పంటల కనీస మద్దతు ధర సూత్రమిదే! | Jaitley clarifies on cost parameter to calculate MSPs to be paid to farmers | Sakshi
Sakshi News home page

పంటల కనీస మద్దతు ధర సూత్రమిదే!

Published Sat, Feb 10 2018 2:20 AM | Last Updated on Mon, Aug 20 2018 4:55 PM

Jaitley clarifies on cost parameter to calculate MSPs to be paid to farmers - Sakshi

ఎంఎస్‌పీపై రాజ్యసభలో మాట్లాడుతున్న ఆర్థిక మంత్రి జైట్లీ

న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) నిర్ణయించటంలో అనుసరించనున్న సూత్రాన్ని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. బడ్జెట్‌లో 2019 ఖరీఫ్‌ సీజన్‌లో పంట ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్ల మద్దతు ధర ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ‘వాస్తవ ఉత్పత్తి వ్యయం, రైతు కుటుంబసభ్యుల శ్రమ వ్యయాన్ని కలపగా వచ్చిన మొత్తానికి 50 శాతం అదనంగా చేర్చి మద్దతు ధరగా నిర్ణయించాం’ అని జైట్లీ వెల్లడించారు. మద్దతు ధరపై అనుసరించిన విధానాన్ని వెల్లడించాలంటూ.. విపక్షాలు, వ్యవసాయ నిపుణులు డిమాండ్‌ చేసిన నేపథ్యంలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రాజ్యసభలో శుక్రవారం జైట్లీ ఈ ప్రకటన చేశారు.

ప్రభుత్వం రైతుల వద్దనుంచి గోధుమ, వరి పంటలనే (రేషన్‌ షాపుల ద్వారా సబ్సిడీపై అందించేందుకు) సేకరిస్తున్నప్పటికీ.. 23 వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించింది. ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించినప్పటికీ.. రైతులకు చేరటం లేదని జైట్లీ అంగీకరించారు. ‘రైతులకు ఎంఎస్‌పీ చేరాలనే లక్ష్యంతోనే బడ్జెట్‌లో ప్రతిపాదనలిచ్చాం. అన్ని పంటలకు ఒకే విధానాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. సాగుకు అయిన వ్యయం (విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, నీటిపారుదల ఖర్చులు, చెల్లించిన కూలీలు.. ఇతరత్రా), రైతు కుటుంబసభ్యుల శ్రమకు విలువకట్టిన మొత్తాన్ని కలుపుకుని దీనికి ఒకటిన్నర రెట్ల మద్దతు ధర నిర్ణయించాం’ అని జైట్లీ వెల్లడించారు.

భయంకరమైన డాక్టర్‌ చేతుల్లో..
యూపీఏ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ పదేళ్లపాటు ‘భయంకరమైన డాక్టర్‌’ చేతిలో ఉందని జైట్లీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌ను చేర్చారని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంపై తీవ్ర విమర్శలు చేశారు. నిర్మాణాత్మక సంస్కరణల కారణంగా 2014 నుంచి భారత ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందని జైట్లీ పేర్కొన్నారు. యూపీఏ హయాంలో జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్‌ అకౌంట్‌ డెఫిసిట్‌లను సభకు వెల్లడించారు. ప్రస్తుత వివరాలను సభ్యులు అర్థం చేసుకోవాలన్నారు. కాగా, కేంద్ర బడ్జెట్‌ ప్రజలను మోసం చేసేదిగా ఉందని.. తృణమూల్, ఎస్పీ, సీపీఐ, ఎన్సీపీ, ఆప్‌ సభ్యులు మండిపడ్డారు. ఫేకూ ఫెడరలిజం (అవాస్తవ సమాఖ్య వ్యవస్థ), అహంకారాన్ని ఎన్డీయే ప్రదర్శిస్తోందని విమర్శించారు.

పార్లమెంటు వాయిదా
తీవ్రమైన నిరసనలు, సభ్యుల ఆందోళనల మధ్య పార్లమెంటు ఉభయసభలు మర్చి 5కు వాయిదా పడ్డాయి. శుక్రవారం లోక్‌సభ ప్రారంభం కాగానే.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వైఎస్సార్‌సీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. అటు రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలు వివరాలు వెల్లడించాలంటూ కాంగ్రెస్‌ ఎంపీలు కూడా వెల్‌లోకి దూసుకెళ్లటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. నిరసనల మధ్యే కాసేపు సభను నడిపించిన స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌.. కొద్దిసేపటి తర్వాత మార్చి 5కు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల తొలి అర్ధభాగం ముగిసింది.  రాజ్యసభలోనూ బడ్జెట్‌పై చర్చ జరగకుండా ఏపీ ఎంపీలు అడ్డుకున్నారు. వెల్‌లోనే బైఠాయించారు. అయితే ఏపీ ఎంపీలను బయటకు పంపి బడ్జెట్‌పై చర్చ, జీరో అవర్‌ను నిర్వహించాలని తృణమూల్, కాంగ్రెస్‌ ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడును కోరారు. అయినా నిరసనలు ఆగకపోవటంతో వెంకయ్య సభను రెండుసార్లు వాయిదా వేశారు. బడ్జెట్‌పై చర్చ జరిగాక రాజ్యసభ మార్చి ఐదో తేదీకి వాయిదా పడింది.  

సీఏసీపీ సూచనల ప్రకారమే!
ప్రస్తుతం వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌ (సీఏసీపీ) సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం ఎంఎస్‌పీని నిర్ణయిస్తుంది. ఈ సంస్థ మూడు సూత్రాలను ప్రభుత్వానికి సూచించింది. ఏ2 (విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, కూలీలు, ఇంధనం, నీటిపారుదల తదితర ఖర్చులు కలుపుకుని), ఏ2+ఎఫ్‌ఎల్‌ (ఏ2కు పంట ఉత్పత్తిలో పనిచేసినందుకు గానూ రైతు కుటుంబీకుల శ్రమను కలుపుకోవాలి), సీ2 (పై రెండు కలుపుకుని, పంటకోసం తన ఆస్తులు, బంగారం మొదలైనవి తాకట్టుపెట్టి తెచ్చిన మొత్తానికి వడ్డీ కలుపుకుని) అని మూడు వేర్వేరు విధానాలను ప్రతిపాదించింది. 2006లో వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్‌ స్వామినాథన్‌ నేతృత్వంలోని జాతీయ వ్యవసాయ కమిషన్‌ కూడా పంట వ్యయానికి (ఏ2+ఎఫ్‌ఎల్‌) 50 శాతం ఎక్కువ మద్దతు ధర సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ కూడా పంట ఉత్పత్తి వ్యయానికి 50 శాతం అధిక మద్దతు ధర చెల్లిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement