
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (ఫైల్ ఫోటో)
మరో పదేళ్లలో ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా..
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఏడాది నాటికి భారత ఆర్థిక వ్యవస్థ బ్రిటన్‌ను అధిగమించి ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మనం ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో ఫ్రాన్స్‌ను అధిగమించామని, వచ్చే ఏడాది బ్రిటన్‌ను తోసిరాజని ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తామని జైట్లీ చెప్పుకొచ్చారు.
ప్రపంచంలో అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలే తక్కువ వృద్ధి రేటుతో సాగుతుండగా రానున్న పది, ఇరవై సంవత్సరాల్లో భారత్ ప్రపంచంలోనే మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల సరసన చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు రుతుపవనాలు ఆశాజనకంగా ఉండటంతో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి పెరుగుతుందనే అంచనాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.4 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ఆర్థిక విధానాల రూపకల్పనలో పేరొందిన ఎన్‌సీఏఈఆర్ పునరుద్ఘాటించింది. మరోవైపు అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం సమసిపోతున్న సంకేతాలతో భారత్ వృద్ధి రేటు ఊపందుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేసింది.