సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లాంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్‌కున్న ప్రాధాన్యత గురించి విడమర్చి విఫులంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల వాణిని ప్రతిధ్వనించేందుకు, కార్యనిర్వాహక విధుల్లో ఏకపక్షంగా వ్యవహరించకుండా ప్రభుత్వాన్ని కాళ్ల బొటన వేళ్లపై నిలబట్టేందుకు పార్లమెంట్ వేదిక ఉపయోగపడుతుంది.
ప్రతి అంశంపై ప్రభుత్వం సమగ్ర చర్చ జరిపి సముచిత నిర్ణయం తీసుకునేందుకు దోహద పడుతుంది. ఇంతటి ప్రాధాన్యంగల పార్లమెంట్ సమావేశాలు వరుసగా తుడిచిపెట్టుకుపోతున్నాయి. వివిధ డిమాండ్లపై ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేస్తుండగా, సందట్లో సడేమియా లాంటి ఎలాంటి చర్చ లేకుండానే పలు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆమోదిస్తూ పోతోంది.
దీంతో బుధవారం నాడు లోక్‌సభ కీలకమైన బడ్జెట్, ఆర్థిక బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లులను ఎలాంటి చర్చ లేకుండా కేవలం 30 నిమిషాల కాల వ్యవధిలో ఆమోదించింది. సాధారణ రోజుల్లో ఈ బిల్లులపై చర్చ జరిపి ఆమోదించడానికి కొన్ని వారాలు పడుతుంది. ఈ విషయంలో తప్పు మీదంటే మీదంటూ ప్రభుత్వ, ప్రతిపక్షాలు పరస్పరం వేలెత్తి చూపుకుంటున్నాయి.
వివిధ అంశాలపై చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్షాలు గొడవ చేయడం వల్ల పార్లమెంట్‌లో వాయిదాల పర్వం కొనసాగుతోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. తమ డిమాండ్లపై ముందుగా చర్చ జరిపితే ఆ తర్వాత ఇతర డిమాండ్లపై చర్చ జరిపే అవకాశం ఉంటుందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.
లోక్‌సభలో గత కొన్ని రోజులుగా గొడవ జరుగుతున్న దృష్యాలను చూస్తుంటే చర్చ పట్ల ప్రభుత్వానికిగానీ, ప్రతిపక్షానికిగానీ చిత్తశుద్ధి మాటను పక్కన పెడితే కనీస ఆసక్తి కూడా లేదని స్పష్టం అవుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై తీవ్రమైన చర్చకు అవకాశమే ఇవ్వలేదు.
సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ ‘కావేరి జలాల నిర్వహణ బోర్డు’ ఏర్పాటుకు ఎలాంటి చొరవ తీసుకోలేదు. గతేడాది పన్నులతో సంబంధంలేని పలు చట్టాల సవరణకు ఆర్థిక బిల్లు ప్రతిపాదించడం, వాటిలోని కొన్ని అంశాలపై ఇప్పటికీ సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతుండడం తెల్సిందే. ఈసారి అలా కాకుండా కీలకమైన ఆర్థిక అంశాలకే పరిమితమైన ఆర్థిక బిల్లును ఎలాంటి చర్చ లేకుండా ఆమోందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
పైగా ఈ బిల్లులో చివరి క్షణంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 20 సవరణలను ప్రతిపాదించారు. వాటిల్లో విదేశీ నిధుల నియంత్రణ కింద రాజకీయ విరాళాలను క్రమబద్ధీకరించడం లాంటి కీలకమైన సవరణలు ఉన్నాయి. ఎన్నికల విరాళాల్లో పారదర్శకతను దెబ్బతీసే సవరణలు కూడా ఇందులో ఉండవచ్చు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా సవరణలు ఉన్నాయనడంలో కూడా సందేహం లేదు.
అలాంటప్పుడు చర్చకు ఆస్కారం ఇవ్వక పోవడం ఏ మేరకు సమంజసం? బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తీరును ఆ ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఇతర పార్టీలను కూడా విస్మయానికి గురిచేశాయి. పార్లమెంట్ సమావేశాలు సవ్యంగా సాగేలా ప్రతిపక్షాలను ఒప్పించడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్, అఖిల భారత అన్నా డీఎంకే నాయకుడు ఎం. తంబిదురై విమర్శించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment