ఫిబ్రవరి 29న కేంద్ర బడ్జెట్
ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 29న పార్లమెంటులో 2016-17 బడ్జెట్‌ను సమర్పించనుంది. ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న రెండు మూడేళ్లకూ మార్గనిర్దేశం చేసేలా ఈ బడ్జెట్ ఉంటుందని కూడా ఆయన వెల్లడించారు. భారత్-కొరియా వ్యాపార సదస్సులో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ఈ అంశాన్ని వెల్లడించారు.
బడ్జెట్ టీమ్ ఇదీ..
ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా, ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం, నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాలు ఆర్థికమంత్రి బడ్జెట్ టీమ్‌లో ఉన్నారు. ఇక అధికారిక బృందానికి ఫైనాన్స్ సెక్రటరీ రతన్ వాటెల్, ఆర్థిక కార్యదర్శి శక్తికాంత్ దాస్, రెవెన్యూ కార్యదర్శి హాస్‌ముఖ్ ఆదియా, డిజిన్వెస్ట్‌మెంట్ సెక్రటరీ నీరజ్ గుప్తాలు నేతృత్వం వహిస్తున్నారు.
ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి ఇది రెండవ పూర్తిస్థాయి బడ్జెట్ కాగా... మొదటి 2014 మధ్యంతర బడ్జెన్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటే మూడవది. బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ జనవరి 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ వివిధ పరిశ్రమ, వాణిజ్య సంఘాలు, ఆర్థికవేత్తలుసహా పలు వర్గాల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు.