మద్దతు ధరకంటే తగ్గిపోయిన మార్కెట్ ధర
రైతులను ఆదుకొనేందుకు రంగంలోకి దిగిన ప్రభుత్వం
హైబ్రిడ్ రకం జొన్నలు మద్దతు ధరకు కొనాలని అధికారులకు ఆదేశం
27,722 టన్నుల జొన్నల కొనుగోలుకు అనుమతి
క్వింటాల్ రూ.3,180 చొప్పున కొనుగోలు
నేటి నుంచి ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హైబ్రీడ్ రకం జొన్నల మార్కెట్ ధర మద్దతు ధరకంటే తక్కువగా ఉండటంతో రైతులను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద వెంటనే హైబ్రీడ్ రకం జొన్నలు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించింది. 27,722 టన్నుల హైబ్రీడ్ రకం జొన్నలు కనీస మద్దతు ధర క్వింటాలు రూ.3,180కు కొనుగోలుకు అనుమతినిచ్చింది. ఈమేరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ స్పెషల్ సీఎస్ అహ్మద్ బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బుధవారం నుంచి ఆర్బీకేల ద్వారా జొన్న రైతుల రిజిస్ట్రేన్‌కు మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేసింది.
రబీ సీజన్‌లో 2.38 లక్షల ఎకరాల్లో జొన్న పంట సాగైంది. రెండో ముందస్తు అంచనా ప్రకారం 4.50 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. హైబ్రీడ్ రకం క్వింటాలు రూ.3180గా, మల్దిండి రకం క్వింటాలు రూ.3,225గా ప్రభుత్వం నిర్ణయించింది. హైబ్రీడ్ రకం ఆహార అవసరాల కోసం, మల్దిండి రకం పారిశ్రామిక అవసరాల కోసం వినియోగిస్తుంటారు. హైబ్రీడ్ జొన్నల ధర మార్కెట్‌లో ప్రస్తుతం క్వింటాలు రూ.2,500 నుంచి రూ.2,600 వరకు పలుకుతోంది. మద్దతు ధరకంటే మార్కెట్ ధర తక్కువ ఉండటంతో జొన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా (మోర్ ప్రిఫర్డ్ వెరైటీగా) గుర్తింపు పొందిన హైబ్రీడ్ రకం జొన్నలను 27,722 టన్నులు కొనడానికి అనుమతినిచ్చింది. బుధవారం నుంచి మే 31వ తేదీ వరకు రైతుల నుంచి ఈ రకం జొన్నలను సేకరిస్తారు. ఇప్పటికే కనీస మద్దతు ధరలకు రబీ సీజన్‌లో పండిన శనగ, మినుము, పెసర, వేరుశనగ పంటలను ఆర్బీకేల ద్వారా ఏపీ మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తోంది.
తక్కువకు అమ్ముకోవద్దు
కనీస మద్దతు ధరకంటే తక్కువకు ఏ రైతూ అమ్ముకోవద్దు. జొన్న రైతులను ఆదుకునేందుకే ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. 27,722 టన్నుల సేకరణకు అనుమతినిచ్చింది. మద్దతు ధర దక్కని రైతులు ఆర్బీకేల ద్వారా వివరాలు నమోదు చేసుకొని వారి వద్ద ఉన్న హైబ్రీడ్ రకం జొన్నలను అమ్ముకోవచ్చు. – డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఏపీ మార్క్‌ఫెడ్
Comments
Please login to add a commentAdd a comment