CACP
-
రైతు బాగే దేశ స్వావలంబన
పంటల ఉత్పత్తి ఖర్చు నిర్ధారణలో అనేక లోపాలు ఉన్నాయి. ఉత్పత్తి ఖర్చును రాష్ట్రాల వారీగా సేకరించి, దానిని దేశ ‘సగటు’గా మార్చడం వల్ల రైతులకు నష్టం జరుగుతున్నది. ఒకే పంటకు దేశ వ్యాప్తంగా సాగు ఖర్చులో తేడా ఉంటుంది. ప్రతి పంటలో అనేక వెరైటీలు ఉన్నా ఒకే మద్దతు ధరఉంటుంది. వరిలో కొన్ని వందల రకాలున్నా, కనీస మద్దతు ధర అన్నింటికీ ఒకటే. ఈ తేడాలను కనీస మద్దతు ధర నిర్ణాయక వ్యవస్థ పరిగణనలోనికి తీసుకునే పరిస్థితి లేదు. ధరలు రాని పంటలను రైతులు వేయడం మానేస్తారు. ఆ పంటలు వేయడం మానేస్తే, పంట పండించే జ్ఞానం, నైపుణ్యం కోల్పోతాము. క్రమంగా, స్వావలంబన కోల్పోతే ఇతర దేశాల పెత్తనానికి దాసోహం కావాల్సి వస్తుంది. వ్యవసాయ ఖర్చులు ధరల కమిషన్ (సీఏసీపీ) కేవలం మద్దతు ధరను సిఫారసు చేస్తుంది. సిఫారసు చేసిందే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలని లేదు. ఉదా: 2023–24 రబీ సీజన్లో గోధుమలకు వారు క్వింటాలుకు రూ. 2,300 సిఫారసు చేస్తే, క్యాబినెట్ ఆమోదించింది రూ. 2,125 మాత్రమే. కనీస మద్దతు ధర నిర్ణయంలో కనీసం 12 అంశాలను పరిశీ లిస్తారు. అయితే 12 అంశాలలో ఉత్పత్తి ఖర్చు తప్పితే, మిగతాఅంశాలు కనీస మద్దతు ధర నిర్ణయంలో ఎటువంటి పాత్ర పోషి స్తాయో స్పష్టత లేదు. పంటల ఉత్పత్తి ఖర్చు నిర్ధారణలో కూడా అనేక లోపాలు ఉన్నాయి. ఉత్పత్తి ఖర్చు రాష్ట్రాల వారీగా సేకరించి, దానిని దేశ ‘సగటు’గా మార్చడం వల్ల కూడా రైతులకు నష్టం జరుగుతున్నది. ఒకే పంటకు దేశ వ్యాప్తంగా సాగు ఖర్చులలో తేడా ఉంటుంది. దీనిని సగటు చేస్తే, ఖర్చు ఎక్కువ అవుతున్న రైతులకు నష్టం అవుతున్నది. సాగు ఖర్చు ఎందుకు పెరుగుతున్నదనే విషయం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సమీక్ష ఎన్నడూ చేయలేదు. రైతు ఆత్మ హత్యల తదనంతరం జరిపిన అధ్యయనాలు రైతుల మీద పెరుగు తున్న ఖర్చు, మార్కెట్లో గిట్టుబాటు ధర పరిస్థితి గురించి ప్రధానంగా ప్రస్తావించాయి. రైతు కొనే విత్తనాలు, ఎరువులు, కీటకనాశకాలు అన్ని కంపెనీల లాభాలు అవుతున్నాయి. కృత్రిమ ఎరువులు, రసా యన కీటక నాశకాలు సారవంతమైన మట్టిని విషతుల్యం చేస్తూ, రైతును ‘బానిసను’ చేస్తున్నాయి. రాష్ట్రాల వారీగా జరిపే ఉత్పత్తి ఖర్చు నిర్ధారణ కూడా సరిగా, పారదర్శకంగా లేదు. చిన్న రైతు ఎదుర్కొనే అన్ని రకాల ఖర్చులను సేకరించే వ్యవస్థ లేదు. రాష్ట్రాలు అందించే రాష్ట్ర స్థాయి ‘సగటు’ లెక్కలను సీఏసీపీ తన స్వీయ ఆలోచన మేరకు తగ్గిస్తూ ఉంటుంది. స్థూలంగా, పంటల మీద ఖర్చును దశల వారీగా, వివిధ స్థాయిలలో ‘తరుగు’ చేస్తున్నది. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చుని శాస్త్రీయంగా, పార దర్శకంగా నిర్ధారించే వ్యవస్థ అవసరం. రైతులు కోరుతున్నట్లుగా ధర లకు చట్టబద్ధత కల్పిస్తే, ఈ వ్యవస్థ లోపాలు బయటకు వస్తాయని కూడా విధాన నిర్ణేతల ఆందోళన కావచ్చు. ప్రపంచ వాణిజ్య సంస్థ పరిధిలో విధించిన షరతులు కూడా ఒక కారణం. కనీస మద్దతు ధర అన్ని పంటలకు ఇవ్వరు. 1964–65లో వరి, గోధుమలకు మాత్రమే కనీస మద్దతు ధరను నిర్ణయించేవారు. కాలక్రమేనా 23 పంటలకు చేరింది. పసుపు, జొన్నలు, తృణధాన్యాలు వంటి పంటలకు లేవు. భారత దేశంలో దాదాపు 600 పంటలు పండించేవారు. అనేక పంటలు కనుమరుగు అయినాయి, అవుతున్నాయి. ఖర్చులు ఎక్కువ, రాబడి తక్కువ, సారవంతమైన మట్టి కనుమరుగు అవ్వడం, కలుషిత నీళ్ళు, నీటి కొరత, పురుగుల బెడద, వన్యప్రాణుల దాడులు, నాణ్యమైన విత్తనాల కొరత, కూలీల కొరత, ఇంకా ఇతర ఆర్థిక, సామాజిక, పర్యావరణ అంశాల నేపథ్యంలో రైతులు క్రమేణా కొన్ని పంటలకే పరిమితం అవుతున్నారు. ఈ నిర్ణయంలో కనీస మద్దతు ధర పాత్ర కూడా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కనీస మద్దతు ధరల వ్యవస్థ మీద నాలుగు కమిటీలు అనేక సూచ నలు ఇచ్చాయి – ఝా కమిటీ (1965), సేన్ కమిటీ (1979), హను మంతరావు కమిటీ (1990), వై.కే.అలఘ్ కమిటీ (2005). 2007లో ప్రణాళిక సంఘం, 2017లో నీతి ఆయోగ్ నివేదికలు కూడా ఉన్నాయి. ఈ సూచనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. 2005 కమిటీ వ్యవసాయ ధరల కమిషన్‌కు చట్టబద్ధత కల్పించాలని సిఫారసుచేసింది. అంటే, కనీస మద్దతు ధర చట్టబద్ధతను అది ఆమోదించింది. ధర నిర్ణయంలో నాణ్యత కూడా కీలకం అని ఈ కమిటీ భావించింది. వివిధ పంటలకు మార్కెట్ కాలం రెండు లేక మూడు నెలలు మాత్రమే ఉంటుంది. రబీ పంటల మార్కెటింగ్ కాలం ఏప్రిల్ నుంచి జూన్ వరకు మాత్రమే. ఆయా పంటల సరఫరా డిమాండ్లతోసంబంధం లేకుండా మద్దతు ధరలు మాత్రం సంవత్సరం పాటు స్థిరంగా ఉంటాయి. ప్రతి పంటలో అనేక రకాల వెరైటీలు ఉన్నా ఒకే మద్దతు ధర ఉంటుంది. వరిలో కొన్ని వందల రకాల విత్తనాలు ఉన్నా, కనీస మద్దతు ధర అన్నింటికీ ఒకటే. వరి రకం బట్టి పంట కాలం ఉంటుంది. ఆ మేరకు ఖర్చులలో కూడా తేడా ఉంటుంది. కొన్ని 80 రోజుల పంట అయితే, ఇంకొన్ని 160 రోజులు ఉంటాయి. ఈ తేడాను కనీస మద్దతు ధర నిర్ణాయక వ్యవస్థ పరిగణనలోనికి తీసుకునే పరిస్థితి లేదు. అంతా స్థిరమైన సగటు. ధర రాక రైతులు రాబోయే సంవత్సరంలో ఈ పంట వేయడం ఆపేస్తే ఆ పంట సరఫరాపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దాని మీద ఆధారపడ్డ వినియోగదారులకు, పరిశ్రమలకు (పంట ముడిసరుకుగా వాడే వాటికి) ధర పెరుగుతుంది. ఏదైనా పంట దిగుబడి తగ్గి, సరఫరా తగ్గి, ధర పెరిగితే వెంటనే దిగుమతులకు అనుమతులు ఇస్తుంది ప్రభుత్వం. అయితే ఆ యేడు వరకే దిగు మతులను ‘నల్లా తిప్పి బంజేసినట్లు’ చేసే పరిస్థితి ఉండదు. సాధారణంగా అంతర్జాతీయ వాణిజ్యంలో సరఫరా ఒప్పందాలు గిట్టుబాటుగా కొన్ని సంవత్సరాల కొరకు చేసుకుంటారు. దిగుమ తులు కొనసాగితే దేశీయంగా ధర మళ్లీ పెరిగే అవకాశం లేక రైతులు ఆ పంట వేయడం పూర్తిగా మానేస్తారు. పప్పుల విషయంలో అదే అయ్యింది. 2015లో కొరత ఉందని అనుమతిస్తే సరఫరా ఒప్పందాలు 7 సంవత్సరాలకు చేసుకుని దిగుమతులు పెంచారు. రైతులకు ధర వచ్చే ఆశ లేక పూర్తిగా వేయడం మానేశారు. దరిమిలా పప్పుల ఉత్పత్తిలో అగ్రగామి అయిన భారత్ ఇప్పుడు దిగుమతుల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. అటు వినియోగదారులకు పప్పుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పప్పులకు కనీస మద్దతు ధర (ఖర్చుకు అనుగుణంగా) ఇస్తేనే రైతులు మళ్లీ వేస్తారు. అధిక ధరలకు దిగుమతి చేసుకుంటున్న ప్రభుత్వం కనీస మద్దతు పెంచడానికి ఇష్టపడటం లేదు. వంట నూనె విషయంలో ఇంకో విధంగా మన స్వావలంబన కోల్పోయాం. ముడి పామాయిల్ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు చేసిన వ్యవస్థ వల్ల ఏర్పడింది. తక్కువ ధరకు పామాయిల్ రావడంతో, తక్కువ ధరకు వినియో గదారులకు అందిస్తే రాజకీయ ప్రయోజనం అని చూసుకుని ప్రభుత్వం ఆయా సంవత్సరాలలో పెరుగుతున్న పామాయిల్ దిగుమతులను పట్టించుకోలేదు. పైగా దిగుమతి సుంకాలను సున్నా చేసింది. ఫలితంగా, మనం పండించే వేరుశనగ, నువ్వులు, ఆము దాలు, ఆవాలు వంటి 9 రకాల వంట నూనె గింజల పంటల విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది. వంట నూనె నిత్య అవసరం కాబట్టి ఇప్పుడు ఆ దిగుమతి మానలేము. అది మానకుంటే రైతులకు ధర రాక ఇక్కడ నూనె గింజల ఉత్పత్తి పెరిగే పరిస్థితి లేదు. డిమాండ్ ఉన్న రకాల పంటలు వేసే ప్రోత్సాహక పరిస్థితి రైతులకు లేకుండా పోయింది. ప్రభుత్వం జోక్యం వల్ల మార్కెట్లకు నష్టం అని భావించేవారు, ఈ పరిస్థితిని ప్రభుత్వ జోక్యం లేకుండా ఎట్లా మారుస్తారో చెప్పాలి. రైతులు ఆ యా పంటలు వేయడం మానేస్తే, పంట పండించే జ్ఞానం, నైపుణ్యం, సామర్థ్యం కోల్పోతాము. ఇప్పుడు చెరుకు కోసే నైపుణ్యం ఉన్న కూలీలు దొరకడం లేదు. తిరిగి ఆ పంట కావాలంటే ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాల్సిందే. అప్పుడు పెట్టుబడులు పెట్టే బదులు, ప్రభుత్వం ఇప్పుడే మార్కెట్లో జోక్యం చేసుకుని, రైతులకు గిట్టుబాటు ధర ఇస్తే అందరూ సంతోషంగా ఉంటారు కదా! లేకుంటే మనం కొన్ని ఆఫ్రికన్ దేశాల మాదిరి అయి పోతాం. నిరంతరం సముద్ర తీరాల వైపు చూడాల్సి వస్తుంది. క్రమంగా, స్వావలంబన కోల్పోతే ఇతర దేశాల పెత్తనానికి దాసోహం కావాల్సి వస్తుంది. - వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు - డా‘‘ దొంతి నరసింహా రెడ్డి -
నేడు విశాఖలో సీఏసీపీ సమావేశం
సాక్షి, అమరావతి: రబీ 2024–25 మార్కెటింగ్ సీజన్‌కు కనీస మద్దతు ధరలు నిర్ణయించేందుకు వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశం విశాఖ పట్నంలో శుక్రవారం జరుగనుంది. సీఏసీపీ చైర్మన్ విజయ్‌పాల్ శర్మ అధ్యక్షతన విశాఖలోని పార్క్ హోటల్లో జరుగనున్న ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్, పుదుచ్చేరి, లక్షద్వీప్ రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ, ఉద్యాన శాఖ కమిషనర్లు, శాస్త్రవేత్తలు, నిపుణులు పాల్గొననున్నారు. ఆయారాష్ట్రాల్లో సాగవుతున్న వ్యవసాయ, ఉద్యాన పంటలకు ప్రస్తుతం ఉన్న కనీస మద్దతు ధరపైన ఖర్చులు, రాబడి వివరాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్తారు. రాబోయే సీజన్‌కు కనీస మద్దతు ధరలను నిర్ణయించి ముసాయిదా నివేదికను కమిషన్ కేంద్రానికి సమర్పిస్తుంది. కేంద్రం వీటిని అధ్యయనం చేసి ప్రతీ ఏటా వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కనీస మద్దతు ధరలను నిర్ణయించి ప్రకటిస్తుంది. రబీ పంట కాలానికి సంబంధించి ఆహార ధాన్యాల కింద గోధుమ, బార్లీ పంటలకు, అపరాల కిందశనగ, మెంతులుæ పంటలు, నూనెగింజల కింద ఆవాలు, కుసుమ పంటల ఉత్పాదక ఖర్చులను పరిగణనలోకి తీసుకుని కనీస మద్దతు ధరలను ఆయా రాష్ట్రాలు ప్రతిపాదిస్తాయి. ఏపీలో అపరాల పంటలలో ఎక్కువగా సాగయ్యే శనగ పంటతో పాటు నూనెగింజలలో ఒకటైన ఆవాలకు కనీస మద్దతు ధరలకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా సీఏసీపీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రబీ–2022–23 మార్కెటింగ్ సీజన్లో శనగ పంటకు క్వింటాల్ రూ.5,230, ఆవాలకు రూ.5,050గా ప్రకటించారు. అయితే ప్రస్తుతం పెరిగిన పెట్టుబడి ఖర్చులు, రాబడిని దృష్టిలో పెట్టుకుని రబీ 2024–25 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి శనగ పంట ఉత్పత్తులకు క్వింటాల్‌కు రూ.7,983లుగా, ఆవాలు క్వింటాల్‌కు రూ.6,608 చొప్పున పెంచి కనీస మద్దతు ధరగా నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌కు నివేదిక సమర్పించనుంది. మిగిలిన రాష్ట్రాలు కూడా తమకు కేటాయించిన పంట ఉత్పత్తులకు సంబంధించిన ప్రతిపాదనలను కమిషన్‌కు సమర్పించనున్నాయి. -
పంటల కనీస మద్దతు ధర సూత్రమిదే!
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) నిర్ణయించటంలో అనుసరించనున్న సూత్రాన్ని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. బడ్జెట్లో 2019 ఖరీఫ్ సీజన్లో పంట ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్ల మద్దతు ధర ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ‘వాస్తవ ఉత్పత్తి వ్యయం, రైతు కుటుంబసభ్యుల శ్రమ వ్యయాన్ని కలపగా వచ్చిన మొత్తానికి 50 శాతం అదనంగా చేర్చి మద్దతు ధరగా నిర్ణయించాం’ అని జైట్లీ వెల్లడించారు. మద్దతు ధరపై అనుసరించిన విధానాన్ని వెల్లడించాలంటూ.. విపక్షాలు, వ్యవసాయ నిపుణులు డిమాండ్ చేసిన నేపథ్యంలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రాజ్యసభలో శుక్రవారం జైట్లీ ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వం రైతుల వద్దనుంచి గోధుమ, వరి పంటలనే (రేషన్ షాపుల ద్వారా సబ్సిడీపై అందించేందుకు) సేకరిస్తున్నప్పటికీ.. 23 వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించింది. ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించినప్పటికీ.. రైతులకు చేరటం లేదని జైట్లీ అంగీకరించారు. ‘రైతులకు ఎంఎస్పీ చేరాలనే లక్ష్యంతోనే బడ్జెట్లో ప్రతిపాదనలిచ్చాం. అన్ని పంటలకు ఒకే విధానాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. సాగుకు అయిన వ్యయం (విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, నీటిపారుదల ఖర్చులు, చెల్లించిన కూలీలు.. ఇతరత్రా), రైతు కుటుంబసభ్యుల శ్రమకు విలువకట్టిన మొత్తాన్ని కలుపుకుని దీనికి ఒకటిన్నర రెట్ల మద్దతు ధర నిర్ణయించాం’ అని జైట్లీ వెల్లడించారు. భయంకరమైన డాక్టర్ చేతుల్లో.. యూపీఏ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ పదేళ్లపాటు ‘భయంకరమైన డాక్టర్’ చేతిలో ఉందని జైట్లీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌ను చేర్చారని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంపై తీవ్ర విమర్శలు చేశారు. నిర్మాణాత్మక సంస్కరణల కారణంగా 2014 నుంచి భారత ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందని జైట్లీ పేర్కొన్నారు. యూపీఏ హయాంలో జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్‌లను సభకు వెల్లడించారు. ప్రస్తుత వివరాలను సభ్యులు అర్థం చేసుకోవాలన్నారు. కాగా, కేంద్ర బడ్జెట్ ప్రజలను మోసం చేసేదిగా ఉందని.. తృణమూల్, ఎస్పీ, సీపీఐ, ఎన్సీపీ, ఆప్ సభ్యులు మండిపడ్డారు. ఫేకూ ఫెడరలిజం (అవాస్తవ సమాఖ్య వ్యవస్థ), అహంకారాన్ని ఎన్డీయే ప్రదర్శిస్తోందని విమర్శించారు. పార్లమెంటు వాయిదా తీవ్రమైన నిరసనలు, సభ్యుల ఆందోళనల మధ్య పార్లమెంటు ఉభయసభలు మర్చి 5కు వాయిదా పడ్డాయి. శుక్రవారం లోక్‌సభ ప్రారంభం కాగానే.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వైఎస్సార్సీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. అటు రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు వివరాలు వెల్లడించాలంటూ కాంగ్రెస్ ఎంపీలు కూడా వెల్‌లోకి దూసుకెళ్లటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. నిరసనల మధ్యే కాసేపు సభను నడిపించిన స్పీకర్ సుమిత్ర మహాజన్.. కొద్దిసేపటి తర్వాత మార్చి 5కు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి అర్ధభాగం ముగిసింది. రాజ్యసభలోనూ బడ్జెట్‌పై చర్చ జరగకుండా ఏపీ ఎంపీలు అడ్డుకున్నారు. వెల్‌లోనే బైఠాయించారు. అయితే ఏపీ ఎంపీలను బయటకు పంపి బడ్జెట్‌పై చర్చ, జీరో అవర్‌ను నిర్వహించాలని తృణమూల్, కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడును కోరారు. అయినా నిరసనలు ఆగకపోవటంతో వెంకయ్య సభను రెండుసార్లు వాయిదా వేశారు. బడ్జెట్‌పై చర్చ జరిగాక రాజ్యసభ మార్చి ఐదో తేదీకి వాయిదా పడింది. సీఏసీపీ సూచనల ప్రకారమే! ప్రస్తుతం వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం ఎంఎస్పీని నిర్ణయిస్తుంది. ఈ సంస్థ మూడు సూత్రాలను ప్రభుత్వానికి సూచించింది. ఏ2 (విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, కూలీలు, ఇంధనం, నీటిపారుదల తదితర ఖర్చులు కలుపుకుని), ఏ2+ఎఫ్ఎల్ (ఏ2కు పంట ఉత్పత్తిలో పనిచేసినందుకు గానూ రైతు కుటుంబీకుల శ్రమను కలుపుకోవాలి), సీ2 (పై రెండు కలుపుకుని, పంటకోసం తన ఆస్తులు, బంగారం మొదలైనవి తాకట్టుపెట్టి తెచ్చిన మొత్తానికి వడ్డీ కలుపుకుని) అని మూడు వేర్వేరు విధానాలను ప్రతిపాదించింది. 2006లో వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్ నేతృత్వంలోని జాతీయ వ్యవసాయ కమిషన్ కూడా పంట వ్యయానికి (ఏ2+ఎఫ్ఎల్) 50 శాతం ఎక్కువ మద్దతు ధర సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ కూడా పంట ఉత్పత్తి వ్యయానికి 50 శాతం అధిక మద్దతు ధర చెల్లిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. -
ఆదుకోవాల్సిన వేళ చేదుకబురు
అమలాపురం, న్యూస్‌లైన్ : ‘కోటి విద్యలు కూటి కొరకే’ అంటారు. వ్యవసాయం రైతులకు ‘కూటి విద్యే’ కావచ్చు. కానీ, అది యావత్తు సమాజానికీ కూడు పెట్టే విశిష్ట విద్య. ఓ రకంగా వెల కట్టలేని విలక్షణ కర్తవ్యం. అయితే- ఆ విద్యను నమ్ముకుని, ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న అన్నదాతలకు ‘కోటి కష్టాలు’ తప్పడం లేదు. అందరి కడుపూ నింపే కృషీవలుర వేదన ‘కడుపు చించుకుంటే కాళ్ల మీద పడడం’ తప్ప ఫలితం లేనిదిగా మారుతోంది. వరుస విపత్తులతో కుత్తుక లోతు కష్టాల్లో మునిగిన రైతులకు సేద్యమంటేనే సింహస్వప్నంగా కనిపించే రోజులు దాపురించాయన్నా సత్యదూరం కాదు. ఇలాంటి ఆపత్సమయంలో అన్నదాతల్లో మనోస్థైర్యాన్ని నిలపాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగా ఒక్క అడుగూ వేయకపోగా.. వ్యవసాయం పట్ల వారికి కలుగుతున్న విముఖత పెరిగేలా, దాన్నుంచి మరింత వెనకడుగు వేసేలా చేస్తున్నాయి. సమాజం కడుపు నింపడంతో పాటు తానూ, తన కుటుంబమూ ఓ ముద్ద తినగలమనీ, మన్నును నమ్ముకున్నందుకు ఎన్నటికైనా మంచిరోజులు వ ణుకుమంటున్న ఆశను సైతం చిదిమేస్తున్నాయి. బాగా పండితే క్వింటాల్‌కు మిగిలేది రూ.49 మాత్రమే.. గత కొన్నేళ్లుగా అటు ప్రకృతి వైపరీత్యాలతో పంటను కోల్పోవడంతో పాటు ఇటు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న రైతులకు ధైర్యం చెప్పి, చేయూతనివ్వాల్సిన సమయంలో మూడేళ్లపాటు ధాన్యానికి మద్దతు ధర పెంచేది లేదని కేంద్ర వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరల నిర్ణాయక కమిటీ (సీఏసీపీ) చైర్మన్ అశోక్ గులాటీ ప్రకటించడం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇటీవల కర్నూలు, మహబూబ్‌నగర్‌లలో రైతులతో మాట్లాడిన ఆయన ఇప్పటికే వరికి మద్దతు ధర ఎక్కువగా ఉందని, దాన్ని పెంచే అవకాశం లేదని చావుకబురు చల్లగా చెప్పారు. ఇప్పటికే సీఏసీపీ ప్రకటించిన మద్దతు ధర గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతుంటే.. పెంచే అవకాశం లేదని చైర్మన్ స్వయంగా ప్రకటించడంపై రైతులు హతాశులవుతున్నారు. ప్రస్తుతం వరి సాధారణ రకం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1310 ఉండగా గ్రేడ్-1కు రూ.1345 ఉంది. జిల్లాలో ఖరీఫ్ ఎకరా సాగుకు రూ.26,500 అవుతున్నట్టు జిల్లా స్థాయి టెక్నికల్ కమిటీ నిర్ణయించిన విషయం తెలిసిందే. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఖరీఫ్‌లో అన్నీ కుదిరితే 28 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా. ప్రస్తుత మద్దతు ధరను బట్టి రైతుకు మిగిలేది క్వింటాల్‌కు రూ.49 మాత్రమే. ఐదేళ్లలో నాలుగుసార్లు ఖరీఫ్ తుడిచిపెట్టుకుపోవడంతో పెట్టుబడులు కూడా దక్కడం లేదు. ఏ సర్కారుకూ కారుణ్యం లేదు.. గతంలో వ్యవసాయ సంక్షోభాన్ని నివారించేందుకు వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఎం.ఎస్.స్వామినాథన్ కమిటీ క్వింటాల్ ధాన్యం ఉత్పత్తికి అవుతున్న పెట్టుబడికి 50 శాతం పెంచి మద్దతు ధర ప్రకటించాలని సిఫార్సు చేసింది. అయితే ఎన్డీఏ, ఆ తరువాత యూపీఏ ప్రభుత్వాలు దీనిని తొక్కిపెట్టాయి. 2011లో మద్దతు ధర గిట్టుబాటుకావడం లేదని కోనసీమ రైతులు సాగు సమ్మె చేశారు. ఈ ఉద్యమం జాతీయస్థాయిలో ప్రకంపనలు సృష్టించడంతో సీఏసీపీ చైర్మన్ అశోక్ గులాటీ కోనసీమలో పర్యటించారు. ఉప్పలగుప్తంలో రైతులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో మద్దతు ధర గిట్టుబాటు కాకపోవడం నిజమేనని అంగీకరించారు. అయితే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని, తాను అందుకు సిఫార్సు చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయనే మూడేళ్లు మద్దతు ధర పెంచేది లేదని ప్రకటించడాన్ని రైతులు తప్పు పడుతున్నారు. కేంద్రం మద్దతు ధర పెంచకుంటే రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌కు అదనంగా రూ.200 ఇవ్వాలని రైతులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. సర్కారు నుంచీ స్పందన కరువైంది. సాగు సమ్మె తరువాత రెండేళ్లకాలంలో ధాన్యం మద్దతు ధరను సీఏసీపీ 15 శాతం మాత్రమే పెంచింది. ఎరువులు, పురుగు మందుల ధర 300 శాతం పెరిగాయి. మద్దతు ధర పెంచలేమంటున్న సీఏసీపీ మూడేళ్లపాటు ఎరువులు, పురుగుమందుల ధరలు పెరగవని హామీ ఇస్తే బాగుండునని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు.