సాక్షి, అమరావతి: మార్కెట్‌లో పంటల ధరలు పతనమైన ప్రతిసారీ రైతన్నను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తోంది. వ్యాపారులతో పోటీ పడి పంటలను కొంటూ ధరల పెరుగుదలకు కృషి చేస్తోంది. తాజాగా మొక్కజొన్న విషయంలోనూ ప్రభుత్వ చొరవ ఫలించింది. కనీస మద్దతు ధరకంటే తక్కువ పలికిన మొక్కజొన్న ధర ప్రభుత్వ జోక్యంతో తిరిగి రూ.2 వేలకు పైగా పలుకుతుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది..
గత మూడేళ్లుగా మంచి ధరలు పలికిన మొక్కజొన్న కొద్ది రోజుల క్రితం కనీస మద్దరు ధరకంటే తక్కువ ధర పలకడంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వెంటనే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపింది. మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద పంట కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. 20 రోజులు కూడా తిరక్కుండానే ధరలు పెరిగాయి. మొక్కజొన్న మద్దతు ధర క్వింటాలుకు రూ.1,962 కాగా, రెండు నెలల క్రితం వరకు రూ.2 వేలకు పైగా పలికింది. కొద్ది రోజుల క్రితం అనూహ్యంగా ధర తగ్గుతున్నట్లు ధరలను రోజూ సమీక్షించే సీఎం యాప్ ద్వారా గుర్తించారు.
అకాల వర్షాలు, ఇతర కారణాలను బూచిగా చూపించి మొక్కజొన్నను కనీస మద్దతు ధరకంటే తక్కువకు కొంటున్నట్లు గుర్తించారు. దీంతో సీఏం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఏపీ మార్క్‌ఫెడ్ రంగంలోకి దిగింది. 66 వేల టన్నుల మొక్కజొన్నను నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా కనీస మద్దతు ధరకు కొనుగోలు ప్రారంభించింది. పంట అధికంగా సాగయ్యే గుంటూరు, ఎన్టీఆర్, అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, బాపట్ల, పల్నాడు, శ్రీ సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో 1,548 ఆర్బీకేల పరిధిలో ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
వీటిలో 24,871 మంది రైతులు నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు 4,500 మంది రైతుల నుంచి రూ.65.14 కోట్ల విలువైన 33,199 టన్నుల మొక్కజొన్నను కనీస మద్దతు ధరకు కొన్నారు. వారం రోజుల్లోనే చెల్లింపులు కూడా చేస్తున్నారు. ఇప్పటికే రూ.20.59 కోట్లు చెల్లించారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలవడంతో వ్యాపారులు సైతం ధర పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ప్రస్తుతం రూ.2 వేల వరకు చెల్లించి కళ్లాల వద్దే కొంటున్నారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా మార్కెట్‌లో ధరలు నిలకడగా కొనసాగేంత వరకు ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను కొనసాగిస్తామని ఏపీ మార్క్‌ఫెడ్ ప్రకటించింది.
ధర మరింత పెరిగే అవకాశం
ప్రభుత్వ జోక్యంతో మొక్కజొన్న ధర పెరుగుతోంది. వారం క్రితం వరకు క్వింటా రూ. 1,750 కంటే తక్కువగా ఉండగా, ప్రస్తుతం రూ 2 వేల వరకు చెల్లించి మరీ కొంటున్నారు. ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దు. కనీస మద్దతు ధర దక్కని ఏ రైతు అయినా వారి పంటను ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా అమ్ముకోవచ్చు. – రాహుల్ పాండే, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్
నష్టం రాకుండా.. కష్టం లేకుండా..
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పలివెలకి చెందిన ఈ రైతు పేరు టి.శ్రీనివాస్. తన సోదరుడితో కలిసి 20 ఎకరాల్లో వరి పంట వేశారు. పదెకరాల్లో సాధారణ రకం.. మరో పదెకరాల్లో బొండాలు రకాలు ఊడ్చారు. సాధారణ ర కం ధాన్యం 200 క్వింటాళ్ల వరకు దిగుబడి వ చ్చింది. రూ.4.08 లక్షల విలువైన ఆ ధాన్యాన్ని ఈ నెల 22న ఆర్బీకేలో విక్రయించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేపట్టిన తర్వాత రైతులకు ఎంతో మేలు జరుగుతోందన్నాడు.
‘ఒకప్పుడు దళారి చెప్పిందే రేటు.. అతను కొనేదే ధాన్యం అన్నట్టు ఉండేది. ఏనాడూ పూర్తిగా మద్దతు ధ ర చూసేవాళ్లం కాదు. ఇప్పుడు పొలం దగ్గరకే వచ్చి ధాన్యం కొనే పరిస్థితిని ప్రభుత్వం కల్పించడంతో రైతుల కష్టం చాలా వరకు తగ్గిపోయింది’అని చెప్పాడు. బొండాలు ధాన్యాన్ని ఆరబెట్టాల్సి ఉందని, ఆ ధాన్యాన్ని కూడా ప్రభుత్వం మద్దతు ధర కు కొ నుగోలు చేస్తామని చెప్పడంతో మార్కెట్‌లో వ్యా పారులు ధర పెంచి కొంటున్నారని చెప్పాడు.
గింజ కూడా వదలడం లేదు
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రుకి చెందిన ఈ రైతు పేరు చింతలపాటి బలరామరాజు. ఆయనకు 8 ఎకరాలు సొంత పొలం ఉంది. మరో 15 ఎకరాలను కౌలుకు తీసుకుని మొత్తం 23 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. మొత్తం 2,280 బస్తాల (ఒక్కొక్క బస్తా 40 కేజీలు) ధాన్యాన్ని ఆర్బీకేలో విక్రయించగా.. వారం రోజుల్లోనే రూ. 18,60,480 నగదు ఆయన ఖాతాలో జమయ్యింది.
‘మా గ్రామంలో ఒక్క గింజ కూడా వదలకుండా ధాన్యం కొంటున్నారు. అందుకు నేనే ఉదాహరణ. ఒకప్పుడు ధాన్యం అమ్మితే డబ్బులు కోసం ఆరేసి నెలలు ఎదురు చూడాల్సి వచ్చేది. వర్షాల సమయంలో అయితే ఆర్బీకే సిబ్బంది నుంచి వీఆర్వో, జిల్లాస్థాయి అధికారుల వరకూ గ్రామాల్లోనే ఉండి ధాన్యం కొన్నారు. రోజుకు 25 వాహనాల్లో ఊరిలో మొత్తం ధాన్యాన్ని తరలించేశారు. ఖరీఫ్‌తో పోలిస్తే రబీలో నాకు మంచి దిగుబడి వచ్చింది’ అని బలరామరాజు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment