మార్క్‌ఫెడ్‌లో ముక్కిన మక్కలు!
⇒ దళారులతో కుమ్మక్కై పురుగులు పట్టిన మొక్కజొన్న సేకరణ
⇒ కొనుగోలు చేసేందుకు ఎఫ్‌సీఐ నిరాకరణ
⇒ అడ్డదిడ్డంగా టెండర్లు పిలిచి అమ్మేసిన వైనం
⇒ మార్‌కఫెడ్‌కు రూ. 100 కోట్లు నష్టం
సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్‌లో అవినీతి రాజ్యమేలుతోంది. దళారుల నుంచి పురుగులు పట్టిన, పుచ్చిపోయిన మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేసి...
ఆ తర్వాత అతి తక్కువ ధరకు వ్యాపారులకు కట్టబెట్టడుతున్నారు. దీంతో మార్క్‌ఫెడ్‌కు అక్షరాలా రూ. 100 కోట్ల మేర నష్టం వాటిల్లింది. మక్కల కొనుగోళ్లలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలంటూ వ్యవసాయ, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి రెండు లేఖలు ఇచ్చినా... సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పినా మార్క్‌ఫెడ్ యంత్రాంగం స్పందించడం లేదు.
పురుగుపట్టిన మొక్కజొన్నగా నిర్ధారించిన ఎఫ్‌సీఐ
తెలంగాణలో సుమారు 15 లక్షల ఎకరాల్లో మక్కలు సాగు చేస్తారు. రైతులు పండించిన మక్కలను కొనుగోలు చేసేందుకు మార్కెట్ యార్డుల్లో ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. ఆ ప్రకారం 2013-14లో మార్క్‌ఫెడ్ తెలంగాణలో రూ.13,100 కనీస మద్దతు చెల్లించి సుమారు 2.52 లక్షల టన్నులు కొనుగోలు చేసింది. అందులో దాదాపు సగం వరకు దళారుల నుంచి కొనుగోలు చేసినట్లు అంచనా.
మార్‌కఫెడ్ సేకరించిన వాటిని ఎఫ్‌సీఐ కొనుగోలు చేయాల్సి ఉంది. కొనుగోలుకు ముందు గతేడాది మొక్కజొన్నలను పరిశీలించిన ఎఫ్‌సీఐ సాంకేతిక బృందం 27 వేల టన్నులు పురుగుపట్టిన స్టాక్ ఉందని నివేదిక ఇచ్చింది. మిగిలిన స్టాక్‌కూడా అదే విధంగా ఉంటుందని భావించిన ఎఫ్‌సీఐ మార్‌కఫెడ్ సేకరించిన 2.52 లక్షల టన్నులలో 2 వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. అప్పుడే అధికారంలోకి వచ్చిన తెలంగాణ సర్కార్‌కు మిగిలిన స్టాక్ ఏం చేయాలో పాలుపోక టెండర్లు పిలిచి అమ్మించాలని నిర్ణయించింది.
ఆ మేరకు టెండర్లు పిలిచి 2014 జూలై నుంచి డిసెంబర్ వరకు 2.50 లక్షల టన్నులు అమ్మేసింది. అయితే దళారులు, రైతుల నుంచి మద్దతు ధర రూ. 13,100కు కొనుగోలు చేసిన మార్క్‌ఫెడ్ టెండర్ల ద్వారా వ్యాపారులకు సరాసరి రూ. 10 వేల వరకు మాత్రమే విక్రయించింది. అలా టన్నుకు రూ. 3 వేల చొప్పున మొత్తం రూ. 75 కోట్లు నష్టం వాటిల్లింది. గోదాముల చార్జీలు, నిల్వ చార్జీలు కలిపి మరో రూ. 25 కోట్ల మేరకు ఉంటాయని అంచనా. ఆ చార్జీలను కూడా ఎఫ్‌సీఐ రాష్ట్రానికి చెల్లించలేదు. దీంతో మార్క్‌ఫెడ్‌కు రూ. 100 కోట్ల మేరకు నష్టం వచ్చింది. 2014-15లో మార్‌కఫెడ్ సేకరించిన 3 లక్షల టన్నుల మక్కలను కొనుగోలు చేసేందుకు ఎఫ్‌సీఐ ఇప్పటి వరకు ఆమోదం తెలపకపోవడం గమనార్హం.
అవినీతి అధికారులకు బదిలీలతో సరి...
అక్రమాలు జరిగాయని ఆరు నెలల క్రితం అప్పటి మార్క్‌ఫెడ్ ఎండీ దినకర్‌బాబు నిర్ధారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినా కిందిస్థాయి అధికారులు స్పందించలేదు. చివరకు వ్యవసాయ, సహకార ముఖ్య కార్యదర్శి ఈనెల 21న జీఎంకు లేఖ రాసినా చర్యలు శూన్యం. మరోవైపు జిల్లాల్లో అవినీతి అధికారులపై చర్యలు తీసుకోకుండా బదిలీలతో సరిపెడుతున్నారు. ప్రస్తుతం నిషేధం ఉన్నా గత శుక్రవారం 13 మందిని బదిలీ చేశారు.