ఐదేళ్లలో రూ. 7,757.87 కోట్ల విలువైన 21.61 లక్షల టన్నులు సేకరణ
రబీ సీజన్‌లో 3.88 లక్షల టన్నుల పంట ఉత్పత్తుల సేకరణకు ప్రభుత్వం అనుమతి
పంట ఉత్పత్తుల సేకరణకు రుణాలు తీసుకోవడం ఎప్పుడూ జరిగేదే
రైతులకు సకాలంలో చెల్లింపుల కోసమే ఈ ఏర్పాటు
ఈనాడు కథనాన్ని ఖండించిన మార్క్‌ఫెడ్ ఎండీ శేఖర్‌బాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పండిన పంటలను రైతులకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నా విమర్శించడం సరికాదని మార్క్‌ఫెడ్ ఎండీ గెడ్డం శేఖర్‌బాబు చెప్పారు. పంట ఉత్పత్తుల కొనుగోలుపై ఈనాడు పత్రిక రాసిన కథనాన్ని ఆయన ఖండించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా సీఎం యాప్ ద్వారా గ్రామాలవారీగా పంట ఉత్పత్తుల మార్కెట్ ధరలను పర్యవేక్షిస్తూ, మద్దతు ధర దక్కని పంటలను ధరల స్థిరీకరణ నిధి (పీఎస్‌ఎఫ్) ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని ఆయన చెప్పారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ 57 నెలల్లో 6.18 లక్షల రైతుల నుంచి రూ.7,757.87 కోట్ల విలువైన 21.61 లక్షల టన్నుల పంట ఉత్పత్తులను సేకరించామన్నారు. ప్రస్తుత రబీ సీజన్‌లో శనగలు, మినుములు, పెసలు, వేరుశనగలు, జొన్నలు, మొక్కజొన్నలు కలిపి 3.88 లక్షల టన్నుల సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. మొక్కజొన్న క్వింటాలు రూ.2,090 చొప్పున 85 వేల టన్నుల సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఈ 57 నెలల్లో రూ.1,648 కోట్ల విలువైన 9.10 లక్షల టన్నుల మొక్కజొన్నను సేకరించామన్నారు.
ఫలితంగా మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు గణనీయంగా పెరిగాయని చెప్పారు. మొక్కజొన్న గతేడాది రూ. 2 వేల నుంచి రూ.2,400 వరకు పలికిందన్నారు. ప్రస్తుతం మొక్కజొన్నకు పౌల్ట్రీతో పాటు ఇథనాల్ పరిశ్రమల నుంచి మంచి డిమాండ్ ఏర్పడటంతో మార్కెట్‌లో ఈ పంట ధరలు నిలకడగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రధాన మార్కెట్లలో క్వింటాలు రూ.2 వేల నుంచి రూ. 2,600 వరకు పలుకుతోందన్నారు. మార్కెట్ సదుపాయం లేని చోట్ల చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం మొక్కజొన్న సేకరణకు అనుమతినిస్తుందని తెలిపారు.
ప్రతి ఏటా మద్దతు ధర దక్కని పంటలకు రైతుకు మద్దతు ధర కల్పించడానికి ప్రభుత్వం మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీం కింద మార్కెట్లలో జోక్యం చేసుకుంటుందని చెప్పారు. అదే రీతిలో ఈ ఏడాది కూడా 85 వేల టన్నుల సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. సకాలంలో చెల్లింపుల కోసం రుణాలు తీసుకోవడం ఏటా జరిగే ప్రక్రియేనని చెప్పారు.
సేకరించిన పంట ఉత్పత్తులను మార్కెట్‌లో విక్రయించగా వచ్చే సొమ్ముతో రుణాలు సర్దుబాటు చేసుకుంటామని, అవసరమైతే పంట ఉత్పత్తుల సేకరణకు తీసుకునే రుణాలను వడ్డీతో సహా ధరల స్థిరీకరణ నిధి నుంచి ప్రభుత్వం సర్దుబాటు చేస్తుందన్నారు. ఇందులో తప్పేమిటని ప్రశ్నించారు. సన్న, చిన్నకారు రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుంటే పనిగట్టుకొని విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment