సన్నాల్లో గోల్‌మాల్‌ జరిగితే కలెక్టర్లే బాధ్యులు | Bonus of Rs 500 per quintal for small paddy from this season | Sakshi
Sakshi News home page

సన్నాల్లో గోల్‌మాల్‌ జరిగితే కలెక్టర్లే బాధ్యులు

Published Fri, Oct 4 2024 4:40 AM | Last Updated on Fri, Oct 4 2024 4:40 AM

Bonus of Rs 500 per quintal for small paddy from this season

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఈ సీజన్‌ నుంచే..

ప్రతీరోజు కలెక్టర్లు రెండు గంటలపాటు ధాన్యం సేకరణపై దృష్టి పెట్టాలి

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: రైతులకు ఇచ్చిన మాట ప్రకా రం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్‌ నుంచే సన్నాలకు కనీస మద్దతు ధరకు(ఎంఎస్‌పీ) అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ చెల్లిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. సన్నవడ్లకు బోనస్‌ ఇవ్వటం ఇదే మొదటిసారి కావటంతో తగిన జాగ్ర త్తలు తీసుకోవాలని, ఎక్కడా ఎలాంటి తప్పు జరగ కుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉందని హెచ్చరించారు. సన్న వడ్ల కొనుగోలుకు ప్రత్యే క ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా కలెక్ట ర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించా రు. 

ధాన్యం సేకరణ, డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్, టీచర్ల నియామక ప్రక్రియను దసరా లోపు పూర్తి చేసే అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్‌కు మార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యకార్యదర్శులు వెంకటేశం, రఘునందన్‌రావు, పౌరసరఫరాల కమిషనర్‌ డీఎస్,చౌహాన్‌ జిల్లాల నుంచి మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ సన్నాల సేకరణకు వీలుగా వేర్వేరు కొనుగోలు కేంద్రాలు, లేదా వేర్వేరు కాంటాలు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సన్న రకాలను ధ్రువీకరించే యంత్రాలు, సిబ్బందిని అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. సన్నవడ్ల సేకరణలో అప్రమత్తంగా లేకపోతే గోల్‌మాల్‌ జరిగే ప్రమాదముందని సీఎం అప్రమత్తం చేశారు. అటువంటి తప్పులు, అవకత వకలు జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని చెప్పారు. 

రాష్ట్రంలో ఈ వానాకాలంలో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, ఈసారి రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందని సీఎం చెప్పారు. ధాన్యం సేకరణకు రాష్ట్ర వ్యాప్తంగా 7,000 ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోగా వారి ఖాతాల్లో డబ్బులు చేరాలన్నారు. ఒకవేళ కొనుగోలు కేంద్రాలు సరిపోని పక్షంలో కలెక్టర్లు నిర్ణయం తీసుకొని అదనంగా కొత్త కేంద్రాలను తెరవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

ప్రతీ కేంద్రానికి ఓ నంబర్‌..
ప్రతీ కొనుగోలు కేంద్రానికి ఒక నంబర్‌ కేటాయించాలని, ఆ కేంద్రంలో కొనుగోలు చేసిన వడ్ల సంచులపైన ఆ నంబర్‌ తప్పకుండా వేయాలని సీఎం సూచించారు. దీంతో ఏ తప్పు జరిగినా, ఏ దశలో గోల్‌మాల్‌ జరిగినా సులభంగా తెలుసుకునే వీలుంటుందన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా కట్టడి చేయాలని ముఖ్యమంత్రి పోలీస్‌ అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని మార్గాల్లోనూ నిఘా ఉంచాలని, చెక్‌ పోస్టుల వద్ద నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు 

రైతులను వేధించొద్దు...
తాలు ,తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేసే వారిని సహించొద్దని, అవసరమైతే క్రిమినల్‌ కేసులు పెట్టాలని సీఎం చెప్పారు. రైతులు ఎక్కడ కూడా దోపిడీకి గురి కాకూడదని, రైతుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును కలెక్టర్లు బాధ్యతగా స్వీకరించాలని కోరారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో సరిపడే సంఖ్యలో గోనె సంచులు, టార్ఫాలిన్లు, మాయిశ్చర్‌ మెషీన్లు, డ్రైయర్లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. 

ప్రతి గంటకోసారి కొనుగోలు కేంద్రాలకు వాతావరణ శాఖ సూచనలను చేరవేయాలని, దానికి అనుగుణంగా కేంద్రాల్లో ధాన్యం తడవకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్లు తమ జిల్లాలో జరుగుతున్న కొనుగోళ్ల ప్రక్రియను సమీక్షించాలని, ప్రతి రోజు ఉదయం నేరుగా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి కేంద్రాలను పరిశీలించాలని ఆదేశించారు. 

పాత పది జిల్లాలకు నియమించిన ప్రత్యేకాధికారులు ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించాలని సీఎం సూచించారు. సమస్యల పరిష్కారానికి పౌరసరఫరాల విభాగంలో 24 గంటల కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలన్నారు. జనవరి నుంచి రేషన్‌షాపుల్లోనూ సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. డిఫాల్ట్‌ మిల్లర్లకు ధాన్యం ఇవ్వొద్దని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. 

డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన 
5వ తేదీలోగా పూర్తి చేయండిఅన్ని జిల్లాల్లో డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనను 5వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. మొత్తం 11,062 మంది ఎంపికైన అభ్యర్థులకు దసరా పండగలోపు నియామక పత్రాలను అందిస్తామని ప్రకటించారు. 

అక్టోబర్‌ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించేందుకు వీలుగా జిల్లాల్లో వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే 9,090 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిందని విద్యాశాఖ అధికారులు సీఎంకు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement