హెచ్చరించారు. శుక్రవారం గజ్వేల్‌లో వ్యవసాయశాఖ అధికారులు, ఫెర్టిలైజర్ దుకాణాల డీలర్లు, రెవెన్యూ అధికారులతో ఇన్‌చార్జి కలెక్టర్ శరత్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ , ఎరువులు, విత్తనాల అమ్మకాల్లో అక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈనెల 17 నుంచి తాను కూడా ఆకస్మిక తనిఖీలను నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్ శరత్ వెల్లడించారు. జిల్లాకు అవసరమైన మేర ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచుతామని, అయినా ఎవరైనా వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించాలనుకుంటే సహించేదిలేదన్నారు. కలెక్టరేట్‌లో రైతుల కోసం ప్రత్యేకంగా 08455-272525 నంబర్‌పై ఫిర్యాదు సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఎలాంటి అక్రమాలు జరిగినా ముందుగా అధికారులను కూడా బాధ్యులను చేసి, వారిపైనా కూడా చర్యలు తీసుకుంటామన్నారు. డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే క్రిమినల్ చర్యలు తప్పవన్నారు. ఈ సందర్భంగా పలువురు డీలర్లు తాము ఎమ్మార్పీపై విక్రయాలు జరిపితే రవాణా చార్జీల భారం, హమాలీ భారం తమపైనే పడుతుందని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని రైతుల వద్ద ఆ డబ్బులు తీసుకునేలా అనుమతి ఇవ్వాలని చేసిన విజ్ఞప్తిపై ఇన్‌చార్జి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మార్పీ కంటే ఒక్క పైసా ఎక్కువ వసూలు చేసినా సహించేదిలేదన్నారు.
పకడ్బందీ పంపిణీకి సిద్ధం
జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 5 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. ఇందులో భాగంగానే పత్తి 1.73 లక్షల హెక్టార్లు, వరి 90 వేల హెక్టార్లు, మొక్కజొన్న 1.50 లక్షల హెక్టార్లలో, మిగతా విస్తీర్ణంలో కూరగాయలు, ఇతర పంటలు సాగవుతాయని భావిస్తున్నారు. ఇందుకోసం అన్ని విత్తనాలు కలుపుకొని సుమారుగా 77 వేల క్వింటాళ్లు, సీజన్ ముగిసేసరికి కాంప్లెక్స్, యూరియా తదితర ఎరువులు కలుపుకొని 1.54 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని గుర్తించారు.
అయితే ఈ అలాట్‌మెంట్ ఏటా పద్ధతి ప్రకారం సరఫరా కాకపోవడంతో ప్రతిఏటా రైతులకు సమస్యలెదురవుతున్నాయి. డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో రైతులు రోడ్లెక్కుతున్నారు. అందువల్లే ఈసారి పకడ్బందీగా విత్తనాలు, ఎరువులను పంపిణీ చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే గతేడాది మాదిరిగానే విత్తనాలు, ఎరువుల దుకాణాలపై నిఘా పెంచే క్రమంలో ఈసారి కూడా 3 నుంచి 6 దుకాణాలకు ఒక అధికారిని ఇన్‌చార్జిగా నియమించేందుకు ఇన్‌చార్జి కలెక్టర్ శరత్ నిర్ణయించారు.
గజ్వేల్‌లో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇన్‌చార్జి అధికారులు ఆయా దుకాణాల్లో నిత్యం క్రయవ్రియాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. నిబంధనలు పాటించని దుకాణదారునిపై మండల వ్యవసాయాధికారికి, లేదా ఏడీఏకు ఇన్‌చార్జి అధికారులు రిపోర్ట్ చేయగానే తక్షణ చర్యలు తీసుకునేలా ఆదేశాలిచ్చారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే క్రిమినల్ చర్యలకు వెనకాడవద్దని నిర్ణయించారు. సమావేశంలో గజ్వేల్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రత్యేకాధికారి హన్మంతరావు, జేడీఏ హుక్యానాయక్, సిద్దిపేట ఆర్‌డీఓ ముత్యంరెడ్డి, గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.