రైతు బాగే దేశ స్వావలంబన | There are several errors in determining the cost of production of crops | Sakshi
Sakshi News home page

రైతు బాగే దేశ స్వావలంబన

Published Sat, Mar 16 2024 2:50 AM | Last Updated on Sat, Mar 16 2024 2:50 AM

There are several errors in determining the cost of production of crops - Sakshi

పంటల ఉత్పత్తి ఖర్చు నిర్ధారణలో అనేక లోపాలు ఉన్నాయి. ఉత్పత్తి ఖర్చును రాష్ట్రాల వారీగా సేకరించి, దానిని దేశ ‘సగటు’గా మార్చడం వల్ల రైతులకు నష్టం జరుగుతున్నది. ఒకే పంటకు దేశ వ్యాప్తంగా సాగు ఖర్చులో తేడా ఉంటుంది. ప్రతి పంటలో అనేక వెరైటీలు ఉన్నా ఒకే మద్దతు ధరఉంటుంది. వరిలో కొన్ని వందల రకాలున్నా, కనీస మద్దతు ధర అన్నింటికీ ఒకటే. ఈ తేడాలను కనీస మద్దతు ధర నిర్ణాయక వ్యవస్థ పరిగణనలోనికి తీసుకునే పరిస్థితి లేదు. ధరలు రాని పంటలను రైతులు వేయడం మానేస్తారు. ఆ పంటలు వేయడం మానేస్తే, పంట పండించే జ్ఞానం, నైపుణ్యం కోల్పోతాము. క్రమంగా, స్వావలంబన కోల్పోతే ఇతర దేశాల పెత్తనానికి దాసోహం కావాల్సి వస్తుంది.

వ్యవసాయ ఖర్చులు ధరల కమిషన్‌ (సీఏసీపీ) కేవలం మద్దతు ధరను సిఫారసు చేస్తుంది. సిఫారసు చేసిందే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలని లేదు. ఉదా: 2023–24 రబీ సీజన్లో గోధుమలకు వారు క్వింటాలుకు రూ. 2,300 సిఫారసు చేస్తే, క్యాబినెట్‌ ఆమోదించింది రూ. 2,125 మాత్రమే. కనీస మద్దతు ధర నిర్ణయంలో కనీసం 12 అంశాలను పరిశీ లిస్తారు. అయితే 12 అంశాలలో ఉత్పత్తి ఖర్చు తప్పితే, మిగతాఅంశాలు కనీస మద్దతు ధర నిర్ణయంలో ఎటువంటి పాత్ర పోషి స్తాయో స్పష్టత లేదు. పంటల ఉత్పత్తి ఖర్చు నిర్ధారణలో కూడా అనేక లోపాలు ఉన్నాయి. ఉత్పత్తి ఖర్చు రాష్ట్రాల వారీగా సేకరించి, దానిని దేశ ‘సగటు’గా మార్చడం వల్ల కూడా రైతులకు నష్టం జరుగుతున్నది. ఒకే పంటకు దేశ వ్యాప్తంగా సాగు ఖర్చులలో తేడా ఉంటుంది. దీనిని సగటు చేస్తే, ఖర్చు ఎక్కువ అవుతున్న రైతులకు నష్టం అవుతున్నది. 

సాగు ఖర్చు ఎందుకు పెరుగుతున్నదనే విషయం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సమీక్ష ఎన్నడూ చేయలేదు. రైతు ఆత్మ హత్యల తదనంతరం జరిపిన అధ్యయనాలు రైతుల మీద పెరుగు తున్న ఖర్చు, మార్కెట్లో గిట్టుబాటు ధర పరిస్థితి గురించి ప్రధానంగా ప్రస్తావించాయి. రైతు కొనే విత్తనాలు, ఎరువులు, కీటకనాశకాలు  అన్ని కంపెనీల లాభాలు అవుతున్నాయి. కృత్రిమ ఎరువులు, రసా యన కీటక నాశకాలు సారవంతమైన మట్టిని విషతుల్యం చేస్తూ, రైతును ‘బానిసను’ చేస్తున్నాయి. 

రాష్ట్రాల వారీగా జరిపే ఉత్పత్తి ఖర్చు నిర్ధారణ కూడా సరిగా, పారదర్శకంగా లేదు. చిన్న రైతు ఎదుర్కొనే అన్ని రకాల ఖర్చులను సేకరించే వ్యవస్థ లేదు. రాష్ట్రాలు అందించే రాష్ట్ర స్థాయి ‘సగటు’ లెక్కలను సీఏసీపీ తన స్వీయ ఆలోచన మేరకు తగ్గిస్తూ ఉంటుంది. స్థూలంగా, పంటల మీద ఖర్చును దశల వారీగా, వివిధ స్థాయిలలో ‘తరుగు’ చేస్తున్నది. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చుని శాస్త్రీయంగా, పార దర్శకంగా నిర్ధారించే వ్యవస్థ అవసరం. రైతులు కోరుతున్నట్లుగా ధర లకు చట్టబద్ధత కల్పిస్తే, ఈ వ్యవస్థ లోపాలు బయటకు వస్తాయని కూడా విధాన నిర్ణేతల ఆందోళన కావచ్చు. ప్రపంచ వాణిజ్య సంస్థ పరిధిలో విధించిన షరతులు కూడా ఒక కారణం.

కనీస మద్దతు ధర అన్ని పంటలకు ఇవ్వరు. 1964–65లో వరి, గోధుమలకు మాత్రమే కనీస మద్దతు ధరను నిర్ణయించేవారు. కాలక్రమేనా 23 పంటలకు చేరింది. పసుపు, జొన్నలు, తృణధాన్యాలు వంటి పంటలకు లేవు. భారత దేశంలో దాదాపు 600 పంటలు పండించేవారు. అనేక పంటలు కనుమరుగు అయినాయి, అవుతున్నాయి. ఖర్చులు ఎక్కువ, రాబడి తక్కువ, సారవంతమైన మట్టి కనుమరుగు అవ్వడం, కలుషిత నీళ్ళు, నీటి కొరత, పురుగుల బెడద, వన్యప్రాణుల దాడులు, నాణ్యమైన విత్తనాల కొరత, కూలీల కొరత, ఇంకా ఇతర ఆర్థిక, సామాజిక, పర్యావరణ అంశాల నేపథ్యంలో రైతులు క్రమేణా కొన్ని పంటలకే పరిమితం అవుతున్నారు. ఈ నిర్ణయంలో కనీస మద్దతు ధర పాత్ర కూడా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

కనీస మద్దతు ధరల వ్యవస్థ మీద నాలుగు కమిటీలు అనేక సూచ నలు ఇచ్చాయి – ఝా కమిటీ (1965), సేన్‌ కమిటీ (1979), హను మంతరావు కమిటీ (1990), వై.కే.అలఘ్‌ కమిటీ (2005). 2007లో ప్రణాళిక సంఘం, 2017లో నీతి ఆయోగ్‌ నివేదికలు కూడా ఉన్నాయి. ఈ సూచనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. 2005 కమిటీ వ్యవసాయ ధరల కమిషన్‌కు చట్టబద్ధత కల్పించాలని సిఫారసుచేసింది. అంటే, కనీస మద్దతు ధర చట్టబద్ధతను అది ఆమోదించింది. ధర నిర్ణయంలో నాణ్యత కూడా కీలకం అని ఈ కమిటీ భావించింది.

వివిధ పంటలకు మార్కెట్‌ కాలం రెండు లేక మూడు నెలలు మాత్రమే ఉంటుంది. రబీ పంటల మార్కెటింగ్‌ కాలం ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మాత్రమే. ఆయా పంటల సరఫరా డిమాండ్లతోసంబంధం లేకుండా మద్దతు ధరలు మాత్రం సంవత్సరం పాటు స్థిరంగా ఉంటాయి. ప్రతి పంటలో అనేక రకాల వెరైటీలు ఉన్నా ఒకే మద్దతు ధర ఉంటుంది. వరిలో కొన్ని వందల రకాల విత్తనాలు ఉన్నా, కనీస మద్దతు ధర అన్నింటికీ ఒకటే. వరి రకం బట్టి పంట కాలం ఉంటుంది. ఆ మేరకు ఖర్చులలో కూడా తేడా ఉంటుంది. కొన్ని 80 రోజుల పంట అయితే, ఇంకొన్ని 160 రోజులు ఉంటాయి. ఈ తేడాను కనీస మద్దతు ధర నిర్ణాయక వ్యవస్థ పరిగణనలోనికి తీసుకునే పరిస్థితి లేదు. అంతా స్థిరమైన సగటు.

ధర రాక రైతులు రాబోయే సంవత్సరంలో ఈ పంట వేయడం ఆపేస్తే ఆ పంట సరఫరాపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దాని మీద ఆధారపడ్డ వినియోగదారులకు, పరిశ్రమలకు (పంట ముడిసరుకుగా వాడే వాటికి) ధర పెరుగుతుంది. ఏదైనా పంట దిగుబడి తగ్గి, సరఫరా తగ్గి, ధర పెరిగితే వెంటనే దిగుమతులకు అనుమతులు ఇస్తుంది ప్రభుత్వం. అయితే ఆ యేడు వరకే దిగు మతులను ‘నల్లా తిప్పి బంజేసినట్లు’ చేసే పరిస్థితి  ఉండదు. సాధారణంగా అంతర్జాతీయ వాణిజ్యంలో సరఫరా ఒప్పందాలు గిట్టుబాటుగా కొన్ని సంవత్సరాల కొరకు చేసుకుంటారు. దిగుమ తులు కొనసాగితే దేశీయంగా ధర మళ్లీ పెరిగే అవకాశం లేక రైతులు ఆ పంట వేయడం పూర్తిగా మానేస్తారు. పప్పుల విషయంలో అదే అయ్యింది.

2015లో కొరత ఉందని అనుమతిస్తే సరఫరా ఒప్పందాలు 7 సంవత్సరాలకు చేసుకుని దిగుమతులు పెంచారు. రైతులకు ధర వచ్చే ఆశ లేక పూర్తిగా వేయడం మానేశారు. దరిమిలా పప్పుల ఉత్పత్తిలో అగ్రగామి అయిన భారత్‌ ఇప్పుడు దిగుమతుల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. అటు వినియోగదారులకు పప్పుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పప్పులకు కనీస మద్దతు ధర (ఖర్చుకు అనుగుణంగా) ఇస్తేనే రైతులు మళ్లీ వేస్తారు. అధిక ధరలకు దిగుమతి చేసుకుంటున్న ప్రభుత్వం కనీస మద్దతు పెంచడానికి ఇష్టపడటం లేదు.

వంట నూనె విషయంలో ఇంకో విధంగా మన స్వావలంబన కోల్పోయాం. ముడి పామాయిల్‌ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు చేసిన వ్యవస్థ వల్ల ఏర్పడింది. తక్కువ ధరకు పామాయిల్‌ రావడంతో, తక్కువ ధరకు వినియో గదారులకు అందిస్తే రాజకీయ ప్రయోజనం అని చూసుకుని ప్రభుత్వం ఆయా సంవత్సరాలలో పెరుగుతున్న పామాయిల్‌ దిగుమతులను పట్టించుకోలేదు. పైగా దిగుమతి సుంకాలను సున్నా చేసింది. ఫలితంగా, మనం పండించే వేరుశనగ, నువ్వులు, ఆము దాలు, ఆవాలు వంటి 9 రకాల వంట నూనె గింజల పంటల విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది. వంట నూనె నిత్య అవసరం కాబట్టి ఇప్పుడు ఆ దిగుమతి మానలేము. అది మానకుంటే రైతులకు ధర రాక ఇక్కడ నూనె గింజల ఉత్పత్తి పెరిగే పరిస్థితి లేదు.

డిమాండ్‌ ఉన్న రకాల పంటలు వేసే ప్రోత్సాహక పరిస్థితి రైతులకు లేకుండా పోయింది. ప్రభుత్వం జోక్యం వల్ల మార్కెట్లకు నష్టం అని భావించేవారు, ఈ పరిస్థితిని ప్రభుత్వ జోక్యం లేకుండా ఎట్లా మారుస్తారో చెప్పాలి. రైతులు ఆ యా పంటలు వేయడం మానేస్తే, పంట పండించే జ్ఞానం, నైపుణ్యం, సామర్థ్యం కోల్పోతాము. ఇప్పుడు చెరుకు కోసే నైపుణ్యం ఉన్న కూలీలు దొరకడం లేదు. తిరిగి ఆ పంట కావాలంటే ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాల్సిందే. అప్పుడు పెట్టుబడులు పెట్టే బదులు, ప్రభుత్వం ఇప్పుడే మార్కెట్లో జోక్యం చేసుకుని, రైతులకు గిట్టుబాటు ధర ఇస్తే అందరూ సంతోషంగా ఉంటారు కదా! లేకుంటే మనం కొన్ని ఆఫ్రికన్‌ దేశాల మాదిరి అయి పోతాం. నిరంతరం సముద్ర తీరాల వైపు చూడాల్సి వస్తుంది. క్రమంగా, స్వావలంబన కోల్పోతే ఇతర దేశాల పెత్తనానికి దాసోహం కావాల్సి వస్తుంది.

- వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు
- డా‘‘ దొంతి నరసింహా రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement