సాక్షి, అమరావతి: మార్కెట్‌లో ధరలు పుంజుకున్నప్పటికీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మరికొంతకాలం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అనుమతికి మించి రైతుల నుంచి కొనుగోలు చేయడమేగాక సకాలంలో డబ్బు చెల్లిస్తూ వారికి బాసటగా నిలుస్తోంది.
ప్రభుత్వ జోక్యంతో మార్కెట్‌లో ధరలు మళ్లీ పుంజుకోవడంతో మొక్కజొన్న రైతులు సంతోషిస్తున్నారు. మార్కెట్‌లో ధరలు ఆశాజనకంగా ఉండడంతో కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. అయినప్పటికీ రైతు ప్రయోజనాల దృష్ట్యా ఈ నెల 12వ తేదీ వరకు కొనుగోళ్లు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పదిరోజుల్లోనే రైతులకు సొమ్ము
మార్కెట్‌లో ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. కనీస మద్దతుధర కంటే మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు తగ్గినట్టు సీఎం యాప్ ద్వారా గుర్తించిన మరుక్షణం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపింది. కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.1,962 కాగా, మార్కెట్‌లో రూ.1,500 నుంచి రూ.1,800 చొప్పున పలుకుతుండడంతో మొక్కజొన్న ఎక్కువగా సాగయ్యే జిల్లాల్లోని 1,548 ఆర్బీకేల పరిధిలో కొనుగోళ్లకు శ్రీకారం చుట్టింది.
మే 5వ తేదీన కొనుగోళ్లు ప్రారంభించింది. తొలుత 25,316 మంది రైతులు తమ వివరాలను ఆర్బీకేల్లో నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు 698 ఆర్బీకేల పరిధిలో 8,915 మంది రైతుల నుంచి కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.1,962 చొప్పున రూ.140.18 కోట్ల విలువైన 71,445 టన్నుల మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులకు పదిరోజుల్లోనే డబ్బు చెల్లిస్తోంది. ఇప్పటికే సీఎం యాప్ ద్వారా 6,292 మంది రైతులకు రూ.95.29 కోట్లు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని వారం, పదిరోజుల్లో చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎమ్మెస్పీకి మించి పలుకుతున్న ధర
ప్రభుత్వ జోక్యంతో వ్యాపారులు సైతం పోటీపడడంతో మార్కెట్‌లో ధరలు అనూహ్యంగా పుంజుకున్నాయి. ఫలితంగా ప్రస్తుతం సాధారణ కామన్ వెరైటీ సైతం కనీస మద్దతు ధరతో సమానంగా ఉండగా, ఫైన్ క్వాలిటీ మొక్కజొన్న ధర క్వింటాల్ రూ.2 వేలకు పైగా పలుకుతోంది. దీంతో రైతులు తమ వద్ద ఉన్న నిల్వలను బహిరంగమార్కెట్‌లో అమ్ముకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పటికే 85 శాతానికి పైగా రైతుల వద్ద ఉన్న నిల్వలు మార్కెట్‌లోకి వచ్చేశాయి. ఈ నేపథ్యంలో తొలుత ఈ నెల 9వ తేదీతో కేంద్రాలను మూసివేయాలని నిర్ణయించినా.. చివరి గింజ అమ్ముకునే వరకు రైతులకు అండగా నిలవాలన్న ప్రభుత్వ సంకల్పం మేరకు ఈ నెల 12వ తేదీ వరకు కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని మార్క్‌ఫెడ్ నిర్ణయించింది. సీఎం యాప్ ద్వారా ప్రతి రోజు మొక్కజొన్నతో సహా ఇతర పంట ఉత్పత్తుల మార్కెట్ ధరలను పర్యవేక్షిస్తున్నారు.
ప్రభుత్వం ఆదుకోకపోతే నష్టపోయేవాడిని..
పంట చేతికొచి్చంది. మార్కెట్‌లో ధర లేదు. పెట్టుబడి కూడా దక్కుతుందో లేదో అని ఆందోళన చెందా. ఏం చేయాలో పాలుపోలేదు. ప్రభుత్వం మా ఊళ్లోనే ఆర్బీకేలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. 113 క్వింటాళ్లు ఈ కేంద్రంలో అమ్ముకున్నా. పదిరోజులు తిరక్కుండానే క్వింటా రూ.1,962 చొప్పున రూ.2.22 లక్షలు నా అకౌంట్‌లో జమ అయ్యాయి. చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం ఆదుకోకపోతే నష్టపోయేవాడిని. – ఎస్.వెంకటేశ్వరరెడ్డి, పాలపాడు, పల్నాడు జిల్లా
కొనుగోలు కేంద్రంలో విక్రయంతో లబ్ధి
నేను 10 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశా. బయట క్వింటా రూ.1,600కు మాత్రమే కొంటున్నారు. దీంతో మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలనుకున్నా. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో నాలుగు రోజుల కిందట క్వింటా రూ.1,900 చొప్పున 10 టన్నులు విక్రయించా. దీంతో క్వింటాకు రూ.300 చొప్పున, 10 టన్నులకు రూ.30 వేల మేర లబ్ధి కలిగింది. – చీడెపూడి సాంబిరెడ్డి, వలివేరు, బాపట్ల జిల్లా
కేంద్రాలు కొనసాగిస్తాం
ప్రభుత్వ జోక్యం వల్ల వ్యాపారులు పోటీపడి కొంటున్నారు. దీంతో బహిరంగ మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కనీస మద్దతు ధరకు మించే కొనుగోలు చేస్తున్నారు. ఫైన్ క్వాలిటీ రూ.2 వేలకుపైగా పలుకుతోంది. ప్రభుత్వాదేశాలతో ఈ నెల 12వ తేదీ వరకు కేంద్రాలు తెరిచే ఉంటాయి. రైతుల నుంచి వచ్చే డిమాండ్‌ను బట్టి మరికొంతకాలం కొనుగోలు కేంద్రాలను కొనసాగిస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. – రాహుల్ పాండే, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్
Comments
Please login to add a commentAdd a comment