సాక్షి, అమరావతి: కొద్దిరోజులుగా ధరలేక ఇబ్బందిపడుతున్న పసుపు రైతుకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కనీస మద్దతు ధర రూ.6,850గా నిర్ణయించి, 20వేల టన్నులు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఆర్బీకేల ద్వారా ఈ నెల 5వ తేదీ నుంచి కొనుగోలు చేసేందుకు ఏపీ మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేసింది.
నాలుగేళ్లలో 52 వేల టన్నుల పసుపు కొనుగోలు
కేంద్రం కనీస మద్దతు ధరలు ప్రకటించే పంటల జాబితాలో లేని పసుపునకు గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తోంది. ధర తగ్గిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద మార్కెట్‌లో జోక్యం చేసుకుని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది.
ఇలా 2019–20 నుంచి ఇప్పటివరకు 29,193 మంది రైతుల నుంచి రూ.405.11 కోట్ల విలువైన 52,456.82 టన్నుల పసుపును సేకరించింది. అదే టీడీపీ ఐదేళ్ల పాలనలో 28 వేలమంది రైతుల నుంచి రూ.305 కోట్ల విలువైన 48,540.38 టన్నులను మాత్రమే కొనుగోలు చేశారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా గత రెండేళ్లుగా పసుపు ధరలు ఆకాశానికి ఎగబాకాయి. ఒకదశలో క్వింటా రూ.10 వేలకుపైగా పలికింది.
నెలరోజుల కిందటి వరకు రూ.7 వేల నుంచి రూ.8 వేల మధ్య పలికింది. సాధారణంగా 50 శాతం రాష్ట్ర పరిధిలో వినియోగిస్తుండగా, 20 శాతం పొరుగు రాష్ట్రాలకు, 30 శాతం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. 2022–23లో రికార్డు స్థాయిలో 84 వేల ఎకరాల్లో సాగుచేయగా, నాలుగు లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఇప్పటికే 50 శాతానికిపైగా మార్కెట్‌కు వచ్చింది.
సీఎం యాప్ ద్వారా నిరంతర పర్యవేక్షణ
డిమాండ్‌కు మించి పసుపు వస్తుండడంతో పాటు దేశీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కొద్దిరోజులుగా మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం నాణ్యమైన పసుపు క్వింటా ధర రూ.5,500 నుంచి రూ.6,300 వరకుపలుకుతోంది.
సీఎం యాప్ ద్వారా మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం పసుపు రైతులకు అండగా నిలవాలని నిర్ణయించింది. మరోసారి మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద మార్కెట్‌లో జోక్యం చేసుకుంటోంది. ఇప్పటివరకు మార్కెట్‌కు ఎంత వచ్చింది. ఇంకా రైతుల వద్ద ఏ మేరకు నిల్వలున్నాయని ఆర్బీకే స్థాయిలో సర్వే చేసింది.
వైఎస్సార్, నంద్యాల, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలోని రైతుల వద్ద పసుపు నిల్వలు ఉన్నట్లు గుర్తించింది. ఆయా జిల్లాల పరిధిలోని ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. రైతుల వద్ద ఉన్న పసుపు నిల్వలను నాణ్యతను బట్టి కనీస మద్దతు ధర రూ.6,850కి కొనుగోలు చేయనుంది.
సీఎం ఆదేశాల మేరకు..
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కనీస మద్దతు ధరకు రైతుల వద్ద ఉన్న పసుపును ఆర్బీకేల ద్వారా కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశాం. ఆర్బీకేల ద్వారా రైతులు తమ వివరాలను నమోదు చేసుకుంటే, వారివద్ద ఉన్న ఫైన్ క్వాలిటీ పసుపును కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. – రాహుల్‌పాండే, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్
Comments
Please login to add a commentAdd a comment