న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌పై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రూ.లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ వ్యవహారంలో నిజానిజాలు దేశ ప్రజలకు తెలియాలని అన్నారు. అదానీపై చర్చించేందుకు కేంద్రం నిరాకరిస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గత రెండేళ్లుగా తాను ఈ విషయం గురించి గళమెత్తుతూనే ఉన్నానని రాహుల్ అన్నారు. దేశంలో రూ.లక్షల కోట్ల అవినీతి జరిగిందని, దేశ మౌలిక సదుపాయాలను ఒక వ్యక్తి హైజాక్ చేశారని పరోక్షంగా అదానీని ఉద్దేశించి అన్నారు.
'అదానీ గ్రూప్ వెనకాల ఉన్న శక్తుల గురించి ప్రజలకు కచ్చితంగా తెలియాలి. కేంద్రం భయపడుతోంది. అందుకే చర్చకు అంగీకరించడం లేదు. అదానీపై చర్చ జరగకుండా ప్రధాని మోదీ అన్ని ప్రయత్నాలు చేస్తారు.' అని రాహుల్ విమర్శించారు.
పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన మరునాటి నుంచి రాజ్యసభ, లోక్‌సభలో కార్యకలాపాలు సజావుగా సాగడం లేదు. అదానీ గ్రూప్ వ్యవహారంపై విపక్షాలు చర్చకు పట్టుబడుతుండగా.. కేంద్రం మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. దీంతో సోమవారం కూడా ఉభయసభలు ఎలాంటి చర్చా లేకుండానే మంగళవారానికి వాయిదాపడ్డాయి.
చదవండి: మద్రాస్ హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరి నియామకంపై వివాదం..
Comments
Please login to add a commentAdd a comment